Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: ఏమిటీ బేలతనం, బాబు గారూ!

 ఎమ్బీయస్‍: ఏమిటీ బేలతనం, బాబు గారూ!

2024 ఎన్నికలను ఉద్దేశించి చంద్రబాబు నాకిది లాస్ట్ ఛాన్స్, టిడిపి గెలవకపోతే రాజకీయాల్లోంచి తప్పుకుంటాను అని అనడాన్ని చాలామంది జీర్ణించుకోలేక పోతున్నారు. నాయకుడన్నవాడు చివరిదాకా, ఊపిరి పోయేవరకూ పోరాడతాను అని అంటూంటాడు. ఈసారి గెలిపించకపోతే నా కథ ముగిసినట్లే అని అనడం బేలతనాన్ని సూచిస్తుంది. చంద్రబాబు వంటి సీనియర్ అలాటి పొరపాటు మాట ఎలా అన్నారో అర్థం కావటం లేదు. 2024లో టిడిపి ఓడిపోతుందనుకున్నా ఏ స్థాయిలో ఓడిపోతారు? గతంలో వచ్చిన 23 కంటె తప్పకుండా ఎక్కువ వస్తాయి కదా! గతంలో వైసిపికి ఏకంగా 151 వచ్చాయి కాబట్టి యీసారి మోజు తగ్గి, ప్రభుత్వ వ్యతిరేకత తోడై, 20శాతం సీట్లయినా తగ్గుతాయని అనుకోవడం కామన్‌సెన్స్. టిడిపికి అన్నీ కలిసి వస్తే 80, కనీసం 50 వస్తాయని వాళ్లు ఆశ పెట్టుకోవడంలో తప్పు లేదు. 50 వస్తే ఘోరపరాజయంగా భావించి, ఆయన రాజకీయాల్లోంచి నిష్క్రమిస్తారా?

ఒక్క ఓటమికే తప్పుకునే మాటైతే టిడిపి చరిత్రలోనే అత్యంత దారుణంగా 23 సీట్లు తెచ్చుకున్నపుడు, నైతిక బాధ్యత వహించి, తను అధ్యక్ష స్థానంలోంచి తప్పుకుని మరొకరికి ఆ పదవి అప్పగించాల్సింది. అప్పుడు చేయనిది, 2024లో చేస్తాననడం వింతగా లేదూ? ఇలాటి మాటలతో పార్టీ కార్యకర్తలకు, నాయకులకు యిచ్చే సందేశమేమిటి? అధికారం దక్కకపోతే కాడి పారేసి, పాలిటిక్స్ మానేసి యింట్లో కూర్చోండి అనా? పార్లమెంటులో 2 సీట్లు మాత్రం తెచ్చుకున్నా, శ్రమించి కొన్నేళ్లలో సొంత మెజారిటీతో ప్రభుత్వం నడిపే స్థాయికి చేరుకున్న బిజెపి తన కార్యకర్తలకు యిచ్చే సందేశం ఎటువంటిది? 2014లో తెచ్చుకున్న ఎమ్మెల్యేల సంఖ్యను ఐదేళ్లలో దాదాపు రెండున్నర రెట్లకు పెంచుకోగలిగిన వైసిపి తన అనుచరులకు యిచ్చే సందేశం ఎలా ఉంది?

ఇప్పుడు కూడా వై నాట్ 175? అనే రణన్నినాదంతో జగన్ తన కార్యకర్తలను ఉత్సాహపరుస్తూంటే బాబు యిలాటి నెగటివ్ థాట్స్ ప్రచారం చేయడం ఏమంత సబబు? కొన్ని నియోజకవర్గాల్లో, ముఖ్యంగా రాయలసీమలో టిడిపికి పరిస్థితి ఆశావహంగా లేదు. ఉత్తరాంధ్రలో అటూయిటూగా ఉంది. ఆ ప్రాంతాల టిడిపి నాయకులు మన దగ్గర నెగ్గేట్టు లేదు, యింకెందుకు పోరాడడం? మన నాయకుడు ఎలాగూ యింట్లో కూర్చోబోతున్నారు, మనమూ మన యిళ్లల్లో కూర్చుందాం, లేకపోతే వేరే గూటికి వెళ్లిపోదాం అనుకుంటే ఎంత ప్రమాదం? అయినా ఓడిపోతే మాత్రం బాబు రిటైర్ కావలసిన అగత్యమేముంది? వయసు రీత్యా అంటే ఆయన వయసు 72 ఏళ్లే. ఆయన కంటె సీనియర్లు చాలామంది రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. మల్లికార్జున ఖర్గే 80 సం.ల వయసులో కాంగ్రెసుకు ప్రాణం పోసే పనిలో దిగారు. 89 సం.ల వయసులో దేవెగౌడ యింకా రాజకీయాలు చేసేస్తూనే ఉన్నారు. ఇప్పుడే రిటైర్‌మెంట్ ఆలోచనలు ఎందుకు తెచ్చుకోవాలి?

74 ఏళ్ల వయసులో ఎన్నికలలో ఓడిపోతే, 2029 నాటికి నెగ్గినా 79 ఏళ్లు వస్తాయి కాబట్టి ముఖ్యమంత్రి పదవి చేసే ఓపికుండ దేమోనన్న సందేహంతో, ముఖ్యమంత్రి కావడానికి నాకు యిదే లాస్ట్ ఛాన్స్ అని బాబు చెప్పి ఊరుకుంటే పోయేది. కానీ ఓడిపోతే 74 ఏళ్లకే రాజకీయాల్లోంచి తప్పుకోవలసిన అగత్యమేముంది? దేవెగౌడ తరహాలో యువకార్యకర్తలకు, ద్వితీయశ్రేణి నాయకులకు దిశానిర్దేశం చేస్తూ కొనసాగవచ్చు కదా! పోనీ ఆరోగ్యరీత్యా చూసినా చంద్రబాబు యింకా నీరసించలేదు. చురుగ్గానే తిరుగుతున్నారు. రోజంతా ఎవరో ఒకరిని కలుస్తూనే ఉన్నారు. మేధస్సు పనిచేస్తోంది. అనేక విషయాలపై సమాచారం సేకరిస్తున్నారు, విశ్లేషిస్తున్నారు, వ్యాఖ్యానిస్తున్నారు.

వినేవాళ్లకు ఓపిక లేకపోయినా రోజంతా మాట్లాడే ఓపిక యీయనకుంది. ఇలాటి ఆరోగ్యభాగ్యం ఉండగా రిటైరై పోతాననే నిరాశాపూరితమైన పలుకులెందుకు? అంటే ఆయన ఉత్తినే రిటైరై పోతాను అని అనటం లేదు. గెలిపించకపోతే రిటైరౌతా జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. బాబు కుప్పంలో ఓడిపోతారని యిప్పటిదాకా మనం అనుకోవటం లేదు. ఆయనకేమైనా భయం వేసి కుప్పం ప్రజల్ని ఉద్దేశించి చెప్పారేమో అనుకున్నాను. రెండోసారి చదివితే అర్థమైంది. ఆయన ఒక్కణ్నీ గెలిపిస్తే చాలదట. టిడిపికి మెజారిటీ సీట్లు వచ్చే స్థాయిలో గెలిపించాలట. అప్పుడు యీయన ముఖ్యమంత్రి అయి అసెంబ్లీకి వెళతారట. కౌరవసభను గౌరవసభగా మారుస్తారట. పంపే బాధ్యత ప్రజలదట.

మహాప్రస్థానం పుస్తకానికి ముందుమాట రాస్తూ చలం ఒక మాట అన్నారు. ‘కృష్ణశాస్త్రి బాధ ప్రపంచం బాధ - ప్రపంచం బాధ శ్రీశ్రీ బాధ’ అని. కృష్ణశాస్త్రిగారు భావకవి. భగ్నప్రేమికుడిగా ఆయన బాధపడితే ఆయన్ను చూసి ప్రపంచం బాధపడింది. కానీ శ్రీశ్రీ ప్రపంచంలో అభాగ్యుల బాధను తన బాధగా ఫీలై కవిత్వం రాశాడు. తమ కోసం పలవరించాడని ప్రజలు శ్రీశ్రీని మహాకవి అన్నారు. ఆయన కంటె గొప్ప కవి ఐన కృష్ణశాస్త్రిని అనలేదు. నాయకుడనే వాడు గ్రహించవలసినది యిదే. మీ బాధ నా బాధ, నాకు వ్యక్తిగతంగా ఏ లోటూ లేదు. కానీ మీకోసం నేను పోరాడతాను, అవసరమైతే సర్వస్వం కోల్పోతాను అంటూ ప్రజలను ఆకట్టుకోవాలి. కానీ బాబు ఏమంటున్నారు? నా బాధ మీ బాధ అంటున్నారు. నా భార్యను అవమానించారు, మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ నేను ప్రతిజ్ఞ చేసి వచ్చాను. ఆ ప్రతిజ్ఞ చెల్లాలంటే మీరు నాకు ఓటేయాల్సిందే అంటున్నారు.

ఇదెక్కడి గోల? ప్రతిజ్ఞ చేయమన్నదెవరు? మీ భార్యపై పడిన నిందకు, మీరు ముఖ్యమంత్రి కావడానికీ సంబంధమేముంది? మీరు ముఖ్యమంత్రి అయితే ఆవిడకు అగ్నిపరీక్ష జరిగినట్లా? నింద పోయినట్లా? అయినా నింద వేసినవాడు మాట వెనక్కి తీసుకుంటున్నాను, తప్పయిపోయిందంటూ లెంపలేసుకున్నాడు. మీరే మాటిమాటికీ గుర్తు చేస్తున్నారు గానీ ప్రజలు దాన్ని మర్చిపోయారు కూడా. మీరు అసెంబ్లీకి వెళ్లి ప్రభుత్వాన్ని ఎండగట్టమని ప్రజలు మీకు అప్పగించిన పని చేయండి చాలు. కానీ మీరేమంటున్నారు? ‘నేను అసెంబ్లీకి వెళ్లాలంటే, రాజ‌కీయాల్లో వుండాలంటే, రాష్ట్రానికి న్యాయం జ‌ర‌గాలంటే రేపు జ‌రిగే ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించ‌క తప్పదు. లేని ప‌క్షంలో నేను అసెంబ్లీకి వెళ్ల‌ను.’ అంటున్నారు. ఇదెక్కడి ఫిటింగు? ‘మీరు యిప్పుడూ అసెంబ్లీకి వెళ్లటం లేదు. అయినా భూగోళం బద్దలవలేదు కదా! ఈ భాగ్యానికి మిమ్మల్నెందుకు సిఎం చేయడం?’ అని ఓటరు అడిగితే మీ దగ్గర సమాధానం ఏముంది?

లాస్ట్ ఛాన్స్ అంటూ సెంటిమెంటు రంగరిస్తే ప్రజలు కరుగుతారని లెక్క వేశారేమో బాబు. జగన్ ‘ఒక్క ఛాన్స్’ అని అడిగినందుకే 151 సీట్ల వర్షించాయని టిడిపి వర్గాలు మనను నమ్మిద్దామని చూస్తున్నాయి అనుకున్నాను. కానీ వాళ్లూ నమ్ముతున్నట్లు నాకు అర్థమైంది. 2014లోనే టిడిపి, బిజెపి, జనసేన కలిసి జగన్‌ను ఓడించినప్పుడే వైసిపికి కేవలం 1.6శాతం ఓట్లు మాత్రమే తక్కువ వచ్చాయి. ఐదేళ్ల బాబు పాలనతో మొహం మొత్తడంతో ప్రజలు జగన్‌ను ఎన్నుకున్నారనేది సింపుల్ లాజిక్. ఒక్క ఛాన్స్ అని అడిగిన ప్రతీవాళ్లకూ జనాలు ఛాన్సిచ్చేస్తారా? ఇప్పుడు పవనూ అంటున్నారు. అంతమాత్రాన ఆయనకు 151 సీట్లు వస్తాయని టిడిపి అంచనానా? అలా అయితే పొత్తు పెట్టుకుని జనసేనకు 150 సీట్లు కేటాయించి, టిడిపి కేవలం 25 సీట్లు తీసుకోవాలి.

ఈ ఒక్క ఛాన్స్ అనేది కొత్తగా వచ్చేవాళ్ల విషయంలో వర్తిస్తుంది. పవన్ యిప్పుడు అడగడంలో తప్పు లేదు. మీ బాధలు తీర్చడానికి నాకో ఛాన్స్ యివ్వమని జగన్ ప్రజల్ని అడిగినట్లే, పవనూ అడుగుతున్నారు. నాకు వయసై పోతోంది కాబట్టి లాస్ట్ ఛాన్స్ యివ్వండి అంటున్నారు బాబు. అదీ తేడా! ప్రజలు టిడిపిని, వైసిపిని చూసేశారు. జనసేనకు నెగ్గే సూచనలున్నాయని తోస్తే, ఓటేసి చూడవచ్చు. అంతేకానీ 9 ఏళ్లు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 5 ఏళ్లు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసిన బాబు ఇంకో ఛాన్స్ అంటే యివ్వాలని ఏముంది? అందుకే లాస్ట్ ఛాన్స్ అని చూశారు. 2014 తమిళనాడు ఎన్నికలలో 92 ఏళ్ల కరుణానిధి పోటీ చేస్తూ, ‘ఇదే నా చివరి ఎన్నిక, నన్ను అధికారంలోకి తీసుకురండి’ అని తమిళ ప్రజలను వేడుకున్నారు. ఆయన వయోవృద్ధుడు. రేపోమాపో అనేట్టున్నాడు. చక్రాల కుర్చీలో కూర్చుని ప్రచారం చేశాడు. అయినా జనం కరుణించలేదు. అలాటిది నిక్షేపంలా కనబడుతున్న బాబు ‘నాకిదే లాస్ట్ ఛాన్స్’ అంటే ప్రజలు కరిగిపోతారా? ఒకవేళ 2024లో టిడిపి ఓడిపోయినా బాబు ఎక్కడికీ వెళ్లరని, మళ్లీ పోటీ చేస్తారని అందరికీ శుబ్భరంగా తెలుసు.

పైగా జగన్ విషయంలో యితను ఎలా పరిపాలిస్తాడో అన్న క్యూరియాసిటీ కొద్దీ ఓటేసి ఉండవచ్చు. పవన్ సొంత కాళ్లపై నిలబడితే అతనికీ ఓటేయవచ్చు. కానీ బాబు పాలన ఎలా ఉందో కొత్తగా తెలుసుకోవాల్సిన పని లేదు. ఐదేళ్లలో చూసేశారు. చూసి, తీర్పు యిచ్చేశారు. ఒకవేళ మారారేమో, యింకో ఛాన్సిస్తే బాగా పాలిస్తారేమో అనే క్యూరియాసిటీ ఉండవచ్చు. కానీ మారారనే అభిప్రాయం బాబు కలిగించటం లేదు. నిజానికి ఓటరు టీచరు లాటి వాడు. పాలకుడు స్టూడెంటు లాటి వాడు. ఐదేళ్ల పాటు పేపరు రాసి ఓటరు చేతికి యిస్తే అతను మార్కులు వేస్తాడు. 2009 ఫలితాల తర్వాత వైయస్ వాపోయారు – కేంద్రానికి బాగానే మార్కులు వేశారు కానీ నాకు పాస్ మార్కులే వేశారు అని. ఈసారి బాగా చేసి, మంచి మార్కులు తెచ్చుకుంటా అన్నాడు. కానీ కొన్ని నెలల్లోనే మరణించారు.

బాబు పద్ధతి అది కాదు, నీకు పేపరు దిద్దడం రాదు అని టీచర్నే దబాయించే రకం. 2019 ఓటమి తర్వాత మీరు తప్పు చేశారు, అందుకే ఉన్మాది పాలన వచ్చింది అని ఓటర్లను నిందించారు. టీచరు మార్కులు వేశాక స్టూడెంటు పేపరు చూసుకుని ఎక్కడెక్కడ తప్పులు రాశాడో గమనించుకుని, అర్థం కాని చోట టీచర్ని అడిగి పొరపాటు తెలుసుకుని, వచ్చే పరీక్షలో బాగా రాస్తాడు. బాబు కూడా ‘నా పాలనలో ఫలానా రంగంలో తప్పులు జరిగాయి, నేను గ్రహించాను. మళ్లీ అవకాశం యిస్తే ఆ తప్పులు జరగనివ్వను.’ అని చెప్పి ఉంటే ఓటరు సంతృప్తి పడేవాడు. కానీ బాబు నేను యింత చేశాను, అంత చేశాను. బారు బద్దలు కొట్టాను, మీరు నన్ను అనవసరంగా ఓడించారు, యిప్పుడు అనుభవిస్తున్నారు అని శాపనార్థాలు పెడుతూనే ఉన్నారు.

2014లో ఆంధ్ర ప్రజలు బాబుని గెలిపించిన కారణమేమిటి? ‘మీరు సమర్థులు. ముందుచూపు ఉన్నవారు. పరిపాలనానుభవం కలవారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసి మొత్తమంతా హైదరాబాదులో పెట్టి మాకు అన్యాయం చేశారు. ఇప్పుడైనా ఆంధ్రలో అన్ని జిల్లాలూ అభివృద్ధి చేయండి’ అంటూ తప్పు సరిదిద్దుకునే అవకాశం యిచ్చారు. కానీ యీయన ఏం చేశాడు? అమరావతి అంటూ మరో హైదరాబాదు తయారు చేయబోయాడు. దానిపై ఎంతో సమయం, శ్రమ, ధనం ఖర్చు పెట్టాడు. రాష్ట్రంలో తక్కిన సమస్యలపై దృష్టి పెట్టలేదు. దాంతో పాలన అస్తవ్యస్తమైంది. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చినా ‘అన్నీ ఒకే చోట పెట్టడం తప్పయింది. మళ్లీ అధికారం యిస్తే వికేంద్రీకరణ చేస్తాను.’ అనటం లేదు. ‘అమరావతి మీదనే నా దృష్టి. దాన్ని మళ్లీ నిలబెట్టడమే నా ధ్యేయం.’ అనే ధోరణిలోనే ఆయన మాట్లాడుతున్నాడు, చేతలూ అలాగే ఉన్నాయి. ఆ విధంగా తనలో ఏ మార్పూ రాలేదని ఆయన చాటి చెప్తున్నాడు. మరెందుకు ఓటర్లు యింకో ఛాన్సివ్వాలి?

లాస్ట్ ఛాన్స్ అని చెప్తే యింకో ఛాన్సిస్తారేమోనని బాబు ఆలోచన. అసలా సెంటిమెంటు ఉపయోగించ వలసిన అవసరమేమొచ్చింది? మాకు 160 సీట్లు వస్తాయి. నేను తిరిగి అధికారంలోకి వస్తా, మీ అందరి తాట తీస్తా అంటూ పోలీసులను, అధికారులను హెచ్చరించే పెద్దమనిషి యిలా సెంటిమెంటాస్త్రం వేయడమెందుకు? ఇది రాంగ్ మూవ్ అని ఆయనకు ఎందుకు తోచలేదు? బాబు చాణక్యుడు కాబట్టి దాని వెనక్కాల ఏదో వ్యూహం ఉంటుంది అని కొందరు నమ్ముతారు. నేను గమనించిన దేమిటంటే ఒక నాయకుడి తెలివితేటలు ఎల్లకాలమూ స్థిరంగా ఉండవు. బ్రహ్మానంద రెడ్డి గారి దగ్గర్నుంచి, అనేక మంది కథలు చెప్పగలను. కొంతకాలం కరక్టు స్టెప్స్ వేసి నిచ్చెన లెక్కుతారు. కొన్నాళ్ల తర్వాత ఆ ప్రభ మసకబారడం మొదలుపెడుతుంది. కళ్లు బైర్లు కమ్ముతాయి. రాంగ్ స్టెప్స్ వేస్తూ పాము నోట్లో పడతారు.

2004లో ముందస్తు ఎన్నికలు వెళ్లడం దగ్గర్నుంచి బాబు పొరపాట్లు చేస్తూ వస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం లేఖ యిచ్చి, అంతిమంగా తెలంగాణలో పార్టీ యూనిట్‌ను నామమాత్రం చేశారు. 2009లో కూడా అధికారంలోకి రాలేకపోయారు. విభజన ధర్మమాని 2014లో బిజెపి, జనసేనల సహాయంతో అధికారం దక్కినా ఐదేళ్ల తర్వాత అధఃపాతాళానికి పార్టీని తీసుకుపోయారు. మూడేళ్లగా ఆయన తీసుకుంటన్న చర్యలు పార్టీపై ప్రజలకు, సహచరులకు నమ్మకం కలిగేంచేట్లా లేవు. బాబు తన దుష్పరిపాలన ద్వారా జగన్‌కి అధికారం కట్టపెట్టినట్లు, జగన్ తన దుష్పరిపాలన ద్వారా బాబుకి కట్టబెట్టాలి తప్ప బాబు ప్రయోజకత్వం ఏమీ కనబడటం లేదు.  

పవన్ వైజాగ్ సంఘటన తర్వాత ఎంతో ఆత్మవిశ్వాసం కనబరచిన బాబు యిప్పుడింత బేలతనం ఎందుకు ప్రదర్శిస్తున్నారు? మధ్యలో జరిగిన దేమిటి? పవన్ మోదీ భేటీ జరిగింది. లోపల ఏం జరిగిందో తెలియదు కానీ తర్వాతి పరిణామాలు చూస్తే ప్రస్తుతానికి జనసేన, టిడిపి కలిసేట్టు లేవు. మోదీ పవన్‌తో ‘నీ శక్తి నువ్వు నిరూపించుకుని పెద్ద నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేసుకుంటే మేలు. అప్పుడే బాబు నీకు విలువ నిస్తారు. పొత్తు పెట్టుకున్నా ఏ పాతికతోనే సరిపెట్టకుండా గౌరవప్రదంగా ఏ ఏభయ్యో ఆఫర్ చేయవచ్చు’ అని హితోపదేశం చేశారనిపిస్తోంది. భేటీ తర్వాత రెండు రోజులకే పవన్ కార్యాచరణలోకి దూకారు. నేనే ముఖ్యమంత్రి అభ్యర్థినని ప్రకటించుకున్నారు. నాకూ ఒక ఛాన్సివ్వమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసిపిని ఎదిరించే చేవ టిడిపికి లేదని ప్రకటించారు. సోము వీర్రాజు అయితే పవన్ జనసేనతో కలిసి ఉంటారని ధాటీగా చెప్పారు. డ్వాక్రా విషయంలో బాబును కించపరుస్తూ స్టేటుమెంటు యిచ్చారు.

ఈ వరసంతా చూస్తే జనసేన టిడిపికి సెకండ్ ఫిడిల్ వాయించడానికి సిద్ధంగా లేదని అర్థమౌతోంది. నాదెండ్ల మనోహర్ ప్రెస్ నోట్‌లో వైసిపిని ఓడించడానికి అంతా కలిసి రావాలని అన్నారు కానీ టిడిపి నేతృత్వంలో ఆ పని చేస్తామనే సూచన యివ్వలేదు. సోము తరహాలో టిడిపిని తిట్టడమూ లేదు. కానీ వైసిపిని ఎదిరించడం టిడిపికి సాధ్యం కాదని పవన్ స్వయంగా అన్నారు. అందువలన తామే లీడ్ తీసుకుందామని ఆయన ప్లాను. తనకు జనబలం ఉందని ముందుగా ఎస్టాబ్లిష్ చేసుకుని, తర్వాత పొత్తుల గురించి మాట్లాడితే బిజెపి కానీ, బాబు కానీ తగిన విలువ యిస్తారని పవన్ అనుకున్నట్లుంది. బిజెపి ప్రస్తుతానికి టిడిపిని దూరంగా ఉంచుదామనుకుంటోందని స్పష్టంగా తెలుస్తోంది. పవన్‌ను, అతని ద్వారా బిజెపిని కూటమిలోకి చేర్చుకుని వైసిపిని ఎదిరిద్దామని బాబు అనుకున్న ప్లాను వర్కవుట్ కాలేదు. ఎవరికి వారే తామే బలవంతులమని చూపుకున్న తర్వాతనే ఎన్నికల ముందు పొత్తు ఉంటుందో లేదో తేలుతుందని అర్థమైంది బాబుకి. అందుచేత తన బలం తను చూపిద్దామని గోదాలోకి దిగి రకరకాల అస్త్రాలు ప్రయోగిస్తున్నారు. వాటిలో యీ సెంటిమెంటాస్త్రం ఒకటి.

ఈ పొత్తు కుదిరితే వైసిపికి భయపడవలసిన అవసరం వస్తుంది. కానీ కర్మకాలి పొత్తు కుదరక టిడిపి, జనసేన-బిజెపి కూటమి విడివిడిగా పోటీ చేస్తే, వైసిపి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. పొత్తు ఖచ్చితంగా కుదరాలంటే మనందరికీ తట్టే తక్షణోపాయం - పవన్‌ను తొలి సగకాలం ముఖ్యమంత్రిగా బాబు ప్రకటించేస్తే చాలు. అతనితో పాటు బిజెపి కూడా వచ్చి చేరుతుంది, ప్రయాణం సుఖంగా సాగుతుంది. ఆ పని చేయకుండా బాబు ఎందుకింత అవస్థ పడడం అని మనకనిపిస్తుంది. కానీ యిది పైకి కనబడేటంత తేలికైన వ్యవహారం కాదు. బాబు వెనక్కాల ఖచ్చితంగా ఉన్న వర్గాలు కమ్మ, బిసి! కమ్మ నాయకుల మాట ఎలా ఉన్నా గ్రామాల్లో ఉన్న కమ్మలకు ఒక కాపును ముఖ్యమంత్రి చేయడం ఎంతవరకు రుచిస్తుందో తెలియదు. పివి నరసింహారావుని తీసేసిన తర్వాత రెడ్డేతర ముఖ్యమంత్రి గురించి ఇందిర వెతికినపుడు జై ఆంధ్ర ఉద్యమానికి వెన్నెముకగా నిలిచిన కమ్మ వర్గాలు వెంగళరావును ప్రిఫర్ చేశాయి. ఆయన వెలమ. ఇటీవల తన ‘కాపు’తనాన్ని తరచుగా ప్రస్తావిస్తున్న పవన్‌ను కమ్మలు ఏ మేరకు ఆమోదిస్తారో సందేహమే.

ఇక బిసిల విషయానికి వస్తే కొన్ని ప్రాంతాల్లో వారికి కాపులతో వైరుధ్యాలున్నాయి. కాపులు తమను బిసిలుగా గుర్తించమని అడిగిన తర్వాత నుంచి అన్ని చోట్లా దూరమయ్యారు. పెత్తనానికి అగ్రకులమని, నాయుళ్లమని చెప్పుకునే కాపులు, రిజర్వేషన్ల దగ్గరకి వచ్చేసరికి తామూ వెనకబడినవారమని చెప్పుకుంటూ తమకు పోటీ రావడం ఏ విధంగా సమర్థనీయమో వారికి అర్థం కావటం లేదు. పవన్‌ను సినీనటుడిగానో, సిద్ధాంతాల రీత్యానో అభిమానించే బిసిలకు యిది అభ్యంతరకరం కాకపోవచ్చు కానీ కులాల పరంగా ఓటేసేవారు సర్దిచెప్పుకోవడం కష్టమే అవుతుంది. ఈ కారణాల చేత బాబు పవన్‌ను ముఖ్యమంత్రిగా చేయలేరని అనుకుంటే, అప్పుడాయన ఏ బిసినో ముఖ్యమంత్రిగా ప్రకటించి, వారిని సంపూర్ణంగా ఆకర్షించాలి. అతని వెనుక బాబే కథ నడిపిస్తారని అందరికీ తెలుసు కాబట్టి బాబుపై అభిమానం, గౌరవం ఉన్నవారందరూ, ఆయన కులస్తుల్లో చాలామందీ ఆ పార్టీకి ఓటేస్తారు. జగన్‌తో విసిగిన తటస్థులు కూడా చేరితే విజయాన్ని అందుకోవచ్చు.

‘ఎలా తిప్పితిప్పి రాసినా బాబు ముఖ్యమంత్రి రేసులో నుంచి తప్పుకుని నాన్-రెడ్డి, నాన్-కమ్మ అభ్యర్థిని ముందు పెట్టి తను మెంటార్‌గా ఉంటే పార్టీ గెలిచే అవకాశాలుంటాయని, ఓ రెండేళ్ల తర్వాత అతన్ని దింపేసి యీయన గద్దె కెక్కినా యిబ్బంది లేదని మీ అభిప్రాయం’ అని మీరంటే, ‘ఔను, సరిగ్గా గ్రహించారు’ అని నేను సంతోషిస్తాను. నేనే ముఖ్యమంత్రిని, నా తర్వాత మా లోకేశే ముఖ్యమంత్రి అని పట్టుబడితే మాత్రం విజయావకాశాలు సన్నగిల్లిపోతాయని మాత్రం నా నమ్మకం. అందుకే ‘ఇదే నా లాస్ట్ ఛాన్స్. నాకు చివరి ఎన్నికలు. నన్నే కాదు, టిడిపి మొత్తాన్ని గెలిపించాలి.’ అని అడగడం బేలతనాన్నే సూచిస్తుందని నా ఉద్దేశం.

– ఎమ్బీయస్ ప్రసాద్ (నవంబరు 2022)

[email protected]

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?