రెండు నెలల కిందటి ప్రపంచం వేరు, ఇప్పటి ప్రపంచ వేరు! మార్చి 18 నాటికి మే 18 నాటికి మనుషుల ఆలోచన తీరే మారిపోయింది! రెండు నెలల కిందట ఎన్నో ప్రణాళికలు, ఎన్నో ఆలోచనలు, ఊహలు, స్వప్నాలు!
ఇప్పుడు.. రేపేమిటో అనే సందేహం! కరోనా ప్రభావం ఇప్పటికిప్పుడు నశించిపోయినా, ఆ తర్వాత మళ్లీ ప్రపంచం పరుగందుకోవడానికి సమయం పట్టొచ్చు! ఇండియా విషయానికి వస్తే.. జనం చేతుల్లో డబ్బుల్లేవ్!
ప్రత్యేకించి మధ్యతరగతి తీవ్ర ఇబ్బందులు పడుతోంది. పేదలు ఎప్పుడూ పేదలే. వాళ్లకు రెండు నెలల కిందటా కష్టాలే, ఇప్పుడు రెట్టించాయి. మధ్యతరగతికి లాక్ డౌన్ తో శరాఘాతం తగిలింది. పట్టణ, నగరాల్లో చిరుద్యోగులతో బతుకీడ్చే ప్రజలు కరోనా లాక్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
ఇంట్లోని అందరూ ఏదో ఒక పని చేయడం, తలా పది వేలో, 15 వేలో తెచ్చుకుని బతుకీడ్చడం… ఇదీ పట్టణాల్లోని, నగరాల్లోని కొన్ని కోట్ల మంది భారతీయుల జీవన చిత్రం. అయితే లాక్ డౌన్ తో బాగా దెబ్బతింది చిరుద్యోగులు, చిరు వ్యాపారులే. పెద్ద పెద్ద ఉద్యోగులకు ఇదేం పెద్ద ఇబ్బంది కాదు, పెద్ద పెద్ద వ్యాపారాలను ఇలాంటి సంక్షోభాలు దెబ్బతీయలేవు. ఎటొచ్చీపేద, మధ్యతరగతి కుటుంబాలు మాత్రం తీవ్ర ఇక్కట్ల పాలవుతూ ఉన్నాయి. అదెలా అనేది.. వారిని దగ్గరుండి చూస్తేనే అర్థం అవుతుంది.
విశేషం ఏమిటంటే.. ఈ వర్గాలు రాజకీయంగా నరేంద్రమోడీని ఇన్నాళ్లూ విపరీతంగా అభిమానించాయి. మోడీ ఏదో చేస్తాడు, దేశాన్ని ఉద్ధరిస్తాడు.. అనేది వీరి ప్రబలమైన నమ్మకం! ఉత్తరాదిలో అయితే అది మరీ ఎక్కువ. సౌతిండియాలో బీజేపీ ఎలాగూ అంత బలంగా లేదు. వీరు కమలం పార్టీకి ఓటు బ్యాంకు కాకపోయినా.. సానుభూతి పరులుగా అయినా నిలిచారు. అయితే వీరిలోనే ఇప్పుడు ప్రబలమైన మార్పు కూడా కనిపిస్తూ ఉంది. ఇదే విషయం గురించినే న్యూయార్క్ టైమ్స్ కూడా ప్రస్తావించింది.
తీవ్ర సంక్షోభ సమయంలో మోడీ ఏం చేశారు? అనేది ప్రజలు ఆలోచిస్తున్నారు. వచ్చారు, ప్రకటించారు, వెళ్లారు. చప్పట్లు కొట్టమన్నారు, దీపాలు పెట్టమన్నారు. అది కూడా లాక్ డౌన్ ముచ్చట తొలివారంలోనే. ఇప్పుడు మోడీ అలాంటి పిలుపులు ఇవ్వడం లేదు! ఇప్పుడు అలాంటి పిలుపునిస్తే.. దానికి స్పందన ఎలా ఉంటుందో అంచనా వేయలేనిది ఏమీ కాదు.
20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటన అన్నారు.. ప్రజల ఖాతాల్లోకి కనీసం 20 రూపాయలు కూడా పడుతున్న దాఖలాలు కనిపించడం లేదు. బారెడు ప్రకటన చేసినా తర్వాత.. తీవ్ర విమర్శలు వస్తుండటంతో, ఇప్పుడు తమ ప్యాకేజీని సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి వర్యులు. నిజంగానే ప్రజలకు లబ్ధి కలుగుతుంటే.. మళ్లీ సమర్థించుకోవాల్సిన అవసరం ఏముండేది?
రెండు నెలల పాటు పేద, మధ్యతరగతి కుటుంబాల్లోని వాళ్లకు పనులు లేకుండా పోతే, ఉపాధి లేకుండా పోతే, నెల జీతాలు రాకుండా పోతే, రోజు వారీ కూలి లేకుండా పోతే.. మోడీ చేసిన బృహత్తర సాయం 500 రూపాయలు! అది కూడా జన్ ధన్ యోజనలో భాగంగా జీరో అకౌంట్లను ఓపెన్ చేసిన వారికే. ఇదీ తీవ్ర కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న ప్రజలను మోడీ ఆదుకున్న తీరు. ఎవడి కష్టాలు వాడు పడాలి, కేంద్రానికి మాత్రం సంబంధం లేదన్నట్టుగా మోడీ వ్యవహరిస్తున్నారు నిస్సందేహంగా.
ఇదే ఊపులో బ్యాంకు డీఫాల్టర్లకు అప్పుల రద్దు పథకం కథా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా మధ్యతరగతిలో బాగా వ్యతిరేకతను పెంచుతున్న అంశం. ఇవన్నీ క్షేత్ర స్థాయికి వెళ్లి చూస్తే అర్థం అవుతాయి, సోషల్ మీడియాలో భజనలు చేసే భక్తులు ఇలాంటి అభిప్రాయాలకు మినహాయింపు, వారి అభిప్రాయాలు మారవు.