ఏపీ అంటే తెలంగాణా పాలకులకు చులకన భావం. ఆంధ్రా అంటే తెలంగాణా ప్రజలకే కాదు, తెలంగాణలో ఉంటున్న ముఖ్యంగా హైదరాబాదులో ఉంటున్న ఆంధ్రా ప్రజలకు కూడా చులకనే. ఆంధ్రాలో ఏముంది ? అని ప్రశ్నిస్తున్నారు.
నిజంగా ఇలాంటి పరిస్థితి రావడం అవమానకరం. ఆంధ్రా వాళ్ళు కూడా తెలంగాణా పాలకుల కింద బతకాలని కోరుకుంటున్నారని టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్ ప్రసంగం ద్వారా అర్ధమవుతోంది. అక్కడి ప్రజలు కోరుకుంటున్నారని అర్ధం కాదు. కేసీఆర్ మాటల సారాంశం అది. ఆంధ్రాలో టీఆర్ఎస్ పార్టీ పెడితే గెలిపించుకుంటామని అక్కడి ప్రజలు చెబుతున్నారని అన్నారు. అంటే ఆంధ్రాలో అధికారంలో ఉన్నవారికి పాలన చేతకావడంలేదని చెప్పినట్లే కదా.
తెలంగాణలోని పథకాలు తమ రాష్ట్రంలోనూ పెట్టాలని వారు కోరుతున్నారని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో దళిత బంధు పెట్టాక ఆంధ్రా నుంచి అనేక విజ్ఞప్తులు అందాయని చెప్పారు. తెలంగాణా ఎంతగా డెవెలప్ అవుతున్నదో సందర్భం వచ్చినప్పుడల్లా కేసీఆర్, కేటీఆర్ చెబుతుంటారు.
ఒకసారి అసెంబ్లీలోనే కేసీఆర్ మాట్లాడుతూ ఒకప్పుడు ఆంధ్రావాళ్ళు తెలంగాణలో తక్కువ ధరలకు పొలాలు కొన్నారని, కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్ముకుంటే ఆంధ్రాలో మూడెకరాల పొలం కొనుక్కోవచ్చని అన్నారు. అంటే తెలంగాణా ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందారని చెప్పడమన్న మాట. తనను భీమవరంలో పోటీ చేయాలని అక్కడి ప్రజలు అడుగుతున్నారని కేటీఆర్ ఒకసారి చెప్పాడు.
కేసీఆర్ పుట్టిన రోజు వస్తే ఆంధ్రాలోని కొన్ని ఊళ్లల్లో ఫ్లెక్సీలు కడతారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకాలు చేస్తారు. కేసీఆర్, కేటీఆర్ ప్రసంగాలకు ఆంధ్రా ప్రజలు ఫిదా అవుతుంటారు. ఆంధ్రాలో కేసీఆర్ మీద అభిమానం ఉందనే విషయం కాదనలేము.
రాష్ట్రం విడిపోయినప్పుడు రాయలసీమను తెలంగాణలో కలపాలని జేసీ దివాకర్ రెడ్డి వంటి నాయకులు డిమాండ్ చేశారు. ఆయన కొంత కాలం కిందట హైదరాబాదుకు వచ్చినప్పుడు తాము తెలంగాణలో కలిసి ఉంటే బాగుండేదని అన్నాడు. ఇప్పటికీ ఏపీ నాయకుల్లో, ఎమ్మెల్యేల్లో చాలామంది హైదరాబాదులోనే ఉంటున్నారు. ఇక ఉద్యోగాలు, ఉపాధి కోసం వచ్చేవారి గురించి చెప్పక్కరలేదు.
ఇప్పటికీ ఆంధ్రావాళ్ళు హైదరాబాదులోనే స్థిరపడాలని కోరుకుంటున్నారు. వారి కారణంగానే హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. ఏ విషయంలోనైనా తెలంగాణా ముందు ఆంధ్రా దిగదుడుపు అనేది వాస్తవం. ఇప్పుడు ఆంధ్రా కుళ్ళు రాజకీయాలకు, ప్రతీకార రాజకీయాలకు పేరుబడింది. ఆర్ధిక వ్యవస్థ దిగజారింది. ప్రజలను సోమరిపోతులను చేసే పాలకులు అక్కడ రాజ్యమేలుతున్నారు. అందరికీ ఉన్న అభిప్రాయం ఇదే.