ఆ తర్వాతిది పౌరాణికం – పాండురంగ మహాత్మ్యం. అయితే అందులో ఈయనది దేవుడి పాత్ర కాదు. భక్తుడి పాత్ర. మరో పౌరాణికం వినాయక చవితి. మళ్లీ కృష్ణుడి పాత్ర. ఆ తర్వాతది భూకైలాస్ – రావణాసురుడి పాత్ర. ప్రతినాయకుడే కానీ సినిమాకు నాయకుడు కూడా. కథంతా అతనిమీదనే తిరుగుతుంది. భక్తుడిగా, అహంభావిగా, మూర్ఖుడిగా రకరకాల భావాలు చూపే అవకాశం వచ్చింది.
తర్వాత వచ్చిన పౌరాణిక సినిమా వెంకటేశ్వర మహాత్మ్యం. వెంకటేశ్వరుడి పాత్రలో ఎన్టీయార్ నీరాజనాలు అందుకున్నారు. తర్వాత దీపావళి. మళ్లీ కృష్ణుడి పాత్ర. ఆ తర్వాత వచ్చినది సీతారామ కళ్యాణం. రావణాసురుడిగా విజృంభించిన సినిమా. తిక్కనగారి ఉత్తరరామాయణం నుండి కథ తీసుకుని రావణుడి వృత్తాంతం బ్యూటిఫుల్‌గా చెప్పారు. రామారావే దర్శకుడు. అయితే దర్శకుడిగా ఆయన పేరు వేసుకోలేదు. ఫస్ట్‌టైమ్ డైరక్షన్ కదా, మోడెస్టీయో, బెరుకో తెలియదు.
తర్వాతి సినిమా భీష్మ. భీష్ముడి యవ్వనం నుంచి వార్ధక్యం వరకు అన్ని స్టేజీల్లోనూ ఎన్టీయార్ అద్భుతమైన నటన కనబరచారు. చక్రపాణిగారి జోక్ వినే వుంటారు. ఆయన వద్దన్నా ఈయన ముసలి భీష్ముడిగా వేసి తనలో నటనా తృష్ణను తీర్చుకున్నారు. దక్షయజ్ఞంలో శివుడిగా వేసినప్పుడే ఆయన పెద్ద కుమారుడు రామకృష్ణ ఆకస్మికంగా పోయాడు. చికెన్‌పాక్స్ వచ్చి పోయాట్ట. లయకారకుడైన శివుడి వేషం వేయబట్టే తనకు యిలాటి విషాదం కలిగిందనుకున్నారుట ఎన్టీయార్.
శ్రీ కృష్ణార్జునయుద్ధంలో శ్రీకృష్ణుడిగా తన పాత్ర అవలీలగా పోషించారు ఎన్టీయార్. ఇక్కడిదాకా ఆయన రాముడి పాత్ర వేయలేదు. 'సంపూర్ణ రామాయణం' అనే తమిళ సినిమాలో తప్ప. 1963లో వచ్చింది 'లవకుశ'. రామారావు రాముడి అవతారంలో జనాల్ని వెర్రెక్కించేశారు. ఆ సినిమా ఏడాదిన్నర ఆడింది. ప్రజల మనసులో రాముడిగా ఆయన తిష్ట వేసుకున్నాడు. ఆ తర్వాత చెప్పుకోవలసినది నర్తనశాల. అర్జునుడి వేయడం సరే. అలాటివాటికి ప్రయత్నమే అక్కరలేదనిపిస్తుంది.
కానీ బృహన్నల వుంది చూశారూ, అది భలే కష్టం. అంత పెర్సనాలిటీ వున్న మనిషి, ఆడ కులుకులు పోతూ నపుంసకుడిగా వేయడం తలచుకుంటే చాలా ఎబ్బెట్టుగా వుంటుంది. కానీ ఈయన తన ప్రతిభతో దాన్ని ఒప్పించారు. దానికోసం ఎంతో కష్టపడి నాట్యం నేర్చుకున్నారు. పాండవ వనవాసంలో భీముడి పాత్ర ఒప్పుకోవడం విశేషం. నర్తనశాలలో వేసిన దండమూడి రాజగోపాలరావును పెట్టినా సరిపోయేది. కానీ స్టార్ వాల్యూ కోసం ఈయన్ని తీసుకున్నారు. భీముడు, ద్రౌపది మధ్య డ్యూయట్ పెట్టడం చక్రపాణిగారి సజెషనేట.
'ఎన్టీయార్, సావిత్రిని పెట్టుకుని ఓ డ్యూయెట్టయినా పెట్టక పోతే ఎట్టా?' అన్నాట్ట ఆయన. వీరాభిమన్యులో మళ్లీ కృష్ణుడి పాత్రే. ఆ తర్వాత వచ్చినది శ్రీ కృష్ణపాండవీయం. దుర్యోధనుడిగా, కృష్ణుడిగా ఎన్టీయార్ ద్విపాత్రాభినయం. సీతారామకల్యాణంలో రావణుడికి గ్లేమర్ తెచ్చి పెట్టినట్టు దీనిలో దుర్యోధనుడికి గ్లేమర్ తెచ్చిపెట్టారు. పోను పోను ఇది వెర్రితలలు వేసి కర్ణ సినిమాలో దుర్యోధనుడికి డ్యూయెట్ పెట్టేవరకూ పోయింది. కర్ణ సినిమాలో డైలాగులు హిట్ అయితే అయ్యాయి కానీ సినిమా అంతా వెర్బల్ ఎక్సెస్ అనిపిస్తుంది.
దుర్యోధనుడిగా, కర్ణుడిగా, కృష్ణుడిగా రామారావు ఒంటిచేత్తో సినిమాను నిలబెట్టారు. ఈయన కర్ణుడుగా వేయడంతో అతని పాత్రను మంచివాడిగా చేసేశారు. ఆయన ఏ పాత్ర వేస్తే దాన్ని హైలైట్ చేయడానికి పురాణాలను మార్చేయడం జరిగింది. విరాటపర్వం వేసినప్పుడు ఈయన వేసిన అయిదు పాత్రల్లో కీచకుడు కూడా ఒకటి. వాడూ మంచివాడయిపోయాడు. ఎందుకురా అంటే రామారావు వేశారు కాబట్టి! కృష్ణుడిగా రామారావు సినిమాల్లో విశ్వరూపం చూపించినది శ్రీ కృష్ణావతారం. శ్రీకృష్ణ తులాభారంలో కూడా ఆయనా, జమునా, కాంతారావు సినిమాను నిలబెట్టేశారు. ఏ పౌరాణిక పాత్ర వేసినా ఆయన భక్తి శ్రద్ధలతో వేసినట్టు కనబడుతుంది. ఎక్కడా అతి కనబడదు.
నిజానికి ఎన్టీయార్ పౌరాణిక పాత్రల్లో చూపిన సంయమనం మామూలప్పుడు చూపలేదు. హీ వజ్ ఆల్వేజ్ ప్లేయింగ్ టు ది గేలరీ. ఇలాటి వాళ్లని స్వాష్ బక్లింగ్ హీరోస్ అంటారు. హీరోయిన్‌ను గాఢంగా హత్తుకోవడం, కత్తిని ముద్దు పెట్టుకోవడం, మారువేషం వేస్తూ వేస్తూ మధ్యలో గడ్డం పీకి 'నేనేరా' అన్నట్టు ప్రేక్షకుల కేసి చూసి కన్ను కొట్టడం, విలన్‌ను చావగొట్టి చెవులు మూసి హాల్లో ఈలలు వేయించడం – యివన్నీ యిలాటి హీరోల లక్షణాలు. ఇవి చూస్తూ ప్రేక్షకుడు మైమరచిపోతాడు. వీటిలో హీరో మొరటుగా వుంటాడు.
హావభావాలు ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తాడు. చదువురాని వాడికి కూడా అర్థమయ్యే రీతిలో హిస్ట్రియానిక్స్ ప్రదర్శిస్తాడు. అందువల్ల మధ్యతరగతి వాళ్లు ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు యిలాటి హీరోను యాక్సెప్ట్ చేయరు. శ్రామిక మహిళలు మాత్రం ఆరాధిస్తారు. ఎందుకంటే ఇతను ఎప్పుడూ మంచివాడిగానే వుంటాడు. మోటు సరసాలాడతాడు. త్యాగాలు చేయడు. కోరినదాన్ని దక్కించుకొంటాడు. అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి జేజేలు అందుకుంటాడు.
తమిళంలో ఎంజీయార్ యిటువంటి పాత్రలే వేశారు. ఆయనను గొప్పనటుడుగా విమర్శకులు అంగీకరించకపోవచ్చు. కానీ నేల తరగతి అతన్ని నెత్తిమీద పెట్టుకున్నారు. అతని సినిమాలను పదేపదే చూశారు. బయటకూడా ఆరాధించారు. ఎన్టీయార్ విషయంలో జానపద సినిమాల్లో జరిగినదిదే! ఆయన జానపద సినిమాల్లో ఎన్నదగినవి చూద్దాం. మొట్ట మొదటి జానపదం పాతాళభైరవి. తోటరాముడిగా ఆయన జాక్‌పాట్ కొట్టాడు. ఇక అక్కణ్నుంచి సినిమాలే సినిమాలు. అందాల రాకుమారుడు అంటే రామారావే! తర్వాతది రేచుక్క. ప్రతిభా వాళ్ల సినిమా. అప్పటిదాకా నాగేశ్వరరావుతో జానపదాలు తీసిన ప్రతిభావాళ్లు రామారావును పెట్టి 'రేచుక్క' తీశారు. నాగేశ్వరరావు ఓ గెస్ట్‌రోల్ వేశారు.
తర్వాత జానపదం జయసింహ. ఎన్టీయార్‌కి ముందునుండీ అభ్యుదయ భావాలున్నాయి. సాంఘిక ప్రయోజనం వున్న సినిమాలు తీయాలి అనుకుని, సినిమా రంగానికి వచ్చిన 3,4 యేళ్లలోనే 'పిచ్చిపుల్లయ్య', 'తోడుదొంగలు' వంటి మంచి సినిమాలు తీశారు. అదే నాగేశ్వరరావుగారయితే ఫీల్డుకి వచ్చిన పాతికేళ్లకు 'సుడిగుండాలు' 'మరోప్రపంచం' తీశారు. అయితే ఎన్టీయార్ తీసిన రెండు సినిమాలూ దెబ్బ తిన్నాయి. ఈయన చాలా నిరాశకు లోనయ్యాడు. కత్తి పడితే తప్ప తన సంస్థ నిలదొక్కుకోదని గ్రహించాడు. అందువల్లనే జయసింహ రూపు దిద్దుకుంది. బ్రహ్మాండమైన హిట్ అయింది. ఎన్.ఏ.టి.సంస్థ నిలబడింది. అనేక మంచి సినిమాలు తీసింది కానీ అన్నీ కమ్మర్షియల్సే! ఆర్ట్ సినిమాల జోలికి పోలేదు.
ఎన్టీయార్ వేసిన జానపదాల్లో చెప్పుకోదగ్గవి – జయం మనదే, వీరకంకణం, రాజనందిని, రేచుక్క-పగటిచుక్క, బాలనాగమ్మ, రాజమకుటం…, రాజమకుటం గురించి ఓ మాట చెప్పాలి. చాలా గొప్ప జానపద సినిమా అది. రామారావు పిచ్చివాడిగా కూడా చాలా బాగా వేస్తాడు. ఆ సినిమా తీసినది బియన్ రెడ్డిగారు. షూటింగు టైములో జరిగిన ఓ విశేషం ఏమిటంటే – రామారావు, స్టంట్ సోము వాళ్లు ఓ ఫైటింగ్ సీను ప్రాక్టీసు చేస్తున్నారట. శాండిలియర్ పట్టుకుని ఊగడం అదీ నన్నమాట. బియన్ రెడ్డి గారు వచ్చి 'నో నో మిస్టర్ రామారావ్, డోంట్ టేక్ రిస్క్. నీకేమైనా అయితే నీతో సినిమాలు తీస్తున్న ప్రొడ్యూసర్లందరూ నష్టపోతారు. ఇలాటి సాహసాలు చేయకు.' అని అడ్డుపడ్డారట.
'సార్, మీరు బయటకు వెళ్లి కూచోండి. మా తంటాలు ఏవో మేం పడతాం. ఫైట్స్ అయిపోయాక మిమ్మల్ని పిలుస్తాం' అని ఆయన్ను బయటకు పంపించి వీళ్లు ఫైట్ సీన్లు షూట్ చేశారట. అలా రిస్క్ తీసుకు చేశాడు కాబట్టే ఎన్టీయార్ తెరమీద కనబడగానే ఈల వేయ బుద్ధయ్యేది. ఆ రిస్కు తీసుకునే క్రమంలో యాక్సిడెంట్లూ అవుతాయి, తప్పదు. ఆక్యుపేషనల్ హజార్డ్. తర్వాతి సినిమాల్లో – భట్టి విక్రమార్క, జగదేకవీరుని కథ, గులేబకావళి కథ, స్వర్ణమంజరి, అగ్గిపిడుగు, మంగమ్మ శపథం, పరమానందయ్య శిష్యులకథ ఇవన్నీ చెప్పుకోవచ్చు. పరమానందయ్య శిష్యుల కథలు ఆంధ్రదేశంలో పాప్యులర్ అయినా వాటిని అలనాటి హాస్యనటుడు కస్తూరి శివరావు సినిమాగా తీస్తే ఫెయిలయిపోయింది. కొత్త వెర్షన్ మంచి హిట్ అయింది. రామారావు గ్లామర్ మహిమ అది.
విఠలాచార్య, రామారావు కాంబినేషన్‌లో బోల్డు జానపద సినిమాలు వచ్చి బాక్సాఫీసులు బద్దలు కొట్టాయి. ఎ క్లాసు సెంటర్లలోనే కాదు, బి, సి సెంటర్లలో కూడా బాగా ఆడేవి. రిపీట్ ఆడియన్సు నిర్మాతలకు కాసుల వర్షం కురిపించారు. అగ్గి బరాటా, కంచుకోట, గోపాలుడు-భూపాలుడు, భువనసుందరి కథ, భామా విజయం, చిక్కడు-దొరకడు, రాజకోట రహస్యం, లక్ష్మీ కటాక్షం, ఆలీబాబా 40 దొంగలు, గండికోట రహస్యం ఇలా ఎన్నో సినిమాల్లో రామారావ్ మ్యాజిక్ అద్భుతంగా పనిచేసింది.
ఈ ప్రేక్షకులే తర్వాత ఓటర్లుగా మారారు. తెరమీద చేసిన అద్భుతాలను ఎన్టీయార్ రాజకీయరంగంలో కూడా చేయగలడని నమ్మారు. నమ్మినట్టే అప్పటిదాకా ఏ రాజకీయవేత్తా చేయలేని పనులను ఎన్టీయార్ చేసి చూపించారు. జానపద సినిమాల్లో వేయడం వల్లనే రామారావు యాక్టింగులో లౌడ్‌నెస్ వచ్చింది. నేలతరగతి ప్రేక్షకుడికి తన ఫీలింగ్స్ అర్థమవ్వాలనే తాపత్రయంతో అవసరానికి మించి అరవడం, ఉత్తిపుణ్యానికి గంతులేయడం యిలాటి వికారాలన్నీ వచ్చి చేరాయి. క్రమేపీ యివి ఆయన సాంఘిక సినిమాల్లో కూడా కనబడసాగింది. ముఖ్యంగా చివరి సినిమాల్లో… (సశేషం)
– ఎమ్బీయస్ ప్రసాద్ (డిసెంబరు 2018)
[email protected]