ఇక్కడ ఛాన్సులున్నప్పుడేమో తెలుగు సినిమాలే మాకు లోకం, టాలీవుడ్డే మాకు ఫుడ్డు అంటూ ఎడా పెడా కోసేసే తారామణులు కాస్తా… కాస్త బాలీవుడ్‌లోనో మరో భాషలోనో ఛాన్సులు రాగానే మాట మార్చేస్తారు. తెలుగు సినిమాలంటే తమకు ఆఫ్ట్రాల్ అన్నట్టు మాట్లాడతారు. అంతేకాదు ఇక్కడి ప్రేక్షకుల అభిరుచిని కూడా ప్రశ్నించేలా వ్యాఖ్యానాలు చేస్తారు.
తాప్సీ చూడండి. యాక్టింగ్ పరంగా పెద్ద గొప్ప అని కాకపోయినా, తెలుగులో వరుసగా మంచి అవకాశాలే దక్కించుకుంది. ప్రభాస్ సహా పెద్ద హీరోలతో కూడా పలు సినిమాల్లో నటించింది. కొద్దో గొప్పో హిట్స్ టేస్ట్ చేసింది. అయితే గత కొంతకాలంగా తాప్సీకి తెలుగులో సినిమాల్లేవు. గోపీచంద్ పక్కన నటించిన సాహసం అనే సినిమా తర్వాత దాదాపు టాలీవుడ్‌లో తాప్సీ కనుమరుగైపోయినట్టే చెప్పాలి.
అదే సమయంలో బాలీవుడ్‌లో బేబీ, ఛష్మే బద్దూర్ వంటి హిట్ మూవీస్ తాప్సీ ఖాతాలో పడ్డాయి. అంతే, తానప్పుడే నేషనల్ నటిని అయిపోయాననుకుంటోందేమో… తెలుగులో కనపడడం లేదేంటి చాన్సుల్లేవా? అనడిగితే… అబ్బే అదేం కాదు… ఛాన్సులైతే బోలెడు వస్తున్నాయి కాని నేనే ఒప్పుకోవడం లేదు అనేసింది. అరె, ఎందుకలా? అంటే తెలుగులో అన్నీ రెగ్యులర్, రొటీన్ రోల్స్ వస్తున్నాయనీ, అవి చేయడానికి చాలా మందే హీరోయిన్లు ఉన్నారు వాళ్లు చేస్తారు కదా… నేనే ఎందుకు? అంటూ ప్రశ్నిస్తోంది.
తాను ఏ సినిమా పడితే ఆ సినిమా చేయనని, నిజానికి తెలుగులో చేయననే నిర్ణయం తనకు మేలు చేసిందంది. దీని వల్ల తనకు సమయం దొరికి, తమిళ్, హిందీల్లో మంచి సినిమాలు చేయగలిగానంది. నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకోవడం కోసం స్టుపిడ్ క్యారెక్టర్లు చేయడం తన వల్ల కాదని, అలా చేసి సాధించుకునే అగ్రస్థానం తనకు వద్దనీ అంటోంది. (మరి తాప్సీ దృష్టిలో అలాంటి క్యారెక్టర్లు చేసి నెంబర్ వన్ అయిందెవరో ఆమెకే తెలియాలి)
అంతేకాదు… బాలీవుడ్ ని, అక్కడి ప్రేక్షకుల్ని తెగ మెచ్చేసుకుంది. తాను నటించిన బేబీ సినిమాలో తన క్యారెక్టర్ ఉండేది 20 నిమిషాలే అయినా హిందీ చిత్ర పరిశ్రమ తన నటనకు అద్భుతమైన గుర్తింపు ఇచ్చిందంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది.
బాలీవుడ్ ప్రేక్షకులు పరిణితి చెందినవారంటూ సినిమాలో తమకు ఒక నటి కనిపించింది 20 నిమిషాలా లేక సినిమా అంతా ఉందా అని చూడరని నటన మాత్రమే చూస్తారంటూ తెగ పొగిడేసింది.తన నటనకు బాలీవుడ్ ఫిదా అయిపోయింది కాబట్టే… తనను పేరున్న సినిమా రూపకర్తలు సంప్రదిస్తున్నారని చెప్పింది. త్వరలో రెండు భారీ హిందీ చిత్రాల్లో నటిస్తున్నానని చెప్పింది.