బాలకృష్ణ సినిమా వస్తుందంటే.. ఆయన అభిమానుల్లో సందడి సహజమే. తెలుగుదేశంలో ఉన్న బాలయ్య అభిమానులు కూడా పార్టీ జెండాలు పెట్టుకుని రిలీజ్ సందర్భంగా హడావిడి చేస్తుంటారు. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ని మాత్రం టీడీపీ నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రీరిలీజ్ వేడుకలంటూ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ర్యాలీలు, ప్రదర్శనల్లో ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయింది.
సాక్షాత్తూ రాష్ట్రమంత్రులే జెండాలు ఊపి ఎన్టీఆర్ ప్రచార రథాలను ప్రారంభించారు. మధ్యాహ్నం దాకా జన్మభూమి కార్యక్రమాలు కూడా వదిలేసి సినిమా ప్రచారంలో తరించారు. బయోపిక్ ప్రమోషన్ అంతా ప్రోటోకాల్ తో సంబంధం లేకుండా ప్రభుత్వ కార్యక్రమంలానే జరిగింది. థియేటర్ల విషయంలో కూడా ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుంటున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
నైజాం ఏరియాలో తమఎత్తులు పారవు కాబట్టి.. ఏపీలో వీలైనన్ని చోట్ల ఎన్టీఆర్ బయోపిక్ కి థియేటర్లు కేటాయించేశారు. ఇక విడుదల రోజు నుంచి వారంరోజుల పాటు అదనపు షోలు, టికెట్ రేటు పెంచుకోవడం, వీటితో పాటు వినోద పన్నురాయితీ… ఇలా అన్ని అస్త్రాలు టీడీపీ దగ్గర సిద్ధంగానే ఉన్నాయి.
ఎన్నికల వేల టీడీపీ పొలిటికల్ మైలేజీని పెంచే సినిమా కాబట్టి దీనికోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతోంది ప్రభుత్వం. పరిస్థితి చూస్తుంటే రేపు ప్రభుత్వ పింఛన్ తీసుకునేవాళ్లందరూ కచ్చితంగా ఎన్టీఆర్ సినిమా చూడాలని ఆదేశాలిచ్చేసి టికెట్ డబ్బులు పింఛన్లో కట్ చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
టీడీపీ మీటింగ్ లకు తరలించినట్టే ఎన్టీఆర్ సినిమాకి కూడా జనాలను తరలించాలని రోజుకొక చోటా నాయకుడికి టార్గెట్ పెడితే వారి పరిస్థితి ఏంటి. సినిమాని పూర్తిగా రాజకీయం చేయడమంటే ఇదే. అందుకే ఇది ఎన్టీఆర్ బయోపిక్ కాదు, రాష్ట్రప్రభుత్వ ప్రాయోజిక చిత్రం అని సెటైర్లు పడుతున్నాయి.