బాలలపై లైంగిక దాడులకు పాల్పడే నేరస్థులు చట్టంలోని లొసుగులను అడ్డం పెట్టుకుని స్వల్ప శిక్షలతో తప్పించుకోకుండా కఠినాత్మకమైన చట్టం తీసుకురావలసిన ఆవశ్యకత ఎంతో ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి వాదించారు. బాలలు అత్యాచారాలు, లైంగిక వేధింపుల బారిన పడకుండా రక్షణ కల్పించే బిల్లుపై బుధవారం రాజ్య సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీకి మూడు ముఖ్యమైన సూచనలు చేశారు.
లైంగిక అత్యాచారాలకు సంబంధించి ఫలానా చర్యలు మాత్రమే తీవ్రమైన నేరంగా పరిగణిస్తూ ప్రభుత్వం వర్గీకరించడం తగదని అన్నారు. నేర తీవ్రతను గుర్తించే బాధ్యతను ఆయా కేసులను విచారించే న్యాయ స్థానాల విచక్షణకు వదిలేయాలని సూచించారు. అలాగే ఈ తరహా కేసులను విచారించే ప్రత్యేక న్యాయ స్థానాలను అధునీకరించి, డిజిటలైజ్ చేయడం వలన బాధితులకు సత్వర న్యాయం అందించే అవకాశం ఉంటుందని అన్నారు.
బాలలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలకు సంబంధించిన కేసులను విచారించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక న్యాయ స్థానాలు ఏర్పాటు చేయాలని కోరారు. నేరస్తులు చట్టంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని తేలికపాటి శిక్షలతో తప్పించుకోకుండా చూసేందుకు గల్ఫ్ దేశాలలో మాదిరిగా సుదీర్ఘ కాలపు శిక్షలు పడేలా చట్టాన్ని అత్యంత కఠినాత్మకంగా తీర్చిదిద్దినప్పుడే ఇలాంటి నేరాలను నియంత్రించగలమని అన్నారు.
చిన్న పిల్లలపై జరిగే లైంగిక అత్యాచార ఘటనలు సమాజం యావత్తును తీవ్రంగా కుదిపేస్తాయి. నిందితులకు అత్యంత కఠినమైన శిక్షలు అమలు జరిగితేనే సమాజంలో నెలకొనే అభద్రతా భావం తొలగిపోతుందని చెప్పారు. దేశంలో ఇటీవల కాలంలో చిన్న పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు పెరిగిపోతున్నాయి. 31 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో లక్షా 60 వేల కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం కింద బాలలపై అత్యాచార ఘటనలకు సంబంధించి 12 వేల కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇది నిజంగా చాలా ఆందోళనకరమని ఆయన అన్నారు.
చర్చకు మంత్రి స్మృతి ఇరానీ సమాధానం చెబుతూ విజయసాయి రెడ్డి ప్రస్తావించిన అంశాలపై స్పందించారు. అత్యాచార నేర స్వభావాన్ని వర్గీకరించవలసిన ఆవశ్యకతను ఆమె వివరిస్తూ బిల్లులో పొందుపరిచిన అంశాలను సమర్ధించారు.