గెలుపు సంగతి తరువాత ….ముందైతే భారీగా భరోసా

తెలంగాణలో అధికార పార్టీ మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చెలరేగిపోతున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు భారీగా భరోసా, మద్దతు లభిస్తున్నాయి. వీరికి భరోసా ఎవరు ఇస్తున్నారు ? బీజేపీ కేంద్ర నాయకులు బీజేపీ అధికారంలో…

తెలంగాణలో అధికార పార్టీ మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద చెలరేగిపోతున్న రాష్ట్ర బీజేపీ నాయకులకు భారీగా భరోసా, మద్దతు లభిస్తున్నాయి. వీరికి భరోసా ఎవరు ఇస్తున్నారు ? బీజేపీ కేంద్ర నాయకులు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు. వీరికి తోడు ప్రధాని మోడీ కూడా. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన 317 జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర బీజేపీ నాయకులు భారీ ఎత్తున పోరాడుతున్నారు కదా.

వీరి పోరాటానికి పార్టీ కేంద్ర నాయకత్వం మద్దతు ఇస్తోంది. బీజేపీ చేస్తున్న పోరాటాలన్నీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే. 2023 లో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వచ్చి తీరుతుందని రాష్ట్ర నాయకులు చెబుతున్నారు. కేంద్ర నాయకులూ చెబుతున్నారు. అధికారంలోకి రావాలంటే ప్రజా సమస్యల మీద పోరాడాలి కదా. వీరు పోరాటం చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. కానీ చెప్పుకోవడానికి చరిత్ర ఉండాలి కదా. ఆ చరిత్రకు ప్రాతిపదిక ఇలాంటి పోరాటాలే.

తమ కోసం బీజేపీ వాళ్ళు బాగా పోరాడుతున్నారని ప్రజలు అనుకోవాలి. రాష్ట్ర బీజేపీ నాయకుల పోరాటానికి కేంద్ర నాయకులు, జాతీయ లీడర్లు మద్దతు పలికితే వీరికీ ఉత్సాహం రెట్టింపు అవుతుంది. దీంతో ఇంకా తీవ్రంగా పోరాడుతారు. ఆ ఉద్దేశంతోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చాడు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వచ్చాడు. తాజాగా అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ వచ్చాడు.

వచ్చినోళ్లంతా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విపరీతంగా తిడుతున్నారు. మధ్యప్రదేశ్ సీఎం చాలా ఘాటుగా మాట్లాడాడు. దీంతో తెల్లవారి మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ ఓ రేంజ్ లో శివారాజ్ సింగ్ చౌహాన్ మీద మండిపడ్డారు. కేసీఆర్ ఒక్క మాట చెప్పి ఉంటే విమానం దిగకుండా చేసేవాళ్లమన్నారు. బీజేపీ – టీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి.

బండి సంజయ్ ని అరెస్టు చేసిన విషయమై ప్రధాని మోడీ ఆయనకే ఫోన్ చేసి మాట్లాడారు. రాష్ట్ర బీజేపీ నాయకులు పోరాటాలు చేయడం, జాతీయ నాయకులు, బీజేపీ ముఖ్యమంత్రులు స్వయంగా వచ్చి మద్దతు ఇవ్వడం బాగానే ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో ఈ పోరాటాల ఫలితం ఎంతమేరకు కనిపిస్తుందనేది ప్రశ్న. 

బీజేపీ నాయకులు చేస్తున్న పోరాటాలకు భారీగా మద్దతు లభిస్తుండగా కాంగ్రెస్ నాయకులకు అలాంటిది ఏమీ లేదు. పోరాటాలు చేయడం మానేసి టీపీసీసీ నాయకులు కొట్టుకుంటున్నారు. పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి పొగబెడుతూనే ఉన్నారు.