ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 04

1972 నాటికి ఆయన 'బడిపంతులు' సినిమాలో అద్భుతంగా నటించాడు. అంటే సినిమా ఫీల్డుకి వచ్చి 23యేళ్లు. ఆయనకు 49యేళ్లు. శరీరం భారీగా పెరిగిపోయింది. నాగేశ్వరరావు గారిలా ఆయన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు కనుక…

1972 నాటికి ఆయన 'బడిపంతులు' సినిమాలో అద్భుతంగా నటించాడు. అంటే సినిమా ఫీల్డుకి వచ్చి 23యేళ్లు. ఆయనకు 49యేళ్లు. శరీరం భారీగా పెరిగిపోయింది. నాగేశ్వరరావు గారిలా ఆయన శరీరాన్ని అదుపులో పెట్టుకోలేదు. అప్పుడు కనుక ఆయన రిటైరయి వుంటే చాలా హుందాగా వుండి వుండేది. ఎప్పుడో అప్పుడొకటీ, ఇప్పుడొకటీ వేస్తూ వుంటే చాలా బావుండి వుండేది. కానీ అప్పుడాయన మంచి విన్నింగ్‌ స్ట్రీక్‌లో వున్నాడు. అమితాబ్‌ బచ్చన్‌, ధర్మేంద్ర హిందీ సినిమాల తెలుగు వెర్షన్‌లో వేయడం మొదలెట్టాడు. జంజీర్‌- నిప్పులాంటి మనిషి, దీవార్‌ – మగాడు, యాదోంకీ బారాత్‌ – అన్నదమ్ముల అనుబంధం. యిలా. ఎదురులేని మనిషి వచ్చింది. వల్గారిటీ కూడా చేరింది.

స్టెప్స్‌ వేయడం మొదలయింది. అవేవో నాగేశ్వరరావుగారు వేస్తే భరించగలిగాం కానీ ఈయన వేస్తే బాబోయ్‌ అనిపించింది. పెద్ద పొట్ట, దాన్ని దాచుకోవడానికి కోటు, కింద బెల్‌బాటమ్‌ పాంట్‌. ఈయన పక్కన మనుమరాలి వయసున్న హీరోయిన్స్‌. ఇద్దరికీ సైజులో హస్తిమశకాంతరం అంటారే, అలా వుండేది. ఈ ధోరణిలో సాగుతూండగానే అడవిరాముడు వచ్చింది. సూపర్‌ డూపర్‌ హిట్‌. అంతే, యిక అక్కణ్నుంచి యమగోల, వేటగాడు, డ్రైవర్‌ రాముడు, ఆటగాడు, సూపర్‌మాన్‌ – ఒకటా, రెండా. కర్మ ఏమిటంటే యివన్నీ హిట్‌ అయ్యాయి. అప్పట్లో ఈయన తీసిన పౌరాణికాలన్నీ ఫెయిల్‌. గొంతు చించుకుని డైలాగ్స్‌ చెప్పిన యిలాటి సినిమాలన్నీ హిట్‌ అయ్యాయి.

రామారావు యంగ్‌ జనరేషన్‌కి చేరువైంది యీ సినిమాల ద్వారానే. వాళ్లే ఆయనకు రాజకీయాల్లో వోట్‌బ్యాంక్‌ అయ్యారు. ఇక చివరికి వచ్చేసరికి బొబ్బిలిపులి, కొండవీటి సింహం – యివన్నీ అప్పటి మూడ్‌లో హిట్‌ కావచ్చుకానీ నటుడిగా ఆయన స్థాయిని దిగజార్చాయని నా అభిప్రాయం. గొప్ప నటుడు, రచయిత, మంచి దర్శకుడు, అభిరుచి గల నిర్మాత అయిన రామారావుకు ఈ విషయం తెలియదా? తన రోల్స్‌ ఎలా వుండాలో ఆయనకు ప్లానింగ్‌ లేదా? నా మట్టుకు నాకు ఆయనకు కెరియర్‌ ప్లానింగ్‌ లేదనే అనిపిస్తుంది. ఆయనకు అవసరమూ పడలేదు. నాగేశ్వరరావుగారి కయితే తనకు సూటయ్యేవి ఏవి అని వెతుక్కోవడం అదీ వుండింది. ఈయన ఏవి వస్తే అవి వేసేయడమే! జంకు, గొంకులేదు.

తోడుదొంగలు సినిమా నాటికి ఎన్టీయార్‌కు 30 యేళ్లు. అందులో ఆయన 60 యేళ్ల ముసలివాడి పాత్ర వేశారు. ఆయన కొడుకు చలం, భార్య హేమలత. ఇప్పుడు చెపితే నమ్మరు కదూ. అదే టైములో 'అగ్గిరాముడు' వంటి మంచి స్వాష్‌బక్లింగ్‌ హీరోగా వేస్తూ పక్కన యిది వేస్తే ఇమేజి పోతుందేమోనన్న చింతే లేదు. వినోదావారి 'కన్యాశుల్కం'లో గిరీశం పాత్ర యిస్తే నాగేశ్వరరావుగారు వద్దనేశారు విలనిక్‌ షేడ్‌ వుందని. ఈయన వేసి పారేశాడు. అలాగే 'చింతామణి'లో వేశ్యకు విటుడిగా  బిల్వమంగళుడు పాత్ర. ఆయన వద్దన్నాడు, ఈయన సరేనన్నాడు.

అన్నిటికన్నా ఆశ్చర్యం – రాజూపేదలో పాత్ర. ఆ సినిమాలో ఈయన పాత్ర ఓ దరిద్రుడి పాత్ర. మోస్ట్‌ అన్‌గ్లామరైజ్డ్‌ పాత్ర.  చింకి గుడ్డలు కట్టుకున్న చిల్లరమల్లర దొంగ, తాగుబోతు, పెళ్లాం పిల్లల్ని పట్టుకుని కొట్టడం తప్ప చేసేదేమీ లేదు. సినిమా చివర్లో గుర్రం మీద వెళ్లి విలన్‌తో పోట్లాడ్డం తప్ప! 'దాసి'లోనూ అన్‌గ్లామరైజ్‌డ్‌యే! 'భీష్మ'లో ముసలిపాత్రలోనే ఎక్కువసేపు కనబడతారు. 'కలిసివుంటే కలదు సుఖం'లో అవిటివాడి పాత్ర.  'నర్తనశాల'లో ఇందాకా చెప్పుకున్నట్టు ఆడంగి పాత్ర. 'చండీరాణి' లో హీరోయిజం చూపించేదంతా భానుమతే!

ఈయనకి ఛాన్సు రాలేదు. అంటే ఈయనకు పాత్రల గురించి స్పృహలేదు అని కాదు నా అర్థం. నిజానికి మంచి పాత్రలు వేయాలన్న తపన మహా ఎక్కువ. నా ఉద్దేశంలో ఆయన ఎస్వీయార్‌తో పోటీ పడ్డారని. ఆయన 'భూకైలాస్‌'లో రావణాసురుడి పాత్ర వేయడానికి ఇన్‌స్పిరేషన్‌ రంగారావు గారే అయుండాలి. 'సీతారామ కల్యాణం'లో రావణాసురుడిగా వేసిన తర్వాత 'సతీ సులోచన'లో ఎస్వీయార్‌ రావణుడిగా, ఎన్టీయార్‌ ఇంద్రజిత్‌గా వేశారు. 'పాండవ వనవాసం'లో ఎన్టీయార్‌ భీముడయితే ఎస్వీయార్‌ దుర్యోధనుడిగా వేసి అదరగొట్టేశారు. అది చూసి ఈయన కృష్ణపాండవీయం'లో దుర్యోధన పాత్ర వేసి తనంటూ పేరు తెచ్చుకున్నారు. నర్తనశాలలో చూసి రంగారావుగారి కీచక పాత్రధారణ చూసి 'శ్రీమత్‌ విరాటపర్వం' అని తీసి దానిలో కీచకుడు పాత్ర వేశారు.

రాజ్యం పిక్చర్స్‌వారు తీసిన 'హరిశ్చంద్ర'లో రంగారావు గారు హరిశ్చంద్రుడు. విజయావారు మళ్లీ తీస్తే రామారావుగారు ఆ పాత్ర వేశారు. మొదటి 'సతీసావిత్రి'లో రంగారావుగారు యుముడు వేస్తే, కొత్త 'సతీ సావిత్రి'లో ఈయన యముడు వేశాడు. అంజలీ వారి 'అనార్కలి'లో రంగారావుగారు అక్బర్‌ పాత్ర వేస్తే ఈయన స్వయంగా అదే స్టోరీతో సినిమా తీసి అక్బర్‌ పాత్ర వేశారు. సినిమా టైటిల్‌లో తన పాత్ర పేరు కూడా కలిపి 'అక్బర్‌, సలీం, అనార్కలి' అని పెట్టారు. 'భక్త పోతన'లో రంగారావు గారు శ్రీనాథుడు, ఈయనకు కూడా కోరిక వుండిపోయింది. రాజకీయాల్లోకి వచ్చేసిన తర్వాత బాపుగారిచేత 'శ్రీనాథ' తీయించుకుని అందులో వేషం వేస్తే తప్ప ఆయనలోని కళాకారుడు శాంతించలేదు.

తమిళంలో తీసిన 'కర్ణన్‌'లో శివాజీ గణేశన్‌ కర్ణుడు. ఈయన కృష్ణుడు. సినిమా బాగా హిట్‌ అయింది. ఈయన కొన్నాళ్లకి 'దానవీర శూరకర్ణ' తీస్తూ కృష్ణుడు, కర్ణుడు ఈయనే వేసేశాడు. బోనస్‌గా దుర్యోధనుడు కూడా. చరిత్రలో కనబడ్డ పాత్రలన్నీ వేసేయాలని ఈయన తపన. అక్కడికీ ఈయన వేసిన చారిత్రక సినిమాలు తక్కువ కాదు. తెనాలి రామకృష్ణలో,మహామంత్రి తిమ్మరసులో కృష్ణదేవరాయలు, సారంగధరలో సారంగధరుడు, బొబ్బిలియుద్ధంలో రంగరాయుడు, పల్నాటియుద్ధంలో బ్రహ్మనాయుడు, చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడు. అసలీ సినిమాలో ఈయన నాగేశ్వరరావుగారికి ఓ ఆఫర్‌ యిచ్చారుట. 'బ్రదర్‌, నువ్వు చంద్రగుప్తుడు, నేను చాణక్యుడు వేద్దామా?' అని. నాగేశ్వరరావుగారు చాలా కాలిక్యులేటెడ్‌ కదా. 'వద్దులే, ఇలాగే కానీ' అన్నారట.

రామారావుగారు ఎన్ని పాత్రలు వేసినా అన్నీ రాజసం వున్నవే. నాగేశ్వరరావుగారు బ్రాహ్మణ పాత్రలు వేసి చక్కగా ఒప్పించారు. ఈయన వేయలేదు, వేసినా నప్పేది కాదేమో! శ్రీనాథుడు బ్రాహ్మణుడే కదా అంటారేమో, రాజసం వున్న బ్రాహ్మడాయన. ఒకలా చెప్పాలంటే దేవుళ్ల పాత్రల్లో రామారావు రాణిస్తే, భక్తుల పాత్రల్లో నాగేశ్వరరావు రాణించారు. రామారావుగారి చివరిదశలో వేసిన హిస్టారికల్‌ ఫిల్మ్‌ అశోక. గొప్ప ఫెయిల్యూర్‌. ఇన్ని వేసినా ఆయనకు యావ పోలేదు. అల్లూరి సీతారామరాజు స్క్రిప్టు రాయించి పెట్టుకుని తాత్సారం చేస్తూ వుంటే కృష్ణ తీసేశారు. ఈయన కొన్ని సినిమాల్లో ఆ వేషధారణలో కనబడి కుతి తీర్చుకున్నాడు.

రామారావుగార్ని పౌరాణికాలూ, జానపదాల్లో బాగా గుర్తు పెట్టుకున్నా ఆయన వేసిన వాటిల్లో సాంఘికాలు ఎక్కువ.  కామెడీ ఆయన బాగా వొప్పించారు. నాకు నచ్చిన కొన్ని కామెడీలు చెప్పమంటారా? – పెళ్లిచేసి చూడు, వద్దంటే డబ్బు, మిస్సమ్మ. మిస్సమ్మలో ఎంత సటిల్‌ హ్యూమరో చూడండి. కన్యాశుల్కంలో గిరీశం పాత్రలో వేయడం మాటలు కాదు. పక్కన అందరూ హేమాహేమీలు. సియస్సార్‌, విన్నకోట రామన్నపంతులు, సావిత్రి, జానకి. వీళ్లందరి మధ్యా నెగ్గుకొచ్చినందుకే మెచ్చుకోవాలి. పెంకిపెళ్లాం, ఇంటిగుట్టు, అప్పుచేసి పప్పుకూడు, అప్పుచేసి పప్పుకూడు నిండా మారు వేషాలే. దేవాంతకుడు, పెండ్లి పిలుపు, గుండమ్మకథ. గుండమ్మకథ తీసేనాటికి ఆయనకు 40 యేళ్లు. లాగూ వేసుకుని వేయాలని చక్రపాణి గారు చెప్తే ఆయన నిర్ఘాంతపోయాట్ట. 'ఇదేమిటండీ, ఈ వయసులో…' అని.  ఆయన పట్టుబట్టాడు.

సినిమా ఫస్ట్‌ కాపీ చిన్నపిల్లలకు చూపారట. వాళ్లు ఈయన పాత్ర బాగా ఎంజాయ్‌ చేశార్ట. 'ఇంకేం? యాక్సెప్ట్‌ చేశారుగా' అన్నార్ట చక్రపాణి. ఆ సినిమా హిట్‌ కావడంతో తర్వాత చాలా సినిమాల్లో అలాటి పాత్రలు వచ్చాయి. 'చుక్కమ్మత్తో బుల్‌బుల్‌' అంటూ పాటలొకటీ. కామెడీ సినిమాల్లో చెప్పుకోదగ్గవి – ఇరుగు-పొరుగు, రాముడు-భీముడు, దాగుడుమూతలు. తిక్క శంకరయ్య, యమగోల. యమగోలలో యముడి దగ్గిర డైలాగులు చాలా బాగుంటాయి. కానీ దేవాంతకుడి టైములో కనబడ్డ సటిలిటీ యమగోలలో మిస్సయింది. కామెడీ పాత్రల గురించి చెప్పుకున్నాక విషాద పాత్రల గురించి చెప్పుకోవాలి – చిరంజీవులు, ఇంటికిదీపం ఇల్లాలే, ఆత్మబంధువు. ఆత్మబంధువు సినిమా చూస్తే ఇప్పటిక్కూడా నాకు కన్నీళ్లు ఆగవు.

రంగారావు, రామారావు యిద్దరూ పోటీపడి వేశారు. ఇతన్ని ఇంట్లోంచి పొమ్మన్నపుడు వుండే దృశ్యాల్లో ఎంత బాగా చేశారో చెప్పనలవి కాదు. రక్తసంబంధం ఒకటి మంచి టియర్‌ జర్కర్‌. రామారావు ముందులో వర్కర్‌గా అమాయకుడిగా వున్నప్పటి యాక్షన్‌కీ, ఎదిగి మిల్లు ఓనర్‌గా మారినప్పటి యాక్షన్‌కీ ఎంతో వ్యత్యాసం చూపించారు. గుడిగంటలు సినిమాలోది మంచి కాంప్లెక్సు పాత్ర. వెల్‌ ఎగ్జిక్యూటెడ్‌. వివాహబంధం, నిర్దోషి, రాము. రాములో మూగవాడి తండ్రిగా చాలా గొప్పగా నటించారు. ఎదురీత కూడా మంచి సినిమా.

ఇక ప్రజలకి ఇన్‌స్పయిరింగ్‌ అనిపించే పాత్రల గురించి చెప్పాలంటే – రాబిన్‌హుడ్‌ టైప్‌ పాత్ర అగ్గిరాముడు, శభాష్‌రాముడు, ఈ సినిమా తర్వాత రిక్షావాళ్లందరూ ఎన్టీయార్‌ ఫాన్స్‌ అయిపోయారు. ఎందుకంటే ఇందులో ఆయన పాత్ర రిక్షావాడి పాత్ర. 'జయమ్ము నిశ్చయమ్మురా' పాట పాడే పాత్ర. పోటీలో గెలిచి నెగ్గే పాత్ర. బందిపోటు సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. చూస్తే ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అలాగే పల్లెటూరి అబ్బాయికి పదును పట్టి వెన్నుతట్టే ఉమ్మడికుటుంబం, కథానాయకుడు సినిమా కథ ముళ్లపూడి వెంకటరమణ గారిది. సంఘాన్ని సంస్కరించే పాత్ర. కామెడీ విలన్లు, వాళ్ల ఆటకట్టించడాలు – ఈ మార్కు సినిమాలకు ఇదేనాంది.

ఇక తర్వాతి ఫేజ్‌లో వచ్చినవాటిలో డ్రైవర్‌ రాముడు, వేటగాడు, సర్దార్‌ పాపారాయుడు, జస్టిస్‌ చౌదరి, మేజర్‌ చంద్రకాంత్‌. వీటిలో పోను పోను డైలాగుల హోరు ఎక్కువయిపోయిందని నా అభిప్రాయం. ఈ హిస్ట్రియానిక్స్‌ చూసి ఆయనకు అండర్‌ప్లే చేయడం రాదనుకోకూడదు. సటిల్‌, సబ్‌డ్యూడ్‌ యాక్షన్‌ చూపిన సినిమాలు వున్నాయి. పిచ్చిపుల్లయ్య, తోడుదొంగలు, ఏకవీర, మా వారి మంచితనం, బడిపంతులు యిలా. రామారావుగారిలో విశేషం ఏమిటంటే ఆయన పౌరాణికాల పాత్రలూ వేశాడు, వాటి పారడీలు వేశాడు – దేవాంతకుడు, యమగోల, ఉమ్మడి కుటుంబంలో యముడు ఇలా చెప్పుకుపోవచ్చు. ఆయన పాత్రకు ఇంపార్టెన్స్‌ యిచ్చాడు కానీ తనదే పై చేయిగా వుండాలని పట్టుబట్టలేదు. తన 200 వ సినిమా, తన సొంత సినిమాకు ఆయన తన పాత్రపరంగా పేరు పెట్టలేదు.

'కోడలు దిద్దిన కాపురం' అని సావిత్రి పరంగా టైటిల్‌ పెట్టారు. తన పక్కన వాణిశ్రీ. ఆమె ఒక్క కరాటే షాట్‌ యిస్తే తను పడిపోయినట్టు చూపించుకున్నాడు. అప్పటికి వాణిశ్రీ చిన్న హీరోయిన్‌. ఈయన టాప్‌లో వున్నాడు. బట్‌ హీ వజ్‌ షివల్రస్‌. వెరైటీ రోల్స్‌కి అవకాశం వచ్చినపుడు అదీ వేశారు – 'తీర్పు ' సినిమాలో జజ్‌ పాత్ర అలాటిదే!

ఇలా చెపుతూ పోతే ఎంత స్థలమూ చాలదు. నటుడిగా ఆయన వేయలేని పాత్ర లేదన్నట్టు తనివితీరా వేశాడు. టాప్‌ రాంక్‌లో వుండగానే రిటైరయ్యారు. దక్షిణాదిన హైయస్ట్‌ పెయిడ్‌ ఆర్టిస్టుగా వుండే పొజిషన్‌లో తప్పుకుని తన సుప్రిమసీని చాటుకున్నాడు. ఆయన నటుడు మాత్రమే కాదు, సినిమారంగంలో ఆయనకు తెలియని విభాగం లేదంటారు. రామారావుగారు తన సినిమాల్లో పాటలు దగ్గరుండి ఎలా రాయించుకునేవారో నారాయణరెడ్డిగారు రాసిన పుస్తకంలో చూస్తే తెలుస్తుంది. ఇన్ని పనులు ఆయన ఎలా చేయగలిగాడో అని ఆశ్చర్యం వేస్తుంది.

క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, సమయపాలన. వాటి గురించి వందలాది ఉదాహరణలు చెప్తారు. ఇలా చెప్తూ పోతే అంతే వుండదు కాబట్టి యిక్కడితో ఆపుతాను. దర్శకుడిగా రామారావు, నిర్మాతగా రామారావు, రాజకీయ వేత్తగా రామారావు.. యిలా ఎన్నో చెప్పవలసి వుంది. జస్ట్‌ ఆయన వేసిన కొన్ని పాత్రల గురించి రేఖామాత్రంగా చెప్పుకున్నామంతే! ఎన్టీయార్‌ 05 నుంచి ఆయన గురించిన ఎనెక్టోడ్స్‌ చెపుతాను. (సశేషం)
– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (డిసెంబరు 2018)
[email protected]

ఎన్టీయార్‌తో గొల్లపూడి అనుభవాల గురించిన సినీస్నిప్పెట్లు 

ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 01 ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 02  ఎమ్బీయస్‌: ఎన్టీయార్‌ – 03