రివ్యూ: షేర్
రేటింగ్: 1.5/5
బ్యానర్: విజయలక్ష్మి పిక్చర్స్
తారాగణం: నందమూరి కళ్యాణ్‌రామ్, సోనాల్ చౌహాన్, ముఖేష్ రిషి, బ్రహ్మానందం, విక్రమ్‌జీత్, ఆశిష్ విద్యార్థి, పోసాని కృష్ణమురళి, ఎం.ఎస్. నారాయణ, అలీ, షఫీ, సయాజీ షిండే తదితరులు
సంభాషణలు: డైమండ్ రత్నం
సంగీతం: ఎస్. ఎస్. తమన్
కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: సర్వేష్ మురారి
నిర్మాత: కొమర వెంకటేష్
కథ, కథనం, దర్శకత్వం: మల్లికార్జున్
విడుదల తేదీ: అక్టోబర్ 30, 2015
ఈ ఏడాది ఆరంభంలో 'పటాస్'తో సూపర్‌హిట్ సాధించిన నందమూరి కళ్యాణ్‌రామ్ 'షేర్'గా ఇంకోసారి ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. తనతో ఇంతకుముందు అభిమన్యు, కత్తి చిత్రాలని తీసి నిరాశ పరిచిన దర్శకుడు మల్లికార్జున్‌కి కళ్యాణ్‌రామ్ మరో అవకాశాన్నిచ్చాడు. పటాస్ రిలీజ్‌కి ముందే మొదలైన ఈ చిత్రాన్ని పటాస్ తర్వాత అయితే కళ్యాణ్‌రామ్ చేసి ఉండేవాడు కాదేమో అనిపించింది. మొదటి సన్నివేశంలోనే ఈ చిత్రం ఎలా ఉండబోతుందనే విషయం తేటతెల్లమవుతుంది. అవుట్‌డేటెడ్ నెరేషన్‌తో, నాసి రకం సంభాషణలతో ఎప్పుడో ఎనభైల్లో వచ్చిన ఫ్లాప్ సినిమాల్ని తలపిస్తూ.. మొదలైన పది నిమిషాలకే ఎప్పటికి అవుతుందో అనే భయాన్ని కలిగిస్తుంది. 'ఓం' తర్వాత చాలా గ్యాప్ తీసుకుని కళ్యాణ్‌రామ్ ఓకే చేసిన కథల్లో పటాస్‌తో పాటు ఇది కూడా ఉంది. మరి మల్లికార్జున్ చెప్పిన కథలో అతనికేం నచ్చిందో కానీ కథ, కథనాల పరంగా ఇందులో మెచ్చుకోతగ్గ అంశం ఒక్కటీ కానరాదు.
తమన్ చేసిన పాటల్లో ఒకట్రెండు ఫర్వాలేదనిపిస్తాయి. సర్వేష్ మురారి ఛాయాగ్రహణం కూడా బాగానే ఉంది. అంతకుమించి 'షేర్' గురించి మొహమాటానికి మెన్షన్ చేద్దామన్నా ఫర్లేదనిపించే పాయింట్ అంటూ ఇంకోటి లేదు. కళ్యాణ్‌రామ్ తన వంతు చేయగలిగింది చేసాడు కానీ ఎంత కష్టపడ్డా ఈ షేర్‌ని ఇంట్రెస్టింగ్‌గా మార్చే ఆస్కారమే లేదు. సాధారణంగా ఫ్లాపుల తర్వాత రాక రాక ఒక అవకాశమొస్తే దానిని సద్వినియోగం చేసుకోవడానికి ఆ దర్శకులు తమ శాయశక్తులా కృషి చేస్తారు. ఎలాగైనా సక్సెస్ సాధించాలనే కసి అయినా చూపిస్తారు. మల్లికార్జున్ ఈ చిత్రాన్ని మలచిన తీరు చూస్తే అతని మునుపటి సినిమాలే మేలనిపిస్తాయి. కమర్షియల్ సినిమాల్లో గొప్ప కథలుంటాయనే అంచనాలతో ఎవరూ వెళ్లరు. కనీస వినోదం కూడా లేని ఈ చిత్రంలో అడుగడుగునా అసంబద్ధమైన సన్నివేశాలు.. చూస్తున్నది సినిమానా, వీధి నాటకమా అనిపిస్తాయి.
చనిపోయిన వ్యక్తి కళ్లలో చివరిగా చూసిన వారి ప్రతిబింబం ఉంటుందట. చనిపోయాక కూడా కళ్లు ఆరు గంటల పాటు పని చేస్తాయి కాబట్టి ఆ కళ్లల్లోంచి ఆ లాస్ట్ ఇమేజ్ స్కెచ్ తీసుకోవచ్చునట. ఇలాంటి సన్నివేశాల్ని ఎంతో సిన్సియర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇక మిగతా అబ్‌సర్డ్ సీన్స్ అన్నీ పెద్ద విషయం అనిపించవు. జాతీయ జెండా కింద పడకుండా పట్టుకున్న చేతిని ఫోటో తీసిన హీరోయిన్ జీవితంలో తాను పట్టుకునేది ఆ చేతినే అని డిసైడ్ అయిపోతుంది. ఆ చెయ్యి తనదే అంటూ వచ్చిన బ్రహ్మానందంతో అయిష్టంగానే డేట్స్‌కి కూడా వెళుతుంది. ఇలా ఒకటేమిటి.. 'షేర్'లో ప్రతి సీనూ ఒక ఆణిముత్యమే అని చెప్పాలి. నటీనటుల్లో అందరికీ సినిమా భవితవ్యం ఏంటనేది ముందే తెలిసిపోయినట్టు తీసుకున్న తాంబూలానికి తగిన న్యాయం చేయక తప్పదన్నట్టు తూతూ మంత్రంగా కానిచ్చేసారు. వీరిలో ఎవరినీ తప్పుబట్టడానికి ఏమీ లేదు. ఇలాంటి సన్నివేశాలు రాసి, అలాంటి సంభాషణలు చేతికిచ్చి నటించమంటే ఎంత తల పండిన నటుడైనా కానీ నీరసపడిపోతాడు.
ప్రతి డైలాగ్ చివర్లో 'సిరాగ్గా' అనడం పృధ్వీకి మేనరిజమ్‌గా పెట్టారు. 'పటాస్' తర్వాత 'షేర్' ఏంటి సిరాగ్గా.. అని కళ్యాణ్‌రామ్‌కి కూడా ఏదో క్షణంలో అనిపించే ఉండాలి. చాలా కాలం తర్వాత అంతటి ఘన విజయం దక్కితే దానికి ఫాలో అప్‌గా ఇలాంటి సినిమా వస్తే మళ్లీ ఇప్పుడింకో పటాస్‌లాంటి సినిమా కోసం ఎదురు చూడాల్సిందేగా? ఎన్నో ఏళ్ల తర్వాత వచ్చిన విజయంపై తిరిగి కెరీర్ నిర్మించుకునే అవకాశాన్ని చేతులారా పోగొట్టుకున్నట్టేగా? స్క్రీనింగ్ మధ్యలో సాంకేతిక పరమైన ఇబ్బంది ఏదైనా తలెత్తి ఉన్నపళంగా సినిమా ఆపేస్తే.. రిఫండ్ ఆశించకుండా థాంక్స్ చెప్పి వచ్చేసేలా ఉన్న ఈ షేర్ బాక్సాఫీస్ దగ్గర వచ్చే 'షేర్'పై పెద్దగా ఆశలు పెట్టుకోనక్కర్లేదు. కొన్ని కమర్షియల్ సినిమాల రిజల్ట్ ఏంటనే దానిపై కాస్త కన్‌ఫ్యూజన్ ఉంటుంది కానీ దీని ఫలితమేంటనే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేయడంలో మాత్రం డైరెక్టర్ ఆద్యంతం సక్సెస్ అయ్యాడు!
బోటమ్ లైన్: బోర్!
– గణేష్ రావూరి