మెగా హీరోల పని అయిపోయిందా?

మెగావంశానికి మూలపురుషుడు చిరంజీవి. స్వయంకృషి, స్వయంప్రతిభ, డ్యాన్సులో ప్రత్యేకత, వివాదరహిత గుణం, మంచితనం…ఇలా అనేకమైన కారణాల కలబోత వల్ల దశాబ్దాలుగా హీరోగా వెలుగొందుతున్నారు.  Advertisement ఆయన తమ్ముళ్లిద్దరూ నటనవైపే అడుగేసినా పెద్ద స్టార్ గా…

మెగావంశానికి మూలపురుషుడు చిరంజీవి. స్వయంకృషి, స్వయంప్రతిభ, డ్యాన్సులో ప్రత్యేకత, వివాదరహిత గుణం, మంచితనం…ఇలా అనేకమైన కారణాల కలబోత వల్ల దశాబ్దాలుగా హీరోగా వెలుగొందుతున్నారు. 

ఆయన తమ్ముళ్లిద్దరూ నటనవైపే అడుగేసినా పెద్ద స్టార్ గా నిలబడింది మాత్రం పవన్ కళ్యాణే. అయితే తొలుత మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంతో ప్రత్యేకంగా చూపించుకున్నా క్రమంగా చిరంజీవి తమ్ముడిగానే ఇతనికి గుర్తింపు మిగిలింది. ఆ గుర్తింపు తోనే ప్రేక్షకులు చిరంజీవికి కొనసాగింపుగా మోసారు, మోస్తున్నారు. అంతవరకు ఒక పర్వం. 

ఇక చిరంజీవి రక్తం కాకపోయినా అల్లు అర్జున్ ని కూడా మెగా హీరోగానే గుర్తించారు. తర్వాత రాం చరణ్ చిరంజీవి వారసుడిగా తెర మీదికొచ్చాడు. 

అంతవరకూ మరొక పర్వం. 

రాం చరణ్ చిరంజీవికి కొనసాగింపైతే అల్లు అర్జున్ మాత్రం మరింత కృషి చేసి ప్రత్యేకతని సంతరించుకుంటూ మెగా నీడలోంచి బయటకు వెళ్లాల్సిన టైములో వెళ్లాడు. 

నేడు అల్లు అరవింద్ కొడుకుగా కంటే, అల్లు అర్జున్ తండ్రే అరవింద్ అనే స్థాయికి ఎదిగాడు. అల్లు అర్జున్ స్టార్ డం “పుష్ప” కి ముందు- తర్వాత అన్నట్టు మారిపోయింది. 

అతనిని పట్టుకుని మరొక శాఖలాగ అల్లు శిరీష్ ఎప్పుడో సీన్లోకొచ్చాడు. కానీ ఏ మాత్రం జనం ఆదరించలేదు. ఎందుకంటే ఎటువంటి ప్రత్యేకతా లేదు. మెగా హీరో కాబట్టి తనని కూడా మోసెయ్యాలంటే జనం ఒప్పుకోలేదు. అందుకే పడుతూ లేస్తూ అక్కడక్కడే ఉన్నాడు తప్ప గుర్తుంచుకోదగ్గ సినిమా ఒక్కటి కూడా చెయ్యలేకపోయాడు. 

ఇక నాగబాబు కొడుకు వరుణ్ తేజ్. ఇతను చాలా జాగ్రత్తగా అడుగులు వేశాడు. కెరీర్ మొదట్లోనే రకరకాల దర్శకులతో పని చేసాడు. శ్రీకాంత్ అడ్డాల, క్రిష్, పూరీ జగన్నాథ్, శేఖర్ కమ్ముల, శ్రీను వైట్ల, హరీష్ శంకర్, అనీల్ రావిపూడి మొదలైన వాళ్ల సినిమాల్లో వరసగా చేయడం వల్ల ఇతనిలోని వైవిధ్యం ప్రేక్షకులకి కనపడింది. అయినప్పటికీ స్టార్డం ని మాత్రం కట్టబెట్టలేదు. ఒక గుర్తింపున్న హీరోగా పరిగణిస్తున్నారంతే. 

వరుణ్ చెల్లెలు నీహారిక తెరంగేట్రం చేసినా ఫ్లాపులవ్వడంతో నిర్మాతగా మారింది. ఆమెను కూడా మెగా క్యాంప్ తొలి హీరోయిన్ అని ఎవరూ నెత్తిన పెట్టుకోలేదు. 

ఇక సాయి ధరం తేజ్. చిరంజీవికి చెల్లెలి కొడుకు. జనం తొలుత పట్టించుకున్నారు. అతని సినిమాలకి కూడా ఎంతో కొంత ఫాలోయింగైతే ఉండేది. ఆ మధ్య రోడ్ యాక్సిడెంటయ్యినప్పుడు కూడా తెగ విలవిల్లాడారు. కానీ అదేంటో మొన్న “రంగరంగవైభవంగా” ఈవెంట్లో తొలి సారి బయటికొచ్చి మాట్లాడినప్పుడు ఎవ్వడూ పట్టించుకోలేదు. అంటే ఈ కొన్నళ్లల్లోనే జనం అటెన్షన్ మారిపోయిందన్నమ్మాట. సినిమాలు చెయ్యకుండా రెస్ట్ తీసుకుంటే ఎంత మెగా క్యాంపైనా జనం మర్చిపోతారు. 

ఇతనికి కొనసాగింపు తమ్ముడు వైష్ణవ్ తేజ్. తొలిసినిమా ఉప్పెన ఒక ఊపు ఊపింది. ఇక నిలబడతాడనుకుంటే తర్వాతి రెండు సినిమాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడంతో తప్పటడుగులు పడ్డాయి. “కొండపొలం” దర్శకుడు క్రిష్. తన అన్నయ్యకి “కంచె” చేసిపెట్టినతను. కనుక నమ్మాడు. కానీ మునిగాడు. ఇక “రంగ రంగ వైభవంగా” అయితే అసలెందుకు ఒప్పుకున్నాడో, ఎవర్ని నమ్మాడో తనకే తెలియాలి. ఈ సినిమాల వల్ల అతనిలో స్టారయ్యే సూచనలు దూరంగా పోయాయి. ఏదో ప్రత్యేకతని సంతరించుకుంటే తప్ప ఇతని కెరీర్ ట్రాకు మీదుంటుందని చెప్పలేం. 

ఇక చెప్పుకోవాల్సిన మరొక మెగానటుడు కళ్యాణ్ దేవ్. మెగాస్టార్ అల్లుడు. కానీ ఫలితం శూన్యం. ఒక చిన్న స్థాయి కొత్త హీరోకంటే దయనీయంగా ఉంది ఇతనికున్న గుర్తింపు కానీ ఫాలోయింగ్ కానీ! 

ఇక్కడ చెప్పేదొక్కటే. మెగా హీరో అంటే ఆ క్యాంపు జనాలకే తప్ప బయటి జనానికి పట్టట్లేదు. కథను మించిన మెగా హీరో ఎవ్వరూ లేరు. కథ కుదరకపోతే చిరంజీవి “ఆచార్య”నే పక్కకు తన్నేశారు జనం. 

గతంలో లాగ మీడియా ని మ్యానేజ్ చేసి ఫ్లాపుని హిట్టుగా చూపించుకోలేరు. సోషల్ మీడియా పుణ్యమా అని దొంగ లెక్కలు చెప్పుకోవడానికి కూడా లేదు. 

కథ బాగుంటే మిడ్ రేంజ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ప్యాన్ ఇండియా హీరో అయిపోతాడు. “రంగ రంగ వైభవంగా” మొదటి రోజు కలెక్షన్స్ కంటే “కార్తికేయ 2” 21వ రోజు కలెక్షన్స్ చాలా సెంటర్స్ లో ఎక్కువగా నమోదయ్యాయంటేనే అర్థమౌతోంది కదా కుటుంబ నేపథ్యం ఏ హీరో సినిమానీ కాపాడలేదని. 

హీరోల మీద, కాంబినేషన్స్ మీద భారీ పెట్టుబడులు అనవసరం. పెట్టుబడి భారీగా పెట్టాల్సింది కథ, కథనం వంటి ప్రీ ప్రొడక్షన్ మీద. ఆ తర్వాత యావరేజ్ స్థాయి నటుల్ని పెట్టుకున్నా ఆసేతుహిమాచలం ఉన్న ప్రేక్షకులు ఆదరించేసేలాగే ఉన్నారు. లేకపోతే బాలీవుడ్లో సైతం అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ సినిమాల్ని కూడా పక్కకు నెట్టి నిఖిల్ సిద్ధార్థ “కార్తికేయ 2” దూసుకుపోవడమేంటి? 

అలాగే “సీతారామం”. డుల్కర్ సల్మాన్ హీరో. జనం ఎంతెలా ఆరాధిస్తున్నారు? కారణం కథా, కథనాలే. 

హీరోని బట్టి సినిమాలు ఆడే రోజులు పోయాయి. సినిమా టాక్ తో పనిలేని ఓపెనింగ్ కలెక్షన్స్ కూడా పలువురు పెద్ద హీరోలకి రావట్లేదంటేనే అర్థమౌతోంది కదా స్టార్ డం యుగం చివరికొచ్చిందని. ఇక రానున్న యుగమంతా కథా,కథన, సాంకేతిక నిపుణులుదే. 

హీరోలు కూడా కళ్లు తెరిచి తమ స్టార్ డం ని కాకుండా కథని నమ్ముకుని ముందుకు వెళ్లాలి. నిర్మాతలు కూడా స్టార్లని పక్కన పెట్టి కథాశ్రవణానికే పెద్ద పీట వేయాలి. కథకులనే స్టార్స్ ని చెయ్యాలి. 

శ్రీనివాసమూర్తి