రామోజీ ఫౌండేషన్ ద్వారా తెలుగు భాషకు ఎనలేని సేవ చేసేందుకు ''తెలుగు వెలుగు'' అనే మాస పత్రికను తెచ్చామని చెప్పుకొంటుంది ఈనాడు గ్రూపు. ఈ పత్రిక ద్వారా తెలుగు ఏ మేరకు వెలుగుతుందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు భాషోద్దరణలో భాగంగా సాహితీ సేవ చేస్తూ కథల పోటీ నిర్వహిస్తున్నామని ఈనాడు సంస్థ భారీగా ప్రచారం చేస్తోంది. రూ.రెండున్నర లక్షల మేర బహుమతులు ఇవ్వడం చాలా గొప్ప విషయం అని కూడా చెప్పుకొంటోంది. ఉత్తమ కథగా ఎంపికైతే రూ.25వేలు ఇస్తారు. ఈ బహుమతుల దగ్గరే కథా రచయితలను బురిడీకొట్టించే దానికి రామోజీ టీం తెరతీసింది.
కథతో హామీ పత్రం ఇవ్వాలనేది ఏ పత్రికైనా తప్పనిసరిగా అడుగుతుంది. రామోజీ ఫౌండేషన్ కూడా కథతోపాటు హామీ పత్రం ఇవ్వాలని నిబంధనల్లో చెప్పి… తాము సిద్ధం చేసిన ఫార్మెట్ లో ఇవ్వాలని తేల్చింది. ఆ ఫార్మెట్ హెడ్డింగ్ లోనే కుట్ర ఉంది. అది హామీ పత్రం కాదు. అంగీకార పత్రం. ఆ ఫార్మెట్ కి పెట్టిన హెడ్డింగ్ అంగీకార పత్రం అని ఉంటుంది. రచయిత రాసిన కథకు సంబంధించిన సకల హక్కులు రామోజీ గ్రూపు వాళ్ళకు దఖలుపరుస్తూ రాసి ఇచ్చే అంగీకార పత్రం అది. అంటే ఆ కథను రామోజీ గ్రూప్ లో భాగమైన ఉషాకిరణ్ మూవీస్, ఈటీవీ… వగైరా వగైరాలకు ఆ కథ వెళ్లిపోతుంది.
ఆ కథను రామోజీ గ్రూపు వాళ్ళు ఏ భాషలోకి తర్జుమా చేసి అమ్ముకొన్నా, వినియోగించుకున్నా కథా రచయితకు చిల్లి గవ్వ కూడా ఇవ్వరు. ఆ కథను సినిమాగా తీసినా, సీరియల్ గా వాడుకొన్నా, షార్ట్ ఫిల్మ్ తీసినా కథల పోటీలో ఇచ్చిన పారితోషికం మాత్రమే రచయితకు దక్కుతుంది. సాధారణంగా ఏ పత్రికలో కథ అచ్చయినా పారితోషికం ఇస్తారు. అనంతరం ఆ కథపై కాపీ రైట్ సదరు రచయితకే ఉంటాయి తప్ప పత్రిక యాజమాన్యానికి ఉండవు. ఆ కథ బాగుంటే వివిధ కథా సంపుటాల్లోకి వెళ్తుంది.
సినిమావాళ్లు తీసుకొంటే రెమ్యూనరేషన్ ఇస్తారు. రామోజీ ఫౌండేషన్ వాళ్ళ కథల పోటీకి వెళ్తే ఎంపికైన కథలపై సంబంధిత రచయితలకు ఎలాంటి హక్కులు ఉండవు. వాటిపై సమస్త హక్కులు రామోజీరావుకే వెళ్లిపోతాయి. ఉత్తమ కథకు రూ.పాతిక వేలు ఇస్తారు. చివరి బహుమానం రూ.5 వేలు. చివరి బహుమానం పొందిన కథే సినిమాకు ఉపయోగపడేలా ఉంటే – ఉషాకిరణ్ మూవీస్ వాళ్ళు సినిమా తీసుకొని సొమ్ము చేసుకొంటారు.
కథ రాసిన రచయితకు దక్కేది ఎంత అంటే మొదట ఇచ్చిన రూ.5 వేలు మాత్రమే. ఇదీ మీడియా మొఘల్ అని చెప్పుకొనే రామోజీ చేసే ‘సాహితీ సేవ’. రచయితలను నిలువునా చేసే మోసం. రూ.రెండున్నర లక్షల బహుమానం అనేది ఎలా ఉంది అంటే… ముసలి పులి బంగారు కడియం పట్టుకొని.. పేద బ్రాహ్మడికి ఆశ చూపి పీక్కు తిన్నట్టు ఉంది. ఇక్కడ ముసలి పులి ఎవరు… పేద బ్రాహ్మడు ఎవరో చెప్పక్కర్లేదు కదా.