Advertisement


Home > Articles - Kapilamuni
అగ్రదినపత్రికకు ఇలాంటి రాతలు తగునా?

పత్రికా రంగం అంటేనే ఓ సామాజిక సేవ లాంటిది. – ఇది ఒకప్పటి మాట. కానీ సమాజంలో అన్ని రంగాలూ గ్లోబలైజేషన్, వినిమయపోకడలతోపాటూ మారుతూ వస్తున్నట్లుగానే ప్రతికారంగం, మీడియా కూడా బహుముఖంగా మారుతూ వచ్చింది. ఇవాళ్టి రోజుల్లో అయితే... సామాజిక సేవ అనేది మీడియా సంస్థల ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోందా అంటే అనుమానమే.

వ్యాపార మరియు రాజకీయ ప్రయోజనాలు లేదా ఇతర వ్యాపారాలకు ఒక కవంగా వాడుకోవడం తదితర లక్ష్యాలతో మీడియా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. అయినా సరే.. దాని మూలాల్లో సామాజిక సేవ లేకపోయినా సరే.. పత్రికలు, మీడియా సంస్థల పనితీరు మీద సామాజిక బాధ్యత అనేది చాలా బలంగా ఉంటుంది. వారు రాసే రాతలు ప్రసారం చేసే అంశాలు ప్రజల్లో ఎలాంటి భావనల్ని వ్యాపింపజేస్తాయి. అవి దేశాన్ని విచ్ఛిన్నం దిశగా నడిపిస్తాయా? లేదా, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. 

తమ రాతల మీద అదుపు, తమ రాతల్లోని భావం కలిగించగల పర్యవసానాల గురించిన అవగాహన పాత్రికేయులకు ఉండకపోతే గనుక.. చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. బాధ్యత లేని రాతలు చదువరుల్లో కూడా బాధ కలిగిస్తాయి. తాజాగా అగ్రస్థాయి తెలుగు దినపత్రికల్లో ఒకటైన ‘సాక్షి’ ఇలాంటి పొరబాటు చేసింది. బాధ్యతగల పత్రికల్లో ఇలాంటి వార్తలు తగునా అనే చర్చ కొందరు పాత్రికేయుల మధ్య నడుస్తోంది.

అయితే తెలుగులో తిరుగులేని ప్రజాదరణ సర్కులేషన్ ఉన్న పత్రికల్లో సాక్షి తప్పకుండా ఉంది. తప్పుడు అభివర్ణనలతో తప్పుదారి పట్టించే వార్తలను చిన్న పత్రికలు రాసినా కూడా తప్పే గానీ.. పెద్ద పత్రికలు రాసినప్పుడు వాటి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు అదే జరిగింది.

వివరాల్లోకి వెళితే...

స్పెయిన్ దేశంలోని ఈశాన్య ప్రాంతం కటలోనియాలో ఒక స్వాతంత్ర్య ఉద్యమం జరుగుతున్నది. పశ్చిమ యూరప్ లో చాలా చిన్న భాగంలో ఇలాంటి పోరాటం మొదలైంది. సహజంగానే అణచివేత, వివక్షల పునాదుల్లోంచి వేర్పాటువాద ఉద్యమం పుడుతుందనే అనుభవాలు మనకు కూడా ఉన్నాయి. అక్కడ కటలోనియాలో రిఫరెండమ్ నిర్వహించుకుంటూ దానికి హాజరైన ప్రజలపై స్పానిష్ పోలీసులు ఆటవికంగా దాడి చేసి కొట్టారు. ముసలీ ముతకా సహా పలువురు గాయపడ్డారు.

యూరప్ దేశాల ఒత్తడి స్పానిష్ పాలకుల మీదికి మళ్లింది. భాషా సంస్కృతుల పరంగా కటలోనియా ప్రాంత వాసులపై స్పానిష్ ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్ష ధోరణులే.. తమకు ప్రత్యేక దేశం కావాలంటూ సాగుతున్న ఈ పోరాటానికి నాంది. ఈవివరాలు సమస్తం విపులంగా అందిస్తూ సాక్షి ఓ కథనాన్ని ప్రచురించింది. ‘నేడు కటలోనియాలో.. రేపు భారత్ లో’ అంటూ ఆ వార్తకు శీర్షిక పెట్టారు. 

అసలు ఆవేదన అదే. రేపు భారత్ లో కూడా ఇదే మాదిరి ప్రత్యేక దేశం కావాలనే పోరాటం వచ్చే అవకాశం ఉన్నదంటూ తమ ఊహాగానాలను జోడిస్తూ.. చాలా సుదీర్ఘమైన కథనమే రాశారు. దక్షిణాది రాష్ట్రాల మీద హిందీ భాషను రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ... దక్షిణాది రాష్ట్రాల నుంచి వస్తున్న ఆదాయాన్ని తీసుకెళ్లి ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రప్రభుత్వాలు ఖర్చు పెడుతున్నాయంటూ అందులో అనేక వివరాల్ని కూడా ప్రస్తావించారు. అయితే అవన్నీ అర్థసత్యాలు. ‘అశ్వత్థామ హత: ... కుంజర:’ లాంటి వాక్యాలు.

దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు ఏ సమాచారం చెబితే కడుపు మండుతుందో అంతవరకే చెప్పారు తప్ప.. అందుకు మూలమైన కారణాలను ఎక్కడా ప్రస్తావించలేదు. హిందీ వ్యతిరేక ఉద్యమం పుట్టిన తమిళుల  పోరాటం గురించి కూడా చెబుతూ.. ఉత్తరాది పాలకులు ఇలాగే ఉంటే కటలోనియాలాగా... ఇక్కడకూడా స్వాతంత్ర్యం కోసం ‘రేపు’ ఒక పోరాటం మొదలవుతుందని వీళ్ల ఊహలను పరాకాష్టకు తీసుకువెళ్లారు. 

సాక్షి కథనాన్ని చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :

ఈ వ్యాసభాగం పై కొన్ని అభ్యంతరాలున్నాయి. ఈ కథనం ఉద్దేశం ఏమిటి?  భారతదేశాన్ని రెండు ముక్కలు చేయడానికి దక్షిణ భారతదేశం మొత్తం ఉద్యుక్తం అయ్యేలా ప్రేరేపించడానికి సాక్షి కంకణం కట్టుకున్నదా? ఇది పత్రిక విధానమా? లేదా, సదరు పాత్రికే మిత్రుడి వ్యక్తిగత పైత్యమా? లేదా, ఇలాంటి తరహాలో కటలోనియాకు – దక్షిణ భారతదేశానికి ముడిపెట్టి కాస్త మసాలా దట్టిస్తే.. ‘రీడబిలిటీ’ రెట్టింపు అవుతుందనే అవగాహనా రహిత అత్యుత్సాహమా? అనేది చెక్ చేసుకోవాలి. ఆ మాటకొస్తే దక్షిణాది రాష్ట్రాల స్వాతంత్ర్య పోరాటం రేపే వచ్చేయాలన్నంత కోరిక ఈ రాతల్లో ఉన్నదా అని కూడా అనిపిస్తుంది. 

నిజానికి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి పన్నుల చెల్లింపు జరుగుతుంది. బీహార్, యూపీ వంటి రాష్ట్రాలకు చెల్లించే వాటా ఎక్కువ ఉంటే వాటికి హేతుబద్ధమైన కారణాలు అనేకం ఉన్నాయి. మనమే ఆంధ్రప్రదేశ్ తరఫున.. ప్రత్యేక హోదా అడుగుతూ వచ్చాం. అది వచ్చి ఉంటే మనకు కూడా అలాంటి అదనపు సొమ్మే వస్తూ ఉండేది. కేంద్రం ఇవ్వకుండా మోసం చేయడం వేరే సంగతి.

కానీ అలాంటి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్మోహన రెడ్డి భావజాలం కొంతైనా ఉండాల్సిన పత్రికలో ఇలాంటి రాతలు తగునా అనే అభిప్రాయం కలుగుతోంది. కటలోనియాలో ఉన్నంతటి క్షేత్రస్థాయి తీవ్ర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయా? అంటే ఎంతమాత్రమూ లేవు. హిందీ భాష పట్ల కొంత వ్యతిరేకత తమిళుల్లో ఉండొచ్చు గానీ.. తతిమ్మా విషయాల్లో దేశం మొత్తం సుహృద్భావ వాతావరణంలోనే మనుగడ సాగిస్తోంది. కటలోనియాకు లేశమాత్రమైనా సారూప్యత లేని భారతీయ నేపథ్యంలో.. కడివెడు పాలలో విషపు చుక్కలాగా... ఇలాంటి వంకర రాతలను సాక్షి ఎందుకు ప్రచురించినట్లు.. పెద్దలు ఆత్మపరిశీలన చేసుకోవాలి.

- కపిలముని