Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: శిందే చాప కిందకు నీళ్లు?

 ఎమ్బీయస్‍: శిందే చాప కిందకు నీళ్లు?

మహారాష్ట్రలో శరద్ పవార్ సోదరుడి కొడుకు అజిత్ పవార్ ఎన్‌సిపి 53 మంది ఎమ్మెల్యేలలో 40 మంది ఎమ్మెల్యేల సంతకాలు సేకరించి, వారితో సహా బిజెపిలో చేరబోతున్నాడన్న పుకార్లు నాలుగు రోజుల క్రితం వచ్చాయి. 2019లో కూడా అజిత్ బిజెపితో చేతులు కలిపినట్లే కలిపి మళ్లీ వెనక్కి వెళ్లిపోయాడు. ఈసారీ అలాటి డ్రామాయే ఆడతాడేమో, పట్టించుకో నక్కరలేదు అని మనం అనుకునే లోపు అజిత్ ఏప్రిల్ 18 మంగళవారం నేను చచ్చేదాకా ఎన్సీపిలోనే ఉంటాను అన్నాడు. కానీ మర్నాడే శిందే శివసేన వర్గపు అనుచరుడు సంజయ్ శీర్శత్ ప్రెస్ మీట్ పెట్టి అజిత్ బిజెపిలో చేరితే తాము ప్రభుత్వం నుంచి వైదొలగుతామని ప్రకటించి, ఆ విధంగా బిజెపిని హెచ్చరించాడు. ‘ఎన్సీపిలో యిమడలేక అజిత్ ఒక్కడూ వస్తే ఫర్వాలేదు కానీ కొందరు ఎన్సీపి నాయకుల్ని వెంటపెట్టుకుని వస్తే మాత్రం మేం తప్పుకుంటాం.’ అని వివరించాడు. అజిత్ కూడా కలిసి వస్తే అధికార కూటమి బలం మరింత పెరుగుతుంది కదా. మరి శిందేకు బాధేమిటి?

బిజెపితో విడిపోయాక, ఎన్సీపి కాంగ్రెసులతో చేతులు కలిపి అధికారంలోకి వద్దామనుకున్నపుడు ఉద్ధవ్ తన పార్టీ తరఫున శిందేయే ముఖ్యమంత్రిగా ఉంటాడని ప్రతిపాదించాడు. కానీ శరద్ దానికి అడ్డుపడ్డాడు. నువ్వే ఉండాలన్నాడు. నాకు కుదరదు, మా అబ్బాయి ఉంటాడు అంటే అదీ కుదరదన్నాడు. ఇక యిష్టం లేకుండా ఉద్ధవే కావలసి వచ్చింది. శరద్ కారణంగా ముఖ్యమంత్రి పదవి పోయిందనే కోపం శిందేలో ఉండిపోయింది. ఉద్ధవ్ ముఖ్యమంత్రి అయ్యాక స్వభావరీత్యా, అనారోగ్యరీత్యా ఎవరితో కలవకుండా ఉండేవాడు. అదే అదనుగా ఎన్సీపి పెత్తనం చలాయించింది. ఇవన్నీ చూసి సహించలేక శిందే తిరగబడి, బిజెపితో రహస్యంగా చేతులు కలిపి, కుట్ర చేసి, శివసేన చీల్చి పది నెలల క్రితం చచ్చీచెడి ముఖ్యమంత్రి అయ్యాడు. తీరా చూస్తే యిప్పుడు మళ్లీ అజిత్ తయారవుతానంటున్నాడు. అదీ శిందే కోపం!

శరద్‌కు, లేదా అజిత్‌కు బిజెపిలోకి వచ్చే ఉద్దేశమే లేదు, రానిచ్చే ఉద్దేశం బిజెపికి లేదు అనుకోవడానికి వీల్లేకుండా ఉంది, శిందే వర్గం ఆగ్రహం చూస్తే! వాళ్లు అధికారంలో ఉన్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల రిపోర్టులు వస్తూంటాయి. అజిత్, బిజెపిల మధ్య ఎంతోకొంత యాక్టివిటీ జరిగిందని వాళ్లు చెప్పి ఉంటారు. వాళ్లని రానిస్తే కుదరదు, వాళ్లయినా ఉండాలి, మేమైనా ఉండాలి అని శిందే బిజెపికి హెచ్చరిక జారీ చేసేటంత సీరియస్‌గా మేటర్‌ ఉంది అని అర్థమౌతోంది. బుధవారం యీ ప్రకటన రాగానే, శుక్రవారం అజిత్ ఒక పత్రికకు యిచ్చిన యింటర్వ్యూలో ‘‘నేను 2024 దాకా ఆగనక్కర లేకుండా యీ లోపునే ముఖ్యమంత్రి కాగలను.’’ అన్నాడు. దీని అర్థం బిజెపి శిందేను తీసిపారేసి, తననే ముఖ్యమంత్రి చేయవచ్చనా? ‘ఆహా, అదే అర్థం’ అన్నాడు ఉద్ధవ్ కుడిభుజం సంజయ్ రావూత్ శనివారం మధ్యాహ్నం!

‘తమతో చేరమని, లేకపోతే కేసులు పెడతామని అజిత్‌పై బిజెపి చాలా ఒత్తిడి పెడుతోంది. అతను ఆందోళనలో ఉన్నాడు. శిందేను దింపేసి అతను ముఖ్యమంత్రి అయితే మేం స్వాగతిస్తాం. కొందరు అర్హత లేకపోయినా ఆ గద్దె మీద కూర్చున్నారు. అజిత్ ఐతే అర్హత కలవాడు. ఉప ముఖ్యమంత్రిగా చాలా ఏళ్లు చేశాడు.’ అన్నాడు సంజయ్. తమకు ద్రోహం చేసిన శిందేపై ఉద్ధవ్ వర్గానికి ఆ మాత్రం కోపం ఉండడం సహజం. పైగా ముందురోజే కళ్యాణ్‌లో ఉద్ధవ్ వర్గ నాయకుడు, డిప్యూటీ జిల్లా చీఫ్ అయిన అరవింద్ మోరేను శిందే తన వర్గంలోకి ఫిరాయింప చేసుకున్నాడు.

శరద్ పవార్‌కు అదానీకి 20 ఏళ్లగా చాలా మంచి సంబంధాలున్నాయి. శరద్ తన ఆత్మకథలో అదానీని మెచ్చుకున్నాడు కూడా. ఏప్రిల్ నెల మొదటి వారంలోనే శరద్ హిండెన్‌బర్గ్ నివేదికను తప్పుపట్టాడు. ‘అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయమని ప్రతిపక్షాలు అడగడం తప్పు’ అని ప్రకటించాడు. ఏప్రిల్ 18 గురువారం నాడు అదానీ వచ్చి స్వయంగా కలిశాడు. మర్నాడే శరద్ కూతురు సుప్రియా సూలే వచ్చే రెండు వారాల్లో దిల్లీలో, మహారాష్ట్రలో రెండు విస్ఫోటనాలు జరగబోతున్నాయి అంటూ ప్రకటించింది. మరో పక్క అజిత్ బిజెపితో చేతులు కలపడం మంచిదని పార్టీలో వాదిస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి. శుక్రవారం నాడే అజిత్ ‘2024కు ముందే ముఖ్యమంత్రి పదవి కోరడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అన్నాడు. ఇవన్నీ గుదిగుచ్చి చూస్తే శరద్ మద్దతు ఉందో లేదో తెలియదు కానీ అజిత్ బిజెపితో చేతులు కలుపుతాడని తోస్తోంది. అతను వస్తే శిందే వెళ్లడం ఖాయం.

ఎందుకిలా జరిగి ఉంటుంది? మహారాష్ట్రలో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏమిటి? శిందే-బిజెపిల మధ్య ఘర్షణ ఏదైనా ఉందా? అనే ప్రశ్నలకు సమాధానం వెతకడమే యీ వ్యాసోద్దేశం. ఇదంతా ఒట్టి ఊహాగానమే, శిందే శివసేన, బిజెపి పాలూనీళ్లలా కలిసిపోయాయి అని ఎవరైనా అంటే మరి ఆగస్టు నుంచి మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతోందేమని అడగాలి. అంతేకాదు, మార్చి నెల మధ్యలో బిజెపి రాష్ట్రాధ్యక్షుడు చంద్రశేఖర్ బావన్కులే తన పార్టీ నాయకుల సమావేశంలో ‘‘రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 288 స్థానాల్లో మనం 240టిలో పోటీ చేస్తాం. శిందే శివసేనకు 48 మాత్రమే వదులుతాం. వాళ్లకు యిప్పుడున్నది 40 మందే కదా’’ అన్నాడు. 48 స్థానాలే యిస్తే యిక వాటిలో గెలిచేవెన్ని? ఇది బయటకు రాగానే, మొదటి పేరాలో చెప్పిన సంజయ్ శీర్శత్ భగ్గుమన్నాడు. చంద్రశేఖర్ సర్దుకుని, ‘సీట్ల పంపిణీపై యింకా కసరత్తు చేయాలి’ అన్నాడు. తమకు మళ్లీ అధికారం రావడానికి సాయపడిన శిందేను బిజెపి చిన్నచూపు చూడడం దేనికి అంటే అతను ఎమ్మెల్యేలను తీసుకుని రాగలిగాడు కానీ పార్టీ మొత్తాన్ని తెచ్చి వీళ్లకు కట్టబెట్ట లేకపోయాడు.

శిందే వెంట నడిచిన ఎమ్మెల్యేలలో చాలామందిపై కేంద్ర సంస్థలు కేసులు పెట్టి వారిని లొంగదీసుకుందని పార్టీ కార్యకర్తల్లో గట్టి నమ్మకముంది. అందుకే వాళ్లు ఉద్ధవ్‌ను విడిచి పెట్టలేదు. మార్చి2న పుణెలోని కస్బాపేట్‌లో జరిగిన ఉపయెన్నికలో యిది నిరూపించబడింది. ఆ స్థానాన్ని 1995 నుంచి బిజెపియే గెలుస్తూ వచ్చింది. సిటింగ్ బిజెపి ఎమ్మెల్యే మరణిస్తే జరిగిన ఉపయెన్నికలో ఉద్ధవ్, ఎన్సీపిల మద్దతుతో కాంగ్రెసు అభ్యర్థి బిజెపి అభ్యర్థిని 11వేల ఓట్ల తేడాతో ఓడించాడు. అక్కడ ఉన్న 15వేల శివసేన ఓట్లు ఉద్ధవ్ మద్దతిచ్చిన అభ్యర్థికే పడ్డాయి. ఇది బిజెపికి షాకిచ్చింది. అదే సమయంలో జరిగిన చించ్‌వాడ్ ఉపయెన్నికలో బిజెపి 36 వేల మెజారిటీతో ఎన్సీపి సిటింగ్ సీటును గెలిచింది. కలాటే అనే ఎన్సీపీ రెబెల్ అభ్యర్థి 44వేల ఓట్లు చీల్చకపోతే ఏమయ్యాదో తెలియదు.

మహారాష్ట్రలో 2024 ఏప్రిల్‌లో 48 సీట్లకు పార్లమెంటరీ స్థానాలకు, అక్టోబరులో 284 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా మహారాష్ట్రలో గెలుపు చాలా ముఖ్యమైనది. 2019 పార్లమెంటరీ ఎన్నికలలో బిజెపి-శివసేన కూటమికి 48లో 41 వచ్చాయి. ఎన్సీపికి 4, కాంగ్రెసుకు 1, యితరులకు 2. కూటమిలో బిజెపికి 23, శివసేనకు 18 వచ్చాయి. ఇప్పుడు 18 సీట్లు తెచ్చే సత్తా శిందేకు ఉందా లేదా అన్నది బిజెపికి సందేహంగా ఉంది. బిజెపి-శిందే పాలన అద్భుతంగా ఉందని వాళ్లే అనుకోవటం లేదని స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ పోతున్నారంటేనే తెలుస్తోంది. పార్లమెంటు ఎన్నికలైతే మోదీ మ్యాజిక్‌తో గెలవవచ్చేమో కానీ అసెంబ్లీ ఎన్నికలలో దెబ్బ పడుతుందన్న భయంతో, అసెంబ్లీ ఎన్నికలను ముందుకు జరిపి పార్లమెంటు ఎన్నికలతో కలిపి నిర్వహించమని రాష్ట్ర బిజెపి యూనిట్ అధిష్టానాన్ని కోరుతోందిట.

ఇక్కడ సమస్యేమిటంటే శివసేన స్వభావానికి, బిజెపి స్వభావానికి, వాళ్లవాళ్ల ఓటు బ్యాంకులకు మౌలికంగా వ్యత్యాసం ఉంది. మరాఠీ ఆత్మగౌరవం (అస్మిత అంటారు వాళ్లు), బయటివాళ్ల ప్రాబల్యాన్ని నిరోధించడం, స్థానికులకు ఉద్యోగాలు డిమాండ్ చేయడం యివన్నీ శివసేన ఆవిర్భావానికి కారణాలు. వాళ్లవి రౌడీ రాజకీయాలు. అందుకని మరాఠీ వర్కింగ్ క్లాస్‌ను అది ఆకట్టుకుంది. తర్వాతి రోజుల్లో హింసోన్మాదం తగ్గాక మిగతావాళ్లను కూడా అది కలుపుకుంది.  బాల ఠాక్రే తండ్రి, అతని స్ఫూర్తి ప్రదాత అయిన ప్రబోధాంకర్ హిందూత్వవాది కాదు. ద్రవిడోద్యమ పెరియార్‌లా మూఢనమ్మకాలకు, బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడినవాడు. బాల ఠాక్రే మొదట్లో కమ్యూనిస్టులకు, యూనియన్ లీడర్లకు, దక్షిణాది ఉద్యోగులకు, వ్యాపారస్తులకు వ్యతిరేకంగా హింసాత్మకంగా పోరాడుతూ గుర్తింపు తెచ్చుకున్నాడు. బొంబాయి నగరంలోనే అతని పలుకుబడి బాగా ఉండేది. కొంతకాలానికి బలం క్షీణించడంతో హిందూత్వ విధానానికి మళ్లాడు.

బిజెపిది తొలి నుంచి హిందూత్వ విధానమే. మరాఠీ ప్రాంతీయవాదాన్ని ప్రోత్సహించలేదు. ఎందుకంటే దాని మద్దతుదారుల్లో గుజరాతీలు, మార్వాడీలు, జైన్‌లు, యితర ప్రాంతాల నుంచి వచ్చిన మధ్యతరగతి వాళ్లు, ఎగువ మధ్యతరగతి అగ్రవర్ణ మహారాష్ట్రులు ఉన్నారు. ఇది కూడా నగరాల్లోనే! గ్రామాల్లో పట్టు ఉన్నది కాంగ్రెసుకు, తర్వాతి రోజుల్లో దానిలోంచి చీలి వచ్చిన ఎన్సీపికి. మహారాష్ట్రలో అవినీతి ఆరోపణలు లేని నాయకులు అతి తక్కువగా కనిపిస్తారు. పార్టీ ఫిరాయింపులూ ఎక్కువే. ఆ విధంగా బిజెపి-సేన గ్రామీణ ప్రాంతాలకు, కాంగ్రెసు, ఎన్సీపి నగరాలకు కూడా విస్తరించాయి. శివసేన-బిజెపి కూటమిగా ఉన్నపుడు పరస్పరపూరకాలుగా ఉంటూ కొన్నిసార్లు విజయాన్ని చవి చూశాయి. మోదీ వచ్చాక శివసేనది కింది చేయి అయి, బిజెపిది పైచేయి అయింది.

తనకిచ్చిన మాట తప్పారంటూ ఉద్ధవ్ బిజెపి కూటమిలోంచి బయటకు వచ్చేసి, బద్ధశత్రువులైన ఎన్సీపి, కాంగ్రెసులతో చేతులు కలిపి ప్రభుత్వం ఏర్పరచడం అందరికీ తెలిసినదే. శివసైనికులు దీన్ని ఆమోదించడానికి కష్టపడుతున్నారనే భావాన్ని వ్యాప్తి చేసి శిందే బాల ఠాక్రే ఆశయాలు నిలబెట్టాలంటే బిజెపితో కలవాల్సిందే అంటూ ఉద్ధవ్‌ను కూలదోసి, శివసేన చీల్చి, బిజెపి సహాయంతో తనదే అసలైన శివసేన అనిపించుకున్నాడు. శివసేనలో 40 మంది ఎమ్మెల్యేలు తనవైపు ఉన్నారు సరే కానీ, కార్యకర్తల్లో, ఓటర్లలో ఎంతమంది ఉన్నారో ఎన్నికలైతే తప్ప లెక్క తేలదు. బిజెపికి మాత్రం లెక్క తేలినట్లే ఉంది. శిందేను నమ్ముకుంటే లాభం లేదని అజిత్‌ను ఆకర్షిస్తున్నారని స్పష్టంగా కనబడుతోంది.

ఇక పరిపాలన పరంగా చెప్పాలంటే, బిజెపి తక్కువ సీట్లున్న శిందేను ముఖ్యమంత్రిని చేసి, ఎక్కువ సీట్లు, ముఖ్యమంత్రిగా అనుభవం ఉన్న దేవేంద్ర ఫడణవీస్‌ను ఉపముఖ్యమంత్రిగా ఒప్పించి, అధికారాలన్నీ అతనికే కట్టబెట్టింది. ప్రమాణస్వీకారం కాగానే జరిగిన ప్రెస్‌మీట్‌లో శిందే మాట్లాడుతూండగానే ఫడణవీస్ అతని చేతిలోంచి మైకు లాక్కుని, తను మాట్లాడాడు. అప్పుడే అధికారగణంతో సహా అందరికీ ఎవరు బాస్‌యో సందేశం వెళ్లిపోయింది,

ఫడణవీస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో శిందే అతని కింద పబ్లిక్ వర్క్స్ వంటి అప్రధానశాఖలో మంత్రిగా చేశాడు. ఇప్పుడు శిందే ముఖ్యమంత్రిగా ఉన్నా ఫడణవీస్ చేతిలో హోం, ఫైనాన్స్ వంటి ముఖ్యమైన శాఖలున్నాయి. అధికారగణమంతా అతని అదుపాజ్ఞల్లో ఉంది. అందువలన అతను శిందేను లెక్క చేయటం లేదు. శిందే ప్రజల్లోంచి వచ్చినవాడు, ప్రస్తుతం ఉద్ధవ్‌కు భిన్నంగా అందర్నీ కలవాలని ఒట్టు పెట్టుకున్నాడు కాబట్టి, రోజంతా జనాల్ని కలుస్తూ ఎప్పుడూ బిజీగానే ఉంటున్నాడు. దాంతో ఎడ్మినిస్ట్రేషన్ మొత్తం ఫడణవీస్ చేతిలోకి వెళ్లిపోయింది. పోస్టింగులూ, బదిలీలు, ప్రమోషన్లు కూడా అతనే సెటిల్ చేస్తున్నాడు. తన ప్రమేయం లేకుండా పోస్టింగులు జరిగిపోవడం శిందేను బాధిస్తోంది. ఫడణవీస్ తనకు ఆప్తుడైన దేవేన్ భారతిని 2022 డిసెంబరులో ముంబయి పోలీసు స్పెషల్ కమిషనర్‌గా నియమించడం శిందేకు కష్టం కలిగించింది.

రాజకీయంగా యిరు వర్గాల మధ్య చిటపటలున్నాయి. శిందే వర్గీయుల చేతిలో ఉన్న ఠానే మునిసిపల్ కార్పోరేషన్‌ సరిగ్గా నడవటం లేదని బిజెపి ఎమ్మెల్యే విమర్శించాడు. శివసేన చేతిలో ఉన్న ముంబయి కార్పోరేషన్‌లో అవినీతి జరుగుతోందని మరో బిజెపి ఎమ్మెల్యే ఆరోపించాడు. శిందే తరఫు మంత్రులైన అబ్దుల్ సత్తార్, శంభురాజ్ దేశాయిలపై బిజెపి గుర్రుగా ఉంది. ఫడణవీస్ వారిని అదుపు చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. శిందే తనకు ఆత్మీయుడైన రియల్ ఎస్టేటు వ్యాపారి అజయ్ అషార్‌ను మిత్రా (మహారాష్ట్ర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ట్రాన్సఫర్మేషన్)కు వైస్‌చైర్మన్‌గా వేయడం బిజెపికి నచ్చలేదు. అజయ్‌పై బిజెపి గతంలో ఆరోపణలు చేసి ఉంది. ఇప్పుడీ నియామకం జరగగానే ఫడణవీస్ పట్టుబట్టి తను ముఖ్యమంత్రిగా ఉండగా సిఎంఓలో పని చేసిన ప్రవీణ్ పరదేశి అనే ఐఏఎస్‌ను అదే సంస్థకు చైర్మన్‌గా నియమించాడు..

శిందేకు ఎన్నికల కమిషన్ విల్లు, బాణం గుర్తు కేటాయించింది. అయినా అతనితో పాటు గోడ దూకిన శివసేన ఎమ్మెల్యేలు కొందరికి ఓటర్లు తమను అసలైన శివసేన అభ్యర్థులుగా గుర్తించరన్న జంకు ఉంది. అందువలన వచ్చే ఎన్నికలలో తాము బిజెపి గుర్తుపై పోటీ చేసి మోదీ వేవ్‌లో లాభం పొందుతామని శిందేతో అంటున్నారు. ఇలాటి పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోకుండా ఉంది శిందేకు. పార్టీపై పూర్తి పట్టు తెచ్చుకుని, ఉద్ధవ్‌ను నామమాత్రం చేయాలంటే ఊరూరూ తిరగాలి. రాజధాని వదిలి వెళితే ఫడణవీస్ మొత్తం చక్రం తిప్పేస్తాడనే భయం. ఇప్పటికే ఉత్సవ విగ్రహంగా మిగిలాను, తిరిగి వచ్చేలోపున నా వెంట వచ్చిన ఎమ్మెల్యేలను కూడా బిజెపి కేసుల భయం చూపెట్టి తన పార్టీలో చేర్చేసుకుని తనను వెళ్లగొడుతుందేమోనన్న భయంతో ఉన్నాడు.

ఈ సమయంలో బిజెపి అజిత్ పవార్‌కు సానుకూల సంకేతాలిచ్చి రప్పించుకోవడం అతనికి బాధగా, భయంగా ఉంది.  అజిత్ వెనక్కాల శరద్ ఉన్నాడో యిప్పటికి తెలియదు. దేశంలోని జిత్తులమారి నాయకులందరిలో శరద్ అగ్రస్థానంలో నిలుస్తాడు. ఎవరితోనైనా కలవగలడు. గతంలో దేవెగౌడ తన కొడుకు కుమారస్వామిని బిజెపి కౌగిలిలోకి పంపినప్పుడు పెద్ద డ్రామా ఆడాడు. తన యిష్టం లేకుండా వాళ్లతో కలిసి ముఖ్యమంత్రి అయ్యాడని, పార్టీ నుంచి అతన్ని బహిష్కరించానని నాటకాలాడాడు. ఇప్పుడు శరద్ కూడా అదే తరహాలో అజిత్‌ను ముందు పంపించి, శిందే స్థానంలో అతను ముఖ్యమంత్రి అయ్యేట్లు చూడవచ్చు. తర్వాత తనూ వెళ్లి బిజెపితో చేతులు కలపవచ్చు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే! చదరంగంలో ఒక పిక్కను కదిలించి మరో పిక్కను తీసేస్తారు. బిజెపి శిందేను ఉపయోగించి ఉద్ధవ్‌ను తోసేసినట్లు, అజిత్ అనే పిక్కతో శిందేను తోసేయవచ్చు. అదే జరిగితే శిందే ఏం చేస్తాడు? వెళ్లి ఉద్ధవ్ చేతులు పట్టుకుని క్షమించమనవచ్చు. బాల ఠాక్రే వారసత్వం కొనసాగించడానికి మనిద్దరం కలిసి పని చేద్దాం అనే పల్లవి అందుకోవచ్చు. చూదాం ఏమవుతుందో! (ఫోటో- ఫడణవీస్, శిందే, అజిత్)

– ఎమ్బీయస్ ప్రసాద్ (ఏప్రిల్ 2023)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?