cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్ : అమరావతి కేసులో గ్రామరుతో తకరారు

ఎమ్బీయస్ : అమరావతి కేసులో గ్రామరుతో తకరారు

‘ఆంగ్లంలో ఏ అంటే ఒక అని చిన్నపుడు చదువుకున్నాం కానీ కేంద్రం ఏ అంటే ఒకటి కానక్కరలేదు, బహువచనం కూడా కావచ్చని తెలిపింది’ అని ఆంధ్రజ్యోతి వాపోయింది. రాష్ట్రవిభజన చట్టంలో పేర్కొన్న ‘ఏ కాపిటల్ సిటీ ఫర్ ఆంధ్రప్రదేశ్’ అనే పదాలకు ఆంధ్రప్రదేశ్‌కు ఒక్క రాజధాని మాత్రమే వుండాలి అని అర్థం కాదని, అంతకుమించి వుండవచ్చని భాష్యం చెప్పిందని బాధపడుతోంది. అంతటితో ఆగకుండా కేంద్రం హైకోర్టు రాజధానిలోనే వుండవలసిన అవసరం లేదని కేంద్ర హోం శాఖ స్పష్టం చేయడంతో పిటిషనర్ల వాదన దెబ్బ తింది.

రాజ్యాంగంలో రాజధాని ఏర్పాటు గురించి లేదని, హైకోర్టు ప్రిన్సిపల్ సీటు రాజధానిలో మాత్రమే వుండాలని ఎక్కడా లేదని, పిటిషనర్లు తమపై అనవసరంగా నింద మోపుతున్నారని హైకోర్టుకి కేంద్రం విన్నవించింది. ఏపికి వేరుగా హైకోర్టు ఏర్పాటు చేసి, 2019 జనవరి 1 నుంచి అమరావతిని ప్రిన్సిపల్ సీటుగా నిర్ణయిస్తూ రాష్ట్రపతి 2018 డిసెంబరు 26 న యిచ్చిన ఉత్తర్వులను కేంద్రం నోటిఫై చేసినంత మాత్రాన అమరావతిని రాష్ట్రరాజధానిగా ప్రకటించేలా కేంద్రం నిర్ణయించిందని భావించేందుకు వీల్లేదని కేంద్రం వాదన.

ఇక మూడు రాజధానులు వుండవచ్చా లేదా అన్న విషయంపై - ‘‘జనరల్ క్లాజ్ చట్టం 1997లోని సెక్షన్ 13 ప్రకారం సదరు విషయానికి, సందర్భానికి భిన్నంగా వుంటే తప్ప కేంద్ర చట్టాలు, నిబంధనల్లో ఏకవచనంలో వున్న పదాలను బహువచనాలుగా, బహువచనంలో వున్న పదాలను ఏకవచనాలుగా భావించవచ్చు. అదే విధంగా పుఃలింగాన్ని స్త్రీలింగంగానూ పరిగణనలోకి తీసుకోవచ్చు.’’ అని కేంద్ర ప్రతినిథి తెలిపారు. అందువలన ‘ఏ’ అంటే ఒకటి అని కాదని స్పష్టం చేశారు.

ఇది చదువుతూంటే నాకు చిన్నప్పుడు విన్న ఓ కేసు గుర్తుకువస్తోంది. బ్రిటిషువారు మనల్ని పాలించేటప్పుడు 5 గుఱ్ఱాల బగ్గీలో వెళ్లే అధికారం కలక్టరుకు మాత్రమే వుండేదట. అయితే ఒక జమీందారు పంతం కొద్దీ 5 గుఱ్ఱాల బగ్గీలోనే ఊళ్లో ఊరేగి, కలక్టరు అధికారాన్ని ఛాలెంజ్ చేశాడు. దాంతో కలక్టరు కేసు పెట్టాడు. జమీందారుగారి పరువుకి సంబంధించిన ప్రశ్న అయింది. 

ప్రకాశం పంతులు గార్నో, ఎవర్నో ప్లీడరుగా పెట్టుకున్నారు. ప్లీడరు కోర్టుకి వచ్చి ఊరేగిన గుఱ్ఱాలను చూపించమన్నాడు. అవే అని నిర్ధారించాక ‘చూడండి, రూలు ప్రకారం 5 హార్సెస్ ఎక్కకూడదని వుంది. కానీ వీటిలో మూడు మేర్స్ (మగ గుఱ్ఱాలు). అందువలన మా జమీందారుగారు నియమోల్లంఘన చేయలేదు.’’ అని వాదించారు. కేసు కొట్టేశారు. ఇక అప్పణ్నుంచి హార్సెస్ ఆర్ మేర్స్ అని రూలు మార్చారట.

మామూలుగా కూడా లీగల్ డాక్యుమెంట్స్‌లో హీ ఇన్‌క్లూడ్స్ షీ అని కూడా చెప్తారు. రాజధాని ముక్కలు చేయడాన్ని ఎదుర్కుంటున్న పిటిషనర్లు ఆ ఒక్క ‘ఏ’ చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నారు. వ్యాకరణాన్ని నమ్ముకుంటే రణరంగంలోకి దిగితే లాభం లేదని తత్త్వం బోధపడి వుంటుంది. ఇప్పటికైనా బాబు అమరావతిని పట్టుకుని వేళ్లాడడం మానేస్తే మంచిది. 

తను సిఎంగా ఉండగా తోడుగా నిలిచిన పెట్టుబడిదారులందరకీ బాబుపై కోపంగా వుంది – బిజెపితో అనవసరంగా పేచీ పెట్టుకుని చెడ్డారని. వారిని మెప్పించడానికే ప్రస్తుతం బిజెపిని ఏమీ అనటం లేదు. విద్యుత్ మీటర్లు పెట్టమని అన్న కేంద్రాన్ని ఏమీ అనరు కానీ సరేనని ఒప్పుకున్నందుకు జగన్‌పై కారాలూ, మిరియాలూ నూరుతున్నారు. ఒకటని కాదు, ప్రతీ విషయంలోనూ యింతే.

నిజానికి సోము వీర్రాజు వచ్చిన దగ్గర్నుంచి బిజెపి ప్రతిపక్ష పాత్ర భీకరంగా పోషించేస్తోంది. ఆ స్థానం నుంచి టిడిపిని తోసిపారేయడానికి, టిడిపిని పూచికపుల్లలా తీసిపారేస్తోంది. తాము టిడిపికి ‘బి’ టీము కాదని చూపించుకుంటోంది. ఇలాటి సమయంలో టిడిపి, బిజెపికి దీటుగా సమాధానం యివ్వకపోతే ఎలా? ఇవ్వక పోవడానికి కారణం బాబు బిజెపి పట్ల మెతక వైఖరి. ఇదంతా దేనికి? ఏదో ఒక సుదర్శన చక్రం వేసి అమరావతిని కాపాడుతుందేమోనని. ఆ ఛాయలేమీ కనబడటం లేదని తాజాగా మళ్లీ రుజువైంది. అయినా బాబు తన అమరావతి పల్లవి వదలటం లేదు.

శ్రీనాథుడు తన అంత్యదశను తలచుకుంటూ వాపోయిన చాటుపద్యం ఉంది – ‘కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా పురవీథి నెదురెండ పొగడదండ..’ అని. దానిలో ‘బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి..’ అని వస్తుంది. బాబు కూడా బొడ్డులో వున్న పల్లెను నమ్మే నిండా మునిగారు. బొడ్డు రాఘవేంద్రరావుగారికి అచ్చివచ్చింది కదాని అందరికీ రమ్మంటే రాదు. తమాషా ఏమిటంటే బాబు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన తొమ్మిదేళ్లపాటు ఈ బొడ్డు థియరీ గుర్తుకు రాలేదు. ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాదు నడిబొడ్లో లేదు కదా, అయినా అన్నీ అక్కడే పెట్టారు.

విభజిత రాష్ట్రం వచ్చేసరికి బొడ్డు సిద్ధాంతం ముందుకు తెచ్చి అన్నీ అక్కడే గుమ్మరిస్తామన్నారు. జనం ఆయన్ని పట్టుకెళ్లి సెక్రటేరియట్ బయట దిమ్మరించారు. మొన్న ఒకాయన వాపోయారు. ‘అమరావతి వట్టి పేరుకేనండీ, రాజధాని అమరావతిలో పెట్టలేదు’ అని. ఇక్కడ లాజిక్ ఏమిటంటే అమరావతి ఊరుతో పని లేదు. ఆ పేరు ఘనచరిత్రను గుర్తుకు తెస్తుంది, అందుకు వాడుకున్నారు.

అమరావతి అనగానే గౌతమీపుత్ర శాతకర్ణి గుర్తుకు వస్తాడు. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అనే కమ్మ జమీందారు గుర్తుకువస్తారు. మొదటాయనపై బాలకృష్ణను పెట్టి అర్జంటుగా సినిమా తీయించేశారు. సినిమా మొత్తంలో ఆయన బ్రాహ్మడని చెప్పకుండా చాలా జాగ్రత్తపడ్డారు.

ఇక రెండో ఆయన ఒక యిన్‌స్పిరేషనల్ ఫిగర్. హైదరాబాదును తలదన్నే రాజధాని మన ఆధ్వర్యంలో కడుతున్నారనే ఉత్సాహం కమ్మ కులస్తులకు కలిగేట్లా చేసింది. అదేమీ తప్పు కాదు. నిజానికి కృష్ణా జిల్లాలో శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఉన్నాడు. మనిషిగా పుట్టి విష్ణ్వంశ కలిగినవాడిగా పేరు కెక్కాడు. శ్రీకృష్ణదేవరాయలంతటి వాణ్ని యిన్‌స్పయిర్ చేసి ‘ఆముక్తమాల్యద’ను రాయించి, అంకితం పుచ్చుకున్నాడు. ‘తెలుగు వల్లభుండ’ అని ఆయన చెప్పుకున్నట్లు రాయలు పద్యం రాశాడు.

తెలుగు వల్లభుడు వెలసిన నేలలో రాజధాని నెలకొల్పుతున్నపుడు శ్రీకాకుళమనో, మహావిష్ణుపురమనో పేరు పెట్టవచ్చు. కానీ ఆంధ్ర మహావిష్ణువు కులమేమిటో పెద్దగా తెలియదు. ఏ క్షత్రియుడనో తేలితే ఓట్ల ప్రకారం సంఖ్య చాలదు. అమరావతి అంటే కనీసం ఒక మేజర్ కులస్తులైనా ఓన్ చేసుకుంటారనుకున్నారు. చేసుకున్నారు కూడా. వారిలో చాలామంది ధనికులూ, వారి ఎంటర్‌ప్రెనార్ స్కిల్స్‌పై, భూమిపై పెట్టుబడుల విషయంలో వారి ముందుచూపుపై నమ్మకమున్న యితర కులస్తులూ విపరీతమైన ధరలకు అక్కడి భూములు కొనేసి, రేట్లు ఆకాశానికి అంటేట్లు చేశారు.

పేరు సంగతి అలా పెడితే అమరావతిపై బాబు ఎంత టైము వేస్టు చేశారో తలచుకుంటే గుండె తరుక్కుపోతుంది. ఈనాడు ‘సిఎం మారితే రాజధాని మార్చేస్తారా?’ అని బాబు హుంకరిస్తున్నారు. ఆయన మాత్రం చేసినదేమిటి? విభజన చట్టం ప్రకారం విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాదు. తెలంగాణతో బాటు పదేళ్లు పంచుకోవాలి. కానీ తను సిఎం అయిన కొన్నాళ్లకు రాజధానిని హైదరాబాదు నుంచి అమరావతికి మార్చేశారు.

హైదరాబాదుపై రాష్ట్రం హక్కు వదులుకున్నారు. హైదరాబాదే కంటిన్యూ అయి వుంటే అమరావతి రాజధాని అంటూ పెట్టిన ఖర్చు, శ్రమ, సమయం అన్నీ ఆదా అయ్యేవి. ఈ లోపున మూడు, నాలుగు నగరాలను వృద్ధి చేసి, వాటిలో ప్రతీదానికి కొన్నేసి ఎలాట్ చేసి వుండేవారు.

ఇప్పుడైతే చంద్రబాబు మూడు రాజధానుల ఐడియాను మూడు ముక్కలాట అని తీసిపారేస్తున్నారు కానీ తనకే యీ ఐడియా వచ్చి వుంటే ‘త్రిలింగదేశానికి త్రిరాజధానులు’ అనే కాన్సెప్టును ప్రమోట్ చేసేవారు. వందిమాగధులు భళాభళా అనేవారు. జగన్ రాజధాని మార్పు చేయడంలో రాజకీయ ప్రయోజనాలున్నాయని బాబు ఆరోపణ. మరి తను ఎందుకు మార్చారో చెప్పాలి. 

రాజకీయాలా? వ్యక్తిగతమైన ఒడంబడికలా? హైదరాబాదుపై హక్కులు వదులుకోవడానికి అది ఆయన సొంత ఆస్తి కాదే! 5 కోట్ల మంది ఆస్తి. ఒక నేరంలో యిరుక్కుని, దానిలోంచి బయటపడడానికి రాష్ట్రప్రయోజనాలను ధారాదత్తం చేయడం ఎంత ఘోరం!

‘జగన్ మొండివాడు, మూడు రాజధానులు వద్దని నెత్తినోరూ కొట్టుకుని చెప్తున్నా వినటం లేదు. ఫ్యాక్షనిస్టు స్వభావం ఎక్కడకు పోతుంది?’ అంటూ టీవీల్లో టిడిపి ప్రతినిథులు, వారికి వంతపాడే ‘పరిశీలకులు’ అంటూ వుంటారు. మొండితనంలో బాబు తక్కువ తిన్నారా? అమరావతిలో రాజధాని వద్దని మేధావులు, పర్యావరణవేత్తలు చెపితే విన్నారా? మూడు పంటలు పండే భూమి ఎందుకు? భూకంపాల ప్రమాదం వుంది, మెత్తటినేల కాబట్టి నిర్మాణవ్యయం ఎక్కువ, 33 వేల ఎకరాలు అక్కరలేదు.. యిలా ఎన్ని చెప్పినా విన్నారా?

శివరామకృష్ణన్ కమిటీని తీసిపారేశారు, శ్రీబాగ్ ఒడంబడికను తుంగలో తొక్కి హైకోర్టు కూడా అమరావతిలో పెట్టేశారు, ‘ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన జిల్లాలు, కేంద్రం చేస్తానన్న సాయం చేయటం లేదు’ అని పదేపదే వాపోయారు కానీ అక్కడకు హైకోర్టో, మరోటో ఎలాట్ చేశారా? 

జగన్ అమరావతి రైతులతో మాట్లాడటం లేదని ఫిర్యాదు చేసేవారు బాబు రాయలసీమ, ఉత్తరాంధ్ర వారితో కానీ భూములివ్వడానికి యిష్టపడని రైతులతో కానీ ఎప్పుడైనా మాట్లాడేరేమో చెప్పగలరా? జగన్ మొండివాడైతే బాబు జగమొండి. ఇంత చిన్న రాష్ట్రానికి అంత పెద్ద రాజధాని ఎందుకు అని ఎందరు చెప్పినా వినలేదు. మరి ఆయనలో ఏ ఫ్యాక్షనిస్టు రక్తం ఉందో తెలియదు.

తమాషా ఏమిటంటే బాబు ప్రతీదీ ప్రయివేటైజేషన్ అంటారు. తనను తాను ముఖ్యమంత్రిగా కంటె సిఇఓగా పిల్చుకోవడానికి ఎక్కువ యిష్టపడ్డారు. ప్రపంచ బ్యాంకుకి అత్యంత ఆత్మీయుడు. ప్రభుత్వం ఏదీ సరిగ్గా చేయదని, అన్ని ప్రయివేటు రంగానికి అప్పగించేసే మనిషి. అలాటాయన రాజధాని నిర్మాణానికి వచ్చేసరికి, అన్నీ ప్రభుత్వమే చేయాలన్నారు. ప్రభుత్వనిర్వహణకు కావలసిన నాలుగు భవంతులు కట్టుకుని తక్కినది ప్రయివేటు రంగానికి వదిలేస్తే వాళ్లంతట వాళ్లే 2,3 ఏళ్లలో బోల్డు కట్టిపారేసేవారు. వాళ్లకు ఆ ఛాన్సివ్వలేదీయన. ప్రభుత్వమే రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తుందన్నారు.

తన పార్టీ ఆఫీసు కట్టడం దగ్గర్నుంచి ఎల్ అండ్ టికి అప్పగించే బాబు, రాజధానికి వచ్చేసరికి సింగపూరును లాక్కుని వచ్చి వాళ్లకు భూములిచ్చేయబోయారు. ప్రయివేటు పార్టీలతో ఒప్పందం పెట్టుకుని, ప్రభుత్వంతో పెట్టుకున్నానని బుకాయించారు. అంతా రహస్యమే. జగన్ ప్రభుత్వం వచ్చి ఒప్పందం వివరాలు బయటపెట్టండి అని అడిగితే సింగపూరు కంపెనీ ఠారెత్తి, కాంట్రాక్టు వదులుకుని పారిపోయింది.

ఇప్పుడందరూ రాజధాని ముక్కలు చేస్తే రైతులకు చచ్చేటంత కాంపెన్సేషన్ యివ్వాల్సి వస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. రైతులతో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం ఎంత ఏకపక్షంగా వుందో గతంలోనే రాశాను. రాజధాని ఫలానా లోపున కడతామన్న కమిట్‌మెంటే లేదు. కట్టమని అన్నపుడు కదా కాంపెన్సేషన్ మాట వచ్చేది. మూడేళ్లు పోయాక నాలుగు భవంతులు కట్టి కట్టేశాం అనవచ్చు. రాజధాని పెద్దదా, చిన్నదా, బుల్లిదా, బుచ్చిదా అనేది ఒప్పందంలో లేదు కదా!

ఏదైనా యిరిగేషన్ ప్రాజెక్టు కని భూములు తీసుకుంటారు. అది కట్టడానికి దశాబ్దాలు పడుతుంది. మధ్యలో డిజైన్లు మారుస్తారు. కేంద్రంలో కానీ, రాష్ట్రంలో కానీ ప్రభుత్వాలు మారితే ఆ ప్రాజెక్టు మానేయవచ్చు, యింకా పైకో, కిందకో జరగవచ్చు. ఫలానా సైజు ప్రాజెక్టుకై భూములిచ్చాం, కట్టకపోతే ఎలా అని వాళ్లు కోర్టుకి వెళ్లగలరా? ‘అది భూసేకరణ. పరిహారం పుచ్చుకున్నాక రైతులకు మాట్లాడే హక్కు లేదు, కానీ యిది భూసమీకరణ. ఇక్కడ రైతులు అడగగలరు.’ అని కొంద రనుకుంటున్నారు.

ఒక్కసారి అగ్రిమెంటు చదవండి, ఎంత ఏకపక్షంగా వుందో తెలుస్తుంది. రైతులకు ఏ హక్కూ లేకుండా వాళ్ల చేత సంతకాలు పెట్టించారు బాబు. విధిలీల ఏమిటంటే యిప్పుడు వాళ్ల తరఫునే ఆయన పోట్లాడవలసి వస్తోంది.

బిజెపికి ఎంత మాలీషు చేసినా, కేంద్రం తరఫు నుంచి అమరావతి విషయంలో ఏ సహకారమూ అందటం లేదు. కోర్టులను నమ్ముకుంటే, అక్కడా కేంద్రం యిలా గ్రామర్ పాయింట్లు మాట్లాడుతోంది. పోనీ ఎలాగోలా తాత్సారం చేయించి, 2024 కల్లా అధికారంలోకి వచ్చేసి గబగబా రాజధాని కట్టేద్దామనుకుంటే, నిధులు సమృద్ధిగా వుంటాయన్న గ్యారంటీ లేదు. ఎందుకంటే బాబు మొన్న యిచ్చిన స్టేటుమెంటు చూస్తే ఆయనా జగన్ సంక్షేమ పథకాలు ఆపేట్టు లేడు.

‘ఇవన్నీ మా పథకాలే. పేరు మార్చి, తండ్రీ కొడుకుల పేర్లు పెట్టేసుకుంటున్నారు. పైగా మేం యిచ్చిన తోఫాలు, కానుకలు, అన్న క్యాంటీన్లు మానేశారు.’ అని తప్పు పట్టారు. అంటే ఆయన అధికారంలోకి మళ్లీ వచ్చినా యీ పథకాలన్నీ కొనసాగడంతో బాటు తోఫాలూ, వాయినాలూ, పసుపూకుంకుమలూ అన్నీ మళ్లీ వస్తాయన్నమాట. ఇక అమరావతి కట్టడానికి డబ్బెలా వస్తుంది? ఇప్పటికైనా బాబు అమరావతిలో అద్భుతనగరం వదలాలన్న వాదన కట్టిపెట్టి, ప్రాక్టికల్‌ సూచనలతో ముందుకు వచ్చి ఆ భారం వదుల్చుకోవాలి.

ఎవరి భూమి ఏదో తెలియకుండా కలిపేసి ముద్ద చేసేసిన అమరావతిలో భూములు వెనక్కి యివ్వడం కూడా కష్టమంటున్నారు. అందుకని ఆ మొత్తాన్ని ఒక కో-ఆపరేటివ్ అగ్రిజోన్‌గా చేస్తే బాగుంటుందని గతంలోనే సూచించాను. అక్కడి రైతులు వ్యవసాయంలో దిట్టలు. తెలంగాణలో చేసినట్లు ప్రభుత్వం సూచనలతో మంచి కమ్మర్షియల్ క్రాప్స్ పండించి, వాటిని ప్రాసెస్ చేయించి, బాగా మార్కెట్ చేయించి, భాగస్వాములందరికీ వాటాల ప్రకారం లాభాలు పంచితే దివ్యంగా వుంటుంది. చుట్టూ వున్న ప్రాంతాలన్నీ వాణిజ్యపరంగా అభివృద్ధిలోకి వస్తాయి.

రవాణా సౌకర్యాలు అమోఘంగా వున్నాయి కాబట్టి మార్కెటింగ్ కూడా యీజీయే. ఈ ప్రతిపాదనలో కష్టనష్టాలేమిటో బాబు వంటి అనుభవజ్ఞుడికే తెలియాలి. ఆయనే ఒక పరిష్కారం కనుగొని అమరావతి రైతులను గట్టున పడేయాలి. ‘తుమ్హీనే దర్ద్ దియా హై, తుమ్హీ దవా దేనా’ అని పాత హిందీపాట ఆయన ముందు ఎవరైనా పాడి వినిపించాలి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (సెప్టెంబరు 2020)

 


×