16 కోట్ల‌తో వారి పంట పండింది!

ఐపీఎల్ ఆడుతున్న క్రికెట‌ర్ల‌లో హాట్ కేకుల్లా నిలిచారు కొంత‌మంది ఆట‌గాళ్లు. వారికి రికార్డు స్థాయి ధ‌ర‌ను చెల్లిస్తూ వివిధ టీమ్ లు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ విష‌యంలో అత్యంత డిమాండ్ క‌లిగిన ఆట‌గాళ్ల‌కు అత్యంత…

ఐపీఎల్ ఆడుతున్న క్రికెట‌ర్ల‌లో హాట్ కేకుల్లా నిలిచారు కొంత‌మంది ఆట‌గాళ్లు. వారికి రికార్డు స్థాయి ధ‌ర‌ను చెల్లిస్తూ వివిధ టీమ్ లు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ విష‌యంలో అత్యంత డిమాండ్ క‌లిగిన ఆట‌గాళ్ల‌కు అత్యంత ధ‌ర ల‌భిస్తుంద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొంద‌రికి వేలంలో జాక్ పాట్ త‌గ‌లొచ్చు. అయితే రిటెన్ష‌న్ ఒప్పందాలు మాత్రం వారి స‌త్తాకు రుజువని చెప్పాలి.

మ‌రి ఈ విష‌యంలో 16 కోట్ల రూపాయ‌ల ధ‌ర‌తో పంట‌ను పండించుకున్నారు ముగ్గురు క్రికెట‌ర్లు. వారే రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజా, రిష‌బ్ పంత్. టీ20 ఫార్మాట్ లోనే కాకుండా.. అన్ని ఫార్మాట్ లలోనూ అత్యుత్త‌మ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌ను చూపిస్తున్న ఈ క్రికెట‌ర్లు ఇప్పుడు కొత్త తార‌లు అని చెప్పాలి.

విశేషం ఏమిటంటే.. రిటైరైనా క్రేజ్ త‌గ్గ‌ని ధోనీ, ఇంకా స్టార్ క్రికెట‌ర్ గానే ఉన్న కొహ్లీ క‌న్నా ఈ క్రికెట‌ర్లు ముగ్గురూ అధిక ధ‌ర ప‌లికారు! కొహ్లీ 15 కోట్ల రూపాయ‌ల మొత్తానికే ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ధోనీ 12 కోట్ల రూపాయ‌ల‌కు ప‌రిమితం అయ్యాడు. అయితే.. రోహిత్ శ‌ర్మ‌, ర‌వీంద్ర జ‌డేజా, రిష‌బ్ పంత్ లు మాత్రం 16 కోట్ల రూపాయ‌ల విలువ‌తో కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేశారు. 

ఇక మంచి రేటుతో ఒప్పందాలు కుదుర్చుకున్న వారిలో బుమ్రా 12 కోట్లు, మాక్స్ వెల్ 11 కోట్ల రూపాయ‌లు, మ‌యాంక్ అగ‌ర్వాల్ 12 కోట్ల రూపాయ‌లు, సంజూ సామ్స‌న్ 14 కోట్లు, కేన్ విలియ‌మ్స‌న్ 14 కోట్ల రూపాయ‌లు.. వీరు కూడా ఉంటారు.

ఇక రిటెన్ష‌న్ అయిన వారు పోనూ.. ఇక వేలంలోకి వ‌చ్చే మేటైన ఆట‌గాళ్లు కూడా చాలా మంది ఉంటారు. ఇప్ప‌టికే వారిపై కూడా ఆయా జ‌ట్లు క‌న్నేసి ఉంటాయి. అలాగే రెండు కొత్త జ‌ట్లు కూడా వ‌చ్చేసారి రానున్నాయి. ఈ నేప‌థ్యంలో వేలంలో కూడా గ‌ట్టి పోటీ ఉంటుంది. రిటెన్ష‌న్ పొందిన వారు ఆనందంగానే ఉండ‌వ‌చ్చు. అయితే వేలంలోకి వెళ్లే వారు బాధ‌ప‌డేది ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు. 

రిటెన్ష‌న్ ఆఫ‌ర్లు రాని వారు కూడా.. వేలంలో రికార్డు ధ‌ర‌ల‌ను ప‌ల‌క‌వ‌చ్చు. రిటెన్ష‌న్లో భారీ మొత్తం 16 కోట్లు అని స్ప‌ష్టం అవుతోంది. మ‌రి వేలంలో ఆ ధ‌ర‌ను మించిన స్థాయిలో కూడా ప‌లికే ఆట‌గాళ్లు ఉండ‌వ‌చ్చు. కేఎల్ రాహుల్, శ్రేయ‌స్ అయ్య‌ర్ వంటి దేశీయ ఆట‌గాళ్ల‌కు అలాంటి ఛాన్సులు లేక‌పోలేదు!