అమీర్‌ఖాన్‌ బహుశా కుమిలిపోతూ ఉంటాడేమో!

కేవలం రెండు వారాల వ్యవధిలో 250 కోట్ల రూపాయల కలెక్షన్లు అంటే.. బాక్సాఫీసులో డబ్బులు వరదలా పారుతున్నట్లే లెక్క. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా.. రంజాన్‌ కానుకగా వచ్చిన బజ్‌రంగీ బాయీజాన్‌ చిత్రం.. ఎంతటి అద్భుతమైన…

కేవలం రెండు వారాల వ్యవధిలో 250 కోట్ల రూపాయల కలెక్షన్లు అంటే.. బాక్సాఫీసులో డబ్బులు వరదలా పారుతున్నట్లే లెక్క. సల్మాన్‌ ఖాన్‌ హీరోగా.. రంజాన్‌ కానుకగా వచ్చిన బజ్‌రంగీ బాయీజాన్‌ చిత్రం.. ఎంతటి అద్భుతమైన విజయాన్ని సాధించిందో ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇది బాలీవుడ్‌ సాధించిన విజయమే అయినప్పటికీ.. తెలుగువాళ్లు కూడ ఈ విజయం గురించి గర్వంగా ఫీల్‌ కావడానికి ఒక కారణం ఉంది. తెలుగు రచయిత విజయేంద్రప్రసాద్‌ దీనికి కథ అందించడమే ఆ కారణం.

కాకపోతే.. ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే.. ఈ చిత్రం కథ ముందుగా అమీర్‌ఖాన్‌ వద్దకు వెళ్లింది. ఆయన కథ సాంతం విన్న తర్వాత.. ఎందుకో చేయడానికి అంగీకరించలేదు. ఆ తర్వాతే సల్మాన్‌కు వినిపించడం జరిగింది. ఆతర్వాత జరిగిందేమిటో అందరికీ తెలుసు. అందుకే ఈ చిత్రానికి సంబంధించి ఇప్పుడు అమీర్‌ఖాన్‌ కుమిలిపోతూ ఉంటాడేమో అనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది. 

దీనికి సంబంధించిన కథా కమామీషూ.. విజయేంద్ర ప్రసాద్‌ ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. బాలీవుడ్‌లో విలక్షణమైన కథాంశంతో ఉన్న మంచి సందేశాత్మక కమర్షియల్‌ చిత్రాలు చేయడంలో అమీర్‌ఖాన్‌ ముందుంటాడని అందరికీ తెలుసు. ఆయన అలాంటివే బ్లాక్‌బస్టర్‌లు పలు చిత్రాలు చేశారు కూడా! అదే సల్మాన్‌ఖాన్‌ అయితే.. రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలకు పెట్టింది పేరు. 

ఈ ఉద్దేశంతోనే ఈ బజ్‌రంగీ బాయీజాన్‌ చిత్ర కథను తయారుచేసినప్పుడు.. విజయేంద్రప్రసాద్‌ తొలుత అమీర్‌ఖాన్‌ను సంప్రదించారట. ఆయన ఎందుకో కథతో కనెక్ట్‌ కాలేకపోయారని ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సల్మాన్‌ఖాన్‌కు కథ చెప్పినప్పుడు.. ఆయన ఉద్వేగంతో కదిలిపోయారని, వెంటనే చేయడానికి ఒప్పుకున్నారని కూడా విజయేంద్ర చెప్పారు. ఫలితం ఎలా ఉన్నదో ఇవాళ అందరూ చూస్తున్నారు. 

తనకు వచ్చిన, తాను చేజార్చుకున్న ఆఫర్‌ ఇంత భారీ బ్లాక్‌ బస్టర్‌ అయిపోయిదే.. అని అమీర్‌ఖాన్‌ బహుశా కుమిలిపోతూ ఉంటాడే అని జనం అనుకుంటున్నారు. బాలీవుడ్‌ మీద గుత్తాధిపత్యం నిరూపించుకోవడానికి ఈ ఖాన్‌ల మధ్య ఉన్న కాంపిటీషన్‌ గురించి కూడా అందరికీ తెలిసిందే కదా!!