Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్‍: క్రాస్ ఓటింగు ఊహించలేదా?

ఎమ్బీయస్‍: క్రాస్ ఓటింగు ఊహించలేదా?

ఆంధ్ర కౌన్సిల్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగు జరిగింది. ఇది ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అన్నట్లుగా కొందరు పరిశీలకులు చెప్తూండడం నాకాశ్చర్యం కలిగిస్తోంది. టిడిపి ద్వారా ఎన్నికైన వారిలో నలుగురు వైసిపికి వేసినప్పుడు, వైసిపి నుంచి కొందరు యిటు వేయడం సహజమే కదా. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని వైసిపి కానీ మనం కానీ ఊహించనిదైతే కాదు. బాహాటంగా బావుటా ఎగరేసిన యిద్దరైతే కచ్చితం, యింకా ఎందరు వేస్తారో తెలియదు అనే అనుకున్నాం. ఆ ఇంకా కొందరు.. యిద్దరే! అని తేలింది. టిడిపి మొదట్నుంచి చెపుతోంది. 16 మంది మాతో టచ్‌లో ఉన్నారు అని. వారిలో 4గురు మాత్రమే యీ ఎన్నికలో యిటు ఓటేశారు. తక్కిన 12 మంది వెనకాడారో, లేకపోతే టిడిపి యిప్పుడు వద్దులే అందో తెలియదు. ‘నలుగురు యిటు వేయడంతో ట్రెండ్ మారిపోయింది, వైసిపి పట్ల ప్రజావ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, 2024లో దాని ఓటమి తథ్యం’ అని అనుకోవడం సబబా కాదా అని చూడాలి.

నలుగురిని టిడిపి తమ వైపు గుంజుకోవడం ఆశ్చర్యం కాదు. టిడిపి వారి 23 మంది ఎమ్మెల్యేల నుంచి నలుగుర్ని వైసిపి లాక్కున్నపుడు, వైసిపి నుంచి టిడిపి లాక్కోవడంలో వింత లేదు. ప్రతిపక్షం లోంచి అధికార పార్టీలోకి ఫిరాయించేవారు ఎక్కువ మంది ఉంటారు. కానీ అధికార పార్టీలో ఉంటూ ఆశించినది దక్కనపుడు ప్రతిపక్షంలోకి గెంతిన వారూ ఉన్నారు. నంద్యాల ఉపయెన్నిక జరిగిన సందర్బం అలాటిదే కదా! టెక్నికల్‌గా వైసిపికి ఉన్నవి 151 మాత్రమే. అంటే స్థానానికి 22 మంది ఎమ్మెల్యేల చొప్పున దానికి 6 సీట్లు దక్కి, పైన 19 మిగలాలి. ఇప్పుడు అన్నే దక్కాయి. అయితే అది కనీసం 154 వస్తాయని లెక్క వేసుకుని ఏడుగురు అభ్యర్థులను నిలపింది. ఎందుకంటే టిడిపి వారిలో నలుగురు, జనసేన నుంచి ఒకరు వైసిపికి అనుబంధ సభ్యులుగా ఉన్నారు. ఆ విధంగా 156 అయ్యారు. తమది కాని 5 ఓట్లు వైసిపి ఎలా ఆశించిందో, తమది కాని 3 ఓట్లు టిడిపి ఆశించి అభ్యర్థిని నిలిపింది. 3 ఆశిస్తే 4 వచ్చాయి. ఈ ముక్క ముందే తెలిస్తే టిడిపి లోకేశ్‌నే నిలబెట్టేది అని కొందరన్నారు. ప్రత్యక్ష ఎన్నికలలో ఎమ్మెల్యేగా, అదీ మంగళగిరి నుంచి, గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని ప్రకటించిన లోకేశ్ ఎమ్మెల్సీగా వస్తే గేలి చేస్తారు. అందుకని అనూరాధతో ఛాన్సు తీసుకున్నారు. ఇప్పుడావిడ గెలిచింది కాబట్టి మంగళగిరి నుంచి లోకేశ్‌ని గెలిపించే భారం ఆవిడపై పెడతారు.

ఇక బలాబలాల సంగతి చూస్తే వైసిపి వైపు ఉన్న అదనపు 5 సీట్లు బాహాటంగా ఎప్పణ్నుంచో అందరికీ తెలిసినవే అయితే టిడిపి వైపు పడిన 4 సీట్లు యిటీవల జరిగిన పరిణామాల ఫలితం. దానిలో సస్సెన్స్ ఎలిమెంట్ ఉంది. ఆ నలుగురు ఎవరో ఊహించవలసిన పరిస్థితి ఉంది. అందుకే చర్చ జరుగుతోంది. టిడిపి ద్వారా నెగ్గి, పార్టీ నుంచి బయటకు వచ్చేసి అసెంబ్లీలో విడిగా కూర్చొంటున్న వారిలో గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, చీరాల నుంచి కరణం బలరాం, విశాఖపట్టణం నుంచి వాసుపల్లి గణేశ్ కుమార్, పశ్చిమ గుంటూరు నుంచి మద్దాలి గిరిధర్ ఉన్నారు. వాళ్లు టిడిపి నుంచి రాజీనామా చేయలేదు. ఎవరైనా మా పార్టీలో చేరాలంటే అవతలి పార్టీకి రాజీనామా చేసి రావాల్సిందే అని వైసిపి పాటిస్తున్న నియమానుసారం వాళ్లు తమ స్థానాలు వదులుకుని ఉప యెన్నికలకు వెళ్లాలి. టిడిపి ఆ మేరకు డిమాండ్ చేసి ఉండాల్సింది.

కానీ ఉప యెన్నికలు రావడం యిష్టం లేకనో ఏమో టిడిపి వాళ్ల రాజీనామాలపై పట్టుబట్ట లేదు. వంశీ టిడిపి అధినాయకులపై యిష్టం వచ్చినట్లు ప్రలాపాలు చేస్తున్నా చర్య తీసుకోవటం లేదు. వైసిపి నుంచి రఘురామ కృష్ణంరాజుదీ అదే పరిస్థితి. వైసిపి వాళ్లు పార్టీలోంచి సస్పెండ్ చేయటం లేదు. అది ఉప యెన్నికకు దారి తీస్తుందన్న భయమా? తెలియదు. ఇప్పుడీ ఎన్నికలలో నలుగుర్ని సస్పెండ్ చేసింది. మరి ఉప యెన్నికల దాకా వెళతారా? అసెంబ్లీ కాలవ్యవధి తక్కువే ఉందంటూ ఉప యెన్నికలు పెట్టరా? ఉప యెన్నికల భయం లేకపోతే టిడిపి కూడా తన నలుగురు సభ్యుల విషయంలో అలజడి చేసి తెప్పించవచ్చు. అలా చేస్తుందా?

ఈ సస్పెన్షన్ ద్వారా వైసిపి ఏం చెప్పదలచుకుంది? పార్టీ విధానానికి వ్యతిరేకంగా వెళితే సహించము. మీకు టిక్కెట్టిచ్చినా, యివ్వకపోయినా, మీ గోడు పట్టించుకున్నా, పట్టించుకోక పోయినా మీరు పార్టీకి విధేయంగా ఉండాల్సిందే. లేకపోతే వేటు తప్పదు అని హెచ్చరించింది. టిడిపి అలా చెప్పటం లేదు. 2014లో వైసిపి 23 మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నపుడు ఏం చేసిందో, టిడిపి యిప్పుడు అదే చేస్తోంది. ఒక పార్టీ తరఫున ఎన్నికై, మరో పార్టీకి వెళ్లిపోయే వాళ్లను మళ్లీ గెలిపించాలో లేదో ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నాం అన్నట్లు కూర్చుంది. ఆ 23 మందిలో కొందరికి టిడిపి మంత్రి పదవులిచ్చింది. వైసిపి అలాటి పని ఏమీ చేయలేదు. పార్టీలో అధికారికంగా చేర్చుకోనూ లేదు. అంతవరకు సంతోషం.

అధికార పార్టీ ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఓడిపోవడం ప్రజాభిప్రాయాన్ని సూచిస్తుందా? గ్రాజువేట్ ఎమ్మెల్సీల విషయంలో అయితే మూడు సీట్లు పోగొట్టుకోవడం ప్రజల్లో ఒక వర్గం, విద్యావంతుల వర్గం లేదా మధ్యతరగతి వర్గం అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తుంది అని చెప్పవచ్చు కానీ యీ ఎన్నిక ప్రజాభిప్రాయాన్ని తెలపదు, ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని మాత్రమే చెపుతుంది. ఇది కూడా రెండు విధాలుగా చూడవచ్చు. ఎమ్మెల్యే తన సొంత కారణాల వలన వ్యతిరేకంగా ఓటు వేయవచ్చు. మంత్రి పదవి దక్కలేదనో, గౌరవం దక్కలేదనో, తన నియోజకవర్గంలో పోటీ నాయకుణ్ని యిన్‌చార్జిగా నియమించడం చేత వచ్చేసారి టిక్కెట్టు దక్కదనే భయం చేతనో అలా ఓటేయవచ్చు. రెండోది వైసిపి పట్ల ప్రజా వ్యతిరేకత ప్రబలిపోయింది, వచ్చే ఎన్నికలలో గెలవదు, మనం ముందుగానే ధిక్కరిస్తే అవతలి పార్టీ వాళ్లు ఆహ్వానించి టిక్కెట్టివ్వచ్చు అనే అంచనా కావచ్చు.

వైసిపి నుంచి క్రాస్ ఓటింగు చేసిన నలుగురిలో ఆనం, కోటంరెడ్డిలకు మంత్రి పదవి దక్కలేదనే బాధ ఉందని అందరికీ తెలుసు. వాళ్లు బయటపడి మాట్లాడుతున్నారు కూడా. తక్కిన యిద్దరి విషయంలో యిన్‌చార్జిల అంశం ఉంది. వారిలో ఒకావిడ తను కాదని బుకాయించే ప్రయత్నం చేసింది. మరొకాయన అలాటి ప్రయత్నమేమీ చేయకుండా అందరికీ అర్థమయ్యే విధంగానే ప్రవర్తిస్తున్నారు. ‘అబ్బే యీ కారణాలు కాదు, ప్రజా ప్రతినిథులు ప్రజల మనసులను చదివేసి, వైసిపి పని అయిపోయిందనే లెక్కతో  మా వైపు ఫిరాయించారు’ అని టిడిపి అర్థం తీస్తే వైసిపికి ఓటేసిన 152 మంది ప్రజాప్రతినిథులు ప్రజాభిప్రాయం జగన్ వైపే ఉందని నమ్ముతున్నారు అని కూడా అర్థం తీయాలి. ఎందుకంటే ఎవరికైనా సరే మళ్లీ గెలవాలని, గెలిచే పార్టీలోనే తాము ఉండాలనీ ఉంటుంది కదా! ప్రజాప్రతినిథులే ప్రజాభిప్రాయానికి సూచికలు అనుకుంటే 175 మంది ఎమ్మెల్యేలలో 152 మంది అంటే దాదాపు 86శాతం మంది అధికార పార్టీకి ఓటేశారు కాబట్టి, ప్రజల్లో కూడా అంతే శాతం మంది ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని, కనీసం అలా ప్రజాప్రతినిథులు అనుకుంటున్నారని ఒప్పుకోవలసి వస్తుంది.

ఇది మింగుడుపడడం కష్టం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఒకవేళ వైసిపి మళ్లీ పాలనలోకి వచ్చినా 40, 50 సీట్లు తగ్గుతాయని అనుకోవడం సమంజసం. 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనం ఉధృతంగా వీచినప్పుడే 50 శాతం ఓటర్లు వైసిపికి ఓటేశారు. అలాటిది యిప్పుడు 86శాతం వస్తుందా, నాన్సెన్స్! ఈ దృక్కోణం తప్పు. ప్రజాప్రతినిథుల అవసరాల బట్టి ప్రజలు ఓటేయరని, తమ యిష్టాయిష్టాల బట్టి ఓటేస్తారని మనం అర్థం చేసుకోవాలి. ప్రజల యిష్టాయిష్టాలు ఎలా ఉన్నాయో అంచనా వేయడంలో ప్రజాప్రతినిథులు లెక్క తప్పుతూనే ఉంటారు. 2019లో ప్రజల మూడ్‌ను ముందుగానే పసిగట్ట కలిగితే టిడిపి తరఫున 175 మంది ఎందుకు పోటీ చేస్తారు? 23 మంది మాత్రమే పోటీ చేసి ఊరుకునేవారు. అందువలన ప్రజల నాడి బట్టే వైసిపిపై ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారు అని అన్వయించడం తప్పు. ఎమ్మెల్యేలు వారివారి కారణాల మీదే తిరుగుబాటు చేశారు, లేదా ఓటేశారు అని అనుకోవాలి.

తిరుగుబాటు దారులు అంత తక్కువ మందే ఉన్నారేమని నా కాశ్చర్యంగా ఉంది. ఏ పార్టీ ఐనా ఎన్నికలలో 20-25 శాతం అభ్యర్థులను మారుస్తారు. అంటే వైసిపి తను ఓడిన స్థానాల మాట ఎలా ఉన్నా గెలిచిన స్థానాల్లో కూడా 30-37 మందిని మారుస్తుంది అనుకోవచ్చు. 30 మంది ఎమ్మెల్యేలకు ఆ మాట ముందే చెప్పేశారు అని అంటున్నారు. 80 మందికి చెప్పారని ఒక విశ్లేషకుడు మాటిమాటికి చెప్తారు. అలా చెప్పడం తెలివైన పనా కాదా అన్నదానిపై కూడా విశ్లేషణలు వచ్చాయి. ముందే చెప్తే గోతులు తీస్తారనే, పార్టీ ఫిరాయిస్తారనే భయంతోనే చివరి దాకా హై కమాండ్ ఎటూ తేల్చదని, జగన్ చేసినది రాజకీయంగా తెలివితక్కువ పని అని  కొందరంటూంటే, మరి కొందరు యిది తెలివైన పని అంటున్నారు. చివరి నిమిషంలో చెప్తే వాళ్లకింకా కోపం వస్తుందని, ముందే చెప్పి, సలహాదారు వంటి మరో పదవి యిస్తామని బుజ్జగిస్తే మంచిదని, ఎంపిక చేసిన అభ్యర్థి సిద్ధం కావడానికి టైమిచ్చినట్టవు తుందని కొందరన్నారు. ఏ మార్గం మంచిదో 2024 ఎన్నికల ఫలితాల తర్వాత తేలుతుంది.

30 మందికే చెప్పారనుకుంటే, టిక్కెట్లు రావని తెలిసినా వారిలో నలుగురు మాత్రమే క్రాస్ ఓటింగు చేశారంటే దాని అర్థమేమిటో ఆలోచించాలి. టిడిపి గెలుస్తుందనే నమ్మకం లేక, యీ పార్టీలోనే ఉంటే మళ్లీ అధికారంలోకి వచ్చి ఏదోలా కాంపెన్సేట్ చేస్తారన్న ఆశ కావచ్చు. టిడిపి వైపు గెంతడానికి డబ్బు మాత్రమే అడిగితే అది సులభంగా ఏర్పాటవుతుంది. ఈ రోజుల్లో 5-10 కోట్లు రాజకీయ నాయకుడికి లెక్కలోకి రాదు. కానీ దానితో పాటు టిక్కెట్టు కూడా యివ్వమంటేనే యిబ్బంది. ఎందుకంటే ఐ పాక్ సర్వేలు గట్రా అయిన తర్వాతే కదా, వైసిపి వీళ్లకు ప్రజాదరణ లేదనుకుని టిక్కెట్లు నిరాకరిస్తున్నది, అలాంటప్పుడు టిడిపి మాత్రం రిస్కు తీసుకుని వీళ్లకు టిక్కెట్లిస్తుందా?  జనసేన, బిజెపి వంటి పార్టీ అయితే పోన్లే ఓ అభ్యర్థి దొరికాడని సంతోషించవచ్చు. కానీ 40 ఏళ్లగా ఉన్న టిడిపికి నాయకుల కొరతేముంది? ఎప్పణ్నుంచో కొంతమంది క్షేత్రస్థాయిలో పని చేస్తూ ఎదిగి ఉంటారు. టిక్కెట్లు ఆశిస్తూ ఉంటారు. వాళ్లను పక్కన పెడితే వాళ్లు ఎదురు తిరగవచ్చు.

అందువలన వైసిపి అసంతృప్త ఎమ్మెల్యేలందర్నీ టిడిపి వాటేసుకొంటుందని అనుకోవడానికి లేదు. టిడిపిలోకి ఎక్కువమంది చేరలేదు కాబట్టి, ఎక్కువమంది క్రాస్ ఓటింగు చేయలేదు కాబట్టి అసంతృప్తి లేదనీ అనుకోకూడదు. ఎమ్మెల్యేలకు జగన్‌పై అసంతృప్తి ఎందుకుంటుంది? జగన్ పాలనలో ఎమ్మెల్యేల ప్రాధాన్యత బాగా తగ్గిపోయింది. ప్రజలతో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుని పథకాల ఫలాలు వాళ్లకు నేరుగా అందివ్వడంతో ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చేవారు తగ్గిపోయారు. దేనికీ ఎమ్మెల్యే సిఫార్సులు అక్కర లేదంటే వాళ్ల మొహం చూసేవారెవరు? పథకాలు యిచ్చేటప్పుడు అర్హుడా కాడా అనే చూస్తున్నారు తప్ప, ఏ పార్టీ వాళ్లు అని చూడటం లేదు అని వైసిపి చెప్పుకుంటోంది. టిడిపి దాన్ని ఖండించటం లేదు. గట్టిగా ఫిర్యాదులు లేవు. ప్రత్యర్థి అనుచరులకు కూడా పథకాలు వెళుతూంటే వైసిపి స్థానిక ఎమ్మెల్యే ఆక్రోశం ఎలా ఉంటుందో ఊహించండి.

వాలంటీర్లకు తోడు యిప్పుడు గృహసారథులు కూడా వచ్చి చేరారు. అప్లికేషన్ పట్టుకుని ఎమ్మెల్యే చుట్టూ తిరగనక్కర లేకుండా వాళ్లే పనులు చేసేస్తూంటే ప్రజలు ఎమ్మెల్యే యింటి అడ్రసు కూడా పట్టించుకోరు. రేపు ఎన్నికలలో ఓటర్లను పోలింగు బూతుకి తీసుకువచ్చే పనీ, అవసరమైతే డబ్బు పంపిణీ కూడా వాళ్లకే అప్పగిస్తే, యిక ఎమ్మెల్యేకు, అతన్ని నమ్ముకుని వెంట తిరిగేవారికీ పనేముంటుంది? ఇది ఏ ఎమ్మెల్యే బయటకు చెప్పుకోలేడు. నియోజకవర్గాల్లో నిర్మాణపు పనులు జరగటం లేదని ఫిర్యాదు చేస్తారు. నిజంగా అభివృద్ధిపై అంత అక్కర ఉందా? అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వధనం ప్రజల్లోకి వచ్చేది కాంట్రాక్టుల ద్వారానే. ఆ పేరు చెప్పి కాంట్రాక్టర్ డబ్బు తెచ్చుకున్నాక దారిలో అందర్నీ తడుపుతాడు. పార్టీలకు నిధులు రావాలన్నా కాంట్రాక్టులే గతి. పనులే చేపట్టకపోతే, చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించకపోతే గొంతెండిపోదూ? అందుకే మా నియోజకవర్గంలో పనులు చేయండి అంటూ డిమాండ్లు పెడుతున్నారు. ఎన్నికలకు నాలుగు ముందు పనులు చేస్తాం, బిల్లులు చెల్లిస్తాం అంటూ జగన్ హామీలిచ్చారట. ఆ పనేదో ఆర్నెల్ల క్రితమే చేయవచ్చుగా. ఇప్పుడు క్రాస్ ఓటింగు చేస్తారేమోనన్న భయంతో హామీలిస్తే నమ్ముతారా?

కరుణానిధిని మీపై వచ్చిన అవినీతి ఆరోపణల సంగతేమిటని అడిగినపుడు ఆయన చమత్కారంగా ఓ మీటింగులో చెప్పాడట. ‘ప్రభుత్వం నా అరచేతిలో తేనె పోసి, ప్రజలకు తలా కాస్తా పోయమంది, పోశాను. ఆ క్రమంలో నా అరచేతికి కొంత అంటింది, కడుక్కోవడం దేనికని నాలికతో నాకేను.’ అన్నాట్ట. ఇది ఎవరో చెప్పారు కానీ ఏ పుస్తకంలోనూ చదవలేదు. ఇలా ఏ నాయకుడైనా చెప్పినా చెప్పకపోయినా జరిగేది యిదే. ఇప్పుడు జగన్ ఎమ్మెల్యేల అరచేతిలో పోయకుండా డైరక్టుగా పైపుల ద్వారా జనాలకు పంపేస్తూంటే మధ్యలో నాకడానికి వీళ్లకేం మిగులుతుంది? జగన్‌కు తగిలించిన లక్ష కోట్ల అవినీతి ట్యాగ్ కారణంగా 2019 ఎన్నికలలో పోటీ చేసిన వైసిపి అభ్యర్థులు జగన్ గెలిచి తాను తిని, పదిమందికి పెడతాడు అనే లెక్కేసుకుని 20, 25 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారు. తీరా గెలిచాక జగన్ వాళ్లను నిరుత్సాహ పరిచినట్లు కనబడుతోంది. పెద్దగా అవినీతి ఆరోపణలేవీ రాలేదు. కేసులూ పడలేదు. జగన్‌కేం సొంత వ్యాపారాలున్నాయి, మా సంగతేమిటి అనే బాధ వారిలో తప్పకుండా ఉంటుంది.

2024లో మళ్లీ నిలవాలంటే ఖర్చు పెట్టాలి కదా. తిరుపతి ఉపయెన్నికలలో ఏ పార్టీ డబ్బు పంచలేదని వార్తల్లో వచ్చింది. జనరల్ ఎలక్షన్స్‌లో కూడా అదే జరుగుతుందని ఆశిద్దాం. అలా అయినా మామూలు ఖర్చులకైనా 10 కోట్లు అవుతాయి. ఆ పెట్టుబడంతా వేస్టే కదా అనే వైరాగ్యం ఎమ్మెల్యేలకు కలిగితే తప్పు పట్టగలమా? అందువలన జగన్‌పై పళ్లు నూరుకునే వైసిపి ఎమ్మెల్యేలు చాలామందే ఉండవచ్చు. అయినా ప్రస్తుతానికి తిరుగుబాటు చేసే ధైర్యం మాత్రం చేయటం లేదు. 151లో 4 గురు అంటే మాత్రమే చేశారంటే కేవలం 2.6శాతం అన్నమాట. ఎన్నికలు దగ్గర పడేసరికి, ఎమ్మెల్యేలు కట్టకట్టుకుని ఎదురు తిరుగుతారేమో వేచి చూడాలి. జగన్ పాలనపై ప్రజలు విసిగిపోయారనే భావన వారిలో గట్టిగా కలిగినపుడే అది జరుగుతుంది. ఆ భావన ఏ మేరకు కరక్టో ఫలితాలు మాత్రమే చెపుతాయి. ఇంత రిస్కు తీసుకునే బదులు, ప్రభుత్వం నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టి, చేసిన వాటికి బిల్లులు చెల్లించి సమాజంలో అన్ని వర్గాలను సంతృప్తి పరిస్తే, ‘మా హయాంలో మేం యిది తెచ్చాం, యింత చేశాం’ అని చెప్పుకుని ఓట్లడిగే ధైర్యం ఎమ్మెల్యేలకు వస్తుంది. ఎమ్మెల్యేతో ప్రమేయం ఏముంది? జగన్ బొమ్మ ఉంటే చాలు అనుకుంటే 2019లో 24 సీట్లలో వైసిపి ఎందుకు ఓడిపోయిందో చెప్పగలగాలి. స్థానిక అభ్యర్థి బలం కూడా తోడు కానిదే ఏ అధినాయకుడి పాప్యులారిటీ సరిపోదని గ్రహించాలి.

ఎమ్బీయస్ ప్రసాద్ (మార్చి 2023)

[email protected]

వలయంలో జగన్

నేను మొక్కలతో, దేముడితో మాట్లాడుతా