ఆంధ్రప్రదేశ్ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో కొత్తగా మరో 9 కేసులు నమోదైనట్టు ప్రకటించింది. నిన్న సాయంత్రం 7 గంటల నుంచి ఈరోజు ఉదయం 9 గంటల వరకు నిర్వహించిన పరీక్షల్లో కృష్ణా, కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెరో మూడేసి కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన ఈ 9 కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 534కు చేరింది.
ఈ 534 మంది కరోనా బాధితుల్లో 20 మంది పూర్తిగా కోలుకున్నారని ప్రకటించిన ప్రభుత్వం.. 14 మంది మృతి చెందినట్టు స్పష్టం చేసింది. మిగిలిన 500 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం గుంటూరులో 122, కర్నూల్ లో 113, నెల్లూరులో 58, ప్రకాశంలో 42 కరోనా కేసులు నమోదయ్యాయి.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. అటు విశాఖపట్నం 20 కేసుల దగ్గరే ఆగింది. ప్రజలంతా పూర్తిగా స్వీయ నియంత్రణ పాటించడంతో పాటు, ప్రారంభంలోనే అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంతో విశాఖ నగరం దాదాపు కరోనా నుంచి బయటపడిందనే చెప్పాలి. సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న వ్యక్తులు కూడా 2 వారాల గడువు పూర్తి చేసుకొని, పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.
ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం రెడ్ జోన్లపైనే దృష్టిపెట్టింది. ఆ ప్రాంతాల్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్న అధికారులు-పోలీసులు.. ఇంటింటి సర్వే పూర్తిచేశారు. అటు కరోనా అధికంగా వ్యాపిస్తున్న కృష్ణా-గుంటూరు జిల్లాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. సరిహద్దులు కూడా మూసివేశారు.