గొల్లపూడి మారుతీరావుగారు ''అమ్మ కడుపు చల్లగా..'' పేరుతో రాసిన ఆత్మకథలో ఎన్టీయార్‌తో రచయితగా తన అనుభవాల గురించి అక్కడక్కడ రాశారు. వాటిని గుదిగుచ్చి చూస్తే –
గొల్లపూడి నాటకరచయితగా వుండే రోజుల్లో 1963లో ప్రొద్దుటూరులో నాటకపోటీలు జరిగాయి. బహుమతి ప్రదానోత్సవంలో సన్మానం చేస్తామన్నారు. సరే అని ఒప్పుకున్న దాకా వుండి మీతో పాటు డైరక్టరు చాణక్య, ఎన్టీయార్‌కు కూడా చేస్తున్నామన్నారు. ముగ్గుర్నీ కలపడం వింతగా వుందనుకున్నా గొల్లపూడి ఏమీ అనలేకపోయారు. ముగ్గురికీ కలిపి ఊరేగింపు చేశారు. రాయలసీమలో ఎన్టీయార్ మకుటం లేని మహారాజు. వేలాది జనం మధ్య రథం మీద చిక్కని చిరునవ్వుతో, తొణకని దర్పంతో ఎన్టీయార్ నిలబడ్డారు. అంతవరకు గొల్లపూడికి ఆయనకు పరిచయం లేదు. ప్రజాదరణను అనాయాసంగా, గర్వంగా, హుందాగా స్వీకరించే సూపర్‌స్టార్‌ను విభ్రమంతో చూస్తూ గడిపానని గొల్లపూడి రాసుకున్నారు. ఆ వూరేగింపు ఎన్టీయార్‌కే అన్నట్లుగా సాగింది కానీ పక్కన మరో యిద్దరున్నట్లు ఎవరికీ తోచలేదు – గొల్లపూడితో సహా! ఎన్టీయార్ తనతో వచ్చిన నిర్మాతలు పుండరీకాక్షయ్య, త్రివిక్రమరావు, బలరాం గార్లను గొల్లపూడికి పరిచయం చేశారు. పుండరీకాక్షయ్యగారికి, గొల్లపూడికి మంచి స్నేహం ఏర్పడింది. బహుమతి తీసుకున్నవాళ్లందరూ విధిగా ఎన్టీయార్ పాదాలపై పడి వెళ్తున్నారు. నాటకపోటీల్లో ఉత్తమ ప్రదర్శన, ఉత్తమ రచనలకు గొల్లపూడి రాసిన ''రెండు రెళ్లు ఆరు'' ఎన్నికైంది. రచయితగా నగదు బహుమతిని గొల్లపూడి ఎన్టీయార్ వద్ద తీసుకున్నారు. ''మొత్తం మీద యిక్కడికి వచ్చినందుకు మారుతీరావుగారికి బిజినెస్ కిట్టుబాటయింది.'' అన్నారు ఎన్టీయార్ నవ్వుతూ. 'ఈ ఒక్క మాటా వారి దృక్పథాన్ని వివరిస్తుంది' అంటారు గొల్లపూడి.
*********
అప్పట్లో ఎన్టీయార్, అక్కినేని గ్రూపులు విడివిడిగా నడిచేవి. ఎవరి రచయితలు వారికే. గొల్లపూడి అన్నపూర్ణ సంస్థకు, తద్వారా అక్కినేని సినిమాలకు రచయిత. అయినా గొల్లపూడి స్వభావం, కేవలం పనిమీదే వుండి గురి తెలుసుకుని ఎన్టీయార్ తన సినిమాలకు కూడా రాయించుకున్నారు. ఒకసారి ''ఎల్లుండి కలుద్దాం'' అని ఎన్టీయార్ అంటే గొల్లపూడి ''ఆ రోజు అక్కినేని గారితో పని వుంది.'' అన్నారు. ''ఆల్‌రైట్. కానివ్వండి. మరొక రోజు కలుద్దాం.'' అన్నారట ఏ పొరపొచ్చాలు లేకుండా.
*********
గొల్లపూడి విజయవాడ ఆలిండియా రేడియోలో పనిచేసే రోజుల్లో ప్రమోషన్ మీద శంబల్పూర్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. విజయవాడలో వుండగా సినిమావాళ్లకు అందుబాటులో వున్నారు. ''మీరు రాసిన ''రైతు కుటుంబం'', ''పాపం పసివాడు'' వంటి సినిమాలన్నీ హిట్స్ కాబట్టి, మీరు ఉద్యోగం మానేసి మద్రాసు వస్తే చాలా బిజీ అయిపోతారు'' అని తాతినేని రామారావు వంటి మిత్రులు ఉత్తరాలు రాసేవారు. ఎన్టీయార్‌ను సలహా అడిగితే ''మీ జీతమెంత?'' అని అడిగారు. చెప్పిన తర్వాత ''కాస్త ఆలోచించి చెయ్యండి. ఇక్కడ ఎవరినీ నమ్మడానికి వీల్లేదు. అంతా గొర్రెదాటు వ్యవహారం.'' అని చెప్పారు. అది ఈయన మెదడులో బాగా నాటుకుపోయింది. ఉద్యోగం మానలేదు. తర్వాత మద్రాసుకి బదిలీ అయి, సినిమాలకు రాస్తూ, ఆ తర్వాత నటుడై బాగా నిలదొక్కుకున్నాక అప్పుడు రిజైన్ చేశారు.
*********
గొల్లపూడి ఆలిండియా రేడియోలో మద్రాసు కేంద్రంలో పనిస్తూ సినిమాలకు కూడా రాస్తూండేవారు. వాటిలో ఎన్టీయార్ సినిమాలు కూడా వున్నాయి. పుండరీకాక్షయ్యగారు ఎన్టీయార్‌కి యీయన చేత కథ చెప్పించాలని ఆరాటపడ్డారు. కానీ అదే సమయంలో గొల్లపూడికి యాక్సిడెంటు అయి కాలూ, చెయ్యి విరిగి యింట్లో మంచం మీద వున్నారు. ఎన్టీయార్ హైదరాబాదు వెళితే మరో 40 రోజుల దాకా తిరిగి రారు. ఎలా? విషయం చెపితే ''పదండి, వెళ్లి మారుతీరావుని చూద్దాం, కథ విందాం'' అన్నారు ఎన్టీయార్.
పుండరీకాక్షయ్యగారు, బలరాం, తర్వాత మంత్రి అయిన స్నేహితుడు బివి మోహనరెడ్డి వెంటరాగా ఎన్టీయార్ వచ్చి గొల్లపూడి మంచం పక్కన కూర్చుని వుండగా గొల్లపూడి పడుకొనే దాదాపు గంటన్నర కథ చెప్పారు. కథంతా విని ''మీరు కోలుకున్నాక కలుద్దాం.'' అని లేచారు ఎన్టీయార్. 'అది వారి సంస్కారానికి, భేషజం లేమికి మచ్చుతునక' అంటారు గొల్లపూడి. గొల్లపూడి తల్లి జీవితంలో యిద్దరే యిద్దరిని చూడాలనుకునేది. ఘంటసాల, ఎన్టీయార్‌లను. ఒక కోరిక తీరింది.
*********
1977 ఉగాదికై గొల్లపూడి ఆలిండియా రేడియో తరఫున ఒక కార్యక్రమం తలపెట్టారు. ప్రధాని ఇందిర పాలనలో ప్రాచుర్యంలో వున్న 20 అంశాల ప్రణాళిక మీద యువకవుల చేత కవితలు రాయించి ప్రసారం చేద్దామనుకున్నారు. ఆ కార్యక్రమాన్ని తన సమీక్షతో సమర్పించవలసినదిగా గొల్లపూడి ఎన్టీయార్‌ను కోరారు. అప్పటికి ఆయన రేడియో కార్యక్రమాల్లో చేసి ఎన్నేళ్లయిందో. గొల్లపూడి మాట కాదనలేక ఒక ఆదివారం ఉదయం ఆయన రేడియో స్టేషన్‌కు వచ్చి చెప్పాల్సిన నాలుగు వాక్యాలు చెప్పారు. రేడియో వాళ్లు యిచ్చిన రూ.75 పారితోషికాన్ని చిరునవ్వుతో స్వీకరించారు.
అయితే ఉగాదికి ముందు ఎన్నికలు జరిగి ఇందిర ఓడిపోయింది. ఈ కార్యక్రమం ఆపేయమంటారేమో, ఎన్టీయార్ ముందుమాటతో వచ్చే తమ కార్యక్రమం ఆగిపోతుందేమోనని యువకవులందరూ బెంగ పెట్టుకున్నారు. అయితే జనతా ప్రభుత్వం యింకా ఏర్పడకపోవడం చేత దీనిపై ఎవరూ నిర్ణయం తీసుకోలేదు. ఉగాది ఉదయం ప్రసారం అయిపోయింది.
*********
ఒకసారి ఆయన ఆఫీసుకి ఆపరేటర్ ద్వారా ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి ''రామారావు స్పీకింగ్'' అన్నారు. ఈయన అధికార ధోరణిలో ''వుచ్ రామారావ్?'' అన్నారు. అటు చిరునవ్వు ''ఎన్‌టి రామారావ్'' అని వినబడింది. ఈయన తుళ్లిపడ్డాడు. ఎన్టీయార్ స్వయంగా ఫోన్ చేస్తారని వూహించడం ఎలా? ''మన బాలయ్య కోసం సినిమా చెయ్యాలి. ఓ హిందీ పిక్చర్ చూడాలి. సోమవారం ఉదయం చూడగలరా?'' అన్నారాయన. ఈయన ''సోమవారం వుదయం ఆఫీసు ఉంటుందండి.'' అన్నారు. సినిమా కంటె నాకు ఆఫీసే ముఖ్యం అని అసంకల్పితంగానే ధ్వనింపచేస్తూ. ''సరే, మళ్లీ ఫోన్ చేస్తా'' అన్నారు ఎన్టీయార్.
మరో గంట తర్వాత ఫోన్ చేసి ''సాయంకాలం సుభాషిణిలో ఆరున్నరకి షో ఏర్పాటు చేశాను. ఈలోగా వీలయితే 'గుడ్ చిల్ట్రన్ డోన్ట్ కిల్' నవల చదవండి.'' అన్నారు ఎన్టీయార్. గొల్లపూడి వెంటనే లైబ్రరీకి పరిగెత్తి, లూయీస్ థామస్ రాసిన ఆ నవల చదవసాగారు. దాని ఆధారంగా హిందీలో ''ఖేల్ ఖేల్ మేఁ'' సినిమా వచ్చింది. అది చూసే ఎన్టీయార్ బాలకృష్ణను పెట్టి తెలుగులో దాన్ని తీద్దామనుకున్నారు. గొల్లపూడి ఆ సినిమా చూశాక డైరక్టరుగా అనుకున్న ఎస్‌డి లాల్‌తో కలిసి ఎన్టీయార్‌ను కలిసి చర్చలు జరిపారు. కొన్ని రోజులు డిస్కషన్లు జరిగినా ఆ ప్రాజెక్టు కార్యరూపం ధరించలేదు.
*********
ఇంకోసారి గొల్లపూడి యింటికి ఫోన్ చేశారు. అప్పట్లో వాళ్లింట్లో ఫోన్ లేదు. పక్కింటికి ఫోన్ చేసి యీయన వచ్చేదాకా ఫోన్ పట్టుకుని కూర్చున్నారు. ''ఒక్కసారి ఆఫీసుకి రండి'' అన్నారు. వెంటనే వెళ్లితే డైరక్టరు ఎంఎస్ గోపీనాథ్ (హీరో సురేష్ తండ్రి) కూర్చుని వున్నారు. ''మనం యీయనికి ఒక సినిమా చెయ్యాలి. ఈయన ఓ కథ చెప్తారు. వినండి.'' అన్నారు. ఈయన గోపీనాథ్‌తో ''మా ఆఫీసుకి రండి, కథ చెపుదురుగాని'' అని పిలిచారు. తమిళరచయితల టైపులో అరుపులు, కేకలతో రెండు గంటలసేపు కథ చెప్పాడాయన. ''అదే రాముని మించిన రాముడు'' సినిమా కథ. ఆఫీసులోని వారేమనుకుంటున్నారో అనే బెంగతో సగం కథ యీయన తలకెక్కలేదు. వద్దులే అనుకున్నారు. ఎన్టీయార్ ఏమనుకుంటారో తెలియదు. అయినా ధైర్యం చేసి ఆయన దగ్గరకు వెళ్లి ''ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలన్నీ నేనే రాస్తున్నాను. ఆఫీసు ఉద్యోగం చేస్తూ మరొక సినిమా చేయడం యిప్పట్లో కష్టం. నాకున్న సమయం దృష్ట్యా తలకు మించిన పని అవుతుంది.'' అన్నారు.
ఎన్టీయార్ స్వయంగా పిలిచి సినిమా రాయమంటే యీయన యిలాటి కారణాలు చెప్తాడేమిట్రా అనిపించిందో ఏమో ఎన్టీయార్ యీయన వైపు ఒక చూపు చూసి, అంతలోనే తమాయించుకుని ''వెరీగుడ్! మనకు వైట్ కాలర్డ్ రచయితలు అక్కరలేదు. మీ పరిస్థితి స్పష్టంగా చెప్పారు. సరే, మీ పనులు మీరు కానీయండి.'' అనేసి పంపించారు.
తర్వాత డివి నరసరాజుగారి చేత రాయించారు. సినిమా ఆడలేదు.
*********
''లాయర్ విశ్వనాథ్'' (198..) సినిమాకు గొల్లపూడి రచయిత. ఎన్టీయార్ హీరో. శతృఘ్న సిన్హా ''విశ్వనాథ్'' హిందీ సినిమా ఆధారంగా తీశారు. సినిమా పెద్ద కోర్టు సీనుతో ప్రారంభమవుతుంది. దాదాపు 4,5 పేజీల డైలాగు సీను ఒకే షాట్‌లో తీశారు. ఆ సీను రాసిన తర్వాత నిర్మాత వైవి రావు, దర్శకుడు ఎస్‌డి లాల్ వినడానికి కూర్చున్నారు. ఆ ఆయిదు నిమిషాల సీనును గొల్లపూడి నటుడి ధోరణిలో చదివారు. అద్భుతంగా వుందన్నారు వాళ్లిద్దరూ. 'ఈ సీనుని అచ్చం మీలాగే హీరోగారు చదివితే బాగుంటుంది' అన్నారు. కానీ ఎన్టీయార్‌కు చెప్పగలమా అని సందేహం. ఏమైతే అది అయిందని తెగించి ఉదయాన్నే ఎన్టీయార్ దగ్గరకి వెళ్లారు.
ఆయన ఆ రోజు శ్రీరాముడి పాత్ర వేస్తున్నారు. నాలుగున్నరకే మేకప్‌కు కూర్చున్నారు. ఆ మాటా యీ మాటా చెపుతూ లాల్ ''అయ్యా, మారుతీరావుగారు మొదటి సీను మీకు చదివి వినిపిస్తానంటున్నారు.'' అన్నారు. ఎన్టీయార్ నవ్వి ''సరే'' అన్నారు. మేకప్ ఒక పక్క సాగుతూండగా గొల్లపూడి ఏకపాత్రాభినయం మొదలుపెట్టారు. మొదటి వాక్యం అవుతూనే తన ముఖం మీద పీతారబరం చెయ్యి తీసేశారు ఎన్టీయార్. గొల్లపూడిని తదేకంగా చూస్తూ ఏకాగ్రతతో విన్నారు. సీను చదవడం అయిపోయింది. ''ఊఁ'' అని నవ్వారు. లాల్‌కి, వైవిరావుకి ఆనందం. కాస్త ఆగి ''మళ్లీ చదవండి.'' అన్నారు. గొల్లపూడి మళ్లీ మొదలెట్టారు. మళ్లీ మొఖం మీద నుంచి పీతారబరం చెయ్యి తప్పించి తదేకంగా విన్నారు. అంతా అయ్యాక మళ్లీ నవ్వారు. ''పదండి'' అన్నారు.
అయిదు రోజుల తర్వాత ఆ సీను షూటింగు జరిగింది. గొల్లపూడి చదివిన ధోరణిలోనే విరుపుల్ని తుచ తప్పకుండా పాటిస్తూ తన ధోరణిలో మరింత శోభాయమానంగా చదివి సీను పండించారు ఎన్టీయార్. అదీ ఆయన ఏకాగ్రత, ప్రతిభ అంటారు గొల్లపూడి.
*********
గొల్లపూడి నటుడిగా, ఎన్టీయార్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత బాలకృష్ణ కూతురు పుట్టిన రోజున యిద్దరూ కలిశారు. ''మీరు యింక రచయితలు కారు. మా కులంలో కలిసిపోయారు.'' అన్నారు ఎన్టీయార్ చిరునవ్వుతో.
– ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2016)