Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: యండమూరి ‘అష్టావక్ర’ 01

ఎమ్బీయస్: యండమూరి ‘అష్టావక్ర’ 01

ఇంచుమించుగా నెలకొక నవల పరిచయం చేస్తున్నాను. గత రెండు నెలలుగా సైఫై నవలలు యండమూరి ‘‘చీకట్లో సూర్యుడు’’, డా. చిత్తర్వు మధు ‘‘ఐసిసియు’’ పరిచయం చేశాను. ఈసారి మరో  యండమూరి నవల ‘‘అష్టావక్ర’’. ఆయన పేరు చెప్పగానే అనగానే తులసిదళం, తులసి గుర్తుకు రాక తప్పదు. క్షుద్రవిద్యల గురించి రాసిన సాహిత్యం కాబట్టి క్షుద్ర సాహిత్యం అని పేరు పెట్టి కొందరు ఈసడించినా వీరేంద్రనాధ్ పాప్యులారిటీ మరింత పెరిగింది కానీ తరగలేదు. ఆయన నాటకకర్తగా ప్రారంభించి, తర్వాత నవలాకర్తగా మారి, మధ్యమధ్యలో కథలు రాసి, సినిమా రచయితై, డైరక్టరై, వ్యక్తిత్వ వికాసకర్తయై.. అనేక రూపాలెత్తారు. ఏ ఫీల్డు కెళ్లినా విజయం సాధించిన దిట్ట. దానికి కారణం ఆయన కఠోర పరిశ్రమ. దేనినీ ఆయన ఆషామాషీగా తీసుకున్నట్టు కనబడదు. బాగున్న ప్రతి అంశాన్ని, క్షుణ్ణంగా అధ్యయనం చేసి, దాన్ని ఎడాప్ట్ చేసుకోవడంలో ఆయన ప్రతిభ కొట్టవచ్చినట్టు కనబడుతుంది.

'అష్టావక్ర' అనగానే యిదేదో కాష్మోరా టైపు నవలరా అనుకుంటే అది కరక్టే. ఆ టైపు నవలే. అయితే దానిలో సైన్సు కూడా కలిపారు కాబట్టి సైఫై నవల కింద దాన్ని డీల్ చేస్తున్నాను. ఏం సైన్సు, అకల్ట్ సైన్సా అని అడక్కండి. అకల్ట్ ఎలాగూ వుంటుంది, దీనిలో వీరేంద్రనాధ్ జెనటిక్స్ చర్చించారు. జెనటిక్స్ అనగానే బయోటెక్నాలజీ, జీన్ మానిప్యులేషన్, అవన్నీ అనుకుని కంగారు పడకండి. అంతదూరం పోలేదు. పుస్తకం రాసి చాలా యేళ్లయింది కాబట్టి జెనటిక్స్‌లో ప్రథమదశ అంటే బిడ్డ పుట్టుక, మేల్ ఫిమేల్ క్రోమోజోమ్స్, ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ యిటువంటివి చెప్పి, వాటితో కథ అల్లారు.

తెలుగు నవలలు చదివేవారందరికీ వీరేంద్రనాధ్ శైలి సుపరిచితమే. బోలెడు పాత్రలు. కొంత శాస్త్ర పరిజ్ఞానంపై చర్చ, అనూహ్యమైన మలుపులు. మలుపుల వద్ద కథ ఆపి యింకో చోటికి తీసుకుపోవడం, మధ్యమధ్యలో చిక్కుప్రశ్నలు. వింతవింత వృత్తుల్లో పనిచేసే ముఖ్యపాత్రధారులు. హీరో కంటె నాలుగాకులు ఎక్కువ చదివిన విలన్లు. మంచివాళ్లనుకున్నవాళ్లు నవల చివరిలో ముసుగు జారిపోయి చెడ్డవాళ్లవడం, క్లయిమాక్స్‌లో దైవికం అన్నట్టుగా మంచివాళ్లకు ఏదో ఒకటి అంది రావడం.. యిలా వుంటాయి. వీటి వల్లనే ఆయన సామాన్య గృహిణుల చేత కూడా పుస్తకం చేతపట్టించాడు.

ఈ క్షుద్రవిద్యల నవలల్లో వీరేంద్రనాధ్ అవలంబించిన విధానం ఒకటి వుంది. నవల మొదటినుండీ ఈ క్షుద్రశక్తులను ఆయనా నమ్ముతున్నాడేమో ననిపించేట్లా రాసుకొచ్చి, చివర్లో సైంటిఫిక్ రీజనింగ్ కూడా యిచ్చి శాస్త్రపరంగా కూడా యిలా జరగవచ్చేమో అనిపించాడు. ఎలా తీసుకుంటే అలాగే వుండేట్లా మలిచాడు కాబట్టే ఆయన పండిత పామరులను మెప్పించగలిగాడు. ఈ “అష్టావక్ర” ఈ నవలలో కూడా అదే టెక్నిక్ వుంది. నవల మొదట్లో కాష్మోరా అనే దుష్టశక్తి మూడోసారి భూమండలంపై రాబోతున్నాడు అని చెప్పారు. అతను అష్టావక్ర అనే పేరుతో వికారమైన రూపంతో ఉద్భవిస్తాడు. కృష్ణుడు అష్టమగర్భాన ఉదయించినట్టు, అతను కూడా ఎనిమిదో వికృత శిశువుగా పుడతాడు. అంతకుముందు ఏడుగురు వికృతరూపులు భూమిపైకి వస్తారు అని చెప్పారు.

ఆ విధంగా బొంబాయిలో ప్రతిమా అగర్వాల్ అనే ఒకామెకు వికృత శిశువు పుట్టి, పుట్టిన కొద్ది క్షణాల్లోనే చనిపోయాడు. కేరళలో మరో శిశువు. ఇంకా కొంతమంది వికృతశిశువులు పుట్టాలి. అప్పుడు అష్టావక్ర పుట్టాలి. ప్రపంచాన్ని ఏలాలి. దేవుణ్ని కాక సైతానుని నమ్మినవారినే అతడు రక్షిస్తాడు. తక్కినవాళ్లను నాశనం చేస్తాడు. ఇదీ థియరీ. ఈ అష్టావక్ర పుట్టవలసినది కేదారగౌరి అనే ఆమె గర్భాన. ఆమె తండ్రి భవానీ శంకరం బాగా డబ్బున్నవాడు. అన్నగారు రవి యిల్లు వదలి పారిపోయాడు. ఈమెకు పోలియో వల్ల కాలు అవిటి అయిపోయింది. భవానీ శంకరంగారికి దూరపు వరస చెల్లెలు కొడుకు రాకేష్ అనే అతను వాళ్లింట్లో పెరుగుతున్నాడు. అతని సవతితల్లి, తండ్రి పెట్టే బాధల వల్ల అతను దుష్టుడిగా మారిపోయాడు. వీళ్లింట్లోనే వుంటున్నా పైకి మంచివాడిగా కనబడుతూ డ్రగ్స్‌కి అలవాటు పడ్డాడు. సైకీలా అయిపోయాడు.

అవేమీ తెలియని భవానీశంకరం, వరుస కుదిరినవాడు కదాని తన కూతురికి యితన్ని ఆఫర్ చేశాడు. కానీ గౌరి యితన్ని కాదంది. అందగాడైన యితన్ని కాదని వాళ్ల క్లాసులో అతి వికారంగా వుండే ఓ పేద కుర్రవాడు సిద్దార్ధ అంటే యిష్టపడి అతన్ని పెళ్లాడతానంది. ఇది రాకేష్‌లో పగ రగిల్చింది. అతను ఉస్సోక్ అనే సంస్థలో చేరదామనుకున్నాడు. ఉస్సోక్ అంటే అండర్ వరల్డ్ సొసైటీ ఆఫ్ సీక్రెట్ అకల్ట్ అని. ఈ సంస్థ స్థాపించినది మహాదష్ట అనే వ్యక్తి. ఈ సంస్థలోకి అందరూ చేరలేరు. ఆర్నెల్లపాటు పరీక్షించాక, ఒక సభ్యుడి రికమెండేషన్ మీద కొత్త వాణ్ని రానిస్తారు. అతని పీక మీద కత్తి పెట్టి అతను ఈ సంస్థలో ఎందుకు చేరుతున్నాడో చెప్పమని ప్రశ్నలు అడుగుతారు.

తప్పుడు సమాధానాలు చెపితే ఆ కత్తితో అప్పటికప్పుడు పీక ఉత్తరించుకుపోతుంది. అతనితో బాటు అతన్ని పరిచయం చేసినవాడిది కూడా. అబద్ధం చెప్తే వాళ్లకు తెలిసిపోతుంది. ఇలా చేరినవాడికి బ్లూ స్కెలిటన్ అనే ముద్ర కొడతారు. వాళ్లు చెప్పిన దుర్మార్గాలన్నీ చేయాలి. పది పదిహేనేళ్లు అలా పనిచేశాక వైట్ స్కెలిటన్‌గా ప్రమోట్ అవుతారు. తర్వాత ఎల్లో, ఆ తర్వాత బ్లాక్.. ఫైనల్‌గా రెడ్. అప్పుడు మహాదష్టను చూసే అవకాశం కలుగుతుంది. ఈ మహాదష్ట అష్టావక్రకి కమాండర్‌గా వుంటాడన్నమాట.

ఈ రాకేష్ చాలా ఆశాపరుడు. మహాదష్టను కూడా దాటి వెళిపోదామని చూసేటంత దురాశాపరుడు. అతనికి ఉస్సోక్ సభ్యుడు ఒకడు కనబడి ఒక అదేశం యిచ్చాడు. మహా మాంత్రికులైన విషాచి, కాద్రాల ఎముకల పొడిని కృష్ణాపురం అనే గ్రామం పైర్లలో జల్లాలి. ఆ తరువాత ఎనిమిదిమంది వికృత శిశువులు ఆ గ్రామంలో పుడతారు. ఎనిమిదోవాడు అష్టావక్రుడు. అతను గర్భాన్ని చీల్చుకుని బయటకు వస్తాడు. అలా పుడుతూనే తల్లిని చంపుతాడు. తర్వాత తండ్రి చావుకి కారణభూతుడవుతాడు. ఆ ఎముకల పొడిని చల్లే పని రాకేష్‌కు అప్పగించారు. రాకేష్, (కేదార)గౌరి, సిద్ధార్థ అందరూ అగ్రికల్చరల్ బియస్సీ స్టూడెంట్స్, ప్రాక్టికల్స్ కోసం కృష్ణాపురం వచ్చివున్నారు. అందువల్ల అతను ఓ అర్ధరాత్రినాడు వాళ్లు చెప్పినట్టే చల్లాడు. ఆ తర్వాత నుండి కొన్నాళ్లకు ఆ వూరిలో వికృతంగా వున్న పిల్లలు పుట్టడం మొదలెట్టారు.

అది ఆ వూళ్లో వున్న డాక్టర్ రంగప్రసాద్‌ను కలవరపరిచింది, అతను 'పెద్ద డాక్టరే అయినా ఓ ఆదర్శం కోసం ఆ పల్లెటూళ్లో వుండి వైద్యం చేస్తున్నాడు. పిల్లలు ఎందుకిలా పుడుతున్నారో అతనికి అంతు పట్టడం లేదు. పరిశోధన చేస్తున్నాడు. డాక్టర్ రంగప్రసాద్‌ది ఓ వింతగాథ. అతని తండ్రి హరిహరరావు 'పెద్ద డార్టర్. జెనెటిక్స్‌లో చాలా పరిశోధనలు చేసి, ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ పద్ధతులు కనుగొన్నాడు. అంటే కృత్రిమ గర్భధారణ అన్నమాట. టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి చాలా చర్చే జరుగుతోంది కాబట్టి యీ విషయాలు మీరు యింతకుముందే వినివుంటారు కాబట్టి ఎక్కువ చెప్పటం లేదు. సింపుల్‌గా చెప్పాలంటే మగవాడి వీర్యంలో కౌంట్ తక్కువ వుంటే పిల్లలు పుట్టరు. ఎందుకంటే అన్నీ స్త్రీ అండాన్ని చేరవు. మధ్యలో కొన్ని వ్యర్థంగా పోతాయి. ఈ డాక్టరుగారి వీర్యంలో జీవకణాలు 25 శాతం జీవకణాలున్నాయి మాత్రమే వున్నాయి. అవీ వ్యర్థంగా పోతూండడం వలన పెళ్లయి అయిదారేళ్లయినా ఆ దంపతులకు పిల్లలు పుట్టలేదు.

తను చేసే ప్రయోగాలు భార్యమీదనే చేస్తే మంచిదనుకుని ఆయన వీర్యాన్ని పట్టి దానిలోని జీవకణాలను తన అసిస్టెంటు డాక్టర్ విలియమ్స్ ద్వారా వేరుచేయించి, తన భార్యలో అండానికి చేరువగా ప్రవేశపెట్టించాడు. రెండు నెలల్లో ఆమె గర్భవతి అయి ఈ డాక్టరు రంగప్రసాద్ పుట్టాడు. ఈ డాక్టర్ రంగప్రసాద్ పెద్దవాడయి డాక్టరయ్యి అంతా బాగుంది అనుకునే సనుయంలో హరిహరరావు వద్ద గతంలో పనిచేసిన డాక్టర్ విలియమ్స్ అనే అతను యితని వద్దకు వచ్చాడు. "నేను చావుబతుకుల్లో వున్నాను. నిన్ను చూసి పోదామని వచ్చాను." అన్నాడు. “నన్నెందుకు చూడడం?” అంటే “నాకు భార్య లేదు, పిల్లలు లేరు. నువ్వు నా కొడుకువి. నా ఏకైక వారసుడివి. " అన్నాడు. అదెలాగ? అంటే కథ చెప్పాడు - ఇతని తండ్రి తన వీర్యం యిచ్చి యితన్ని ప్రయోగించమన్నాడు కదా. దానిలో చూస్తే ఒక్క జీవకణం కూడా లేదు. అప్పటికే ఆయనకు వంధ్యత్వం వచ్చేసింది. పిల్లలు పుట్టే ఛాన్సు బొత్తిగా లేదు. అందువల్ల డాక్టరు దంపతులు బాధపడకుండా ఈ విలియమ్స్ తన వీర్యాన్ని టెస్ట్ ట్యూబ్ లో నింపి హరిహరరావు భార్యలో ప్రవేశ పెట్టాడట. ఆ విధంగా రంగప్రసాద్ విలియమ్స్ కొడుకు తప్ప హరిహరరావు కొడుకు రాదు.

ఈ మాటలు చాటుగా విన్న రంగప్రసాద్ తల్లి అక్కడికక్కడ గుండె పగిలి చచ్చిపోయింది. అతని తండ్రి వైరాగ్యంతో యిల్లు వదిలి హిమాలయాలకు వెళ్లిపోయాడు. ఈ కథంతా విన్న రంగప్రసాద్ పెళ్లి, పిల్లలు అంటేనే అసహ్యం పుట్టి బ్రహ్మచారిగా మిగిలి, ఈ పల్లెటూరికి వచ్చి వైద్యం చేసుకుంటున్నాడు. డాక్టర్ హరిహరరావు వ్యక్తిగత జీవితంలో విషాదం తక్కిన డాక్టర్లకు తెలియదు. భార్యపోయిన వైరాగ్యంలో వైద్యవృత్తి విడిచి పెట్టేశా డనుకుంటున్నారంతే! ఆయనను జెనెటిక్స్ పితామహుడిగా మన్నిస్తూ సభలు జరుపుకుంటున్నారు. ఆ సభను నిర్వహించిన డా. వంశీకృష్ణ అనే జెనెటిక్స్ డాక్టర్ ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ సెంటర్‌లో ఆ ప్రక్రియ గురించి గొప్పగా చెబుతూంటే రంగప్రసాద్ అతనితో విభేదించాడు. ఇదే నా జీవితాన్ని నరకప్రాయం చేసిందంటూ తన కథ చెప్పాడు.

ఈ రంగప్రసాద్ కృష్ణాపురంలో సంభవించిన వింత జననాల గురించి ‘సైన్సు ఇండియా’ పత్రికా విలేఖరితో మాట్లాడి దాన్ని ప్రపంచం దృష్టికి తెచ్చాడు. అష్టావక్ర ఆగమనానికి రహస్యంగా ఏర్పాట్లు చేస్తున్న ఉస్సోక్ వాళ్లకు రంగప్రసాద్ చేసిన పని నచ్చలేదు. అతన్ని చంపడానికి రాకేష్ జాగిలాలను పంపాడు. కానీ సరైన సమయంలో గౌరి అనుకోకుండా అక్కడకు వచ్చి రక్షించింది. రాకేష్ యిలాటి అతి త్వరగా క్రూరమైన పనులు చేసి మహాదష్టకు చేరువయ్యాడు. వాళ్లు ఒరిస్సాలో బిస్తా గ్రామానికి వెళ్లి అక్కడ విషాచి సమాధి వద్దకు మహారథతో సహా వెళ్లి ఓ పెట్టి సంపాదించాడు. అక్కడ అష్టావక్ర జననం గురించి రాసిన సమాచారాన్ని మహాదష్ట కంటబడకుండా తన దగ్గరే దాచేశాడు. కాష్మోరా అంశతో అష్టావక్ర గౌరి గర్భాన పుట్టాలని మహాదష్ట నిర్ణయించాడు. దానికిగాను దుష్టముహూర్తంలో పెళ్లి కావాలి. అమావాస్య నాడు ఆరుబయట గర్భాదానం జరగాలి.. యిలా ఏవో కండిషన్లు వున్నాయి. రాకేష్ అవన్నీ జరిగేట్టు చూశాడు. కానీ తన అనుమతి లేకుండా రంగప్రసాద్‌ను చంపబూనడం మహాదష్టకు కోపం తెప్పించింది. ఓ భూతయజ్ఞం చేయమని రాకేష్‌ను ఆజ్ఞాపించాడు. దానికి డబ్బు కావాలి. వెళ్లి గౌరిని అడిగాడు. ఆమె నాన్న యిస్తాడు. వెళ్లు అంది.

రాకేష్ ‘మామయ్యా’ అంటూ భవానీ శంకరం వద్దకు వెళ్లాడు. ఆయన అప్పటికే రాకేష్ సైకోపాత్ అని కనుగొన్నాడు. అతనిమీద డిటెక్టివ్‌లను పెట్టి అతని వివరాలన్నీ సేకరించాడు. మత్తుపదార్థాలకు బానిసయ్యాడని, రహస్య సమాజాల్లో తిరుగుతున్నాడని, సైకియాట్రిస్టు వద్ద ట్రాన్సులోకి వెళ్లి తన దుష్ట ఆలోచనలను వెళ్లగక్కాడని అన్నీ చెప్పి నిజమేనా అని అడిగాడు. అప్పుడు రాకేష్ తన కడుపులో దాచుకున్నదంతా వెళ్లగక్కాడు - 'మీరంటే నా కసహ్యం. నేను ఉస్సోక్ సభ్యుణ్ని, ఉస్సోక్ ప్రభువైన కుట్టి సైతాన్ అష్టావక్రుడి రూపంలో నీ కూతురి గర్భాన పుట్టేట్టు చేస్తున్నాం." అని అంటూ పేపర్‌నైఫ్‌తో అతన్ని చంపేశాడు. అతను ఛస్తూ ఛస్తూ సెక్రటరీకోసం పెట్టుకున్న డిక్టాఫోన్ నొక్కాడు. ఈ సంభాషణలో చివరి భాగం దానిలో రికార్డయింది. ఆ టేప్‌ను ఎవరూ పట్టించుకోలేదు. ఈ హత్యను యాక్సిడెంటుగా బనాయించేశాడు రాకేష్, ఆ యింట్లో యిద్దరు పనివాళ్లు కూడా ఉస్సోక్ సభ్యులే. వారి సహాయంతో కేసు మాఫయిపోయింది.

కృష్ణాపురంలో ఓ అవతార్ బాబా వెలిసాడు. తనను నమ్ముకుంటే వికృత శిశువులు పుట్టకుండా చేస్తానని ప్రచారం చేసుకున్నాడు. అతనికి ఉస్సోక్ సభ్యులు బోల్డంత ప్రచారం కలిగించారు. అయితే కొన్నాళ్లకు అతన్ని చంపేసి అతని స్థానంలో మెయిన్ విలన్ ప్రవేశించాడు. గడ్డాలూ, మీసాలూ వుంటాయి కాబట్టి మనిషి మారిపోయాడని ఎవరూ గుర్తుపట్టలేదు, ఈ బాబా మహాత్మ్యాలు అంటూ గూనివాళ్లకు గూని పోగొట్టి, ఇంకోళ్లకు కడుపునొప్పి పోగొట్టి అంతా డ్రామాలాడారు. వాళ్లంతా వీళ్ల మనుష్యులే. కానీ మూఢభక్తులకు కొదవ ఉండదుగా, తీర్థప్రజలా జనాలు వచ్చిపడుతున్నారు. ఆ బాబా ఆశ్రమం చాలా ఘోరాలకు నిలయంగా మారింది. మన హీరోయిన్ గౌరి హేతువాది. ప్రజల్లో ఈ మూఢభక్తి పోగొట్టాలన్న ఉద్దేశంతో బాబాను వేళాకోళం చేయబోయింది. ఓ సారి వెళితే ఆమెకు ఆడపిల్ల పుడుతుందని చెప్పాడు, మరోసారి వెళితే మగపిల్లాడు అన్నాడు. చూశారా, మీ జోస్యం అని వెక్కిరించింది. దాంతో బాబాకు ఒళ్లు మండి, ‘‘నీ కడుపున అష్టావక్రుడు పుట్టుగాక” అని శపించాడు. అప్పటిదాకా ఆ పేరు వినని గౌరికి ఆ పేరు వింతగా తోచింది.

ఇందాకా డాక్టర్ రంగప్రసాద్‌ను యింటర్వ్యూ చేసిన సైన్సు విలేఖరి అన్నాను కదా, అతని పేరు రవి. ఇంట్లోంచి పారిపోయిన గౌరి అన్నగారు. తండ్రి పోయిన వార్త తెలుసుకుని చెల్లిని ఓదార్చడానికి వచ్చాడు. మామగారి మరణం తర్వాత సిద్ధార్థ కాపురం కృష్ణాపురానికి మార్చేశాడు. అక్కడికే వెళ్లి పలకరిస్తూండగానే రాకేష్ వచ్చి రెండు లక్షల చెక్కు గురించి అడిగాడు. రాకేష్‌ను చూస్తూనే రవి సందేహించాడు. రవి మంచి మెజీషియన్. వైట్ షాడో పేరుతో మాజిక్‌లు చేస్తూంటాడు. అతనికి తగ్గ ఓ అమ్మాయి రంజిత అని పరిచయమైంది. ఆమె ప్రొఫెసర్ జయదేవ్‌కి చుట్టం. ఈ జయదేవ్ తులసిదళం నవలలో పరిచయమవుతాడు మనకు. ఆయన గొప్ప సైంటిస్టు. ఈమెకో వాచీ బహుమతిగా ఇచ్చాడు అది వైబ్రేషన్స్ యిస్తుంది. రెండు అడుగుల దూరం వరకు ఆ పరిధిలో వున్నవాళ్లను వీళ్లు చెప్పేది నమ్మేట్టు చేస్తుంది. ఈ వాచి పెట్టుకుని ఆ రంజిత ఈ వైట్ షాడో (రవి) నే మెస్మరైజ్ చేయగలిగింది.

ఆమెను చూసి రవి ముచ్చటపడ్డాడు. ‘మా చెల్లెల్ని అవమానించిన అవతార్‌ బాబాను ఎక్స్‌పోజ్ చేద్దాం. మీరు గర్భవతిగా వేషం వేసుకుని రండి. నేను భర్తగా నటిస్తాను. అతను ఆడపిల్లనో, మగపిల్లాడనో ఏదో చెప్తాడు కదా, అప్పుడు వేషం విప్పేసి, వెక్కిరిద్దాం’ అన్నాడు. ఇద్దరూ సై అంటే సై అనుకుని బాబా దగ్గరకి వెళ్లారు. కానీ అప్పటికే రాకేష్ వీళ్ల గురించి బాబాకు చెప్పేశాడు. దాంతో అతను “నీది దొంగ కడుపు. ఈ పనికి నా శాపం అనుభవించు. నీకు సద్యోగర్భం వస్తుంది.” అంటూ రంకెలు వేశాడు. కథ యిలా అడ్డం తిరిగినందుకు పశ్చాత్తాప పడి షాడో రంజితను పెళ్లి చేసుకుంటానని ఆఫర్ చేశాడు. అతనంటే యిష్టపడిన రంజిత సరేనంది.

ఈ ఉస్సోక్ వాళ్లు మేధావులను కూడా ఆకర్షించడం మొదలెట్టారు. మామూలు భక్తులను ప్రేరేపించి ఆత్మాహుతి దళాలుగా తయారు చేయించి, విదేశీ నాయకులను హత్య చేయించడం, ఆ కారణంగా భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడం యిది వాళ్ల ప్లాను. భారతదేశంలో ఆందోళన రేగినప్పుడు తమ సంఘ సభ్యుడైన ఆర్మీ కమాండర్ ద్వారా సైన్యసహాయంతో దేశాన్ని వశపరుచుకోవాలని ఐడియా వేశారు. రాకేష్ వీటన్నిటిలోనూ ముందున్నాడు. వీలైతే మహాదష్టను కూడా పక్కకు తప్పించి తనే అష్టావక్రకు కుడిభుజమవుదామని కలలు కంటున్నాడు. ఆ సమయంలో రంజిత కంట భవానీశంకరం టేపు పడింది. రంజిత ఓ సారి చనిపోయిన మావగారి గది శుభ్రం చేస్తుంటే డిక్టాఫోన్ చూసింది. ఏముండాని నొక్కింది. రాకేష్ మాటలున్నాయి కదా, ‘కుట్టి సైతాన్ అష్టావక్రుడి రూపంలో నీ కూతురి కడుపున పుడతాడు’ అని, అవి వినబడ్డాయి. ఇంకా వినబోతూండగానే రాకేష్ అనుకోకుండా అక్కడకు వచ్చాడు. ఓ ఇనుపరాడ్ పెట్టి చాటుగా ఆమె నెత్తిమీద కొట్టాడు. ఆమె స్పృహ తప్పి పడిపోతూ వుంటే షాడో వచ్చి ఆమెను ఆసుపత్రికి తీసుకుపోయాడు. తనకు లభించిన వ్యవధిలో, రాకేష్ టేపును కాల్చేశాడు. తర్వాతి భాగం యండమూరి ‘‘అష్టావక్ర’’ 02లో చదవండి. (సశేషం)

– ఎమ్బీయస్ ప్రసాద్ (మే 2022)

mbsprasad@gmail.com

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా