నానో ఫెయిల్.. మరి నానో ఎలక్ట్రిక్ పాస్ అవుతుందా?

మధ్యతరగతి ప్రజలకు కూడా కారును అందుబాటులోకి తెచ్చే సదుద్దేశంతో మార్కెట్లోకొచ్చింది టాటా నానో కారు. 2008లో కేవలం లక్ష రూపాయల ఎక్స్ షోరూమ్ ధరకే మార్కెట్లోకి అడుగుపెట్టిన నానో, అప్పట్లో ఓ సంచలనం. అయితే…

మధ్యతరగతి ప్రజలకు కూడా కారును అందుబాటులోకి తెచ్చే సదుద్దేశంతో మార్కెట్లోకొచ్చింది టాటా నానో కారు. 2008లో కేవలం లక్ష రూపాయల ఎక్స్ షోరూమ్ ధరకే మార్కెట్లోకి అడుగుపెట్టిన నానో, అప్పట్లో ఓ సంచలనం. అయితే టాటా ఒకటి భావిస్తే, మధ్యతరగతి మరోటి ఫీల్ అయింది.

నానో కారు కొన్న మధ్యతరగతి జనాల్ని చీప్ గా చూడడం మొదలుపెట్టారు చాలామంది. ఆటో కాదు నానో అనే జోకులు కూడా వచ్చాయి. దీంతో కారు ఉందనే ఆనందం కంటే, నానోతో నెట్టుకొస్తున్నాడనే విమర్శను మధ్యతరగతి వ్యక్తి భరించలేకపోయాడు. దానికితోడు బ్యాక్ ఇంజిన్ కలిగి ఉండడం, సేఫ్టీ రెగ్యులేషన్లు లేకపోవడం వంటి కారణాల వల్ల ఆ కారు ఫెయిలైంది.

అలా నానో కార్ల ఉత్పత్తిని ఆపేసింది టాటా కంపెనీ. మళ్లీ ఇన్నేళ్లకు నానోకు కొత్త రూపు తీసుకొచ్చింది. ఈసారి టాటా నానో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లో ప్రవేశపెట్టే ప్రణాళికలు రచిస్తోంది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకొని సెక్యూరిటీ ఫీచర్లతో పాటు, లగ్జరీ పేరిట మరికొన్ని ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుతం ఈవీ కార్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. వాటితో పోల్చుకుంటే నానో ఈవీ కారు చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రాబోతోంది. దీని ఎక్స్ షోరూం ధరను 2 లక్షల 69వేల రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉంది. మారుతి ఆల్టో కంటే తక్కువ ధరకే నానో ఈవీని అందించాలనేది టాటా టార్గెట్.

అయితే ఇప్పటికే రిలీజైన స్టిల్స్ చూస్తుంటే.. పాత నానోకు, త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న నానో ఈవీకి డిజైన్ పరంగా పెద్దగా తేడా కనిపించడం లేదు. పాత నానో ఫెయిల్ అవ్వడానికి ప్రధాన కారణాల్లో దాని డిజైన్ కూడా ఒకటి. రెగ్యులర్ గా రోడ్లపై కనిపించే కార్ల తరహాలోనే నానో ఈవీ డిజైన్ కూడా ఉంటే ఆదరణ దక్కుతుంది. పాత నానో డిజైన్ నే నానో ఈవీకి కూడా కొనసాగిస్తే ఆదరణ దక్కించుకోవడం కష్టం అంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు

ఇదొక కారణమైతే.. ఈవీ వాహనాలకు ఆదరణ ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. అది కూడా టాప్-ఎండ్ సెగ్మెంట్ లోనే ఈవీ వాహనాలు కొనేందుకు ఎక్కువమంది మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అగ్రగామిగా ఉంది టాటా మోటార్స్. మౌలిక వసతుల సామర్థ్యం కూడా ఈ కంపెనీకి ఎక్కువ. వాటిని సద్వినియోగం చేసుకునే క్రమంలో నానోకు ఈవీ మోడల్ తీసుకొస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు.

వీటి సంగతి పక్కనపెడితే, టాటా మాత్రం ఈసారి నానో ఈవీపై పూర్తి నమ్మకంతో ఉంది. ఒకసారి ఛార్జింగ్ పెడితే 160 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని, 30 సెకెన్లలో 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని చెబుతోంది. త్వరలోనే విపణిలోకి రాబోతున్న నానో ఈవీ సంచలనం సృష్టిస్తుందా లేక మరోసారి పాత నానో టైపులోనే విమర్శలకు గురవుతుందా అనేది చూడాలి.