వికిపీడియా సర్వే.. చావులపై నెటిజన్ల ఆసక్తి!

మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ కి చావు డప్పు వింటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. విలన్ కనిపించినప్పుడు వినిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదోరకంగా ఉంటుంది. అలాంటి ఆసక్తి దాదాపుగా అందరిలోనూ…

మహేష్ బాబు స్పైడర్ సినిమాలో విలన్ కి చావు డప్పు వింటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది. విలన్ కనిపించినప్పుడు వినిపించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదోరకంగా ఉంటుంది. అలాంటి ఆసక్తి దాదాపుగా అందరిలోనూ ఉంటుందని తాజాగా వికీపిడియా తేల్చింది. అవును.. ఈ ఏడాది నెటిజన్లు అత్యథికంగా చదివిన వికీపిడియా పేజీ ఏదంటే.. డెత్స్ ఇన్ 2021.

సమాచారం కోసం అందరూ వికీపిడియాను చూడ్డం అలవాటు. ప్రముఖుల జీవిత చరిత్రల కోసమో, ఇంకేదైనా అంశంపై అదనపు సమాచారం కోసమో చాలామంది వికీపిడియాను ఉపయోగిస్తారు. కానీ అసలు సంగతి వేరే. ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా 4.27 కోట్ల మంది నెటిజన్లు.. 'ప్రముఖుల మరణాలు' అనే అంశంపైనే వెదికారట. ఇంగ్లండ్ ప్రిన్స్ ఫిలిప్ నుంచి హాలీవుడ్ నటి జెస్సికా వాల్టర్ వరకు చాలామంది ప్రముఖుల మరణాల జాబితాతో వికీపిడియా రూపొందించిన పేజీకి నెటిజన్ల నుంచి అమితమైన ఆదరణ లభించింది.

ఇక మరణాల తర్వాత అందరూ వెదికిన పేజీ బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2. ఆమెకు సంబంధించిన ఆర్టికల్స్ ను ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 2.52 కోట్ల మంది చదివారట. బ్రిటన్ రాణులు మరణిస్తే తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు అనే అంశంపై కొన్ని పత్రాలు ఇటీవల లీకయ్యాయి. దీంతో ఆ తంతు గురించి చాలామంది ఆసక్తిగా పరిశోధించారు. దీంతో ఎలిజిబెత్ 2 వికీపిడియా పేజ్ నెటిజన్లు అత్యథికంగా చదివిన లిస్ట్ లో రెండో స్థానంలో ఉంది.

సమకాలీన వ్యక్తుల్లో ఎలన్ సూపర్..

ఎలన్ మస్క్.. టెస్లా సంస్థ వ్యవస్థాపకుడిగా కంటే.. స్పేస్ ఎక్స్ తో చేపట్టిన ప్రయోగాలే ఎలన్ మస్క్ ని వార్తల్లో వ్యక్తిగా నిలిపాయి. ఏకంగా టైమ్ మేగజీన్, ఎలన్ మస్క్ ని పర్సన్ ఆఫ్ ది ఇయర్-2021గా ప్రకటించడంతో ఎలన్ మరింత పాపులర్ అయ్యారు. ఇక ప్రపంచ కుబేరుల జాబితాలో ఎలన్ పైపైకి ఎగబాకడం కూడా ఆయన పాపులార్టీకి మరో కారణం. ఎలన్ మస్క్ వికీపిడియా పేజ్ కి 2.41 కోట్ల వ్యూస్ వచ్చాయి.  

నాలుగో ప్లేస్ లో స్క్విడ్ గేమ్..

స్క్విడ్ వీడియో గేమ్ పేజ్ ని 2.18 కోట్ల మంది వికీపిడియాలో చూశారు. దీని నెంబర్ 4. ప్రముఖ పుట్ బాల్ ప్లేయర్ క్రిస్టియానా రొనాల్డో పేజీ 1.87 కోట్ల వ్యూస్ సాధించి ఐదో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆరో స్థానంలో బ్రిటన్ రాణి ఎలిజిబెత్-2 భర్త ప్రిన్స్ ఫిలిప్ పేజీ నిలిచింది.

గ్రీకు రాకుమారుడైన ఫిలిప్ 1947లో ఎలిజిబెత్ ని వివాహమాడారు, ఆ తర్వాత బ్రిటన్ కు వచ్చారు. 99ఏళ్ల వయసులో ఆయన ఈ ఏడాది ఏప్రిల్-9న చనిపోయారు. ఏడో ర్యాంక్ కూడా ఫుట్ బాల్ కే దక్కడం విశేషం. అయితే ఫుట్ బాల్ ప్లేయర్ కి కాకుండా.. ఈ ర్యాంక్ 16వ యూరోపియన్ ఛాంపియన్ షిప్ ఫుట్ బాల్ టోర్నీకి వచ్చింది. ఈ పేజీని 1.74కోట్లమంది చదివారు.

అమెరికా విషయాలు ఈ ఏడాది ప్రముఖంగా వార్తల్లో నిలిచాయి. ఆఫ్ఘన్ లో యూఎస్ బలగాల ఉపసంహరణ వ్యవహారంతో అమెరికా వికీపిడియా పేజ్ ని 1.71 కోట్లమంది చదివారు. అమెరికా నూతన అధ్యక్షుడు జో బైడెన్ పేజీని 1.68కోట్ల మంది, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేజీని 1.63కోట్లమంది చూశారు. ఇదీ ఈ ఏడాది వికీపిడియా ఇచ్చిన ర్యాంక్ లు.