ఎమ్బీయస్‌: యూరోప్‌ గాథలు- టేల్‌ ఆఫ్‌ టు సిటీస్‌- 1

ఫ్రెంచ్‌ విప్లవం జరిగిన 80 ఏళ్ల తర్వాత దాని నేపథ్యంలో చార్లెస్‌ డికెన్సు ''ద టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌'' నవల రాసి పాఠకులకు అందించారు. కథ లండన్‌, పారిస్‌ నగరాల మధ్య నడుస్తుంది.…

ఫ్రెంచ్‌ విప్లవం జరిగిన 80 ఏళ్ల తర్వాత దాని నేపథ్యంలో చార్లెస్‌ డికెన్సు ''ద టేల్‌ ఆఫ్‌ టూ సిటీస్‌'' నవల రాసి పాఠకులకు అందించారు. కథ లండన్‌, పారిస్‌ నగరాల మధ్య నడుస్తుంది. విప్లవానికి చాలా ముందుగానే కథ ప్రారంభమై, విప్లవంలో గిల్లెటిన్‌ మారణకాండతో ముగుస్తుంది. మధ్యలో ముక్కోణపు ప్రేమ గాథ, జమీందార్ల దౌష్ట్యం, దాన్ని ఎదిరించినవారి కష్టాలు, హద్దులు మీరిన విప్లవకారుల ప్రతీకారం… అన్నీ వస్తాయి. నవల ప్రారంభవాక్యాలు జగత్ప్రసిద్ధమైనవి. ''ఆ రోజులు ఉత్తమమైనవి, అధమమైనవి కూడా. అది విజ్ఞానం వర్ధిల్లిన యుగం, మూర్ఖత్వం ప్రబలిన యుగం, వెలుతురు వెల్లివిరిసిన ఋతువది, గాఢాంధకారం కమ్ముకున్న ఋతువుకూడా… అంటూ సాగుతుందది. ఇంగ్లీషులో చదివితే అద్భుతంగా వుంటుంది. 

పారిస్‌లోని బాస్టిల్‌లో 18 ఏళ్లగా ఖైదీగా మగ్గుతున్న అలెగ్జాండర్‌ మేనెట్‌ అనే ఫ్రెంచ్‌ వైద్యుణ్ని విడిపించడానికి 1775లో లండన్‌వాసి అయిన జార్విస్‌ లారీ అనే బ్యాంకు మేనేజరు లండన్‌ నుంచి చేసే ప్రయత్నంతో నవల ప్రారంభమైంది. అతను లండన్‌ నుంచి డోవర్‌ (80 మైళ్లుంటుంది) వచ్చి అక్కడ నివసిస్తున్న మేనెట్‌ కూతురు లూసీ, ఆమె గవర్నెస్‌ మిస్‌ ప్రాస్‌ను కలిశాడు. అప్పటిదాకా తన తండ్రి చనిపోయాడని లూసీ అనుకుంటోంది. వాళ్లను వెంటపెట్టుకుని జార్విస్‌ డోవర్‌ నుంచి పారిస్‌కి (280 మైళ్లుంటుంది) వెళ్లాడు. జమీందారుల దుర్మార్గానికి బలై జైలు పాలైన మేనెట్‌ ఒక వైద్యుడు. ఆ జమీందారు సోదరుల్లో చిన్నవాడు  రైతు కుటుంబంలోని ఒక అమ్మాయిపై మనసు పడి, ఆమెను ఎత్తుకుపోయి బలవంతంగా చెరిచాడు. వైద్యుడైన మేనెట్‌ ఆ అమ్మాయిని కాపాడడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. ఆమె చనిపోయింది. జమీందారు ఆ అమ్మాయి భర్తను పిలిచి బండచాకిరీ చేయించి చంపేశాడు. సంగతి తెలిసి అమ్మాయి తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఆమె సోదరుడు జమీందారుపై పగ తీర్చుకోబోయి కడతేరాడు. కుటుంబంలో మిగిలిన చిన్న కూతురు ఎటో పారిపోయింది. తన తమ్ముడు చేసే అక్రమాలకు పెద్ద జమీందారు మద్దతు యిచ్చాడు. ఈ అన్యాయాలన్నీ చూసి సహించలేకపోయిన మేనెట్‌ వారిపై అధికారులకు ఫిర్యాదు చేయబోయాడు. జమీందారు సోదరులు లంచం యిచ్చి అతని నోరు మూయించబోయారు. కానీ అతను అంగీకరించలేదు. దాంతో తప్పుడు కేసు బనాయించి, జైల్లో పెట్టించారు. మేనెట్‌ను దాదాపు చీకటిగా వుండే గదిలో ఒక్కణ్నీ వుంచి అతని చేత చెప్పులు కుట్టించేవారు.

ఇన్నాళ్లకు మేనెట్‌ను ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రహస్యోద్యమం నడుపుతున్న ఎర్నెస్ట్‌ డిఫార్జ్‌, అతని భార్య థెరిసా రహస్యంగా జైలు నుంచి విడిపించి తాము నడుపుతున్న మద్యశాలలో ఆశ్రయం కల్పించారు. 18 ఏళ్లు జైల్లో అలా గడపడంతో విడుదల తర్వాత కూడా మేనెట్‌ మనుషులతో కలవలేకపోయేవాడు. మౌనంగా ఒంటరిగా చిరుచీకట్లో చెప్పులు కుడుతూ వుండేవాడు. ఎవరితో మాట్లాడేవాడు కాడు. ఒక రకంగా పిచ్చివాడై పోయాడు. కూతుర్ని సైతం గుర్తు పట్టలేదు. చివరకు తన భార్య పోలికలు ఆమెలో కనబడి తల వూపాడు. అతన్ని తీసుకుని ఆమె లండన్‌కు తీసుకుని వచ్చేసింది. క్రమేపీ అతన్ని మామూలు మనిషిగా చేయడానికి ప్రయత్నిస్తోంది. 

మేనెట్‌ జైల్లోంచి బయటకు వచ్చి ఐదేళ్లు గడిచాక 1780లో చార్లెస్‌ డార్నే అనే యువకుడిపై రాజద్రోహం అభియోగంపై లండన్‌ కోర్టులో కేసు నడుస్తోంది. ఈ డార్నే అనే యువకుడు ఎవర్‌మాండ్‌ ఫ్రెంచి జమీందారీ కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి చనిపోయాడు. పినతండ్రి బతికి వున్నాడు. తండ్రి, పినతండ్రి చేసే అకృత్యాలపై అతనికి అసహ్యం పుట్టింది. మానుకోమని పినతండ్రితో వాదించాడు. దానికి సమాధానంగా అతను – ''తొక్కి పెట్టి వుంచడమొక్కటే పదికాలాల పాటు నిలిచే సిద్ధాంతం. బానిసత్వం, గడగడలాడించే భయం యీ రెండే యీ కుక్కల్ని కొరడాకు లొంగి వుంచేట్లు చేస్తుంది.'' అని వాదించాడు. అతన్ని మార్చలేక, తాను సొంతంగా ఏమీ చేయలేక పరిస్థితులతో రాజీ పడలేని స్థితిలో ఫ్రాన్సును అసహ్యించుకుని పారిస్‌ వదలి వచ్చేశాడు. తన యింటిపేరును వదిలేసి, తన తల్లి పుట్టింటిపేరును ఇంగ్లీషు మోడల్లో డార్నేగా మార్చేసి పెట్టుకున్నాడు. అటువంటివాడిపై ఉత్తర అమెరికాలో బ్రిటిషు సైన్యాల గురించి సమాచారాన్ని ఫ్రెంచ్‌వారికి అందిస్తున్నాడని కేసు పెట్టారు. అతనలా చేస్తూండగా కంటితో చూశామని చెప్పే జాన్‌ బర్సాడ్‌, రోజర్‌ క్లయ్‌ అనే సాక్షులు యిద్దరున్నారు. డార్నే తరఫున డిఫెన్సు న్యాయవాదిగా వున్న స్ట్రయివర్‌ 'మీరు చూసినది డార్నేయే అని ఎలా చెప్పగలరు?' అని అడిగాడు. 'ఎంతమందిలో వున్నా అతన్ని సులభంగా గుర్తు పట్టగలను' అన్నారు యిద్దరూ. 'ఓహో, అలాగా ఆ మూలగా వున్న నా భాగస్వామి సిడ్నీ కార్టన్‌ అనే లాయరును ఓ సారి చూడండి' అన్నాడు స్ట్రయివర్‌. చూస్తే అతను అచ్చు గుద్దినట్లు డార్నే లాగానే వున్నాడు. సాక్షులు గందరగోళ పడ్డారు. 'మీరు చూసినది అతన్నేమో, యితను కాదేమో' అన్నాడు డిఫెన్సు న్యాయవాది. కేసు కొట్టేశారు. డార్నే విడుదలయ్యాడు.

కోర్టు నుంచి విడుదలైన డార్నేకు మేనెట్‌ కూతురు లూసీకి పరిచయమైంది. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. సిడ్నీ కార్టన్‌ కూడా లూసీని ప్రేమించాడు. నీ కోసం ఏ త్యాగానికైనా సిద్ధం అని చెప్పినా ఆమె స్పందించలేదు. ఇక అతను తప్పుకున్నాడు. క్రమంగా మనుషుల్లో పడిన మేనెట్‌ డార్నేతో  తన కూతురి పెళ్లికి సమ్మతించాడు. పెళ్లి రోజు పొద్దున్న డార్నే తను ఫ్రెంచివాడిననీ, ఎవర్‌మాండ్‌ కుటుంబానికి చెందిన వాడినని చెప్పేశాడు. మేనెట్‌ నిర్ఘాంతపోయినా తన కూతురి సౌఖ్యం కోసం పెళ్లి చేసేశాడు. వాళ్లు హనీమూన్‌కి వెళ్లగానే మానసిక ఆందోళన తట్టుకోలేక తిరిగి చెప్పులు కుట్టే పనిలో పడ్డాడు. వాళ్లు తిరిగి వచ్చేసరికి సర్దుకున్నాడు. ఈ సంగతులు కూతురికి చెప్పవద్దని అల్లుణ్ని కోరాడు.

పారిస్‌లో డార్నే పినతండ్రి మార్క్విస్‌ ఆఫ్‌ ఎవర్‌మాండ్‌ దుర్మార్గాన్ని నిరూపించే ఒక సంఘటన జరిగింది. కిక్కిరిసిన పేదవాడలలోంచి అతను తన గుఱ్ఱాల బండిని వేగంగా, నిర్లక్ష్యంగా తోలిస్తూ వుంటే గాస్పర్డ్‌ అనే ఒక రైతు కొడుకు, చిన్నపిల్లవాడు బండి చక్రాల కింద పడి చచ్చిపోయాడు. అయినా మార్క్విస్‌ బండి ఆపలేదు. పోనీయమన్నాడు. గాస్పర్డ్‌ వచ్చి అరుస్తూంటే ఒక నాణెం తీసి అతని మీద విసిరేశాడు. అతన్ని డిఫార్జ్‌ ఓదార్చాడు. మార్క్విస్‌ వెళ్లిపోతూ వుంటే గాస్పర్డ్‌ ఆ నాణాన్ని తిరిగి బండిలోకి విసిరేయడంతో మార్క్విస్‌ అహం దెబ్బ తింది. గాస్పర్డ్‌ ఆ బండి కింద రహస్యంగా దాక్కుని మార్క్విస్‌ భవంతి లోపలకి వెళ్లిపోగలిగాడు. రాత్రి బయటకు వచ్చి నిద్రపోతున్న మార్క్విస్‌ను కత్తితో పొడిచి చంపేశాడు. మర్నాడు జమీందారు శవం చూశాక కేసు పెట్టారు. గాస్పర్డ్‌ మీదే అనుమానం, అతని కోసం గాలించి గాలించి ఏడాది తర్వాత పట్టుకుని గ్రామపు బావి గట్టు మీద ఉరితీసి చంపేశారు. అటు ఇంగ్లండులో డార్నే, లూసీలు కాపురం పెట్టారు. ఒక కొడుకు పుట్టి పోయాడు, తర్వాత కూతురు పుట్టింది. మేనెట్‌ ఆరోగ్యం బాగుపడింది. కార్టన్‌ వాళ్లకు ఫ్యామిలీఫ్రెండ్‌గా వుంటూ వస్తూ పోతూ వుండేవాడు. ఈ దశలో 1789లో ఫ్రెంచ్‌ విప్లవం వచ్చింది. (సశేషం) 

ఫోటోలు – వర్సాయిలో హోష్‌ విగ్రహం

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (అక్టోబరు 2015) 

[email protected]

Click Here For Archives