ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 07

''అల్లూరి సీతారామరాజు'' విషయంలో ఎన్టీయార్‌ కృష్ణతో 'నేను తీయను, నువ్వు తీయవద్దు' అన్నారన్న స్టేటుమెంటును ఓ పాఠకుడు శంకించారు. నాకూ ఆ శంక ఉంది. కృష్ణ, విజయనిర్మల, కృష్ణ సోదరుడు హనుమంతరావు వీళ్లందరూ యిప్పుడు…

''అల్లూరి సీతారామరాజు'' విషయంలో ఎన్టీయార్‌ కృష్ణతో 'నేను తీయను, నువ్వు తీయవద్దు' అన్నారన్న స్టేటుమెంటును ఓ పాఠకుడు శంకించారు. నాకూ ఆ శంక ఉంది. కృష్ణ, విజయనిర్మల, కృష్ణ సోదరుడు హనుమంతరావు వీళ్లందరూ యిప్పుడు ఆ మాట చెప్తున్నారు, ఎందుకొచ్చిన గొడవని కాబోలు. వారి స్టేటుమెంటునే నేను ఉటంకించాల్సి వచ్చింది. నిజం ఏమై ఉంటుంది అనేది మనం ఊహించుకోవాల్సిందే. తన రాయించి పెట్టుకున్న స్క్రిప్టుల విషయంలో ఎన్టీయార్‌ ధోరణి ఎలా ఉండేది అనేది తరచి చూస్తే కొంత ఐడియా వస్తుంది.

''సంపూర్ణ రామాయణం'' (1973) స్క్రిఫ్టు రాస్తూ ఉండగానే ముళ్లపూడి వెంకట రమణగారు ఎన్‌టిఆర్‌ గారి ఇంటికి వెళ్లి తాము సంపూర్ణ రామాయణం చిత్రం తీస్తున్నామని చెప్పారు. ఆ ఘట్టాన్ని తన ఆత్మకథ ''ఇంకోతి కొమ్మచ్చి'' లో రాసుకున్నారు.

రమణ చెప్పగానే ఎన్టీయార్‌ ''ఎందుకు – మేము తీస్తున్నాముగా?'' అన్నారు.

''ఎప్పుడండి?''

''సముద్రాల వారు స్క్రిప్టు రాసి ఆరేళ్లయింది''

''ఆరేళ్లనించి మీ దస్త్రాల్లోనే ఉంది కదా – మీరింకా అల్లూరి సీతారామరాజు, దుర్యోధన చరిత్రలు ప్లాన్‌ చేస్తున్నారు. చాలా పరిశోధనలు జరుపుతున్నారు అని పత్రికల్లో కూడా రాశారు''

''అవును కదా – మరింకేం?'' అన్నారాయన నవ్వి.

''మీరు సిద్ధమయేసరికి ఇంకా కొంతకాలం పడుతుంది. ఈ లోపల బాపూ నేనూ మూర్తిగారూ రామాయణం తీస్తున్నాం''

''అంటే – నిశ్చయించేశారా'' అన్నారు కొంచెం తీవ్రంగా. ''అది పక్కన పెట్టి వేరే తీసుకోవచ్చు కదా?'' అని కూడా అన్నారు.

''అది మాకూ చాలా ఇష్టమైన కథ''

''అంత గట్టిగా నిశ్చయించేసుకుంటే ఇప్పుడు మాకు చెప్పడం దేనికి'' అన్నారు ఇంకా తీవ్రంగా.

''పెద్దలు – మా లాటివారికి మార్గదర్శకులు'' అని రమణగారు.

ఎన్టీయార్‌ కొద్దిక్షణాలు మౌనంగా ఉండి కోపంగా హుంకరించకపోయినా నవ్వుతూ హ హ హాంకరించారు. ''మంచిది. అట్లే కానివ్వండి – కాని ఒకటి – మీరు తీస్తానంటున్నారు కాబట్టి మీకు అయిదు సంవత్సరాలు మాత్రం టైమిస్తున్నాము… హా తరవాత – మీ రాముడి మీద ఈ తారకరాముడి దండయాత్ర తప్పదు!'' అన్నారు అట్టహాసంగా.

రేపు రామాయణం రిలీజనగా హీరో శోభన్‌బాబు గారు ఎన్‌ టిఆర్‌ ఇంటికి వెళ్లారు – నమస్కరించారు. అలవాటు ప్రకారం ఎన్‌ టిఆర్‌ ఎడం చేత్తో అభయహస్తం చూపి దీవించారు. రామాయణం సినిమాకు పని చేశానని విన్నవించాడు శోభన్‌బాబు.

''ఎప్పుడు రిలీజు?'' అన్నారాయన.

''రేపేనండి''

''ఎలా వచ్చింది?''

''బాగుందండి''

''ఆ సంగతి ఎల్లుండి వచ్చి చెప్పండి'' అన్నారు ఎన్‌టిఆర్‌.

ఎల్లుండి వెళ్లి చెప్పడానికి కొత్త రాముడికి మొహం చెల్లలేదు. ఎందుకంటే ఉదయం ఆట హౌస్‌ఫుల్‌ కాలేదు – హౌస్‌ నిల్‌! మార్నింగ్‌ షో ఓపెనింగు కలెక్షను 130/- రూపాయలు మాత్రమే! మాట్నీ ఎంత అని కనుక్కుందికి నిర్మాతలకు దమ్ములు చాల్లేదు. భయం కూడా వేసింది. పెఠేల్‌ పెఠేల్‌మంటూ గూబలు అదరగొట్టే నిశ్శబ్దం… సాయంత్రం కూడా చడీచప్పుడూ లేదు – ఖాళీ హాల్లో ప్రొజెక్టరు నడిచే గురక చప్పుడు తప్ప. షాకు తిన్న బాధతో శోభన్‌బాబు వారం రోజులు షూటింగుకి వెళ్లలేదు.

రామాయణం చిత్రం ఫ్లాప్‌ అవుతుందని రామారావు గారు ఆనాడు అనుకున్నట్టే- ఆంధ్రలో ప్రేక్షకులు కూడా నాలుగైదు రోజులు అలాగే అనుకున్నారు. ఎన్‌టిఆర్‌ ఉండగా ఇంకో రాముడిని నిలపడానికి వీళ్ళకెంత గుండెధైర్యం అనుకున్నారు. ఈ కార్టూనిస్టు, కమ్యూనిస్టు బాపతు వాళ్ళు రామాయణం జోలికి పోనేల అని హేళన చేశారు. కానీ త్వరలోనే మబ్బులు వీడాయి. కొత్త రాముడు ఆమోదింపబడ్డాడు. సినిమా సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. ఎన్‌టిఆర్‌కి కుతూహలం పెరిగి, శోభన్‌బాబు నడిగి ఆయన థియేటర్‌లోనే సంపూర్ణరామాయణం షో వేయించుకున్నారు. సినిమా మొత్తం చూశారు. శోభన్‌బాబుని పిలిచి గుండెకు హత్తుకున్నారు. టీ తెప్పించి కప్పు బాపు చేతికి అందించి ''శభాష్‌ బాపు గారూ – నేను అనుకోలేదు ఇంత గొప్పగా తీస్తారని'' అని మెచ్చుకున్నారు. అదీ ఆయన ఘనత! మహానుభావుల గొప్ప సంస్కారం! – అని రమణ రాశారు.

ఇక ఐదేళ్ల తర్వాత రామారావుగారు స్వయంగా తీసిన రాముడి సినిమా గురించి – ఆయన అవేళ అన్నట్టే ''శ్రీరామ పట్టాభిషేకం'' (1978) తీశారు. తను రాముడు, రామకృష్ణ లక్ష్మణుడు, సత్యనారాయణ భరతుడు, సంగీత సీత. సినిమా ఫ్లాప్‌. రమణగారి మాటల్లో చెప్పాలంటే – 'ఈ సినిమాని రామయ్య మెచ్చలేదు – కారణం…. సముద్రాల వారు వ్రాసిన స్క్రిఫ్టును ఎన్‌టిఆర్‌, త్రివిక్రమరావు గారు, కొండవీటి వెంకటకవి ఇంకా మరెందరో ''య్యింఫ్రూవు'' చేయడం. సముద్రాలవారు 'నా రాముడి' కథ అని ఎంతో మమకారంతో రాశారు. తరువాతివారు ఇంకో కారంతో ఇంప్రూవు చేశారు.'

ఒక విషయం గమనించండి – రాముడిగా రామారావుకి పేరు తెచ్చిపెట్టిన సినిమాలు – ''లవకుశ'' (1963), ''శ్రీరామాంజనేయ యుద్ధం'' (1975). రెండూ యితరులు డైరక్టు చేసినవే. మొదటిది సి.పుల్లయ్య, రెండోది బాపు. తను సొంతంగా రాయించుకుని, డైరక్టు చేసిన ''శ్రీరామ పట్టాభిషేకం''ను జనాలు పట్టించుకోలేదు. అదీ ఆయన గొప్పగా ఊహించుకున్న 'తారకరాముడి దండయాత్ర'! ఇప్పటికీ రామనవమి నాడు ''సంపూర్ణ రామాయణం'' సినిమా వేస్తారు తప్ప ''శ్రీరామ పట్టాభిషేకం'' కాదు. 

బాపు, రమణలపై ఎన్టీయార్‌కు అభిమానం ఉంది. అయినా యిలాటి కోపాన్ని ప్రదర్శించారంటే యిక కృష్ణపై ఎలాటి కోపం చూపి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి కృష్ణది ఒక విలక్షణ మార్గం. అప్పటిదాకా నటులందరూ అటు రామారావునో, యిటు నాగేశ్వరరావునో అనుకరించేవారు. శోభనబాబు కూడా దానికి మినహాయింపు కాదు. కృష్ణ తనకు వచ్చిన తీరులో నటిస్తూ పోయారు. సాంఘికాలకే పరిమితమైతే ఎలా ఉండేదో కానీ, సినిమాల్లోకి వచ్చిన మలి సంవత్సరమే ''గూఢచారి 116'' (1966) ద్వారా జేమ్స్‌బాండ్‌ యిమేజి వచ్చి యువతరాన్ని ఆకట్టుకున్నారు. నిజజీవితంలో కూడా హీరోయిజాన్ని ప్రదర్శించారు. 

వచ్చిన ఐదేళ్లలోనే నిర్మాతగా మారి ''అగ్నిపరీక్ష'' సినిమా తీశారు. దానిలో కలరులో ఓ పెద్ద సన్నివేశాన్ని పెట్టారు. అది ఫెయిలయినా తర్వాతి సంవత్సరమే భారీగా రంగుల్లో ''మోసగాళ్లకు మోసగాడు'' (1971) తీసి, కౌబాయ్‌ యిమేజి కూడా తెచ్చుకున్నారు. ఎయన్నార్‌, ఎన్టీయార్‌లు 1972 వరకు కలరులో సొంత సినిమాలు తీయలేదు. ఆపై ఏడాది మల్టీస్టారర్‌ ''పండంటి కాపురం'', 1973 వచ్చేసరికి మరో మల్టీస్టారర్‌ ''దేవుడు చేసిన మనుషులు''.. యిలా నిర్మాతగా రెపరెపలాడిపోతూ తక్కినవారికి అసూయ పుట్టే స్థాయికి వెళ్లిపోయాడాయన.

ఆ సమయంలో ''అల్లూరి సీతారామరాజు'' తీస్తా అనేసరికి ఎన్టీయార్‌ భగ్గుమన్నారు. ''అది కమ్మర్షియల్‌గా పే చేయదు, నువ్వు తియ్యవద్దు'' అంటే అదేదో వాత్సల్యంతో యిచ్చిన సలహా అనుకోవాలి. 'సర్లే, అనుభవిస్తే కానీ తెలిసిరాదు' అని నిట్టూర్చి ఊరుకోవాలి. లేదా 'ఇది స్పీడు బ్రేకరు అవుతుంది, బుద్ధొస్తుంది' అని సంతోషించాలి. కానీ పంతానికి పోవడం దేనికి? తనతో సినిమాలు వేయడం మానేయడం దేనికి? అహం దెబ్బతినడం చేతనే అనుకోవాలి.

''అల్లూరి..'' హిట్‌ కావడంతో కృష్ణ ధైర్యం మరీ పెరిగిపోయింది. ''దేవదాసు'' మళ్లీ తీద్దామనుకున్నాడు. అది ఎయన్నార్‌కు కోపాన్ని కలిగించింది. తెలుగులో దేవదాసు అంటే తను తప్ప వేరెవరూ గుర్తు రాకూడదని ఆయన భావన. ఈ కొత్త దేవదాసు నేను చూడలేదు కానీ, మరీ అంత అన్యాయంగా లేదని విన్నాను. పైగా జగ్గయ్య, గుమ్మడి వంటి హేమాహేమీలున్నారు. గీతరచన, సంగీతం అద్భుతంగా ఉన్నాయి. దాని మానాన దాన్ని వదిలేసి వుంటే ఏ ఐదారు వారాలో నడిచేదేమో! కానీ ఆ సినిమాపై ఎయన్నార్‌, ఎన్టీయార్‌ అభిమానులు పగబట్టారు. ఏదైనా పాత సినిమాను మళ్లీ తీసినపుడు పాత సినిమాను మళ్లీ రిలీజు చేసి దీన్ని దెబ్బకొట్టడం ఆనవాయితీగా వస్తోంది. తన సినిమాకు అలాటి పోటీలేకుండా చేయాలని కృష్ణ పాత దేవదాసు (1953) ప్రింట్లు సంపాదించి, తగలబెట్టడానికి ప్లాను చేశాడని రూమర్లు పుట్టాయి. 

కృష్ణకు అటువంటి ఆలోచన వుందో లేదో దేవుడికి తెలియాలి, కానీ యీ పుకార్లు అతనిపై ఏహ్యత కలిగించాయి. పైగా అదే సమయంలో ఎయన్నార్‌ అమెరికా వెళ్లి గుండెకు సర్జరీ చేయించుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం గురించి అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో ఆయన కారెక్టర్లలో మకుటాయమానమైన దేవదాసు ప్రింటును ధ్వంసం చేయబూనడం దుర్మార్గం అనిపించింది. కృష్ణ ప్రయత్నాల మాట ఎలా వున్నా, పాత దేవదాసు ప్రింటును సంస్కరించి నవయుగ వారు సరికొత్తగా అనేక థియేటర్లలో రిలీజు చేయించారు. ఆ సినిమా చాలా ఏళ్లగా అనేకసార్లు రిలీజై థియేటర్లలో ఆడేది. కానీ యీ సింపతీ ఫ్యాక్టర్‌ వర్కవుట్‌ అయ్యి, ఆ ఏడాది రిలీజైనప్పుడు విపరీతంగా ఆడింది. హైదరాబాదులో ఓ థియేటరులో మార్నింగు షోలలో 100 రోజులు ఆడింది. ఇది ఒక రికార్డు.

ఇక ఎయన్నార్‌ అభిమానులు (ఎన్టీయార్‌ అభిమానులు తోడయ్యారు) కృష్ణ దేవదాసును భ్రష్టు పట్టించడానికి చేతనైనంత చేశారు. తెరపై కృష్ణ నవ్వినపుడు వీళ్లు ఏడ్చి, కృష్ణ ఏడ్చినపుడు నవ్వి, దగ్గి రసాభాస చేశారు. థియేటరుకి వెళ్లినవాళ్లు ఎందుకొచ్చారాం బాబూ అనుకునేట్లు చేశారు. మొత్తం మీద సినిమా పరాజయం పాలైంది. అయినా కృష్ణ వెనక్కి తగ్గలేదు. మధ్యలో కొన్ని యితర సినిమాలు తీసి 1977 నాటికి ''కురుక్షేత్రం'' ప్లాను చేశారు. దర్శకత్వం కమలాకర కామేశ్వరరావుగారు. సినిమాలో అతిరథ మహారథులందరినీ పెట్టేశారు. దానికి పోటీగా ఎన్టీయార్‌ ''కర్ణ'' సినిమా తీశారు. ఇద్దరూ ఎంత హడావుడిగా తీశారంటే, యిప్పుడు చూస్తే రెండు సినిమాలూ నాసిగానే అనిపిస్తాయి. ''కురుక్షేత్రం''లో నటులందరికీ స్కోపు యివ్వడానికై కథను దెబ్బతీశారు. డైరక్షన్‌ కమలాకర ఒక్కరి చేతి మీదే సాగలేదు. టైము తక్కువగా ఉందంటూ అయిదుగురు డైరక్టు చేశారు. యుద్ధసన్నివేశాలు అత్యంత హాస్యాస్పదంగా అనిపిస్తాయి.

ఇక ''కర్ణ'' సినిమాను ఆకాశానికి ఎత్తేసేవారికి ఒక ప్రశ్న – ఆ సినిమాలో కర్ణుడి పాత్ర మీదుగా ఉన్న ఒక డైలాగు కానీ, ఒక సన్నివేశం కానీ చెప్పండి చూద్దాం. ఎంతసేపటికి దుర్యోధనుడి డైలాగులే గుర్తుకు వస్తాయి. కర్ణుడి పాత్ర పూర్తిగా డల్లయిపోయింది. అది స్క్రిప్టులో లోపం కాదా? తమిళంలో ''కర్ణ'' సినిమా వచ్చింది. ముఖ్యపాత్రధారికి బోల్డు కథ ఉంది. దుర్యోధనుడికీ పాత్ర ఉంది కానీ అది సెకండరీ. కర్ణుడికి ఒక ప్రేమకథ వగైరాలు పెట్టారు. ఇక్కడ దుర్యోధనుడి డైలాగులే డైలాగులు. వాటిల్లో ఎంత కొత్త భావాలైనా ఉండవచ్చు, ఎంత పాండిత్యమైనా ఉండవచ్చు, కానీ సినిమాను నాటకంలా తీస్తే ఎలా? 

ఇక సాంకేతికంగా చూస్తే ఎన్‌ఏటి-రామకృష్ణ వారి ఏ సినిమా అంత కంటె ఘోరంగా తయారవలేదు. ఎప్పుడో 1961లోనే ''సీతారామకల్యాణం''లో రవికాంత్‌ నగాయిచ్‌ చేత ఫోటోగ్రఫీలో అద్భుతాలు జరిపించిన రామారావు ''కురుక్షేత్రం''తో పోటీ యావలో పడి, యీ సినిమా ఫోటోగ్రఫీని పట్టించుకోలేదు. దాంతో తెరపై దారాలు కనబడి, జనాలు నవ్వారు. పోటీ ఉండి ఉండకపోతే కర్ణ అంతలా ఆడేది కాదనే నా అభిప్రాయం. ఎందుకంటే ఆ తర్వాత వచ్చిన రామారావు చారిత్రాత్మక, పౌరాణిక సినిమాలు ఏవీ ఆడలేదు. ''పోతులూరి…'' తప్ప. అది కూడా ఆ సినిమాను కోర్టుకి లాగడం వలన, బిసి ముద్రపడడం చేత బజ్‌ వచ్చింది. తర్వాతి రన్‌లలో ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఎవరూ దాన్ని పెద్దగా ప్రస్తావించరు కూడా.

అగ్రనటుల్లో ఉదాత్తత లోపించడం చేత సినీరంగానికి వాటిల్లే నష్టం యిలా ఉంటుంది.

(ఫోటో – తమిళ ''సంపూర్ణ రామాయణం''  (1958) షూటింగు సందర్భంగా ఫిల్మ్‌ యూనిట్‌)
-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (జనవరి 2019)

 

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 03

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 04 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 05  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 06