భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ మళ్లీ ఐపీఎల్ బాట పడుతున్నట్టున్నారు. ఐపీఎల్ లో ఢిల్లీ టీమ్ గంగూలీ సేవల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్టుగా ఉంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నట్టుగా సమాచారం. గంగూలీని మెంటర్ గా తీసుకోవడానికి ఢిల్లీ జట్టు ప్రయత్నాలు సాగిస్తున్నట్టుగా సమాచారం.
ఢిల్లీ టీమ్ యాజమాన్యంతో గంగూలీకి ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో ఒప్పందం ఖరారు కావొచ్చని తెలుస్తోంది. బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు గంగూలీ ఏ జట్టు కోసం పని చేయడానికి వీల్లేకపోయింది. వరసగా క్యాబ్ ప్రెసిడెండ్, ఆ తర్వాత బీసీసీఐ ప్రెసిడెంట్ హోదాల్లో గంగూలీ కొనసాగారు.
ఒక దశలో లోథా సంస్కరణలతో గంగూలీ పదవి కోల్పోవాల్సి వచ్చినా, కొన్నాళ్ల పాటు కొనసాగారు. చివరకు ఇటీవలే రోజర్ బిన్నీ రూపంలో బీసీసీఐకి కొత్త ప్రెసిడెంట్ వచ్చారు. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి నుంచి వైదొలిగిన నేపథ్యంలో గంగూలీ ఇక మళ్లీ క్రికెట్ కోచ్, మెంటర్ వంటి హోదాలకు వెళ్లడానికి అవకాశం ఏర్పడింది.
ఈ అవకాశాన్ని ఢిల్లీ తీసుకుంటున్నట్టుగా ఉంది. అలాగే రిటైర్డ్ ఆటగాళ్లతో బోర్డులతో ఒప్పందం లేని ఆటగాళ్లతో జరిగే విదేశీ సరదా లీగ్ ల విషయంలో కూడా గంగూలీ పని చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో ఘనతలే ఉన్నా ఐపీఎల్ లో మాత్రం గంగూలీది పేలవమైన రికార్డు. కోల్ కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా ఆ తర్వాత పుణే జట్టు కోసం పని చేసి కూడా గంగూలీ ఫెయిల్యూర్ ట్రాక్ రికార్డును కలిగి ఉన్నాడు. మరి ఈ దశలో గంగూలీకి ఐపీఎల్ కొత్త అనుభూతులను ఏమైనా మిగులుస్తుందేమో!