ఉత్కంఠ తొలగింది. బ్రెగ్జిట్ ప్రపంచాన్ని ముంచేసింది. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలగాలనుకున్న బ్రిటన్‌కి మద్దతుగా బ్రిటన్ పౌరులు తీర్పునిచ్చారు. నిన్న జరిగిన ఓటింగ్ ఫలితాలు నేడు వెల్లడయ్యాయి. బ్రెగ్జిట్‌కి అనుకూలంగా 52 శాతం ఓట్లు పోలవగా, వ్యతిరేకంగా 48 శాతం ఓట్లు పోలయ్యాయి. దాంతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడం ఖాయమైపోయింది.
వద్దు మొర్రో.. అంటూ ప్రపంచమంతా మొత్తుకున్నది, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలిగితే అది ప్రపంచ ఆర్థిక రంగానికి పెను సవాల్ విసురుతుందనే. భారతదేశం సహా అన్ని దేశాలూ ఈ ఎఫెక్ట్‌ని చవిచూడనున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఒక్క రోజే వంద పైసలకు పడిపోయింది. బ్రిటన్ కరెన్సీ పౌండ్ ధర అయితే 31 ఏళ్ళ కనిష్ట స్థాయికి పడిపోయింది. ఏడు శాతానికి పైగా నష్టాలు రావడంతో జపాన్ మార్కెట్లను కాస్సేపు తాత్కాలికంగా మూసివేశారు.
మనదేశంలో పరిస్థితు చేజారకుండా ఆర్బిఐ రంగంలోకి దిగింది. సమస్య ఏర్పడినా అది తాత్కాలికమేనంటూ ప్రభుత్వం తరఫున ప్రకటనలు వస్తున్నా, మార్కెట్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్టాక్ మార్కెట్లు దారుణంగా పతనమయ్యాయి.
ఇదిలా వుంటే, దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లుందనీ, దేశ ఆర్థిక వ్యవస్థ ఇకపై పరుగులు తీస్తుందనీ, ప్రపంచ దేశాలకూ బ్రిటన్ కారణంగా వచ్చే సమస్యలు ముందు ముందు ఏమీ వుండవనీ 'బ్రెగ్జిట్' మద్దతుదారులు నినదిస్తున్నారు. అదే సమయంలో, విపక్షాలు బ్రిటన్ ప్రధాని జేమ్స్ కామరూన్ రాజీనామాకి డిమాండ్ చేస్తుండడం గమనార్హం.