Advertisement


Home > Articles - Kapilamuni
వీడ్కోలు కలాంజీ.. నీవు లేవు, నీ వెలుగు ఉంటుంది!

వీడ్కోలు కలాంజీ.. వీడ్కోలు మార్గదర్శీ.. నీకు శాశ్వత వీడ్కోలు పలకడానికి భారతజాతి మొత్తం కన్నీళ్లు కారుస్తోంది. ఎవ్వరికీ మనసొప్పడం లేదు. ఎవ్వరికీ నోట మాట రావడం లేదు. రామేశ్వరం వచ్చిన వేలాది మంది అభిమానులు, రాలేకపోయిన కోట్లాది మంది అశక్తులు అందరూ నీ పవిత్ర స్మృతికి నివాళి అర్పిస్తున్నారు. పార్టీ రహితంగా నాయకులందరూ వచ్చి నీ పాదాల వద్ద ముకుళిత హస్తాలతో అంజలి ఘటిస్తున్నారు. నీవు శాశ్వతంగా దూరమైనందుకు భరతమాత గుండె తడి అవుతోంది. 

ఓ మనీషీ.. ఇవాళ నీవులేవు. ఒకకొరత అనిపిస్తోంది. నీవు అందించిన స్ఫూర్తి మా గుండెల నిండా ఉంది. నీవు చూపిన మార్గం కనుల ముందు కనిపిస్తోంది. ఒక వ్యక్తి చనిపోతే.. ఆ లోటు ఎవ్వరూ తీర్చలేనిదని అంతా అంటుంటారు. కానీ మరణం అనివార్యం అయినప్పుడు.. అలాంటి వృథా చింత నీకు కూడా రుచించదనే స్పృహ మాకు కలుగుతోంది. నీవు భౌతికంగా మా మధ్య ఇవాళ లేకపోవచ్చు. కానీ నీవు ఉన్న ఈ నేలమీద, నీవు నడయాడిన కాలంలోనే మేము కూడా ఉండగలిగామనే గర్వం మా వెన్నంటి ఉంటుంది. 

నీవు లేని లోటు తీరదని అనుకోవడం వెర్రితనం. మాకెలాంటి లోటు లేదు. నిజం చెప్పాలంటే.. నీవందించిన విలువల సంపద మా జీవితాలను మించిపోయి.. మా వద్ద పదిలంగా ఉన్నది. దాన్ని జాగ్రత్తగా కాపాడి మా భావితరాలకు మేం అందించగలిగితే అదే పదివేలు. ఆ మాత్రపు శక్తిని.. నీనుంచి గ్రహించిన విలువల మార్గాన్ని వీడకుండ జీవనప్రస్థానం సాగించగలిగిన నైతిక స్థైర్యాన్ని ప్రసాదించాల్సిందిగా కోరుతున్నాం. అంతకు మించే మాకేమీ అక్కర్లేదు. నీనుంచి ఇంకా ఎంతో పొంది ఉండగలం... కానీ ఇప్పటిదాకా పొందిన విలువల సంపదే చాలా ఎక్కువ. దాన్ని పదిలం చేసుకుంటే అదే మహోన్నతం అవుతుంది. 

అందుకే ఇవాళ నీవు లేకపోయినా.. మా గుండె తడిఅయినదే తప్ప.. ధైర్యం సడలిపోలేదు. నీవు లేవు.. కానీ నీ వెలుగు ఉన్నది. ఉంటుంది. సూర్యచంద్రులు ప్రతిరోజూ అలసిపోయి విశ్రాంతి తీసుకుంటూ ఉండవచ్చు గాక.. కానీ నీవందించిన విలువల వెలుగులు నిత్యమూ ప్రకాశవంతమై మా మార్గాలను తేజోవంతం చేస్తుంటాయి. ధన్యవాదాలు. 

పూర్తయిన అంత్యక్రియలు 
అబ్దుల్‌కలాం అంత్యక్రియలు రామేశ్వరంలో గురువారం ఉదయం పూర్తయ్యాయి. సైనిక, ప్రభుత్వ లాంఛనాలతో ఈ అంత్యక్రియలు పూర్తిచేశారు. రైల్వేస్టేషన్‌ సమీపంలోని మైదానంలో ఆయన పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, మనోహర్‌ పారికర్‌, ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, సిద్ధరామయ్య, కేరళ సీఎం తదితర ప్రముఖులు హాజరయ్యారు. సాంప్రదాయబద్ధంగా ఆయన అంత్యక్రియలు పూర్తిచేసి ప్రార్థనలు నిర్వహించారు. 

- సురేష్

suresh@greatandhra.com