టీఆర్ఎస్ నుంచి ఎవర్ని సాగనంపినా.. వారిని మెల్లమెల్లగా జనాల్లో పలుచన చేయడం కేసీఆర్ కి కానీ ఆ పార్టీకి కానీ బాగా అలవాటు. ఈటల రాజేందర్ నిష్క్రమణ సందర్భంలోనూ అదే జరిగింది. అవినీతి మరక అంటించి ఆయన్ను మెల్లగా పార్టీ నుంచి బయటకు పంపించారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు అందరూ సైలెంట్ గానే ఉన్నారు. ఈటలకు విమర్శించే ఛాన్స్ ఇచ్చారు.
కేసీఆర్, కేటీఆర్ సహా.. ఈటల అందరిపై మాటలు తూలారు కానీ తన స్నేహితుడు హరీష్ రావుని మాత్రం మొదట్లో పల్లెత్తు మాట అనలేదు. పైగా తనతోపాటు ఆయనకి కూడా అన్యాయం జరిగిందని, మంత్రి పదవి ఇవ్వడంలో ఆలస్యం చేశారని, కేసీఆర్ నిరంకుశ ధోరణికి హరీష్ కూడా బలయ్యారని సింపతీ చూపించారు. హరీష్ కూడా తన స్నేహితుడు, తెలంగాణ ఉద్యమంలో తనతో కలసి పనిచేసిన నమ్మకమైన నేస్తంపై విమర్శలు చేయకుండానే కాలం గడిపారు.
కానీ ఇది కేసీఆర్ కి నచ్చలేదు. పదే పదే ఈటల తన గురించి మాట్లాడటం, తాను సైలెంట్ గా ఉండటం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తుందనే ఉద్దేశంతో వ్యూహాత్మకంగా హరీష్ ని రంగంలోకి దించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతలు హరీష్ పై పెట్టి ఈటల వర్సెస్ హరీష్ అనేలా సీన్ క్రియేట్ చేశారు.
శత్రువుల్లా మారిన స్నేహితులు..
కేసీఆర్ గేమ్ ప్లాన్ తో స్నేహితులు శత్రువులుగా మారిపోయారు. ఇప్పుడు రాజకీయ విమర్శలన్నీ హరీష్ వర్సెస్ రాజేందర్ అనే లెవల్లోనే సాగుతున్నాయి. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఈటల రాజేందర్, తాజాగా హరీష్ రావు కు సవాల్ విసిరారు. దీనికి హరీష్ కూడా అంతే దీటుగా సమాధానం చెప్పారు. హుజూరాబాద్ లో గెల్లు శ్రీనివాస్ దే విజయం అని ఖాయంగా తేలడంతో ఈటల భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
కార్యకర్త చేతిలో ఓడిపోతే బాగుండదని ఈటలకి అర్థమైందని అందుకే తనని పోటీ చేయాలని అడుగుతున్నారని సెటైర్లు వేశారు. తాను నిలబడినా, తమ పార్టీకి చెందిన ఏ కార్యకర్త నిలబడినా ఈటలకు దారుణ పరాభవం తప్పదని అన్నారు.
కొన్నాళ్లుగా ఈటల హరీష్ రావు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. హరీష్ రావు ఇతర వ్యవహారాన్నీ పక్కనపెట్టి హుజూరాబాద్ లో క్షేత్ర స్థాయిలో పనులు పర్యవేక్షిస్తున్నారు. గెల్లు శ్రీనివాస్ గెలుపుకోసం కష్టపడుతున్నారు. దుబ్బాక మచ్చను చెరిపేసుకునేందుకు హుజూరాబాద్ తనకు అంది వచ్చిన అవకాశంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో తన స్నేహితుడిపై తీవ్ర విమర్శలు చేయక తప్పడం లేదు.
తెలంగాణలో టీఆర్ఎస్ అనే నీటి కుంట నుంచి బయటకొచ్చిన మొసళ్లన్నీ ఏమయ్యాయో అందరికీ తెలుసు. బయటకొచ్చాక అందరూ బద్నాం అయ్యారే కానీ, బలపడింది లేదు. అందుకే అప్పట్లో తన ప్రయారిటీ తగ్గినా హరీష్ రావు పార్టీని వదిలిపెట్టలేదు, కేసీఆర్ ని పల్లెత్తు మాట అనలేదు. ఈటల మాత్రం ఆ గ్యాప్ ని అలాగే కంటిన్యూ చేసి చివరకు తన మంత్రి పదవి కిందకే నీళ్లు తెచ్చుకున్నారు. ఇప్పుడు బీజేపీలో ఒంటరిగా మారి, గెలుపు కోసం చెమటోడుస్తున్నారు.
ఉద్యమ సమయంలో తనతో కలసి పనిచేసినవారంతా ఇప్పుడు తనకు శత్రువులుగా మారిపోయే సరికి ఈటల అయోమయంలో పడ్డారు. ఆఖరికి స్నేహితుడు హరీష్ రావుతో కూడా మాటలు పడాల్సి వస్తోంది.