బాబు లీలలు: ఇప్పుడు అప్పులు.. రేపు కుంభకోణాలు

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు నాలాంటి అనుభవజ్ఞుడు కావాలంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉందంటూ దొంగ లెక్కలు చెప్పారు. విడిపోయినప్పటికీ తెలంగాణతో సమానంగా అభివృద్ధి సాధించామని,…

విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కు నాలాంటి అనుభవజ్ఞుడు కావాలంటూ సొంత డబ్బా కొట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితి బ్రహ్మాండంగా ఉందంటూ దొంగ లెక్కలు చెప్పారు. విడిపోయినప్పటికీ తెలంగాణతో సమానంగా అభివృద్ధి సాధించామని, దేశంలోనే టాప్-5లో ఉన్నామని గొప్పలు చెప్పుకున్నారు. బాబు చెప్పుకున్న ఈ దొంగ లెక్కలు, చేసిన దొంగ పనులు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటపడుతున్నాయి.

ఎన్నికల్లో గెలిచేందుకు, దొంగదారిలో అధికారాన్ని దక్కించుకునేందుకు ఆఖరి నిమిషంలో పసుపు-కుంకుమ నాటకం ఆడారు చంద్రబాబు. దీనికోసం ఆయన ఏం చేశారో ఇప్పుడు బయటపడింది. ఏకంగా ప్రభుత్వ ఉద్యోగుల సొమ్మును స్వాహా చేసి పసుపు-కుంకుమకు వాడేశారు బాబు. ఆర్థిక శాఖతో సీఎం జగన్ చేసిన సమీక్షలో ఈ విషయం బయటపడింది.

ఆఖరి నిమిషంలో తన స్వప్రయోజనాల కోసం ఉద్యోగుల పీఎఫ్ డబ్బుల్ని అప్పుగా తీసుకున్నారు బాబు. అది కూడా ఏకంగా 66 వేల కోట్లరూపాయలు. ఇంత మొత్తాన్ని పీఎఫ్ నిధి నుంచి ఏపీ ప్రభుత్వం “అప్పు”గా తీసుకుందన్నమాట. ఇక్కడ అప్పు అనేది కేవలం ఓ సాంకేతిక పదం లాంటిది. ప్రభుత్వం దగ్గర ఉంటే తిరిగి ఇస్తుంది, లేదంటే ఆ అప్పు అలానే కొనసాగుతుందన్నమాట. ఇదంతా ఇప్పుడు నూతన ముఖ్యమంత్రి జగన్ కు చుట్టుకుంది.

ఆపత్కాలంలో, అత్యవసరాల్లో ఉద్యోగులకు ఉపయోగపడుతుందనుకున్న ఈ సొమ్మును చంద్రబాబు వాడేశారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని జగన్, పీఎఫ్ నిధిలో జమచేయాల్సి ఉంటుంది. కేవలం ఇది మాత్రమేకాదు, వివిధ కార్పొరేషన్ల నుంచి కూడా చంద్రబాబు చాలా మొత్తాల్ని ఇలా “అప్పు” రూపంలో తీసేసుకున్నారు. వాటి విలువ దాదాపు 8 వేల కోట్ల రూపాయలు. వాటన్నింటినీ ఇప్పుడు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత జగన్ పై పడింది.

చివరికి చంద్రబాబు చేసిన ఈ అప్పులు ఎంత విపత్కర పరిస్థితులకు దారితీశాయంటే.. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేయడానికి కూడా పౌరసరఫరాల కార్పొరేషన్ దగ్గర డబ్బులు లేవు. ఆ డబ్బుల్ని కూడా చంద్రబాబు వాడేశారు. పైకి మాత్రం అంతా బాగానే ఉందని, రాష్ట్రం దూసుకుపోతోందని కలరింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు.

రాబోయే రోజుల్లో బాబు చేసిన ఇలాంటి ఎన్నో పనులు బయటకు రాబోతున్నాయి. ఇప్పటివరకు ఆర్థిక శాఖకు సంబంధించిన సమీక్ష మాత్రమే పూర్తయింది. ఇంకా చాలా శాఖలున్నాయి. మరీ ముఖ్యంగా లోకేష్ చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ, దేవినేని ఉమ చేపట్టిన నీటిపారుదల శాఖలు ఉండనే ఉన్నాయి. వాటిని కూడా సమీక్షిస్తే, అప్పులేం ఖర్మ, ఏకంగా కుంభకోణాలే బయటపడతాయంటున్నారు ఆర్థిక నిపుణులు. 

కోట్లు పెట్టుబడి పెట్టి.. అవినీతి రహిత పాలనకు ఒప్పుకుంటారా?