నెహ్రూకు పార్టీ యంత్రాంగాన్ని పట్టించుకునే సమయం వుండేది కాదు. అందువలన రాష్ట్ర నాయకులపై ఆధారపడేవాడు. వాళ్లు తమతమ రాష్ట్రాల్లో కాంగ్రెసు పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకునేవారు. వాళ్లు అవినీతికి పాల్పడ్డారని తెలిసినా నెహ్రూ వారిపై చర్య తీసుకోవడానికి జంకే పరిస్థితి వచ్చింది. పార్టీకి చెడ్డపేరు వచ్చి ప్రజలు ఏవగించుకునే స్థితి రాసాగింది. ఇదంతా చూశాక 1963 ఆగస్టులో నెహ్రూకు ఒక ఆలోచన వచ్చింది. రాష్ట్రాలలో, కేంద్రంలో ప్రభుత్వపదవులు అనుభవిస్తున్న నాయకులు వాటిని వదిలేసి, పార్టీలో బాధ్యతలు చేపట్టి పార్టీని పరిపుష్టం చేయాలని అన్నాడు. దానికి కామరాజ్ పథకం అని పేరు పెట్టారు. ఇది ప్రకటించగానే 300 మంది రాజీనామాలు సమర్పించారు. వారిలో నెహ్రూ కొంతమందిని ఎంచుకుని వారిని పదవుల్లోంచి తప్పించాడు. సీనియర్ కాబినెట్ మంత్రులైన మొరార్జీ దేశాయి, లాల్ బహదూర్ శాస్త్రి, ఎస్‌కె పాటిల్, జగ్జీవన్ రామ్, బెజవాడ గోపాలరెడ్డి, కెఎల్ శ్రీమాలి వాళ్లలో వున్నారు. వారితో బాటు కామరాజ్‌తో సహా ఆరుగురు ముఖ్యమంత్రులు కూడా వున్నారు. ఇంతవరకు బాగానే వుంది కానీ రాజీనామా చేసినవారికి పార్టీలో బాధ్యతలు అప్పగించేంత తీరిక నెహ్రూకి లేకపోయింది. అప్పటికే చైనా దాడి వలన కలిగిన మానసిక ఆందోళన వలన, వయసు కారణంగా అనారోగ్యపీడితుడయ్యాడు. ఈ కారణం చేత రాష్ట్ర ముఖ్యమంత్రులు బలపడి అమిత అధికారాలు చెలాయించసాగారు. ఇందిరా గాంధీ బలం పుంజుకుని 1969లో వీళ్లను అదుపు చేసేవరకూ వారి మాటే చెల్లింది. 1964 మేలో తన 75 వ ఏట నెహ్రూ చనిపోయేనాటికి కాంగ్రెసు ప్రతిష్ఠ దిగజారుతోంది.
తను మరణించాక తనకు మతపరమైన అంత్యక్రియలు జరపవద్దని నెహ్రూ తన వీలునామాలో స్పష్టంగా రాశాడు. నెహ్రూకి భగవద్గీతపై, ఉపనిషత్తులపై అపారమైన గౌరవం వుంది. ఆలోచనాపరులు, ద్రష్టలైన వారే వాటిని రాయగలరని అనేవాడు. తన బ్రీఫ్ కేసులో వాటిని పెట్టుకుని చదువుతూ వుండేవాడు. కర్మకాండపై ఆయనకు విశ్వాసం లేదు. కానీ ఆయన అనారోగ్యపీడితుడు కాగానే ఇందిరా గాంధీ, గుల్జారీలాల్ నందా కలిసి తమ యిష్టాలను రుద్దసాగారు. ఆయన పేర మృత్యుంజయ జపాలు చేయించారు. చనిపోగానే నెహ్రూ సోదరి విజయలక్ష్మీ పండిత్ అభ్యంతరాలను లెక్క చేయకుండా, నెహ్రూ వీలునామాను పట్టించుకోకుండా ఇందిర హిందూ మతాచారాల ప్రకారం తన కొడుకు సంజయ్ చేత తలకు కొరివి పెట్టించింది. ఆ విధంగా నెహ్రూ ఆదర్శాలు ఆయన శవంతో బాటు బూడిదయ్యాయి.
రాజవంశీకుల తరహాలో నెహ్రూ వంశస్తుల కుటుంబపాలనకు ఆద్యుడు నెహ్రూ అని చాలామంది అంటారు. కానీ అది నిజం కాదు. అలాటి రాజరికపు ఆలోచనలున్నది ఇందిరకు మాత్రమే. తన వారసుడిగా తన కొడుకు సంజయ్‌కు తర్ఫీదు యిచ్చింది. అతని అకాలమరణంతో రాజీవ్‌ను తెచ్చింది. నెహ్రూ ఇందిరను తన వారసురాలిగా ఎన్నడూ పేర్కొనలేదు. నెహ్రూ తర్వాత ప్రధానమంత్రి అయిన లాల్ బహదూర్ శాస్త్రి తనకు మంత్రిపదవి ఆఫర్ చేసినప్పుడు ఇందిర తిరస్కరించింది. 'నెహ్రూ ఆదర్శాలు కొనసాగుతున్నాయన్న సందేశం ప్రజలకు వెళ్లాలంటే నా కాబినెట్‌లో ఎవరో ఒకరు నెహ్రూ కుటుంబీకులు వుండకపోతే బాగుండదు. నువ్వు తీసుకోకపోతే విజయలక్ష్మీ పండిత్‌కు యిస్తాను' అన్నాడు శాస్త్రి. మేనత్తంటే అస్సలు పడని ఇందిర ఆమెకు రాకుండా చేయడానికి మంత్రి పదవి స్వీకరించింది. అది కూడా ముఖ్యమైన పదవి ఏమీ కాదు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్‌కాస్టింగ్ వంటి ప్రాధాన్యత లేని శాఖ! కామరాజ్‌తో లాల్ బహదూర్ ప్రదర్శించిన రాజకీయ నిపుణత గమనిస్తే తెలుస్తుంది – ఆయన ఎక్కువకాలం బతికి వుంటే ఇందిర ప్రాధాన్యతను క్రమంగా తగ్గించేసేవాడు. కానీ ఆయన 19 నెలల తర్వాత ఆకస్మికంగా మరణించడంతో విధి ఇందిరకు అవకాశం యిచ్చింది. శాస్త్రి స్థానంలో మళ్లీ ప్రధాని పదవికై పోటీ మొదలైంది. నెహ్రూ పోగానే ఆ పదవి ఆశించిన మొరార్జీ యీ సారి పోటీలోకి దిగి తీరతానన్నాడు. అలాటి మొండివాడు వస్తే తమకు కష్టమని భయపడిన సిండికేట్ 1964లో అడ్డుపడినట్లే, ఏడాదిన్నర తర్వాత మళ్లీ అడ్డుపడ్డారు. బలమైన అభ్యర్థి ఎవరున్నా కష్టమేననుకుని తమ చేతిలో కీలుబొమ్మలా వుంటుందనుకుని అప్పటిదాకా 'మాటలు రాని ఆటబొమ్మ'గా పేరుబడిన ఇందిరను తెచ్చి సింహాసనంపై కూర్చోబెట్టారు. ఆమెను కొన్నేళ్లు అలాగే ఆడించారు కూడా. అయితే కొంతకాలానికి ఆమె ఎవరూ వూహించని రీతిగా బలం పుంజుకుని యీ సిండికేట్ నాయకులందరినీ మట్టి కరిపించి దేశం మొత్తంలో బలమైన నాయకురాలిగా ఎదిగింది. తండ్రి కున్న ఆదర్శాల భారం లేకపోవడంతో నియంతగా మారింది. ఆ పరిణామక్రమం యిప్పుడు చెప్పుకోబోతున్నాం.
నెహ్రూ బతికి వుండగానే అడిగారు ''మీ వారసులు ఎవరు?'' అని. 1962 అక్టోబరులో అనూహ్యంగా చైనా దండయాత్ర చేయడం ఆయనను కృంగదీసింది. ఆ తర్వాత ఆరోగ్యం కూడా దెబ్బ తిని ఏడాదిన్నరలో పోయాడు. ఆ దశలో యీ ప్రశ్న వేశారు. ''నేను యిప్పట్లో పోను'' అని నవ్వుతూ జవాబిచ్చి ''నేను ఎవరి పేరైనా చెప్పానంటే వాళ్లు కాకుండా మిగతావాళ్లందరూ సర్వయత్నాలు చేస్తారు.'' అన్నాడు. నెహ్రూ మరణం తర్వాత మొరార్జీ దేశాయి, లాల్ బహదూర్ శాస్త్రి ఆ స్థానానికై పోటీ పడ్డారు. మొరార్జీ అతి సమర్థుడైన మంత్రి. క్రమశిక్షణ, తెలివితేటలు అన్నీ వున్నవాడు. నెహ్రూ కాబినెట్‌లో ఆర్థికశాఖను అతి ప్రతిభావంతంగా నిర్వహించాడు. కానీ సర్దార్ పటేల్ లాగానే అతను కూడా సోషలిజానికి వ్యతిరేకి అని, వ్యాపారవేత్తల, బడా వ్యాపారస్తుల పక్షం వహిస్తాడని నెహ్రూకు కినుక. అతనితో పోలిస్తే శాస్త్రి అంత సమర్థుడు కాడు. చాలా పరిమితులున్నవాడు. ఉత్తరప్రదేశ్‌కు బయట అతని గురించి తెలిసిన వారు చాలా తక్కువ. అరియలూరు రైల్వే యాక్సిడెంటు తర్వాత బాధ్యత వహించి రాజీనామా చేసిన రైల్వే మంత్రిగా గుర్తింపు వచ్చిందంతే. గాంధేయవాది. సింపుల్‌గా జీవించే వ్యక్తి. ఇలాటివాడైతే తమ చెప్పుచేతల్లో వుంటాడని సిండికేట్ నాయకులు భావించారు.
ఈ సిండికేట్‌లో సభ్యులు ఎవరెవరంటే – ఆంధ్రప్రదేశ్ నుంచి సంజీవరెడ్డి, తమిళనాడు నుంచి కామరాజ్ నాడార్, కర్ణాటక నుండి నిజలింగప్ప, బొంబాయి నుంచి ఎస్ కె పాటిల్, బొంబాయి నుంచి అతుల్య ఘోష్ యిత్యాదులు. వీళ్లు తమతమ రాష్ట్రాలలో బలంగా వుండడం చేత సామంతరాజులుగా తయారయి ''కింగ్‌మేకర్స్''గా వ్యవహరించేవారు. నిధులు సేకరించడంలో దిట్టలు కాబట్టి, పార్టీ వీరి కనుసన్నల్లో నడిచేది. తమకు కావలసినవారికి టిక్కెట్లు యిచ్చుకునేవారు. (సశేషం)
(ఫోటో – నెహ్రూ అంతిమయాత్రలో పాల్గొన్న సి.సుబ్రహ్మణ్యం, వైబి చవాన్, శాస్త్రి, .., నందా, జాకీర్ హుస్సేన్)
– ఎమ్బీయస్ ప్రసాద్ (అక్టోబరు 2015)