cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‌: జాతీయమీడియా జగన్‌ పక్షమా?

ఎమ్బీయస్‌: జాతీయమీడియా జగన్‌ పక్షమా?

జాతీయ మీడియా నిర్వహించిన ఎగ్జిట్‌ పోల్స్‌లో చాలా భాగం ఆంధ్రలో వైసిపికే ఎక్కువ అసెంబ్లీ, పార్లమెంటు సీట్లు వస్తాయని చెప్పాయి. ఇండియా టుడే 130-135, 18-20 వస్తాయంటే టైమ్స్‌ నౌ 98, 18 వస్తాయంది. లగడపాటి 72 అసెంబ్లీ స్థానాలు వస్తాయన్నారు. పార్లమెంటు సీట్లపై మాత్రమే సర్వే చేసిన సిఎన్‌ఎన్‌ న్యూస్‌18 వైసిపికి 13-15 వస్తాయని అంటే ఎబిపి నీల్సన్‌ 20 వస్తాయంది.

రిపబ్లిక్‌-సిఓటర్‌ 11 వస్తాయంటే లగడపాటి మాత్రం 8-12 వస్తాయన్నారు. జాతీయ మీడియా యిలా చెప్పడానికి కారణం ఏమిటో టిడిపి నాయకులు, సమర్థకులు చెపుతున్నారు. జాతీయ మీడియా మొత్తం మోదీ చేతిలో ఉందట. జగన్‌ మోదీ తాలూకు మనిషి కాబట్టి అతనికి అనుకూలంగా ఎగ్జిట్‌ పోల్స్‌ వెలువడ్డాయట.

ఇక్కడ మనం గ్రహించవలసిన దేమిటంటే - ఎన్నికలకు ముందు జరిగే సర్వేలను ప్రభావితం చేస్తే రాజకీయ నాయకులకు ప్రయోజనం ఉంటుంది. ఇంగ్లీషు వీక్లీలు అప్పుడప్పుడు ఒపీనియన్‌ పోల్స్‌ అని వేస్తూ ఉంటాయి చూడండి, వాటిని పూర్తిగా నమ్మనక్కరలేదు. జనాభాలో 75% మంది మళ్లీ మోదీనే ప్రధానిగా కోరుకున్నారని లేదా రాహుల్‌ను ప్రధానిగా కోరుకున్నారని, 54% మంది అవినీతి గురించి పట్టించుకోరని, 68% మంది గృహిణులు సంతోషంగా ఉన్నారనీ... యిలా యిచ్చే అంకెలు ప్రజాభిప్రాయాన్ని తమకు కావలసిన విధంగా పోతపోసే అవకాశం ఉంది. 

ఫలానా రాష్ట్రం ఫలానా విషయంలో ముందంజలో ఉందని, ముఖ్యమంత్రి పాలన వెలిగిపోతోందని కూడా యిస్తారు. మరో రెండు వారాలు పోయాక ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆరు పేజీల యాడ్‌ను 'ఎడ్వర్టోరియల్‌' పేరుతో ఆ పత్రికకు యిస్తుంది. ఎగ్జిట్‌ పోల్స్‌ కంటె ముందు వచ్చిన ఒపీనియన్‌ పోల్స్‌లో జాతీయ మీడియా ఆంధ్రలో వైసిపికే బలం ఉందని చెపుతూ వచ్చింది. వాటిని మోదీయో, జగనో ప్రభావితం చేశారని వాదించే ఆస్కారం ఉంది. 

కానీ ఎగ్జిట్‌ పోల్స్‌ విషయంలో అలా అనలేము. ఎందుకంటే అవి వెలువడే నాటికి ఎన్నికలు ముగిసిపోయి ఉంటాయి. ఫలానావారు ఇంద్రుడు, చంద్రుడు అని పొగిడినా లాభం లేదు. పడాల్సిన ఓట్లన్నీ పడిపోయి ఉంటాయి. పైగా ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాల విడుదలకు, అసలు ఫలితాల విడుదలకు చాలా తక్కువ రోజుల వ్యవధి ఉంటుంది. ఏ సర్వే సంస్థ కరక్టుగా ఊహించగలిగింది అనే విషయం అందరూ గ్రహిస్తారు, చర్చిస్తారు. తన్మూలంగా ఆ సంస్థ ప్రతిష్ఠ పెరగడమో, తరగడమో జరుగుతుంది. 

దానికి భవిష్యత్తులో వచ్చే క్లయింట్ల సంఖ్యను అది నిర్ధారిస్తుంది. అందువలన వీటి విషయంలో సంస్థలు రాజకీయ ప్రయోజనాల కంటె, తమ సంస్థ యిమేజి గురించే ఎక్కువగా ఆలోచిస్తాయి. మరి చాలా భాగం ఎగ్జిట్‌ పోల్స్‌ ఎందుకు తప్పుతాయి అంటే తీసుకున్న శాంపిల్‌ పరిమాణం, ఎంచుకున్న శాంపిల్‌, సమాధానాలు రాబట్టే తీరు, ఎనలైజ్‌ చేసే నైపుణ్యం - యిలాటి వాటిపై ఫలితం ఆధారపడుతుంది. ఎవరూ కావాలని తప్పులు చెప్పరు.

ఎన్‌డిఏ మంచి మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెపుతున్నాయి. మోదీ వాళ్లని బెదిరించి అలా చెప్పించాడని అనుకోవాల్సిన అవసరం లేదు. చెప్పిస్తే ఏం లాభం? నాలుగు రోజుల్లో ఎలాగూ వాస్తవం బయటకు వస్తుంది కదా! 'మీ విజయాన్ని కరక్టుగా ఊహించాను సార్‌' అని చెప్పి మోదీని మురిపిద్దామన్నా, ఆయన 'మంచిది' అంటాడు తప్ప, 'నా విజయంలో మీకూ పాలు ఉంది' అనడు కదా. 

ఇదంతా ఏజన్సీల ఊహాశక్తికి పరీక్ష తప్ప నాయకుల నాయకత్వ పటిమకు కాదు కదా! పార్టీకి అనుబంధంగా ఉండే నాయకులు చెప్పే జోస్యాలు తమ బృందం చెదిరిపోకుండా ఉండడానికి ఉద్దేశించినవై ఉంటాయి. వాటిని సందేహాస్పద దృష్టితోనే చూడాలి. ఇప్పుడు జాతీయ మీడియా వైసిపికి ఎక్కువ సీట్లు యిచ్చింది అంటే వాస్తవం అదే వాళ్లు నమ్మి యిచ్చినదే తప్ప కావాలని మేనిప్యులేట్‌ చేసి యిచ్చిందని అనుకోనక్కరలేదు. ఆ జోస్యాలు నిజం కావచ్చు, కాకపోవచ్చు, కానీ ఆ యా సంస్థలకు ఏదో ఎజెండా ఉందని అనుకోవడం అనవసరం. 

ఈ ఫలితాలు తమకు అనుకూలంగా లేనివారందరూ వీటిని కొట్టి పారేయడం సహజం. రేపు అసలైన ఫలితాలు వస్తూ ఉంటే పొద్దున్న అన్ని పార్టీ ప్రతినిథులు కూర్చుంటారు చూడండి. ట్రెండ్స్‌ ప్రారంభమై తమకు వ్యతిరేకంగా వస్తూంటే 'ఇటీజ్‌ టూ ఎర్లీ టు డిసైడ్‌ ఎయిదర్‌ వే' అనో 'ఆ ప్రాంతంలో మా పార్టీ బలహీనంగా ఉంది. రాష్ట్రమంతటా గణాంకాలు వచ్చినప్పుడు మాకు అనుకూలంగా మారుతుంది' అంటూ వస్తారు. 

11 గం.లు అయ్యేసరికి స్వరం మారుతుంది. 'ఇలా ఎందుకు జరిగిందో మా పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటాం' అంటారు. సాయంత్రం చర్చకు మొహం చాటేస్తారు. లేదా ఎన్నికలలో అక్రమాలు జరిగాయి, కోర్టుకి వెళతాం అంటారు.   ఇప్పుడు బాబు ''2014లో కూడా ఆంధ్రలో వైసిపికి ఎక్కువ పార్లమెంటు, అసెంబ్లీ స్థానాలు వస్తాయని జాతీయ సర్వేలు చెప్పాయి. కానీ అవన్నీ తప్పాయి. ఈ సారి అంతే'' అని తీసిపారేశారు. జాతీయ సర్వేలు ఆంధ్ర విషయంలో తప్పి వుండవచ్చు కానీ కేంద్రం విషయంలో కరక్టుగానే చెప్పాయి.

ఆంధ్రకు వస్తే టైమ్స్‌ నౌ-ఇండియా టివి- సిఓటర్‌ వైసిపికి 13 వస్తాయన్నాయి. ఇండియా టుడే-సిఓటర్‌ కూడా 13 వస్తాయన్నాయి. టైమ్స్‌ నౌ-ఓ ఆర్‌జి, ఎన్‌డిటివి-హంసా 8 వస్తాయన్నాయి. సిఎన్‌ఎన్‌-ఐబిఎన్‌-లోకనీతి-సిఎస్‌డిఎస్‌ 11-15 వస్తాయన్నారు. ఎన్‌డిటివి 12 వస్తాయంది. అంతిమంగా వైసిపికి 9, టిడిపికి 15, బిజెపికి 1 పార్లమెంటు సీట్లు వచ్చాయి. అసెంబ్లీలో టిడిపికి 102, వైసిపికి 67 వచ్చాయి.  

ఒక పార్లమెంటు స్థానంలో సరాసరి 7 అసెంబ్లీ స్థానాలుంటాయి కాబట్టి ఈ 9, 15ను అనువదించి చూస్తే 63, 105 వస్తాయి. 67, 102 వాటికి దగ్గరగానే వచ్చాయి. లగడపాటి యీసారి వైసిపికి 8 నుంచి 12 వరకు పార్లమెంటు స్థానాలు రావచ్చన్నారు. అంటే 84 ఎసెంబ్లీ స్థానాలకు వరకు రావచ్చన్నమాట. కానీ అక్కడ 72కి తగ్గించేశారు. జాతీయ సర్వేలన్నీ చూస్తే వైసిపికి హీనపక్షం 15 పార్లమెంటు స్థానాలు వస్తాయనిపిస్తుంది. అలా అయితే 105 అసెంబ్లీ స్థానాలన్నమాట. 

కానీ యివన్నీ కాకిలెక్కలే. అసలు ఫలితాలు రేపే తెలుస్తాయి. ఈ లోపున టిడిపి చాలా హడావుడి పడుతోంది. దాని అభిమానులు సోషల్‌ మీడియాలో 'బాబు తమకు 130 వస్తాయని చెప్పుకున్నారు కదా. జగన్‌ తన అంకె చెప్పడేం?' అనీ, 'ప్రశాంత కిశోర్‌ సర్వే చేసే ఉంటాడు కదా, బయటకు చెప్పడేం? అంటే వైసిపి ఓటమి తప్పదా?' వంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. పోలింగు అయిపోయిన తర్వాత ఏం చెప్పీ ప్రయోజనం ఉందని జగన్‌ మౌనంగా ఉండి వుండవచ్చు. ఆ మాట కొస్తే ట్విట్టర్‌లో చురుగ్గా వుండే లోకేశ్‌ కూడా మౌనంగానే ఉన్నారు కదా.  

ఫలితం అనుకూలంగా వచ్చినా స్టాలిన్‌ సైతం ఏమీ వ్యాఖ్యానించలేదు. ఎవరిష్టం వాళ్లది. టిడిపి సమర్థకులు చెప్తున్న వాదన ఏమిటంటే - ఫలితాలు టిడిపికి అనుకూలంగా ఉండబోతున్నాయి. దీనికి నిదర్శనం, బాబు పిలుపుకు స్పందించి, ఇవిఎంలు పాడైన చోట యిళ్లకు వెళ్లిపోయిన ఓటర్లు - ముఖ్యంగా మహిళలు, వృద్ధులు - వెనక్కి వచ్చి అర్ధరాత్రి దాకా నిలబడి ఓటేసి, బాబు పట్ల తమ కృతజ్ఞత చాటుకున్నారు అని.

అయితే యిక్కడ గమనించవలసినది - అలా పాడైన ఇవిఎంలు ఎన్ని? అని. ఉదయం 10 గంటలకు ప్రకటన చేస్తూ బాబు 30% ఇవిఎంలు పని చేయటం లేదు అనేశారు. తర్వాత అది అతిశయోక్తి అని తేలింది.  రాష్ట్రం మొత్తం మీద 45,920 పోలింగు బూతులు, 92,000 ఇవిఎంలు ఉంటే 372 ఇవిఎంలు మాత్రం పని చేయలేదని ఎన్నికల కమిషన్‌ అంది. బొత్తిగా పని చేయని ఇవిఎంల సంఖ్య కావచ్చు యిది. 

ట్రబుల్‌ యిచ్చి తర్వాత సరిచేసిన వాటి సంఖ్య కలిపి ఉండకపోవచ్చు. అలాటివి వీటికి రెట్టింపు ఉన్నాయనుకున్నా మొత్తం మీద వెయ్యి ఇవిఎంలలో సమస్యలున్నా యనుకుందాం. అంటే మొత్తం ఇవిఎంలలో యివి 92వ వంతన్నమాట. అందుకే సాయంత్రం 5 గం.ల కల్లా 72% ఓటింగు జరిగిందంటున్నారు. మొత్తానికి చూస్తే 79.64% ఓటింగు జరిగింది.

అర్ధరాత్రి దాకా ఓటింగు జరిగిన బూత్‌లు ఎన్ని? 400. అంటే మొత్తం వాటిల్లో 1% కంటె తక్కువ. ఆంధ్రలో 3.93 కోట్ల మంది ఓటర్లున్నారు. అంటే రమారమిగా 4 లక్షల మంది ఓటర్లు ప్రభావితమయ్యారన్నమాట. వాళ్లలో చంద్రబాబు మాట విని పసుపు-కుంకుమ, పెన్షన్లకు మురిసి ఓటేసిన వారెందరో తెలియదు. ఈ సంఘటన బట్టి ఓటర్లందరూ బాబును మళ్లీ గెలిపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారని వాదించడం సమంజసం కాదు. 

ఒకవేళ ఉంటే ఉండవచ్చు కానీ యిది సాక్ష్యంగా చాలదంటున్నాను. బాబు రెండు రకాలుగా మాట్లాడుతున్నారు. ఇవిఎంలలో గోల్‌మాల్‌ జరిగిందంటున్నారు. తన ఓటు తనకే పడిందో లేదో తెలియదంటున్నారు. మరో పక్క 110 నుంచి 130 కచ్చితంగా వస్తాయంటున్నారు. ఒకవేళ ఆయన చెప్పినట్లే జరిగితే, టిడిపి ఓట్లు వైసిపికి, వైసిపి ఓట్లు టిడిపికి పడి టిడిపి గెలిచిందనుకోవాలి. 

నిజానికి జాతీయ సర్వేలు దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేసరికి పొరపాట్లు చేస్తూ ఉంటాయి. అసలు మన గురించిన వార్తలు కూడా సమగ్రంగా యివ్వదు జాతీయ మీడియా. రాష్ట్రానికి ఒక వ్యాఖ్యాతను పెట్టుకుంటారు. ఆయన రాజధానిలో ఉంటూ అన్ని రకాల కథనాలూ ఆయనే అందిస్తాడు. ఇక సర్వే వచ్చేపాటికి సరైన సాధన సంపత్తి లేక, ఔట్‌సోర్స్‌ చేస్తారనుకుంటాను. అందువలన వాళ్ల సర్వేలను గుడ్డిగా నమ్మడానికి లేదు. 

ఇక స్థానికుల దగ్గరకు వచ్చేసరికి, వాళ్లలో పక్షపాత ధోరణి ఎక్కువ కనబడుతోంది. ఫలానా టీవీ సర్వేనా, అయితే ఫలితం యిలా వుంటుంది చూడు అని ముందే చెప్పేయవచ్చు. నా అనుమానం జాతీయ మీడియా ఏవో కొన్ని లెక్కలు వేసి వైసిపికి మొగ్గు చూపించి ఉంటుంది. ఉత్తరాదిన ఓటింగుపై కులసమీకరణాల ప్రభావం ఎక్కువ. దాన్నే ఆంధ్రకు అన్వయించి ఉంటారు.

'గత ఎన్నికలలో జగన్‌ వెంట నడిచిన కులాలన్నీ యిప్పటికీ అతనితోనే ఉన్నాయి. బాబు వెంట నడిచిన బిజెపి తాలూకు అగ్రవర్ణాలు, జనసేన తాలూకు కాపులు యిప్పుడు దూరమయ్యారు. జనసేన అభ్యర్థి బలంగా ఉన్నచోట కాపులు జనసేనకు వేశారు. లేనిచోట్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే కాపులు బాబును ఓడించగలిగిన వైసిపికి ఓటేశారు. అందుకే గోదావరి జిల్లాల్లో టిడిపికి సీట్లు తగ్గుతాయి. 

టిడిపికి ఎప్పుడూ అండగా ఉండే బిసిలు కూడా టిడిపి పట్ల నిరాశ చెంది, వారిలో కొందరు దూరమయ్యారు. అందుకే ఉత్తరాంధ్రలో కూడా వైసిపి పుంజుకుంటోంది. గతంలో టిడిపికి ఓట్లేసిన రెడ్లు కూడా యీసారి పగబట్టి వైసిపికి వేశారు. (జెసి దివాకరరెడ్డి కూడా యిదే మాట అన్నారు). ఇది కాకుండా తమకు హైకోర్టు కూడా దక్కనివ్వనందుకు రాయలసీమ ప్రజలు ఉడుకుతున్నారు. అక్కడ జగన్‌ అత్యధికమైన సీట్లు గెలవబోతున్నారు.' - ఈ లైన్స్‌లో వాళ్లు ఆలోచిస్తున్నారని నాకు తోస్తోంది.

రేపు యీ పాటికి ఫలితాలన్నీ తెలిసిపోతాయి - బాబు ఇవిఎంలపై మరో కొత్త కేసు పెట్టి ఫలితాల ప్రకటన ఆపిస్తే తప్ప! ఆ తర్వాత ఎవరు ఎవరికి ఓటేశారు అనేదానిపై చర్చలు, విశ్లేషణలూ ఎటూ తప్పవు.

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (మే 2019)
mbsprasad@gmail.com