Advertisement

Advertisement


Home > Politics - Andhra

ఆ ఒక్క మాట చెప్పకుండా మోడీ ప్రసంగం!

ఆ ఒక్క మాట చెప్పకుండా మోడీ ప్రసంగం!

విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలకు కొండంత అండ కొంగు బంగారం లాంటి విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేట్ పరం చేసేందుకు కేంద్రం మూడేళ్ళుగా నిరంతర ప్రయత్నంలో ఉంది. కీలకమైన విభాగాలను నిర్వీర్యం చేస్తూ పరోక్షంగా ఉక్కు ఊపిరిని ఆగిపోయేలా చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే విశాఖ ఉక్కు బలిపీఠం మీద ఉంది. 

మూడవసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే చేసే మొదటి ప్రకటన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అని చెప్పడమే అని అంతా భావిస్తున్న క్రమంలో అనకాపల్లిలో జరిగిన ఎన్డీయే కూటమి ఎన్నికల సభకు వచ్చిన ప్రధాని మోడీ విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఓదార్పు ని ఇచ్చే ఒక్క మాట కూడా మాట్లాడకపోవటంతో ఉక్కు ఉద్యమకారులు మండిపోతున్నారు.

విశాఖ ఉక్కుని తెగనమ్మాలని బీజేపీ చూస్తూంటే మూడేళ్ళుగా అలుపెరగని పోరాటం చేసి అడ్డుపడుతున్నామని ఎన్నికలు పూర్తి అయితే కేంద్రంలో బీజేపీ మళ్ళీ వస్తే ఉక్కు ప్రభుత్వ రంగంలో ఉండదని కూడా అంటున్నారు. ఎంపీ సీటులో గెలించేందుకు ఓట్ల కోసం వచ్చిన మోడీ ఉక్కుని కాపాడుతామని ఒక్క మాటా అనకపోవడం పట్ల కార్మిక లోకం మొత్తం ఆగ్రహంగా ఉంది.

బీజేపీతో పొత్తులో ఉన్న టీడీపీ జనసేన కూడా ఈ విషయం కనీసం సభలో ప్రస్తావించి మోడీ నుంచి హామీని రాబట్టలేక పోవడం పట్ల కూడా ఉద్యమకారులు ఫైర్ అవుతున్నారు. ఎన్నికల వేళలోనే ఉక్కు మీద ఊరట ఇచ్చే హామీ దక్కకపోతే ఇక దిక్కు ఎవరు అన్న ఆవేదన వారిని ఆవహిస్తోంది.

పదేళ్ళ బీజేపీ పాలనలో విశాఖకు ఏమి చేశారు అని ప్రశ్నిస్తున్నారు. రైల్వే జోన్ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదని భూములు కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో ఉన్నాయని నిర్మాణం ప్రారంభించకుండా ఏపీ ప్రభుత్వం భూములు ఇవ్వలేదని సాకులు చెప్పడమేంటి అని అంతా మండిపడుతున్నారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం వైఖరి మోడీ సభతో తేటతెల్లమైంది అని అంటున్నారు. దాంతో ఉక్కు కార్మికులు ఉద్యోగులు ఈ ఎన్నికల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు ఎవరిని గెలిపించి ఎవరిని ఓడిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?