చూస్తున్నావా జగన్.. ఈ అధికారుల నిర్లక్ష్యం

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందర్నీ పిలిచి మార్గనిర్దేశం చేసినా కొంతమంది అధికారుల్లో ఎలాంటి మార్పురాలేదు. పైగా అలాంటి వాళ్లలో టీడీపీ వీరభక్తులు కూడా ఉండడం ఇప్పుడు జగన్ కు పెద్ద తలనొప్పిగా…

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అందర్నీ పిలిచి మార్గనిర్దేశం చేసినా కొంతమంది అధికారుల్లో ఎలాంటి మార్పురాలేదు. పైగా అలాంటి వాళ్లలో టీడీపీ వీరభక్తులు కూడా ఉండడం ఇప్పుడు జగన్ కు పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ చిత్తూరుజిల్లా పీలేరులో జరిగింది.

తండ్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పలు పథకాల్ని ప్రారంభించారు సీఎం జగన్. ఇందులో భాగంగా రాజన్న బడిబాట కార్యక్రమం కూడా ప్రారంభమైంది. గతంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన బడికొస్తా పథకానికి దాదాపు సమానమైనదే ఇది. ఇందులో ఎలాంటి తప్పులేదు. కానీ అధికారులు మాత్రం తమ అలసత్వంతో క్షమించరాని తప్పుచేశారు. పీలేరులో విద్యార్థినులకు చంద్రబాబు స్టిక్కర్లతో ఉన్న సైకిళ్లనే పంపిణీ చేశారు.

చంద్రబాబు మీద ఆయన సొంతజిల్లా అధికారులకు ఇంకా ప్రేమ తగ్గినట్టు లేదు. ఇప్పటికీ తమ జిల్లాలో చంద్రబాబునే ముఖ్యమంత్రి అనుకుంటున్నారో లేక జగన్ అంటే ఇష్టంలేకనో ఇలాంటి పనులకు దిగుతున్నారు. నిజానికి చంద్రబాబు హయాంలో కొనుగోలు చేసిన సైకిళ్లను కూడా, కొత్తగా కొనుగోలు చేసిన వాటితో పంచాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. డబ్బు వృధా చేయడం ఇష్టంలేక ఈ నిర్ణయం తీసుకుంది. పైగా ఎలక్షన్ కోడ్ వల్ల మూలనపడిన సైకిళ్లను ఇలా సద్వినియోగం చేయాలని తలచింది.

అలా అని చంద్రబాబు, అప్పటి విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉన్న పచ్చ స్టిక్కర్లతో సైకిళ్లను పంపిణీ చేయమని చెప్పలేదు. వాటి స్థానంలో కొత్త స్టిక్కర్లను కూడా సరఫరా చేసింది. కానీ పీలేరు అధికారులు మాత్రం చంద్రబాబుపై ప్రేమతో ఇలా పాత స్టిక్కర్లు ఉన్న సైకిళ్లనే పీలేరులోని ఓ పాఠశాలలో పంపిణీ చేశారు.

చంద్రబాబు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అనే విషయం అధికారులకు తెలుసు. గంటా శ్రీనివాస్ కు మంత్రిపదవి లేదని కూడా తెలుసు. అయినప్పటికీ అధికారులు ఇలా కావాలనే సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ విషయాన్ని జగన్ సీరియస్ గా తీసుకోవాలి. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. లేదంటే రాబోయే రోజుల్లో ఇది మరింత విపరిణామాలకు దారితీస్తుంది.

రాబోయే రోజుల్లో జిల్లాలో ఏదైనా ప్రభుత్వ కార్యక్రమం జరిగితే ఇలాంటి అధికారులు, చంద్రబాబును ఆహ్వానించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై చిత్తూరుజిల్లా వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

అన్నా.. జగనన్నా.. చేర్చుకో అన్నా!