వైసీపీ శ్రేణులకు హైకోర్టులో ఊరటనిచ్చే విషయం. గత ఏడాది కాలంలో జగన్ సర్కార్‌కు ఎక్కువ సందర్భాల్లో హైకోర్టులో ఎదురు దెబ్బలు, మొట్టికాయలు అనే మాటే. ఇలాంటి సందర్భంలో జగన్ సర్కార్‌తో పాటు వైసీపీ శ్రేణులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చే ప్రశంస హైకోర్టు నుంచి వచ్చింది.
‘విశాఖపట్నం ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం ఎంతో గొప్పగా వ్యవహరించింది. ఈ ఘటనలో మృతి చెందిన ప్రతి ఒక్కరికీ కోటి రూపాయల భారీ తక్షణ నష్టపరిహారం అందించింది. ఇది చాలా గొప్ప విషయం. ఇంత భారీ మొత్తాన్ని పరిహారం గా ఇచ్చిన ప్రభుత్వ మానవతా దృక్పథాన్ని.. దయార్ద హృదయాన్ని అభినందిస్తున్నాం’ అని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది.
కానీ ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ రాష్ట్ర హైకోర్టు వెల్లడించిన అభిప్రాయం కేవలం సాక్షి పత్రికకే పరిమితం కావడం గమనార్హం. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో భూతద్దం పెట్టి వెతికినా ఎక్కడా కనిపించలేదు. సమస్యలను బట్టి హైకోర్టులో తీర్పులు, వ్యాఖ్యానాలు ఉంటాయని ఈ ఎపిసోడ్ ద్వారా అర్థం చేసుకోవాలి. అలా కాకుండా వ్యతిరేక తీర్పులు, ఆదేశాలు వచ్చినప్పుడు బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడితే చిక్కులు కొని తెచ్చుకోవడం తప్ప…మరేం సాధించలేం.