సినిమా రివ్యూ: సర్కార్‌

రివ్యూ: సర్కార్‌ రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: సన్‌ పిక్చర్స్‌ తారాగణం: విజయ్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాధారవి, పాలా కరుప్పయ్య, తులసి, యోగిబాబు తదితరులు సంగీతం: ఏ.ఆర్‌. రహమాన్‌ కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌…

రివ్యూ: సర్కార్‌
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: సన్‌ పిక్చర్స్‌
తారాగణం: విజయ్‌, కీర్తి సురేష్‌, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాధారవి, పాలా కరుప్పయ్య, తులసి, యోగిబాబు తదితరులు
సంగీతం: ఏ.ఆర్‌. రహమాన్‌
కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌
ఛాయాగ్రహణం: డి. గిరీష్‌ గంగాధరన్‌
నిర్మాత: కళానిధి మారన్‌
కథనం, దర్శకత్వం: ఏ.ఆర్‌. మురుగదాస్‌
విడుదల తేదీ: నవంబర్‌ 6, 2018

మురుగదాస్‌ ఎంచుకున్న కథాంశానికి ఎల్లలు లేవు. 'యూనివర్సల్‌ అప్పీల్‌' వున్న స్టోరీ పాయింట్‌ని ఎంచుకున్న మురుగదాస్‌ దానిని తెరకెక్కించడం మాత్రం 'విజయ్‌' అభిమానులని దృష్టిలో పెట్టుకుని తీసాడు. అందుకే ఒక పాయింట్‌ వరకు ఆకట్టుకోగలిగిన 'సర్కార్‌' ఆ తర్వాత పూర్తిగా మన 'బోర్డర్‌' దాటేసి అరవ పరిమళాలు వెదజల్లింది. హీరోయిజం మిస్‌ అవకుండా సోషల్‌ ఇష్యూని తీసుకుని కమర్షియల్‌ ఫార్ములాలో చెప్పగలగడం మురుగదాస్‌ స్పెషాలిటీ. 'రమణ' (ఠాగూర్‌) నుంచి 'కత్తి' (ఖైదీ నంబర్‌ 150) వరకు పలుమార్లు తనలోని ఈ ప్రతిభ తేటతెల్లమయింది. అయితే ఎంత తలపండిన దర్శకుడికి అయినా అన్ని వేళలా ఈ ఫార్ములాతో మ్యాజిక్‌ చేయడం కష్టమవుతుంది. అందులోను 'స్పైడర్‌'తో పూర్తిగా గాడి తప్పిన మురుగదాస్‌ మళ్లీ ఒకేసారి పూర్తి ఫామ్‌లోకి రావడం అంత తేలిక కాదు మరి.

'సర్కార్‌' చిత్రాన్ని అటు విజయ్‌ ఇమేజ్‌కి తగ్గట్టు మలుస్తూ, విజయ్‌ అభిమానులకి కావాల్సిన అంశాలని కథ వీడి బయటకి పోకుండా జోడిస్తూ 'ఐ యామ్‌ వెయిటింగ్‌' అనే విజయ్‌ మార్కు ఇంటర్వెల్‌ వరకు మాంఛి పట్టు చూపించిన మురుగదాస్‌ ఆ తర్వాత పట్టు సడలి విజయ్‌ స్టార్‌డమ్‌ ఊబిలో పడిపోయాడు. హీరోయిజం ఎలివేట్‌ చేసే పనిలో అనవసరమైన 'టైమ్‌ ఫ్రేమ్స్‌'లో స్క్రీన్‌ప్లేని ఇరికించి తన ఊహాశక్తికి, తన సృజనాత్మకతకి తానే అవధులు పెట్టేసుకున్నాడు. ఫస్ట్‌ హాఫ్‌లో పాయింట్‌లోంచి బయటకి రాకుండా పండిన హీరోయిజం సెకండ్‌ హాఫ్‌కి వచ్చేసరికి డ్రైవింగ్‌ ఫ్యాక్టర్‌గా మారిపోయి అసలు పాయింట్‌ 'అలో మురుగా' అంటూ మరుగున పడిపోయింది.

కథలోకి వెళితే… పెద్ద కంపెనీకి సిఈఓ అయిన సుందర్‌ (విజయ్‌) ఓటు వేయడం కోసమే పనిగట్టుకుని ప్రైవేట్‌ జెట్‌లో ఇండియాకి వస్తాడు. కానీ అప్పటికే తన ఓటు ఎవరో వేసేసారని తెలిసి షాకవుతాడు. తన పలుకుబడి, డబ్బు ఉపయోగించి మళ్లీ ఓటు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయించుకుంటాడు. కానీ ఇంతలో అతని ఈగో హర్ట్‌ చేసాడో పొలిటీషియన్‌ (రాధారవి). దాంతో దొంగ ఓట్లుగా పోయిన ఓట్ల కోసం జనం తిరగబడేలా రెచ్చగొడతాడు. అది కాస్తా ఎన్నికలే రద్దయ్యే పరిస్థితి తీసుకొస్తుంది. సుందర్‌ని రాజకీయ నాయకులు మరింత రెచ్చగొట్టడంతో ఎన్నికల బరిలో దిగుతాడు. అంతిమంగా ఎలా గెలుస్తాడనేది మిగతా స్టోరీ.

ఫలానా కంపెనీ సిఈఓ వస్తున్నాడనగానే ఇక్కడున్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీల సిఈఓలు వణికిపోవడం, అవసరానికి మించిన హంగామాతో కథని మొదలు పెట్టిన విధానం చూసి మురుగదాస్‌ ఇంకా 'స్పైడర్‌' మూడ్‌లో వున్నాడేమో అనే అనుమానం వచ్చినా కాసేపటికే కుదురుకుని 'సర్కార్‌'ని తనదైన శైలిలో ఉరకలు వేయిస్తాడు. ఓటు పోవడం అనే చిన్న పాయింట్‌తో మొదలు పెట్టి కొంచెం కొంచెంగా దాని తీవ్రతని పెంచుతూ, హీరో ఆలోచనలని నెమ్మదిగా పెద్ద అంశాల వైపుకి మలచిన విధానంలో ఒకప్పటి మురుగదాస్‌ కనిపిస్తాడు.

సైడ్‌ ట్రాక్‌ అవడానికి కీర్తి సురేష్‌, యోగిబాబు పాత్రలు వున్నా డీవియేట్‌ అవకుండా పాయింట్‌కి స్టిక్‌ అయ్యాడు. అయితే విజయ్‌ హీరో కనుక మాండెటరీ సాంగ్స్‌ కోసం కొన్నిసార్లు రాజీ పడక తప్పలేదు. హీరోయిజం ఎలివేట్‌ చేయడం కోసమని కథలో ఇమడని సన్నివేశాల జోలికి కూడా పోలేదు. ఉదాహరణకి పార్టీ ఆఫీస్‌లో ఫైట్‌ సీన్‌ కథలో భాగంగానే వస్తుంది, అలాగే విజయ్‌ ఫాన్స్‌కి కావాల్సిన హుషారుని టన్నుల్లెక్కన ఇచ్చేస్తుంది.

విజయ్‌తో మురుగదాస్‌ తీసిన గత రెండు చిత్రాల మాదిరిగానే మళ్లీ ఇంటర్వెల్‌ సీన్‌కి 'ఐ యామ్‌ వెయిటింగ్‌' డైలాగ్‌తో ఫస్ట్‌ హాఫ్‌ 'హై' ఇచ్చి ఎండ్‌ అవుతుంది. ఇక ఎలక్షన్‌ సీన్‌కి తెర లేచిన తర్వాత అటు విజయ్‌ ఇమేజ్‌ని బ్యాలెన్స్‌ చేస్తూ, ఇటు వాస్తవికతని విడిచి పెట్టకుండా ఎలా డీల్‌ చేయాలనే దగ్గరే మురుగదాస్‌కి పరీక్ష ఎదురయింది. స్టోరీ డ్రైవ్‌ చేయాలని భావిస్తే స్క్రీన్‌ప్లే మరోలా వుండే వీలుండేది. కానీ స్టార్‌ డ్రైవ్‌ చేయాలని డిసైడ్‌ అయి స్టీరింగ్‌ విజయ్‌ చేతిలో పెట్టేయడంతో 'సర్కార్‌' ట్రాక్‌ తప్పింది. పదిహేను రోజుల్లో రీ ఎలక్షన్‌ అనడంతోనే చిక్కొచ్చి పడింది.

పదిహేను రోజుల్లో ఒక స్థానంలో పోటీ చేయడమే కష్టమనుకుంటే, అన్ని స్థానాల్లోను అభ్యర్థులని నిలబెట్టడం, ఒక్క స్పీచ్‌తో జనం అంతా తనవైపుకి తిరిగిపోవడం, అంతలావు రాజకీయ నాయకులు కూడా దద్దమ్మల మాదిరిగా అతడికి బెదిరిపోవడం అస్సలు నమ్మశక్యంగా అనిపించదు. విజయ్‌ అభిమానులకి అతనికి ఏదైనా సాధ్యమనిపించవచ్చు కానీ సగటు ప్రేక్షకులకి మాత్రం నేల విడిచి సాము చేస్తోన్న సంగతి క్లియర్‌గా కనిపిస్తూనే వుంటుంది.

పవర్‌ఫుల్‌ పొలిటీషియన్స్‌ తలచుకుంటే ఏమి చేయగలరనేది 'ఒకే ఒక్కడు'లాంటి ఉదాహరణలు వున్నా, డబ్బుంటే హీరో ఏదైనా చేసేయగలడు అన్నట్టు వాస్తవాతీతంగా చూపించడం ఆకట్టుకోదు. హీరోని మట్టుబెట్టాలని భావించిన ప్రతిసారీ ఆకు రౌడీలు రాడ్లు పట్టుకుని వచ్చి తన్నులు తినడానికి లైన్లో నించోవడమే తప్ప హీరోని సవాల్‌ చేసే 'సర్కార్‌' ఏదీ? చివరకు మెయిన్‌ విలన్‌గా చివర్లో ఎంట్రీ ఇచ్చే వరలక్ష్మి శరత్‌కుమార్‌ పాత్ర కూడా అంతకుముందంతా ఫోన్లో 'హీరో వర్‌షిప్‌' చేయడంతోనే సరిపెడుతుంది.

'వాడి జోలికి వెళ్లద్దు, వాడినేమీ అనవద్దు' అంటూ మిగతా వాళ్లకంటే హీరో ఆ క్యారెక్టరే ఎక్కువ బిల్డప్‌ ఇస్తుంది. అయితే గాడి తప్పిన సర్కార్‌ కాస్తయినా మళ్లీ పద్ధతిగా నడిచిందంటే వరలక్ష్మి 'పొలిటీషియన్‌' అవతారంలో ఎంటరయ్యాకే. విజయ్‌ని సవాల్‌ చేసే సమవుజ్జీ వుండి, పదిహేను రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలిచేయడం లాంటి అతిశయాలు లేకుండా వుంటే 'సర్కార్‌' చాలా బెటర్‌గా వుండేది. ప్రశ్నించాలనే 'సుందర్‌' ఐడియాలజీలో జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ కనిపిస్తే విచిత్రం కాదు. ఈ కథ పవన్‌కి అయితే ఇంకా బాగా సూట్‌ అయ్యేదేమో కూడా.

నటీనటుల విషయానికి వస్తే విజయ్‌ మార్కు మేనరిజమ్స్‌ నచ్చే వారికి అతని శైలి నచ్చాలి. అతడితో పెద్దగా పరిచయం లేని వారికి అవి విచిత్రంగా తోచే అవకాశముంది. కీర్తి సురేష్‌ కేవలం హీరోయిన్‌ స్లాట్‌ ఫిల్‌ చేయడానికే వుంది. వరలక్ష్మి శరత్‌కుమార్‌ నటన బాగానే వుంది. మిగతా వాళ్లలో రాధా రవి నటన మెప్పిస్తుంది. పాటలు అవసరం లేదని భావించడం వలనో ఏమో రహమాన్‌ వీలుంటే ఎడిట్‌ చేసేసుకునే పాటలు చేసిచ్చాడు. నేపథ్య సంగీతంపై తన ముద్ర వేసాడు. సాంకేతికంగా ఉన్నతంగా వున్న సర్కార్‌ కంటెంట్‌ పరంగా కూడా సగం మార్కులు ఘనంగా స్కోర్‌ చేసి ఆ తర్వాత హాండ్సప్‌ అంటూ సరండర్‌ అయిపోయింది.

బాటమ్‌ లైన్‌: వీక్‌ 'సర్కార్‌'!
– గణేష్‌ రావూరి

తమ్ముడి రాజకీయం కోసం చిరు సహకారం.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్