cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

సినీ స్నిప్పెట్స్‌: ఎన్టీయార్‌కు డూప్‌గా ఎమ్జీయార్‌

సినీపరిశ్రమను అతి దగ్గరగా చూసిన సీనియర్‌ జర్నలిస్టు నందగోపాల్‌ తన అనుభవాలతో, సినీరంగంలోని వివిధ విభాగాలపై బోల్డంత సమాచారంతో - ''సినిమాగా సినిమా'' అనే పుస్తకాన్ని రాశారు. దానిలో ఎన్టీయార్‌ గురించి ఆయన రాసిన ఆసక్తికరమైన విషయాలు - 1977లో ఎమ్జీయార్‌ యీయనతో మాట్లాడుతూ ''శ్రీరాములు నాయుడు గారు కోయంబత్తూరులో తీసిన ''మలైకళ్లన్‌'' (1954)లో నేను, భానుమతి గారు నటించాం. దాని తెలుగు వెర్షన్‌ ''అగ్గిరాముడు''లో తమ్ముడు రామారావు నటించారు. కొన్ని సందర్భాల్లో ఆయన మద్రాసు నుంచి సమయానికి రాలేకపోతే స్టంట్‌ సీనులో ఆయనకు డూప్‌గా నటించాను... అదే ఫైట్‌ చేశాను. సాధారణంగా హీరోలకు డూప్‌లు వుంటారు కానీ ఒక హీరో మరొకరికి డూప్‌గా చేయడు. నా తమ్ముని కోసం చేశాను. నా తమ్ముడు ఔట్‌డోర్‌కు వెళితే సినిమా ధ్యాసలో పడి ఆయనకు యిల్లు, భార్యాబిడ్డలు జ్ఞాపకం రారు. ఓ రోజు ఉదయం రామారావు పెద్దకూతురు లోకేశ్వరి ఫోన్‌ చేసింది - ''పెదనాన్నా! మీకో శుభవార్త. నేను ఇంటర్‌ ఫస్ట్‌క్లాసులో పాసయ్యాను. ఈ విషయం ముందుగా మీకే ఫోన్‌ చేసి చెపుతున్నాను.'' అంటూ. లోకమ్మకు మెడిసన్‌ చేయాలని వుంది. మెడికల్‌ కాలేజీలో సీటు యిప్పించి, చేర్పించింది నేనే. నాకు దేవుని మీద నమ్మకం లేదు. ఉంటే మరుజన్మలో రామారావును, నన్నూ ఒకే తల్లి బిడ్డలుగా పుట్టించమని కోరుకుని వుండేవాణ్ని.'' అన్నారట. 

హుస్సేన్‌సాగర్‌లో జిబ్రాల్టర్‌ రాక్‌ మీద ఎన్టీయార్‌ బుద్ధవిగ్రహాన్ని నెలకొల్పారని అందరికీ తెలుసు. విగ్రహాన్ని చెక్కే పనిని గణపతి స్థపతికి అప్పగించారు. ఆయన దేశమంతటా గాలించి వరంగల్‌ సమీపంలోని రామగిరి కొండ మీద సరైన శిలను కనుగొన్నారు. 1985లో బుద్ధవిగ్రహానికి రూపుదిద్దే కార్యక్రమం ముఖ్యమంత్రి ఎన్టీయార్‌ చేతుల మీదుగా జరిగింది. ముహూర్త సమయానికి శిలపై తొలిసారిగా ఉలిని తాటించడం, చెక్కడం చేయాలి. ఎన్టీయార్‌ ఉలిని పట్టుకొని ఒడుపుగా వంచి దాని తలపై సుతారంగా సుత్తితో మోదారు. ఇది గమనిస్తున్న గణపతి స్థపతి ఆయన పాదాలకు నమస్కరించి ''ఎన్నో ఏళ్ల అనుభవం వున్న మహాశిల్పిలా ఉలిని చేతపట్టారు.'' అని మెచ్చుకున్నారు. ''మల్లీశ్వరి సినిమాలో హీరో నాగరాజు శిల్పి. ఆ పాత్రకు న్యాయం చేయటానికి పదిహేను రోజులు మద్రాసు నుండి మహాబలిపురం వెళ్లి అక్కడ శిల్పుల వద్ద తర్ఫీదు పొందాను.'' అని ఎన్టీయార్‌ చెప్పారు. 34 ఏళ్ల క్రితం నేర్చుకున్న పాఠం ఆయన మర్చిపోలేదంటే ఆ పాత్ర పట్ల ఆయన శ్రద్ధ అలాటిది. 

''మల్లీశ్వరి'' తీసే సమయంలో బిఎన్‌ రెడ్డి గారి సహనానికి భానుమతి పరీక్ష పెట్టారట. ఏనాడూ అనుకున్న సమయానికి సెట్‌ మీదకు వచ్చేవారు కాదు. ఆమె వచ్చేలోగా షాట్‌లో ఆమె నిలబడే చోటులో మరొకరిని నిలబెట్టి లైటింగు ఏర్పాటు చేసుకునేవారు. మల్లీశ్వరి వుండే చోటును మార్కింగ్‌ చేసి సిద్ధంగా వుండేవారు. సెట్‌లో లైట్లు వేసి వుంచి, ఆవిడ వచ్చేక షూటింగు ప్రారంభమయ్యేది. భానుమతి యితరులనే కాదు, భర్త రామకృష్ణనూ సతాయించేరట. ''విప్రనారాయణ'' (1955) తీసేటప్పుడు ఆమెకు భరతనాట్యం నేర్పడానికి ఎల్లప్ప అనే డాన్స్‌ మాస్టరు రోజూ వచ్చేవారట. మధ్యలో నాలుగు రోజులు భానుమతి బద్ధకించి, క్లాసులు ఎగ్గొట్టారు. సినిమా డైరక్టు చేస్తున్న భర్త ''నిన్ను తీసేసి పద్మినితో సినిమా తీయనా?'' అని అడిగారట. దెబ్బకి బద్ధకం వదిలిపోయింది. ''మరి మీరూ అలా అడగలేకపోయారా?'' అన్నారట నందగోపాల్‌ బియన్‌తో. ''భానుమతి, రామారావు లేకపోతే మల్లీశ్వరి లేదు. వీరికి ప్రత్యామ్నాయం మీరు చూపించగలరా?'' అన్నారట బియన్‌. నాగరాజు పాత్ర అంత చిత్తశుద్ధితో, అంకితభావంతో వేశారు కాబట్టే ఎన్టీయార్‌ ఉలి, సుత్తి పట్టడం మర్చిపోలేదు. 

''నర్తనశాల''(1963)లో అర్జునుడిగా, నాట్యాచార్యుడు బృహన్నలగా నటించమని నిర్మాత లక్ష్మీరాజ్యం తనను కోరినప్పుడు ''ఉత్తర పాత్ర వేస్తున్న ఎల్‌ విజయలక్ష్మి అద్భుత నాట్యకారిణి, ఆమెకు నాట్యం నేర్పగల గురువుగా వేయాలి. సరే, ఓ నెల తర్వాత నా నిర్ణయాన్ని తెలియపరుస్తాను'' అన్నారు ఎన్టీయార్‌. కూచిపూడి నాట్యగురువు వెంపటి పెదసత్యంను రోజూ యింటికి పిలిపించుకుని, తెల్లవారు ఝామున 4 గంటల నుంచి 6 గంటల వరకు నాట్యం అభ్యసించి, నాట్యం చేయగలనన్న నమ్మకం వచ్చాకనే నర్తనశాలలో నటించడానికి ఒప్పుకున్నారు.  

ఎన్టీయార్‌ దర్శకుడిగా వున్నపుడు కళాదర్శకత్వంపై కూడా ఎంతో అవగాహన ప్రదర్శించేవారు. కాస్ట్యూమ్స్‌, మేకప్‌, కిరీటాలు, సెట్‌లో కనబడే దృశ్యాలు అన్నిటిలోను ఆయన అభిరుచి, ఆలోచన కనబడేవి. ''శ్రీకృష్ణపాండవీయం'' సినిమాలో దుర్యోధనుడి కిరీటంలో పడగ విప్పిన త్రాచు బొమ్మ వుంటుంది చూడండంటారు నందగోపాల్‌. జెండాపై, పాదరక్షలపై, పక్కన వింజామరలపై అన్నిటా తాచు పడగ. అతనికి పాండవులపై పగ కాబట్టి పగబట్టిన తాచును దుర్యోధనుడికి ప్రతీకగా అనుకున్నారన్నమాట. ''దానవీర శూరకర్ణ''లో కర్ణుడి నుదుట తిలకం కాంతిరేఖల సూర్యబింబం. కర్ణుడు సూర్యపుత్రుడని సంకేతం. 1991లో నందగోపాల్‌ ''సామ్రాట్‌ అశోక'' సినిమా షూటింగు చూడడానికి వెళ్లారట. అశోకుడికి, తిష్యరక్షితకు తొలిరేయి ఘట్టం. సెట్టింగు పరికించి చూస్తే - రాచభవనం పిట్టగోడలపై వరుసగా నెమళ్లు, నెమలి వెనక నెమలి మోల్డ్స్‌. గోడలపై, గుమ్మటాలపై నెమళ్ల బారులు. ''ఏమిటిది?'' అని అడిగితే ఎన్టీయార్‌ ''అశోకుడు శృంగార పురుషుడు. శృంగార ప్రియులకు నెమలి అంటే మక్కువ ఎక్కువ. అందుకే సింబాలిక్‌గా యీ నెమళ్ల బారులు'' అని చెప్పారట. 

ఇంతటి కళాభిజ్ఞత గల ఎన్టీయార్‌ తెలుగు సినిమాకు సంబంధించి తనదైన వస్తుసంపదను భావితరాలకు అందించాలనే సంకల్పంతో తన చిత్రాలలోని పురాణపాత్రలు ధరించిన ఆభరణాలు, కిరీటాలు, సెట్‌ప్రాపర్టీస్‌, కాస్ట్యూమ్స్‌ అన్నీ భద్రపరచి మద్రాసు నుంచి హైదరాబాదుకి తెచ్చి బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 13లో తన యింట్లో మ్యూజియం ఏర్పాటు చేద్దామనుకున్నారు. వాటిలో ఆయన 18,19 ఏళ్ల వయసులో బెజవాడ కాలేజీ వార్షికోత్సవంలో స్త్రీ పాత్రలో ధరించిన చీర కూడా వుంది. 'రాచమల్లు దౌత్యం' అనే ఆ నాటకంలో ఆయన నాయకురాలు నాగమ్మ వేషం వేశాడు. మీసం తీయనంటే సరే మీసంతోనే వేయమన్నారు. ఆ వేషానికి తల్లి నుంచి పట్టుచీర అరువు తీసుకుని కట్టుకున్నాడు. ఆ నాటకం చూసిన తల్లి సీతారావమ్మగారు మురిసిపోయి, 'ఆ చీర నీదే బాబూ, రేపు యింకో నాటకానికి అవసరం రావచ్చు' అని కానుకగా యిచ్చేశారు. నంద గోపాల్‌ ''1970లో ఎన్టీయార్‌ నాతో మాట్లాడుతూ అమ్మ యిచ్చిన పట్టుచీర యిప్పటికీ నా వద్దనే వుంది. చీరలో అమ్మను చూసుకుంటున్నాను. అన్నారు. ఆయన మ్యూజియానికి చట్టపరమైన అవరోధాలు వుంటే అవి తొలగిపోయి ఆ తలుపులు తెరుచుకోవాలి.'' అని ఆవేదనతో రాశారు. ఎన్టీయార్‌ పేరు గర్వంగా చాటుకునే కుటుంబసభ్యులు తమలో తాము రాజీ పడి ఆ మ్యూజియం తెరిస్తే తెలుగు సినిమాకే ఒక అలంకారం అమరుతుంది.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఏప్రిల్‌ 2016) 

mbsprasad@gmail.com