Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: ఉద్యోగులపై జాలి

ఎమ్బీయస్‌: ఉద్యోగులపై జాలి

జగన్‌ 'ఏమో, ఏమో' అంటున్నా ఆంధ్ర రాజధానిని వైజాగ్‌కు తరలిస్తున్నారని అందరికీ అర్థమై పోయింది. దాంతో కొందరు ఉద్యోగులపై జాలి కురిపిస్తున్నారు. పాపం హైదరాబాదు నుంచి అమరావతి వెళ్లారు, ఇప్పుడు అక్కణ్నుంచి మళ్లీ వైజాగ్‌ వెళ్లాలట, ఎంత కష్టం, ఎంత కష్టం అని నిట్టూర్పులు విడుస్తున్నారు. కొందరేమో మూడు రాజధానులంటే మూడు చోట్లా ప్రభుత్వోద్యోగులకు యిళ్లు యిచ్చేస్తారట, సర్కారు వారికి ఎంత నష్టం, ఎంత నష్టం అని వాపోతున్నారు. 

మొదటగా నష్టం గురించి మాట్లాడుకుంటే జగన్‌ మాటల గారడీతో మూడు రాజధానులు అంటున్నాడు కానీ హైకోర్టు ఉన్న ఊరిని ఎవరూ రాజధాని అని పిలవరు. ఆ లెక్కన పది రాష్ట్రాలకు రెండేసి రాజధానులున్నాయని మన పుస్తకాల్లో రాసుకోవాలి. అలాగే అసెంబ్లీ సెషన్స్‌ నిర్వహించే చోటునూ రాజధాని అనరు. ఆ లెక్కన జమ్మూకశ్మీర్‌ రాజధాని జమ్మూ, మహారాష్ట్రకు రాజధాని నాగపూర్‌ అనాలి, పోనీ సగం రాజధాని అనాలి. ఈ రాజధాని మాట ఫ్యాషనై పోయి, తిరుపతిని ఆధ్యాత్మిక రాజధానిగా చేయాలి అని డిమాండు వస్తోంది. దానితో బాటు కాకినాడను మెరైన్‌ రాజధాని, కడపను మైనింగ్‌ రాజధాని, శ్రీకాకుళాన్ని జీడిపప్పు రాజధాని.. అంటూ యిలా ప్రతీ జిల్లాకు ఓ రాజధానిని ప్రకటించవచ్చు! కానీ అసలైన రాజధాని సెక్రటేరియట్‌ వగైరాలు ఉన్నదే, దాన్నే ఎగ్జిక్యూటివ్‌ రాజధాని అనే పేరుతో పిలుస్తున్నారు.

ప్రభుత్వోద్యోగులు ఎక్కడ పని చేస్తే అక్కడ క్వార్టర్లు యిస్తారు, అదీ కొన్ని శాఖలకు మాత్రమే. మహా అయితే యిళ్ల స్థలాలు కేటాయించవచ్చు. అదీ, రాష్ట్రంలో ఎక్కడో ఒక చోటే యిస్తారు తప్ప బదిలీ చేసిన చోటల్లా యివ్వరు. అయినా పని చేసిన చోటే స్థలం యిస్తాం, నువ్వు యిల్లు కట్టుకుని తీరాలి అని ప్రభుత్వం అనదు. నువ్వు సొంతింట్లో ఉండు, బంధువులింట్లో ఉండు, అద్దింట్లో ఉండు నా కనవసరం, సమయానికి ఆఫీసుకి వచ్చి పని చేస్తే చాలు అనే ప్రభుత్వం చెప్తుంది. అందువలన ప్రభుత్వానికి అదనంగా అయ్యే ఖర్చేమీ ఉండదు. ఉద్యోగులకు ఆ రూపేణా ఒరిగేదీ ఏమీ ఉండదు.

ఇక ఉద్యోగుల కష్టం గురించి! హైదరాబాదు నుంచి అప్‌ అండ్‌ డౌన్‌ చేసే వారి గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు. పాపం వాళ్లను బాబు ఎంతో మురిపెం చేస్తే, జగన్‌ వాళ్లను యిక్కట్లపాలు చేసి వైజాగ్‌ తరిమివేస్తున్నాడు అంటున్నారు. మొదటగా తెలుసుకోదగినది బాబు చేసిన మురిపెం దేశంలో ఎవ్వరూ చేసి ఉండరు. అది ప్రజాధనంతో చేశారని మర్చిపోవద్దు. వారానికి ఐదు రోజులే పని, మీకోసం ప్రత్యేక రైళ్లు, పనిలో వెసులుబాటు... యింటూ యిన్ని వరాలు కురిపించవలసిన అవసరం ఉందా? ఉద్యోగి అన్నవాడు ఉద్యోగంలో చేరిన రోజే సంతకం పెట్టి యిస్తాడు - మీరు నన్ను ఎక్కడకి బదిలీ చేస్తే అక్కడకు వెళ్లి పని చేస్తాను అని. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బతిమాలుకుని బదిలీని మార్పించుకోవచ్చు. కానీ అదంతా యాజమాన్యం యిష్టాయిష్టాలపై ఆధారపడి వుంటుంది. ఫలానా చోటికి వెళ్లు అంటే తట్టా, బుట్టా సర్దుకుని వెళ్లవలసినదే. అందుకే 'ఉద్యోగికి దూరభూమి లేదు' అనే సామెత పుట్టింది.

బ్యాంకు ఉద్యోగులను సాధారణంగా మూడేళ్ల కో సారి బదిలీ చేస్తారు, యీ మధ్య రెండేళ్లకే చేస్తున్నారు. యాజమాన్యం అవసరం బట్టి రాష్ట్రాలు, రాష్ట్రాలు దాటి పని చేయవలసి ఉంటుంది. అక్కడి భాష వేరు, సంస్కృతి వేరు, ఆహారపు అలవాట్లు వేరు - యిలా ఎన్ని కారణాలు చెప్పినా వినరు. ఐటీ వాళ్ల విషయంలో వారం రోజుల వ్యవధిలో వేరే దేశం వెళ్లి పని చేసుకుని రా అంటారు. ప్రయివేటు ఉద్యోగుల విషయంలో ఎప్పుడైనా, ఏమైనా జరగవచ్చు. ఈ 'ఆక్యుపేషనల్‌ హజార్డ్‌' ఉందని తెలిసినా ఉద్యోగంలో ఎందుకు చేరతారంటే కరువొచ్చినా, కాటకమొచ్చినా నెల తిరిగేసరికి జీతం రాళ్లు ఠంచన్‌గా చేతిలో పడతాయి. వ్యవసాయంలో, వ్యాపారంలో ఆ సౌలభ్యం లేదు. ఉద్యోగం అనేది సేవకవృత్తి. యజమాని చెప్పినట్లు చేయాల్సిందే. అయితే ఉద్యోగికి కొన్ని హక్కులు వుంటాయి. కానీ బదిలీ నిరాకరించడం వాటిలో ఒకటి కాదు.  

ఉద్యోగ పరిస్థితులు ఎల్లకాలం ఒకేలా ఉండాలని లేదు. కొన్ని శాఖలను ఎత్తివేయవచ్చు, కొన్నిటిని కలిపివేయవచ్చు, మరి కొన్నిటిని వేరే ఊరికి పంపవచ్చు. 'ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎల్లకాలం వుంటుంది, ఎన్ని దశాబ్దాలైనా సరే నన్ను హైదరాబాదులో ఉంచుతారు అనుకుని హైదరాబాదులో యిల్లు కొన్నాను. ఇప్పుడు అమరావతికి మారిస్తే ఎలా?' అని వాదించడానికి కుదరదు. రాజకీయ కారణాల వలన రాష్ట్రం విడిపోయింది. అందువలన అమరావతికి వెళ్లు అన్నారు. ఇప్పుడు  పైకి ఏ కారణాలు చెప్పినా రాజకీయ కారణాల చేతనే రాజధాని అమరావతి నుండి మారి వైజాగ్‌కు వెళుతోంది. అక్కడకి వెళ్లు అంటే వెళ్లాల్సిందే. అమరావతికి వచ్చి మూడేళ్లు దాటింది, వైజాగ్‌లో సౌకర్యాలు తయారయ్యేటప్పటికి ఇంకో ఏడాది పడుతుంది. అమ్మయ్య, నాలుగేళ్లు ఒకే చోట ఉండగలిగాను అని సంతోషించాలి తప్ప, అమరావతికి అలవాటు పడిపోయాను, కదలను అని వాదించే హక్కు ఉద్యోగికి లేదు. 

ఇవి బాబుకి తెలియని విషయాలు కావు. అయినా ఎందుకో గాని హైదరాబాదు ఉద్యోగులను నెత్తి నెక్కించుకున్నారు. సకల సౌకర్యాలు సమకూర్చారు. దాని వలన వారి పని సామర్థ్యం పెరిగిందా అనేది మనకు తెలియదు. ఏది ఏమైనా పని చేసేచోట, కుటుంబం ఉండకపోతే సామర్థ్యం దెబ్బ తింటుంది. ఎంతసేపూ సొంత వూరు ఎంత త్వరగా వెళ్లిపోదామన్న ధ్యాసే ఉంటుంది. రెండు, మూడు సెలవులు ఒకేసారి వస్తే మరో రెండు రోజులు లీవు పెట్టి వారం దాకా కనబడకుండా పోతారు. ఏడాది మధ్యలో ఉండగా బదిలీ అయినపుడు ఉద్యోగులు సాధారణంగా కుటుంబాన్ని షిఫ్ట్‌ చేయలేరు, పిల్లల చదువు కారణంగా! తర్వాత ఎకడమిక్‌ ఇయర్‌ ప్రారంభమయేనాటికి యిల్లు మారుస్తారు. అమరావతికి దగ్గర్లో ఉన్న విజయవాడ, గుంటూరులలో విద్యాలయాలకు కొదవ లేదు. పైగా అదేమీ అడవి కాదు, వస్తువులు దొరకని చోటు కాదు. రవాణా సౌకర్యాలు లేని చోటు కాదు. ఎకడమిక్‌ ఇయర్‌ ప్రారంభమయ్యేవరకు యీ సౌకర్యాలు యిచ్చినా, తర్వాత ఆపివేయవలసింది. 

ఆపకపోవడంతో వాళ్లు హైదరాబాదు వదిలి రాలేదు. భార్య/భర్త హైదరాబాదులో ప్రయివేటు ఉద్యోగంలో లేదా తెలంగాణ ప్రభుత్వోద్యోగంలో ఉండడం, నగరం విడిచి రావడానికి బుద్ధి పుట్టకపోవడం యిలాటి వ్యక్తిగత కారణాలు ఉండవచ్చు. వాటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాధ్యులు కారు. ఉద్యోగులకు చెల్లినంత కాలం చెల్లింది. ఇకపై చెల్లేట్లు లేదు. అలా అనుకుని ఊరుకోవడం ఉత్తమం. వైజాగ్‌ వెళితే యీ అప్‌ అండ్‌ డౌన్‌లు కుదరవు. కాపురం మారిస్తే వారికీ, వారితో పనిబడే పౌరులకూ సుఖం. కాదు, హైదరాబాదు కాపురమే ముఖ్యం అనుకుంటే ఎగ్జిట్‌ గేటు ఎప్పుడూ తెరిచే వుంటుంది. ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలన్నీ నడివయసు ఉద్యోగులను ఎలా వదుల్చుకుందామా అని చూస్తున్నాయి. వాలంటరీ రిటైర్‌మెంట్‌ అడిగితే సంతోషంగా యిచ్చేస్తాయి.

తరలి వచ్చిన ఉద్యోగులు యిప్పుడిప్పుడే విజయవాడ పరిసరాల్లో యిళ్లు కట్టుకున్నారు. ఇప్పుడు వైజాగ్‌ పొమ్మంటే ఎలా పాపం? అని కొందరు వాదిస్తున్నారు. విజయవాడ యిల్లు ఎక్కడికీ పోదు, అద్దె కిస్తారు. లేకపోతే అది అమ్మేసి, వైజాగ్‌లో మరొకటి కొనుక్కుంటారు. వాటి గురించి మన కెందుకు గోల? నేను మద్రాసులో పని చేసేటప్పుడు ఒక ఫ్లాట్‌ కొన్నాను. కొన్నాను కాబట్టి నన్నక్కడే కొనసాగించాలని వాదించగలనా? హైదరాబాదు వచ్చేశాక, కొన్నేళ్లకు మద్రాసు ఫ్లాట్‌ అమ్మేసి, హైదరాబాదులో కొనుక్కున్నాను. వీటితో యాజమాన్యానికి ఏం సంబంధం?

హైదరాబాదుకి, వైజాగ్‌కి చాలా దూరం అని కొందరు వాదిస్తున్నారు. అసలు హైదరాబాదు ఉద్యోగుల మీద యింత ఫోకస్‌ దేనికి? ఆంధ్రలో ఉన్న 13 జిల్లాల ఉద్యోగుల గురించి ఎందుకు మాట్లాడరు? వారిన్నాళ్లూ దూరంగా ఉన్న హైదరాబాదులో పని చేస్తూ వచ్చారు కదా! రాష్ట్రం విడిపోయినప్పుడు బాబు ఏమన్నారు? ఉమ్మడి రాజధాని కాబట్టి హైదరాబాదులోనే పదేళ్లూ ఉంటూ ఆంధ్రను పాలిస్తాను, రాజధాని కట్టాక వెళతాను, ఆ లోపున యిక్కడ ఆంధ్రమూలాల వారికి రక్షణగా నిలుస్తాను అన్నారా లేదా? అప్పుడు యీ దూరభారాల గురించి ఆలోచించలేదా? శ్రీకాకుళం వాడు, చిత్తూరు వాడు హైదరాబాదు రావలసి వస్తోందే అని ఫీలవలేదా? 

ఆ దిక్కుమాలిన ఓటుకు నోటు కేసులో దొరికిపోయి, కెసియార్‌తో ఒప్పందం కుదుర్చుకోవడం చేత కదా, పరుగుపరుగున పారిపోయారు! పోతూపోతూ ఉద్యోగులందరికీ స్థానచలనం కలిగించారు! దానికి హైదరాబాదు ఉద్యోగులు ఏమనుకుని పోతారోనని కదా యింత బుజ్జగించారు! ఇకనైనా వాళ్లని చంక దింపడం మంచిది. ఆంధ్ర ప్రభుత్వోద్యోగుల్లో హైదరాబాదు మూలాల వారే కాదు, తక్కిన జిల్లాల వారు కూడా ఉన్నారు. తూర్పు గోదావరి జిల్లా అవతలి నుంచి ఉన్న ఉద్యోగులందరూ వైజాగ్‌ రాజధాని అంటే హర్షిస్తారు. 

ఇక ఉద్యోగుల అవస్థల మీద, ప్రభుత్వం వాటి మీద పెట్టే ఖర్చు మీద కొందరికి తెగ అనుమానాలు వచ్చేస్తున్నాయి. ప్రభుత్వోద్యోగులు కోర్టుకి వెళ్లాలంటే వైజాగ్‌ నుంచి కర్నూలు వెళ్లడం ఎంత కష్టం, ఎంత నష్టం అంటున్నారు. అసలు ఉద్యోగి హైకోర్టుకి ఎందుకు వెళతాడు? అఫీషియల్‌గా వెళ్లాల్సింది ఏదైనా ఉంటే ప్రాంతీయంగా ఉన్న సెషన్స్‌ కోర్టులోనే తేలిపోతుంది. హైకోర్టుకి ప్రభుత్వ న్యాయవాది వెళతాడు. అతనికి ఏదైనా సందేహం ఉంటే లీగల్‌ శాఖలోని ఉన్నతోద్యోగి ఎవరో ఒకరు వెళ్లవచ్చు, లేదా ఫోన్‌లోనే సందేహం తీర్చవచ్చు. హైదరాబాదు ఊళ్లో ఊళ్లోనే, వ్యక్తిగతంగా ఎవరూ కలవటం లేదు. వాట్సాప్‌లో పంపేయండి, చూసుకుంటాను అంటున్నారు. 

హైదరాబాదును దేశానికి రెండో రాజధాని చేయాలి అని తెలుగువారందరూ ముక్తకంఠంతో అడుగుతున్నారు. అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదా? వృథావ్యయం కాదా? ఆ డబ్బును అభివృద్ధిపై ఖర్చు పెట్టవచ్చు కదా! ఉద్యోగులకు కష్టం కాదా? పార్లమెంటు సెషన్‌ అయితే యావత్‌ సెంట్రల్‌ సెక్రటేరియట్‌ కదిలి రావాలంటే ఎంత కష్టం? - అనే వాదన దిల్లీ వాళ్లు చేస్తే మనం వింటామా? కానీ యిప్పుడు మాత్రం 'అసెంబ్లీ సెషన్‌ టైములో యావత్తు సెక్రటేరియట్‌ కదిలి రావలసి వస్తుంది, ఎంత ఖర్చు' అంటూ కొందరు వాపోతున్నారు. హైదరాబాదు సెక్రటేరియట్‌ స్టాఫందరూ అసెంబ్లీ భవన్‌ పక్కన అడ్డా వేసుకుని ఉండగా చూశామా? అసెంబ్లీ సెషన్లకు, ఉద్యోగులకు ఉన్న లింకు గురించి నాకు తెలిసినంత వరకు చెప్తాను. 

అసెంబ్లీలో ప్రజాప్రతినిథులు ప్రశ్నలు వేస్తారు. ఎవరు ఏమడిగినా సంబంధిత శాఖ ఆ ప్రశ్న గురించిన సమాచారం సేకరించి సంబంధిత మంత్రికి అందిస్తుంది. దాన్ని మంత్రి అసెంబ్లీలో చదువుతాడు. సెషన్‌లో వున్నన్ని రోజులూ అనేక ప్రశ్నలు వస్తాయి. అయితే అన్నిటికీ మంత్రి అప్పటికప్పుడే జవాబు చెప్పనక్కరలేదు. కనుక్కుని చెప్తాం అనవచ్చు. ఒక్కోప్పుడు వెంటనే చెప్పాల్సి వుంటుంది. సప్లిమెంటరీ ప్రశ్న వేస్తే దానికీ సమాధానం చెప్పాల్సి వుంటుంది. దానికి గాను ఉద్యోగి అసెంబ్లీ హాలుకి పక్కనే ఆఫీసర్స్‌ బాక్స్‌లో కూర్చుని వాటికి సమాధానం రాసి పంపాలి. ఇలా వెళ్లే ఉద్యోగి సాధారణంగా ఐఏఎస్‌  స్థాయివాడు అయి వుంటాడు. అందువలన అసెంబ్లీ సెషన్‌ జరిగేటప్పుడు శాఖాధిపతులు తప్ప తక్కిన వాళ్లెవరూ వెళ్లనక్కరలేదు. అందువలనే అసెంబ్లీ సెషన్‌ వేరే చోట పెట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని రాష్ట్రాలు భావించటం లేదు.

అమరావతిలో యిప్పటికే కట్టిన భవంతుల మాటేమిటి? అనే ప్రశ్న వస్తుంది. ఎగ్జిక్యూటివ్‌ కాపిటల్‌ పేర వైజాగ్‌కు సెక్రటేరియట్‌ మాత్రం తరలించి, వివిధ శాఖలను వేర్వేరు చోట్లకు పంచడం జరిగితే దీనికి సమాధానం దొరుకుతుంది. ఎందుకంటే యీ క్రమంలో కొన్ని అమరావతిలోనే ఉండిపోతాయి, కొన్ని తరలిపోతాయి. ఉండిపోయినవాటికి ఆ భవంతులు పనికి వస్తాయి. ఉద్యోగులు తరలి వెళ్లిపోయినంత మాత్రాన అభివృద్ధి ఆగిపోదు. ఉద్యోగి కుటుంబాల అవసరాలు తీర్చే వారి సంఖ్యలోనే హెచ్చుతగ్గులు వస్తాయి. సెక్రటేరియట్‌ వచ్చినంత మాత్రాన వైజాగ్‌లో ఊహూ జనాలు పెరిగిపోరు. స్టేట్‌ సెక్రటేరియట్‌లో పనిచేసే వారి సంఖ్య మహా అయితే ఎంత ఉంటుంది? ఐదు వందలా? ఆరు వందలా? అసలు రాజధానికి, అభివృద్ధికి లింకుందా? అనేది ముఖ్యమైన విషయం. దానిపై మరోసారి మాట్లాడుకుందాం.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?