Advertisement

Advertisement


Home > Articles - Kapilamuni

‘‘ఫర్ ది సేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’

‘‘ఫర్ ది సేక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్’’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. న్యాయం కోసం పోరాడుతున్నారు. న్యాయం పొందడానికి తమకు చేతనైన రీతిలో ఒక ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోని దయార్ర్ద హృదయులారా.. ఇటురండి.. తలా ఒక చెయ్యి వేయండి...! న్యాయం కోసం నిలబడడానికి, న్యాయం కోసం పోరాడడానికి మా బలం సరిపోవడం లేదు.

అధికార మదాంధులైన పాలకులలో కదలిక తీసుకురావడం అంత చిన్న పనికాదు. విజ్ఞులైన, ప్రాజ్ఞులైన తమ బోటి వారికి అది తెలియని సంగతి ఎంత మాత్రమూ కాదు. తోలుమందం ఉన్న దున్నపోతును వాన చినుకు కదిలించగలుగుతుందా?  మా కోరికలో ఎంత నిజాయితీ ఉన్నప్పటికీ.. మా బలం మొత్తం కలిపి చిరుజల్లు పాటి మాత్రమే.

అందుకే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి- ఒక ప్రభుత్వం రూపేణా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి.. మరొక ప్రభుత్వం రూపేణా జరిగిన వంచనను రూపుమార్చడానికి సత్యసంధులు,  ధర్మనిర్మాణచరులు అయిన మహానుభావులంతా తరలివచ్చి తలా ఒక చేయి వేయండి.

అధికారానికి ముందు ఒకమాట, తర్వాత మరొకమాట చెబుతూ.. అశేషమైన ప్రజలను యథేచ్ఛగా వంచిస్తే.. అడిగే దిక్కు ఉండదనే అభిప్రాయం దుష్ట పాలకులకు కలగనివ్వకండి. ఒకరు మోసం చేస్తే మరొకరు ధర్మానికి అండగా నిలబడే వాళ్లకు ఈ దేశం గొడ్డుపోలేదనే నమ్మకం ప్రజలకు కలగాలంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిపాదిస్తున్న అవిశ్వాసానికి అందరూ మద్దతు పలకాలి. అండగా నిలబడాలి.

కొన్ని దశాబ్దాల తర్వాత.. హస్తనపీఠాన్ని ఏలడానికి సింగిల్ పార్టీగా మెజారిటీ సంపాదించుకుని విర్రవీగుతున్న వారిని ఈ అవిశ్వాసం కూలదోయకపోవచ్చు. కానీ ఓటింగు దాకా వస్తే.. వారి దుర్మదాంధతను నిలదీసే చర్చ తప్పదు. ఆ రకంగా వారి వైఖరిపై ప్రజల్లో చైతన్యం కలిగించడమూ తప్పదు. అందుకే అందరూ కలిసిరండి.

ఇది వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతిపాదిస్తున్న అవిశ్వాసం అనుకోవద్దు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆవేదనకు ప్రతిబింబం అనుకోండి. మీ అందరి ఆశీర్వాదం ఉంటేనే ధర్మం నెగ్గుతుంది.

ధర్మో రక్షతి రక్షితః

హోదా ప్రాప్తం అవుతుంది.

...కపిలముని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?