ప్రశాంతంగా తమ ప్రేమ పెళ్లిని చేసుకున్న క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా షెట్టిలను సోషల్ మీడియా బాగా ఇబ్బంది పెడుతోంది. వీరికి ప్రముఖుల నుంచి భారీగా గిఫ్ట్ లు అందాయంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతూ ఉంది. వీరికి ఫలానా వారు ఫలానా గిఫ్ట్ ఇచ్చారంటూ ట్రోల్ పేజ్ ల వాళ్లు, పేజ్ ల అడ్మిన్లు అసంబంద్ధమైన, అడ్డదిడ్డమైన ప్రచారానికి తెగించారు.
రాహుల్ కు ధోనీ 50 లక్షల రూపాయల బైక్ బహుమానంగా ఇచ్చాడని ఒకరు, కొహ్లీ అయితే ఏకంగా రెండు కోట్ల రూపాయల కారు ఇచ్చాడని మరొకరు ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇంతటితో ఆగడం లేదు. అతియా తండ్రి సునీల్ షెట్టి సల్మాన్ కు సన్నిహితుడు కాబట్టి సల్మాన్ అరవై లక్షల రూపాయల విలువైన బహుమానం ఇచ్చారని ఇంకో ప్రచారం. ఇలా ఈ లిస్ట్ అంతా ఏకరువు పెడుతూ సోషల్ మీడియాలో ప్రచారం తెగ జరిగిపోతోంది.
అలాగే రాహుల్ కు సునీల్ షెట్టి కట్నంగా ఏకంగా యాభై కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అంటూ ఇంకో ప్రచారం! ఇదీ వరస. ఇదెంత వరకూ వెళ్లిందంటే… కేఎల్ రాహుల్ కు కొహ్లీ, ధోనీ లు భారీ గిఫ్ట్ లను ఇచ్చారని, మరోవైపు ఇదే సమయంలో పెళ్లి చేసుకున్న అక్షర్ పటేల్ ను మాత్రం పట్టించుకోవడం లేదంటూ ఇంకొందరు మేధావులు మొదలుపెట్టారు! ధోనీ, కొహ్లీలు కేఎల్ రాహుల్ కు ఏయే గిఫ్ట్ ఇచ్చారో అక్షర్ కు కూడా అవే బహుమానాలు ఇచ్చేస్తే పద్ధతిగా ఉంటుందంటూ వీరు వాదించే ముచ్చటా మొదలైంది!
అయితే ఇదంతా ఫేక్ ప్రచారం బాబోయ్ అంటోంది అతియా, రాహుల్ ఫ్యామిలీ. సోషల్ మీడియా లో ప్రచారం జరుగుతున్నట్టుగా ప్రముఖుల నుంచి బహుమానాలు ఏవీ రాలేదని వారు వివరణ ఇచ్చుకుంటున్నారు పాపం! అంటే.. గిఫ్ట్ రానందుకు బాధ కాదు, అసలు ఈ రచ్చ అంతా ఎందుకు చేస్తున్నారో అని వారు వాపోతున్నారు. అయితే సోషల్ మీడియా దేన్నైనా తనకు తోచినట్టుగా ప్రచారం చేయగలదు. అర్థంపర్థం లేని పోస్టులను అడ్మిన్లు పోస్టు చేసేస్తే వాటిల్లో సత్యం ఏమిటో తెలుసుకోకుండా వైరల్ చేసేందుకు వేల, లక్షల గొర్రెలు ఎప్పుడూ సదాసిద్దంగా ఉంటాయక్కడ!