యాక్సిడెంట్ లో మరణించిన రవితేజ తమ్ముడు భరత్ వైవాహిక జీవితం గురించి మీడియాలో కథనాలు వస్తున్నాయి. భరత్ నాలుగు సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడని, అయితే మూడేళ్లుగా భార్యభర్తలు వేర్వేరుగా ఉంటున్నారని మీడియా చెబుతోంది.
భరత్ భార్య అమెరికాలో ఉంటోందని కూడా మీడియా వర్గాలు సమాచారం ఇస్తున్నాయి. మరి యాభై ఏళ్ల వయసున్న భరత్ నాలుగేళ్ల కిందట వివాహం చేసుకోవడం ఏమిటి? అంటే.. బహుశా ఇది రెండో వివాహం అని అనుకోవాల్సి వస్తోంది.
భరత్ వివాహాన్ని చేసింది తను.. అని ఒకసారి రచయిత, దర్శకుడు, నటుడు పోసాని చెప్పాడు. ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో పోసాని ఆ విషయాన్ని కూలంకషంగా వివరించాడు.
భరత్ పెళ్లి తన అవకాశాలకు ఎసరు పెట్టిందన్న విషయాన్ని కూడా పోసాని వివరించాడు. మరి ఆ కథేంటంటే.. ఇప్పుడు కాదు, పరుచూరి బ్రదర్స్ వద్ద పోసాని అసిస్టెంట్ గా ఉన్న రోజుల్లో.. రచయితగా పరుచూరి కాంపౌండ్ లోనే ఒక రూమ్లో వున్న రోజుల్లో.. భరత్, ఒక అమ్మాయిని తీసుకుని వచ్చి పోసాని రూమ్ తలుపు తట్టాడట.
హైదరాబాద్ నుంచి వాళ్లిద్దరూ పారిపోయి చెన్నై వచ్చారట. ఎక్కడ ఉండాలో తెలీక ఫ్రెండ్స్ ద్వారా పోసానిని సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అప్పుడు పోసాని పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ గా వాళ్లిచ్చిన రూమ్ లో తలదాచుకునే వాడట.
రవితేజ అప్పటికి ఇంకా హీరో కాలేదు, చిన్నాచితక వేషాలు వేసుకునేవాడు. ఆ క్రమంలో రవితేజ తమ్ముడు ఒక అమ్మాయిని ప్రేమించి, పెళ్లి చేసుకోవడానికి ఒక రాత్రికి ఆశ్రయం అడిగితే.. పోసాని కాదనలేకపోయాడట.
తన రూమ్ వాళ్లకు ఇచ్చి తను వేరే ఆఫీసుకు వెళ్లి పడుకున్నాడట. ఆ విషయం పరుచూరి బ్రదర్స్ ఇంటిలోని ఆడవాళ్లకు తెలిసి.. రూమ్ లో అమ్మాయిలు ఉంటున్నారనే అభియోగంతో పోసానిని పరుచూరి కాంపౌండ్ నుంచి బయటకు పంపించేశారట.. ఈ విషయాలన్నింటినీ పోసానే చెప్పారు.
ఆ విధంగా భరత్ ప్రేమ వ్యవహారం తనకు పరుచూరి బ్రదర్స్ వద్ద ఉపాధిని లేకుండా చేసిందని పోసాని వివరించారు. జరిగిన విషయాన్ని అర్థం చేసుకోకుండా పరుచూరి సోదరులు తనను పంపించి వేశారని పోసాని చెప్పాడొకసారి.
ఆ తర్వాత తను ఎప్పుడూ పరుచూరి ఇంటి మెట్లు ఎక్కలేదని తనదైన శైలిలో చెప్పారు పోసాని. అదే సమయంలో భరత్ పెళ్లి గురించి కొన్ని కామెంట్లు చేశాడు పోసాని.
భరత్ ఒక డబ్బున్న ఇంటి అమ్మాయిని తీసుకొచ్చాడని, అతడి పెళ్లిని తామే చేశారని.. వాళ్లు కలిసున్నారా, విడిపోయారా అనేది అప్రస్తుతం అని కొన్నేళ్ల కిందట ఆ ఇంటర్వ్యూలో పోసాని అన్నాడు. అంటే పోసాని చెప్పిన దాన్ని బట్టి.. భరత్ ది ప్రేమ వివాహం అని విడిపోయారని అనుకోవాల్సి వస్తోంది.
మరి నాలుగేళ్ల కిందటి వివాహం సంగతేంటో మాత్రం క్లారిటీ రావడం లేదు. రవితేజ కుటుంబీకులు తమ వ్యక్తిగత వ్యవహారాలను, కుటుంబాన్ని మీడియాకు దూరంగా ఉంచుతూ రావడంతో వీరి వివరాలు సామాన్య ప్రేక్షకులకు అర్థం కానట్టుగానే ఉంటున్నాయి.