క్రికెట్ అంటే ఆ కిక్కే వేరప్పా. అది కిక్కు కాదు.. పిచ్చి.. అని ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిరూపించింది. దేశంలోనే అతి పెద్ద జూద క్రీడగా ఈ 'జెంటిల్మెన్' గేమ్‌కి పేరు వచ్చిందంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు. కోట్లు గుమ్మరించి ఆటగాళ్ళని కొనుగోలు చేసి, ఆట షురూ చేసి, ఫిక్సింగ్‌తో ఆటను భ్రష్టుపట్టించి.. అబ్బో, ఈ 'డర్టీ గేమ్' గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
క్రికెట్ నుంచి అవినీతిని దూరం చేయాలని, ఇండియన్ క్రికెట్లో ప్రక్షాళన తప్పదనీ సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పాక, బీసీసీఐ షాక్‌కి గురయ్యింది. లోథా కమిటీని నియమించి, క్రికెట్ ప్రక్షాళనకు తీసుకోవాల్సిన చర్యల గురించి సుప్రీంకోర్టు పర్యవేక్షించింది. అయితే లోథా కమిటీ సూచనల్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది. దాంతో, సర్వోన్నత న్యాయస్థానం బీసీసీఐపై ఆగ్రహం వ్యక్తం చేయాల్సి వచ్చింది. ఇదీ కథ.
కానీ, 'నా దారి అడ్డదారి..' అంటోన్న బీసీసీఐ, ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టుతో జరుగుతున్న పోటీల్ని అటకెక్కించేందుకు రంగం సిద్ధం చేసింది. కారణం, లోథా కమిటీయేనట. లోథా కమిటీ సూచనల నేపథ్యంలో బ్యాంక్ అకౌంట్లు క్లోజ్ అయిపోయాయనీ, క్రికెట్ పోటీల నిర్వహణ అసాధ్యమనీ బీసీసీఐ వింత వాదనను తెరపైకి తెచ్చింది. మీడియాకి ఈ విషయమై లీకులు అందించింది. అంతే, లోథా కమిటీ మళ్ళీ రంగంలోకి దిగి, ఇదంతా 'ఫేక్ వ్యవహారం' అని కొట్టి పారేసింది.
'క్రికెట్లో ప్రక్షాళన అంటే, క్రికెట్‌ని రద్దు చేయమని కాదు.. మా సూచనల వల్ల ఏ బ్యాంక్ అకౌంట్ కూడా క్లోజ్ అవలేదు. ఎలాంటి ఇబ్బందీ లేకుండా న్యూజిలాండ్‌తో పోటీల్ని బీసీసీఐ కొనసాగించవచ్చు..' అంటూ లోథా కమిటీ స్పష్టం చేసింది. దాంతో, బీసీసీఐ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. అయినాసరే, బుకాయిస్తూనే వుంది.
బీసీసీఐ అంటే, ప్రపంచ క్రికెట్లోనే అత్యంత ధనిక బోర్డుగా చెప్పుకోవచ్చు. కోట్లు మగ్గిపోతున్నాయి.. కోట్లు అవినీతిమయమవుతున్నాయి.. అవినీతి రాజకీయాలు భారత క్రికెట్‌ని సర్వనాశనం చేసేస్తున్నాయి. ఇంతలా 'చెడిపోయిన' బీసీసీఐని ప్రక్షాళన చెయ్యమంటే, బీసీసీఐ పెద్దలకు ఎందుకు కోపం వస్తోందో ఎవరికీ అర్థం కావడంలేదు.
ముందే చెప్పుకున్నాం కదా.. క్రికెట్ అంటే పిచ్చి అని.. ఆ పిచ్చి అభిమానులకి తగ్గితే తప్ప, బీసీసీఐకి పట్టిన డబ్బు పిచ్చిని వదిలించడం సాధ్యం కాదేమో.!