Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘‘నీ రంపం కంటె.. నా సూదే గొప్ప’’

‘‘నీ రంపం కంటె.. నా సూదే గొప్ప’’

తాను లొల్లాయి పాట పాడినా.. అది కాంభోజి రాగమంత గొప్పదని అందరూ భజన చేయాలి.. అదే ఇతరుల విషయానికి వస్తే.. వారు శంకరాభరంణం రాగాన్ని శ్రావ్యంగా ఆలపించినా సరే.. గార్ధభ గానం అంటూ దానిని తోసిరాజనాలి... ఇదే చంద్రబాబునాయుడు ఎరిగిన రీతి.

తానేదో నాలుగు మొక్కుబడి చర్యలు తీసుకుంటూ.. అవేవో మహాద్భుతమైన పోరాటాలు అన్నట్లుగా బిల్డప్ లు ఇచ్చుకుంటూ రోజులు నెట్టేస్తున్న చంద్రబాబునాయుడు.. అదే సమయంలో.. విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగిస్తున్న నిర్దిష్టమైన, ప్రణాళికబద్ధమైన పోరాటాలను మాత్రం.. ఈసడించడం.. వైచిత్రి. ఇలాంటి వైఖరి కేవలం చంద్రబాబుకు మాత్రమే వెన్నతో పెట్టిన విద్య.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించే విషయంలో.. తొలినుంచి పోరాటం చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి... ఈనెల 21వ తేదీన తన పార్టీ ఎంపీల ద్వారా... కేంద్రప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. అయితే చంద్రబాబునాయుడు మాత్రం.. దానికి మద్దతు ఇచ్చి.. రాష్ట్రమంతా ఒక డిమాండుకోసం ఒక్కతాటిపై ఉన్నదని సంకేతాలు ఇవ్వడానికి బదులు.. అలాంటి ప్రయత్నమే దండగ అని అపశకునాలు పలుకుతున్నారు. అవిశ్వాసం పెడితే.. ప్రభుత్వం పడిపోతుందా.. ఆ అవకాశం లేనప్పుడు.. ఎందుకు తీర్మానం పెట్టడం అంటూ.. ఆయన ఎద్దేవా చేస్తున్నారు.

ఆయన చెబుతున్నది.. నిజమే, ప్రభుత్వం పడిపోదు- అనే అనుకుందాం..! మరి నిన్న అసెంబ్లీలో ఆయన చేసిన పనేమిటి? కేంద్ర అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా.. ఒక తీర్మానం ప్రతిపాదించి... ఆమోదించారు. ఇలా అసెంబ్లీలో తీర్మానం ఆమోదిస్తే.. కేంద్రం వణికిపోయి ప్రత్యేకహోదా ఇస్తుందా? ఇలాంటి ఎందుకూ పనికిరాని తూతూమంత్రపు తీర్మానాల వలన నయాపైసా ఉపయోగం ఉంటుందా? ఆయన అలాంటి భరోసా ఇవ్వగలరా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు ఎలాంటి పోరాటం చేసినా.. దానికి మద్దతిచ్చే సహృదయత ఉన్నవారే అధినేత అనిపించుకోగలుగుతారు. ఒకరు చేసే పోరాటాలను చులకన చేసి మాట్లాడుతూ.. వాటి విలువ పోగొడుతూ.. తాను నిర్దిష్టమైన పోరాటాలు చేయకుండా.. మాటలతో రోజులు నెట్టేస్తూ ఉంటే.. రాష్ట్రానికి మంచి జరిగేది ఎలాగ? అని ప్రజలు అనుకుంటున్నారు.

-కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?