cloudfront

Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: కనీస మద్దతు ధర, చట్టంగా..?

ఎమ్బీయస్: కనీస మద్దతు ధర, చట్టంగా..?

ఉద్యమిస్తున్న రైతుల డిమాండ్లు రెండు – కొత్తగా తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి, రెండోది కనీస మద్దతు ధర విషయంలో చట్టం చేయాలి. ఎందుకిలా అడుగుతున్నారు? దానివలన వచ్చే కష్టనష్టాలేమిటి? అనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి ముందు ఉద్యమం ప్రస్తుత పరిస్థితి గురించి ఓ సారి సమీక్షించుకోవచ్చు. మోదీ తొలిసారి 70 రోజుల నాటి రైతు ఆందోళన ప్రస్తావించారు. ఈ చట్టాలను 18 నెలల దాకా (యీ 18 అంకె ఎందుకు, ఎలా వచ్చిందో నాకు తెలియటం లేదు) అమలు చేయం అనే హామీని తన తరఫు నుంచి కూడా యిచ్చారు. ఆందోళనకారులు అడుగుతున్నది వాయిదా వేయమని కాదు. చట్టాల్ని రద్దు చేయమని. అది ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగిస్తుంది కాబట్టి ప్రభుత్వం రద్దు చేయదు. వాయిదా వేశామని చెప్పి, ఆందోళన సద్దు మణిగాక, అప్పుడు మళ్లీ ముందుకు తీసుకుని రావచ్చు.

ఈ చట్టాలలో కొన్ని లోపాలున్నాయని మామూలు వాళ్లకే తోస్తోంది. సబ్ కలక్టరు చెప్పిందే ఫైనల్, ఆ తర్వాత కోర్టుకి వెళ్లడానికి వీల్లేదు అనడం ఒకటి, హోర్డింగ్ (నిలువ చేయడం)పై సీలింగు (పరిమితి) ఎత్తివేయడం మరొకటి. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశం కాగా యీ చట్టం ద్వారా హక్కులు హరించడం మరొకటి. ఇలాటివి తమంతట తామే సవరించి, సవరణ చేశాం తప్ప పూర్తిగా రద్దు చేయలేదు అని ప్రభుత్వం ఊరడిల్లవచ్చు. తమకు యిబ్బందికరమైనవి తీసేశారు కదాని రైతాంగం ఆనందించవచ్చు. ఇక ఎమ్మెస్పీని చట్టంలోకి తేవడం విషయం రైతులతో కాదు అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీలతో కూర్చుని ఆలోచించి చేయాలి. ఎందుకంటే రేపు ఎవరైనా అధికారంలోకి రావచ్చు. ప్రతిపక్షంలో వుండగా ఒక మాట, అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారు వీళ్లందరూ. ఇప్పుడు వాళ్లని కమిట్ చేయించాలి.

ఇక శాంతిభద్రతల విషయానికి వస్తే, ఎఱ్ఱకోట వీరుడు దీపూ సిద్దూ అని స్పష్టంగా తేలింది. అతనిదే అల్లరంతా మాదేం లేదు అంటున్నారు రైతు నాయకులు. మీరు రెచ్చగొట్టారు కాబట్టే యిదంతా జరిగిందని కేంద్రం కేసులు పెడుతోంది. అయోధ్యలో బాబ్రీ మసీదు ఎవరో దుండగులు కూల్చారు అంది సుప్రీం కోర్టు. మరి దానికి ముందు రథయాత్ర చేసి ఆడ్వాణీ రెచ్చగొట్టి మూకలను రప్పించారు కదా అంటే కోర్టు కాదు పొమ్మంది. మరి యీ కేసులో ఏమంటుందో చూడాలి. ఈ అల్లర్లను సాకుగా చూపి, కేంద్రం రైతు నాయకులను మూసేయడానికి చూస్తోంది. రెండు నెలలుగా యాక్షన్ తీసుకుందామంటే సాకు దొరకలేదు. ఇప్పుడు దొరికింది.

దిల్లీ ప్రభుత్వం చేతిలో పోలీసు వ్యవస్థ వుండి వుంటే రిపబ్లిక్ దినాన ఎఱ్ఱకోటపై దాడి జరగడం శాంతిభద్రతల వైఫల్యం అంటూ కేంద్రం ఆప్ ప్రభుత్వాన్నీ రద్దు చేసేది. ఇప్పుడు ఉద్యమం యుపిలో ఉధృతమౌతోంది. తికాయత్ పిలుపు మేరకు ఎక్కడెక్కడి రైతులు ఘాజీపూర్ చేరుతున్నారు. ఫిబ్రవరి 2 నాటికి 5 రాష్ట్రాల రైతులు వచ్చి చేరతారట. పోలీసులు హైవేలను తవ్వేసి అపాలని చూస్తున్నారు. అంతమంది అక్కడ చేరినపుడు ఏ అఘాయిత్యమైనా జరగవచ్చు. చేరకుండా చూడాలంటే అక్కడ వాక్సినేషన్ క్యాంపు పెట్టాలి. టీకాల టార్గెట్ యీజీగా చేరవచ్చు. ఒకవేళ టీకాల భయంతో రావడం మానేశారనుకోండి, మరీ మంచిది. జనాలకు రోగమంటే ఖాతరు లేదు కానీ టీకా అంటే వణుకుందిగా!

ఇప్పటిదాకా పంజాబీలు నేతృత్వం వహించారు కాబట్టి వాట్సప్ వీరులు పంజాబీల మీద కక్ష కట్టి విషం చిమ్ముతున్నారు. మన దగ్గర రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ వుంటే పంజాబీ రైతులు దిట్టంగా వుండడమేమని వీరి దుగ్ధ కాబోలు. పదివేల ట్రాక్టర్లు, దాని కయ్యే డీజిలు అంటూ లెక్కలు వేసి, యిన్ని వేల కోట్లు అవుతుంది, దీని ఖర్చు ఖలిస్తానీలు, పాకిస్తాన్, చైనా పెట్టాయంటూ మెసేజిలు వచ్చి పడుతున్నాయి. ఏ ట్రాక్టరు డీజిలు ఖర్చు ఆ రైతు పెట్టుకోలేడా? ఆ రైతు దగ్గర ఆ మాత్రం డబ్బుండదా? అని ఆలోచించి చూడరేం? వీళ్లు సరే, మరి ఉద్యమంలో వున్న హరియాణా, పశ్చిమ యుపి రైతుల మాటేమిటి? హరియాణాలో, యుపిలో వున్నది బిజెపి ప్రభుత్వం కాబట్టి వాళ్లంతా ఉత్తములై పోయారా? దీనిలో వున్న పంజాబీలంతా ఖలిస్తానీయులైతే మరి వాళ్లంతా ఏ స్తానీలు? కెనడా ఖలీస్తానీల డబ్బు వారికి కూడా చేరుతోందా?

మొత్తం పంజాబీలను కాదు, ఖలిస్తానీయులను అంటున్నాం అని కొందరి బుకాయింపు. ఖలిస్తాన్ ఎప్పటి మాట? కెనడా ఖలిస్తానీయులకు డబ్బు వుండవచ్చు కానీ పలుకుబడి లేదు. అందుకే పాకిస్తాన్ ఎంత ప్రయత్నించినా ఖలిస్తాన్ పేరు చెపితే పంజాబ్‌లో అంబ పలకటం లేదు. ప్రస్తుతం ఖలిస్తాన్ సానుభూతిపరులు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఇప్పటికీ డిఫెన్సులో పంజాబీలే ఎక్కువ. రిపబ్లిక్ దినం నాడు వచ్చిన ట్రాక్టర్లలో ఎవడో భింద్రన్‌వాలే బొమ్మ ట్రాక్టర్ మీద పెయింట్ చేయించుకున్నాట్ట. టైమ్స్ నౌ పొద్దుటి నుంచి సాయంత్రం దాకా అదే విజువల్. మొత్తం ఎన్ని ట్రాక్టర్లలో అతని బొమ్మలున్నాయో, వాటి శాతమెంతో ఎవరైనా ఆలోచించారా? గ్వాలియర్‌లో గోడ్సే జ్ఞానమందిరం పెట్టారనే వార్త చదివి ఏ అమెరికనో భారతీయులు గాంధీని ఆరాధించరు, ఆయన హంతకుడైన గోడ్సేని ఆరాధిస్తారని ప్రచారం చేస్తే...?

‘ఆ సెంటర్ రెండు రోజుల తర్వాత మూతపడింది, యిప్పటికీ భారతీయులు తమ పిల్లలకు గాంధీ పేరు పెట్టుకుంటారు తప్ప గోడ్సే పేరు పెట్టుకోర’ని చెప్పాలా వద్దా? పంజాబ్‌లో పంట పుష్కలంగా పండుతోంది కాబట్టే, దళారీ వ్యవస్థో, మరో వ్యవస్థో దాని ద్వారా అది దేశమంతా చేరుతోంది కాబట్టి వరి, గోధుమ ధరలు యీ స్థాయిలో వున్నాయి. లేకపోతే యింకా ఎంత పెరిగిపోయావో! గతంలో ఆహారధాన్యాల కోసం అమెరికాను దేబిరించినవాళ్లం మనం. బియ్యం కోసం రేషన్ షాపుల ముందు క్యూలో నిలబడిన రోజులు నాకింకా గుర్తున్నాయి. వ్యవసాయాన్ని కిట్టుబాటుగా చేయకపోతే తిండి గింజలు పండించడం మానేస్తారు రైతులు. మళ్లీ ఆ రోజులు వస్తాయి. అందువలన వరి, గోధుమ పండించి బాగా మదించారు పంజాబ్, హరియాణా రైతులు అంటూ వాళ్ల మీద మండిపడడం మానేస్తే మంచిది.

రిపబ్లిక్ డే సంఘటన చూసి షేమ్, షేమ్ ఇండియా అనుకోనవసరం లేదు. ఎందుకంటే అమెరికాలో, అందరికీ నీతులు చెప్పే అమెరికాలో, జనవరి 6 నాటి దాడి సాక్షాత్తు అధ్యక్షుడే చేయించాడు. ఇక్కడ దీపూ సిద్దూ అనే ఆకతాయి చేశాడు. ఇతని వెనుక ప్రధాని మోదీ ఉన్నాడని తేలితే మాత్రం అప్పుడు షేమ్‌షేమ్ ఇండియా అనుకోవాల్సిందే. అప్పటిదాకా అనేక దురదృష్ట సంఘటనల్లో యిదొకటి అనుకుని అక్కడ ఆగవచ్చు. ఇలాటి ఉద్యమాలను విరమింప చేయడానికి యీ ప్రభుత్వమైనా, మరే యితర ప్రభుత్వమైనా సరే ఏవో ట్రిక్కులు వేస్తుంది. 

ఎందుకంటే వీరి డిమాండ్లకు లొంగితే రేపు మరొక వర్గం వారు ఉద్యమించవచ్చు. సంస్కరణల పేర చేద్దామనుకున్న మార్పులు చేయలేక పోవచ్చు. అందువలన రైతు సంఘాల్లో చీలికలు తేవడం, కేసులు మోపడం, మీడియా ద్వారా బద్‌నామ్ చేయడం.. యివన్నీ మామూలే. ఇవాళ విమర్శిస్తున్న ప్రతిపక్షాలు కూడా అధికారంలోకి వస్తే యించుమించు యిలాగే ప్రవర్తిస్తారు. అందువలన ఉద్యమకారులు అంతిమంగా గెలుస్తారా లేదా అన్నది ఎవరూ చెప్పలేరు.

రైతుల ప్రస్తుత పరిస్థితి బాగా లేదు. దీనికి తరతరాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలు కారణం. అందరూ యిక్కడదాకా అంగీకరిస్తారు. అయితే వాళ్ల పరిస్థితిని యీ చట్టాలు బాగుపరుస్తాయా అనే దానిపైనే చర్చ అంతా. ఇంత ముఖ్యమైన చట్టాలు లోపరహితంగా వుండాలి. మెచ్చుకునే నిపుణులు ఫలానా లోపాలున్నాయని చెప్పటం లేదు. అంతా భేషుగ్గా వుందంటున్నారు. మోదీ కఠినాత్ముడు కాదు, చట్టంలో రక్షణ లేకపోయినా రైతులను కాపాడతాడని కొందరు హామీలు యిస్తున్నారు. మోదీ ఎల్లకాలం వుండడని గుర్తుంచుకోవాలి. చట్టంలో లొసుగు వుంటే రేపు వచ్చే వాళ్లు దాన్ని ఆసరా చేసుకుని రైతులను బాధించవచ్చు. సబ్ కలక్టరు తీర్పే ఫైనల్, కోర్టుకి వెళ్లడానికి వీల్లేదు అనే చట్టాన్ని ఆమోదించాక ఆ తర్వాత నెత్తీనోరూ కొట్టుకున్నా ప్రయోజనం లేదు.

అమరావతి రైతుల విషయమే వుంది. వాళ్లు భూములు డెవలప్‌మెంట్‌కి యిచ్చినపుడు చంద్రబాబుపై నమ్మకంతో టైము లిమిట్ క్లాజ్, కాంపెన్సేషన్ క్లాజ్ లేకుండా సంతకాలు పెట్టేసి, భూమి అప్పగించేశారు. బాబు వెళ్లిపోయి జగన్ వచ్చాడు. ప్రభుత్వం యిచ్చిన హామీలు పట్టించుకోవటం లేదు. ఒప్పందం చూపించి కోర్టుకి వెళదామంటే, అది లోపభూయిష్టం. దాంతో ఎప్పటికో అప్పటికి ఏదో ఒకటి కడతాం అంటా జగన్ తాత్సారం చేస్తున్నాడు. రైతులు ఏమీ చేయలేక రోడ్డెక్కారు. ఈ సాగు చట్టాల విషయంలో కూడా రేపు అదే జరుగుతుంది. రాబోయే వాళ్లు చట్టాన్ని అడ్డు పెట్టుకుని రైతుల్ని ఒక ఆట ఆడుకోవచ్చు. అన్ని పక్షాలకు న్యాయం జరిగేట్లా వుంటేనే అది సరైన చట్టం అవుతుంది.

ఇప్పుడు కనీస మద్దతు ధర ఎందుకు వుండాలి అనే ప్రశ్నకు సమాధానం చెపుతాను. ఉమ్మడి రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీగా చేసిన డా. మోహన్ కందాగారు ‘‘మోహన మకరందం’’ అనే తన ఆత్మకథలో జాలర్ల విషయంలో తన స్వానుభవాన్ని రాశారు. 1980లో ఆయన ఫిషరీస్ కార్పోరేషన్‌కి సిఎండీగా వుండగా సముద్రం నుంచి జాలర్లు తెచ్చే చేపలను కాంట్రాక్టర్లు కారుచౌకగా కొట్టేస్తూండడం గమనించారు. చేపలు నిలవ వుండవు కాబట్టి వాళ్లు చెప్పిన అధ్వాన్నమైన రేటుకి అమ్మకతప్పేది కాదు జాలర్లకు. ఈయన ఫిషరీస్ కార్పోరేషన్ తరఫున సముద్రపు ఒడ్డునే ఒక స్టాల్ పెట్టించారు. కాస్టింగ్ అంతా సరిగ్గా చేయించి ఫలానా చేపకైతే యింత, మరోదానికైతే యింత అంటూ ఒక ఫ్లోర్ ప్రైస్ (కనిష్ట ధర) ప్రకటించి, ఆ రేటుకి జాలర్ల వద్ద తాము కొని, ప్రజలకు అమ్ముతామని ప్రకటించారు. అది అప్పటిదాకా తమకు వచ్చే రేటు కంటె ఎక్కువ వుండడంతో జాలర్లు తమ చేపల్ని వీళ్లకే అమ్మసాగారు.

ఇది చూసి మూడో రోజు నుంచి కాంట్రాక్టర్లు ప్రభుత్వం యిచ్చే రేటు కంటె మేం ఒక రూపాయి ఎక్కువిచ్చి కొంటాం అనసాగారు. దాంతో జాలర్లు వాళ్లకే అమ్మసాగారు. పోనీలే, జాలర్ల జీవితాలు బాగుపరిచాం అని ఫిషరీస్ డిపార్టుమెంటు వారు ఆనందించారు. ఆర్నెల్లు యిలా సాగేసరికి ఫైనాన్సు శాఖ నుంచి అభ్యంతరం వచ్చింది. అక్కడ స్టాలు పెట్టారు, కొనుగోళ్లు లేవు, అమ్మకాలు లేవు, ప్రభుత్వానికి నష్టం వస్తోంది, మూసేయండి అని. వాళ్లకి ఎదురు చెప్పలేక వీళ్లు మూసేశారు. ప్రభుత్వ స్టాల్ ఎత్తేయగానే కాంట్రాక్టర్లు మా చిత్తం వచ్చిన రేటుకే మీరు అమ్మాలనే పద్ధతికి మళ్లీ వచ్చేశారు. జాలర్ల దోపిడీ తిరిగి మొదలైంది. కథలో నీతి ఏమిటి? ప్రభుత్వం కనుక కనీస మద్దతు ధర ప్రకటించకపోతే ఉత్పత్తిదారు దోపిడీకి గురవుతాడు. నాకు గిట్టుబాటయ్యే ధరను నువ్వివ్వకపోతే, నేను దర్జాగా ప్రభుత్వానికి అమ్ముకుంటాను అని రైతు అనగలిగే స్థితి వుండాలి.

విత్తనం వేసిన దగ్గర్నుంచి, పంట చేతికి వచ్చేదాకా రైతుకి ఎన్నో టెన్షన్లు. విత్తనం నాణ్యత, ఎరువుల నాణ్యత, క్రిమినాశకాల నాణ్యత, కూలీల లభ్యత, వర్షాభావం, అకాలవర్షం, తుపాను, వరదలు, పెట్టుబడికి డబ్బు రాకపోవడం యిలా ఎన్నో అడ్డంకులు దాటుకుని పండించిన దాకా వుండి, దాన్ని అమ్ముకోలేక పోతే ఎలా అనే భయం వున్నపుడు రిస్కెందుకు తీసుకుంటాడు? ‘నీ ఉత్పాదనకు కిట్టుబాటు ధర ఏమిటో నేను లెక్కలు వేసి వుంచాను. ఎక్కడా అమ్ముడుపోకపోతే నా దగ్గరకు రా, నేను కొంటాను.’ అనే హామీ ప్రభుత్వమైనా యివ్వకపోతే ఎవరు మాత్రం వ్యవసాయం చేయగలరు? తక్కిన వస్తువులైతే, రేటు వచ్చాకనే అమ్ముదాం అంటూ గొడౌన్లలో పడేసి వుంచవచ్చు. పంట అలాక్కాదే!

ప్రస్తుతం మండీలలో తమ పంటను కనీస మద్దతు ధరకు అమ్ముకోవచ్చు. ఈ చట్టాల ద్వారా మండీలకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కార్పోరేట్‌ల మండీలను దించుతోంది. వాటిల్లో కూడా కనీస మద్దతు ధర లభించేట్లా చూడమని రైతులు అడుగుతున్నారు. ప్రభుత్వం అదేం కుదరదు, జాన్తానై అంటోంది. కార్పోరేట్లు వచ్చాక కూడా మండీలు వుంటాయని కేంద్రం అంటోంది కానీ మూలపడే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే యిప్పుడు రాష్ట్రప్రభుత్వాలకు వాటి ద్వారా ఆదాయం వస్తోంది, వాటిని పోషిస్తున్నాయి. ఈ చట్టం ద్వారా మండీలో అయితే రాష్ట్రానికి డబ్బు కట్టాలి, మండీ బయట అయితే ఏమీ కట్టనక్కరలేదు అనగానే మండీకి ఎవడు వెళతాడు? ఆదాయం రాకపోతే రాష్ట్రం మాత్రం ఏం మేన్‌టేన్ చేస్తుంది? అందువలన మండీ బయటే అమ్మకాలు జరుగుతాయి కాబట్టి అక్కడ కనీస మద్దతు ధర హామీ లేకపోతే ఎలా అని రైతుల బాధ.

అగ్రికల్చరల్ ఎకనామిక్స్ మీద ఎన్‌డిఏ ప్రభుత్వానికి సలహాలిస్తూ, అనేక పదవులు అలంకరిస్తూ, 2015లో పద్మశ్రీ కూడా అందుకున్న అశోక్ గులాతీ ‘‘కొరత వున్న రోజుల్లో పుట్టుకొచ్చినది కనీస మద్దతు ధర విధానం. ఇప్పుడు కావలసినదాని కన్న ఎక్కువగా పండుతున్న రోజుల్లో యిది అనవసరం.’’ అంటారు. పంట ఎక్కువ పండుతోంది నిజమే కానీ రైతుకి ఎక్కువ లాభం వస్తోందా? వస్తూంటే గతంలో కంటె రైతు ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయి? సమస్య పంట దిగుబడి గురించి కాదు, అమ్మకం గురించి అని యీ మేధావులకు అర్థం కాదెందుకో! నేషనల్ రెయిన్‌ఫెడ్ ఏరియా అథారిటీ అనే కేంద్ర వ్యవసాయ శాఖకు సంబంధించిన సంస్థ సిఇఓ అశోక్ దల్వాయి ‘కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి ఆ ధరకే కార్పోరేట్లను కొనమంటే వాళ్లు యితర దేశాలకు ఎగుమతి చేసినప్పుడు కాంపిటీటివ్ ధరకు అమ్మలేరు’ అన్నారు.

ఇక్కడే క్లియర్‌గా అర్థమౌతుంది, కార్పోరేట్‌లు కనీస మద్దతు ధరకు కొనడానికి సిద్ధంగా లేరు అని. కొంటే వాళ్లకు లాభాలు రావు. వాళ్లకు లాభం రాని పని కేంద్రం చేయదు. చట్టబద్ధం చేయడం ఎందుకంటే కార్పోరేట్లతో బేరమాడేటప్పుడు రైతుకి ధైర్యం వుంటుంది. ఏదైనా వస్తువు కొనేటప్పుడు దాని మీద వేసిన ఎమ్మార్పీ (మాగ్జిమమ్ రిటైల్ ప్రైస్) గరిష్ట ధర కంటె ఎక్కువ వుంటే మనం దుకాణదారుణ్ని నిలదీస్తాం. అలాగే రైతు పంట అమ్మేటప్పుడు ప్రభుత్వం చెప్పిన ఎమ్మెస్పీ కంటె తక్కువకి అడుగుతావేమిటి అని కార్పోరేట్‌ను నిలదీయవచ్చు. 

పైన చెప్పిన ఫిష్ స్టాల్ ఉదంతం గమనించండి. రైతు పచ్చగా వున్నాడనుకుంటున్న పంజాబ్‌లోనే 72% మంది 5 ఎకరాలకు లోపు భూమి వున్నవారట. హరియాణాలో 67%. ఈ చిన్న రైతులు కార్పోరేట్లతో బేరమాడేటప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ధాటీగా రేటు డిమాండ్ చేయలేరు. నీక్కాకపోతే ప్రభుత్వ స్టాల్‌లో అమ్ముకుంటే వాళ్లు మహరాజులా యిస్తారు అని దబాయించే పరిస్థితి వుండాలంటే, ఎమ్మార్పీ గురించి చట్టం వుండాలి. ప్రస్తుతం ఎమ్మార్పీ ఒట్టి సూచన మాత్రమే.

ఇదంతా వింటే కనీస మద్దతు ధర పేర ప్రభుత్వం చాలా ఎక్కువ రేటు పెట్టి కొనుగోలుదారులకు నష్టం చేకూరుస్తోందనే అభిప్రాయం కలగవచ్చు. ఆ ధరను ప్రస్తుతం గణిస్తున్న విధానం గురించి జనవరి 8 నాటి ఆంధ్రజ్యోతిలో రైతు స్వరాజ్య వేదిక కన్నెగంటి రవి విశదీకరించారు. ధర నిర్ణయించే సిఎసిపి అన్ని రాష్ట్రాల నుంచి వ్యవసాయ విశ్వవిద్యాలయాల తోడ్పాటుతో పంటల ఉత్పత్తి ఖర్చుల (అంటే విత్తనాలు, ఎరువులు, క్రిమినాశకాలు, ఇంధనం, కూలీలకు యిచ్చినది, సాగునీటి ఖర్చు)వివరాలు సేకరించి సగటు చేస్తుంది. 

తెలంగాణలో 13 వేల గ్రామాలుంటే కేవలం 30 గ్రామాలలో వివరాలు మాత్రమే తీసుకుంటుంది. తెలంగాణలో 30-40 పంటలు పండించే రైతులు రైతు బంధు పథకం ప్రకారం 61 లక్షలున్నారు. వీళ్లు కేవలం 10 పంటలకు 300 మంది రైతుల నుంచి మాత్రమే సమాచారం సేకరిస్తారంటే వీళ్ల శాంపుల్ ఎంత చిన్నదో అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యవసాయ శాఖ ద్వారా ఉత్పత్తి ఖర్చులు సేకరిస్తాయి. ఈ రెండిటికి ఎక్కడా పొంతన వుండటం లేదట. రాష్ట్రప్రభుత్వం యిచ్చే సమాచారాన్ని సిఎసిపి పట్టించుకోదు.

ఇలా అతి తక్కువ శాంపుల్స్‌తో పోగేసిన అంకెలను సగటు చేస్తుంది. అసలు యీ సగటు విధానమే తప్పు. ఒక్కో రాష్ట్రంలో ఖర్చులు ఒకలా వుంటాయి. రాష్ట్రంలోనే ఒక్కో చోట ఒక్కోలా పరిస్థితులుంటాయి. అనంతపురంలో సాగునీటి ఖర్చు ఎక్కువ, గోదావరి జిల్లాలో తక్కువ. గోదావరి జిల్లాలో కూలీల ఖర్చు ఎక్కువ, శ్రీకాకుళంలో కూలీల ఖర్చు తక్కువ. పంజాబ్‌లో నీళ్లు ధారాళంగా దొరుకుతాయి, రాజస్తాన్‌లో దొరకవు. అలాటప్పుడు దేశమంతా కలిపి ఒకే రేటు ఎలా ఫిక్స్ చేయగలరు? ఏమైనా మాట్లాడితే యీ మధ్య ఒన్ నేషన్-ఒన్ ... అని మొదలుపెట్టారు. మనది వైవిధ్యభరితమైన దేశం. ఒక రాష్ట్రంలో పురుషుల సగటు ఎత్తు 5’8’’ అయితే మరో రాష్ట్రంలో 5’3’’. అందరికీ ఒకే పంట్లాం తొడుగుతామంటే ఎలా?

సరే యీ ఉత్పత్తి ఖర్చును ఎ2 అన్నారు. దీనికి ఎఫ్‌ఎల్ (ఫ్యామిలీ లేబర్) అని ఇంకో అంకె చేరుస్తారు. అంటే కూలీలను పెట్టుకున్నా, సాధారణ రైతు యింట్లో మనుష్యులు కూడా వచ్చి పని చేస్తూంటారు కాబట్టి, వాళ్ల శ్రమకు విలువ కట్టి చేరుస్తారన్నమాట. వినడానికి భేషుగ్గా వుంది కానీ వాళ్లు కట్టే విలువ చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వరి పంట విషయంలో సీజను మొత్తానికి యావన్మంది కుటుంబసభ్యుల శ్రమకు సిఎసిపి కట్టిన విలువ ఎంతో రూ. 3728 అని రవి రాశారు. రోజుకి ఎంత వర్కవుట్ అవుతుందో మీరే లెక్కేసి, ఆ రేటుకి ఏ కూలీ వస్తాడో చెప్పండి. ఈ ఎ2ని, ఎఫ్‌ఎల్‌ను కలిపి వచ్చిన మొత్తం మీద దానికి కొంత లాభం చేర్చి దీన్నే ఎమ్మెస్పీగా ప్రకటిస్తారు.

ఇలా లెక్కించే పద్ధతి కరక్టు కాదని, రైతు మూల పెట్టుబడి, (భూమి విలువ, సాగు నీటి వనరు, పొలంలో షెడ్డు, యంత్రాల కొనుగోలు, ఆ భూమిని కౌలుకిస్తే ఎంతో కొంత వస్తుంది కదా, అది పోతోంది కాబట్టి దానికి బదులుగా కొంత, ఫిక్సెడ్ కాపిటల్ ఎసెట్‌పై ఇంట్రస్టు యిలాటివన్నీ కలిపితేనే సమగ్ర ఉత్పత్తి ఖర్చు (సి2) వస్తుందని, దానికి 50% కలిపి కనీస మద్దతు ధర ప్రకటించాలని 2007లో, అంటే 13 ఏళ్ల క్రితం స్వామినాథన్ ఆధ్వర్యంలోని జాతీయ వ్యసాయ కమిషన్ సిఫారసు చేసింది. 2009 ఎన్నికల సందర్భంగా దాన్ని అమలు చేస్తామని హామీ యిచ్చిన యుపిఏ అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయలేదు. ధర కాస్త పెంచి ఊరుకుంది. బిజెపి 2014 పార్లమెంటు ఎన్నికల మానిఫెస్టోలో, మోదీ తన ప్రచారంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు చేస్తామని చెప్పారు.

అధికారంలోకి వచ్చాక ఆ హామీ నిలబెట్టుకోకుండా, తాత్సారం చేసి, చాన్నాళ్లకు సి2కి 50% కలిపి కాకుండా ఎ2, ఎఫ్‌ఎల్‌కు కొంత లాభం కలిపి ఎమ్మెస్పీ ప్రకటించడం మొదలుపెట్టిందని, పైగా ఎమ్మెస్పీకి చట్టబద్ధత లేకపోవడం చేత ప్రభుత్వాలు ఆయా పంటలను సేకరించిన సందర్భంలో తప్ప వ్యాపారులు ఎవరూ దాన్ని చెల్లించటం లేదని, చివరకు మండీలలో కూడా అది అమలు కాకపోయినా అధికారులు, మండీ పాలక మండలి పట్టించుకోవడం లేదని కన్నెగంటి రవి రాశారు. అందుకే రైతులు చట్టబద్ధత గురించి అంత పట్టుబడుతున్నారు. 

ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సిఐ)ని పునర్నిర్మాణానికి ఎన్‌డిఏ ప్రభుత్వం నియమించిన హైలెవెల్ కమిటీ నివేదిక ప్రకారం దేశంలో ఎమ్మెస్పీకి అమ్మే రైతులు 5.8% మాత్రమేనని, ఇప్పుడది 9% అయిందని అశోక్ దల్వాయి అంటున్నారని, పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లు ఎమ్మెస్పీ రేట్లకు ఓ మేరకు సేకరిస్తున్నాయని, తూర్పు రాష్ట్రాలలో చాలా వాటిల్లో సేకరణే లేదని ఔట్‌లుక్ (డిసెంబరు 21) రాసింది. సాక్షి (జనవరి 23)లో యోగేంద్ర యాదవ్ రాస్తూ ఎమ్మెస్పీ మద్దతు పొందుతున్న రైతులు 20 కంటె తక్కువ శాతంమందే అని రాశారు. ఒక్కో పంటకు ఒక్కో శాతం వుంది కాబోలు.

రైతుల్లో ఎమ్మెస్పీ ఎవేర్‌నెస్ గురించి 2017 సెప్టెంబరులో చేసిన ఒక అధ్యయనంలో గ్రామీణ రైతుల్లో వాటి గురించి 24% లోపు రైతులకే తెలుసని తేలింది. ఇప్పుడీ ఆందోళన వలన అందరికీ తెలిసి వచ్చివుండవచ్చు. యోగేంద్ర యాదవ్ తన వ్యాసంలో రాసిన ప్రకారం మొక్కజొన్న ఎమ్మెస్పీ క్వింటాలుకి రూ.1850 కాగా, రైతు 1100-1300 కే అమ్ముకోవలసి వచ్చిందట. ‘స్వామినాథన్ కమిషన్ సిఫార్స్ చేసినట్లు ఎమ్మెస్పీని 50% మేర పెంచినట్లయితే ప్రభుత్వం మీద పడే అదనపు భారం రూ. 2.28 లక్షల కోట్లు అవుతుంది. ఇది మొత్తం జిడిపిలో 1.3% మాత్రమే. అంటే కేంద్ర బజెట్‌లో 8% అన్నమాట.’ అని యోగేంద్ర యాదవ్ రాశారు. పశ్చిమ దేశాలు ఎమ్మెస్పీ జిడిపిలో 10% వరకు అనుమతిస్తాయని ఇండియా టుడే (అక్టోబరు 5) రాసింది. అయితే అవి వ్యవసాయ సబ్సిడీలు పరిమితం చేయాలని పట్టుబడుతూంటాయి.

అదే వ్యాసంలో ఎన్‌డిఏ ప్రభుత్వం 2017 నాటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ మార్కెటింగ్ చట్టం, 2018 నాటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అండ్ లైవ్‌స్టాక్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ప్రకారం మండీలలో ప్రయివేటు పెట్టుబడులు అనుమతించమని ప్రోత్సహిస్తోందని, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, తమిళనాడు వంటి 18 రాష్ట్రాలు ప్రయివేటు మండీలలో కార్పోరేట్లను అనుమతించాయని రాశారు. మరి వాటి అనుభవం ఎలా వుందో పూర్తిగా చూడకుండా, యీ చట్టం ద్వారా మండీలకు పోటీగా కార్పోరేట్లను తేవడం ఎందుకో నాకు అర్థం కాలేదు. ముఖ్యంగా ఎమ్మెస్పీ పట్ల ఏదో ఒకటి చేయాలి. నిజానికి మధ్యప్రదేశ్‌లోని బిజెపి ప్రభుత్వమే ఎమ్మెస్పీకి, రైతుకి కిట్టుబాటు అయ్యే ధరకు మధ్య వ్యత్యాసం వుందని గుర్తించి ‘భావాంతర్’ (రేటులో తేడా) పథకం పెట్టింది. అందువలన ఎమ్మెస్పీ గణన సరిగ్గా లేదని ఆ పార్టీకే తెలుసు.

సాగు చట్టాలపై యింకా కొన్ని వ్యాసాలు రాస్తాను. కంటెంట్‌లో ఏవైనా తప్పులు దొర్లుతూంటే చెప్తూండండి.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2021)
mbsprasad@gmail.com

 


×