Advertisement

Advertisement


Home > Articles - MBS

ఎమ్బీయస్: ఓ గూఢచారిణి ప్రేమ కథ – 14

 ఎమ్బీయస్: ఓ గూఢచారిణి ప్రేమ కథ – 14

పీటర్ గురించి తెలుసుకోవడానికి సాల్ డార్‌ను ఒక రెస్టారెంట్‌లో కలిశాడు. చాలా ఏళ్లకు కలిశామంటూ కబుర్లు చెప్పుకున్నాక ఈ పీటర్ ఎవరు చెప్పు అన్నాడు. ‘నువ్వు వ్యక్తిగతంగా అడుగుతున్నావు కాబట్టి చెపుతున్నా, నా మనిషే, డేవిడ్ నిన్ను నమ్మకపోవడం చేత కాబోలు నన్నడిగాడు. అతన్ని పంపించాను.’ అని డార్ చెప్పేశాడు. సాల్ మర్నాడు ఆఫీసుకి వెళ్లినపుడు డేవిడ్‌ను పీటర్ గురించి అడిగాడు కానీ డేవిడ్ ఏమీ చెప్పడానికి యిష్టపడలేదు.

అప్పుడు సాల్ అతనితో ‘అతన్ని రప్పించిన కారణం నాకు తెలుసు. నజీర్‌ దొరకగానే బ్రాడీని చంపేయడానికి అతన్ని ఏర్పాటు చేసుకున్నావ్. ఆ విధంగా నీ డ్రోన్ ఎటాక్ సంగతిని సమాధి చేద్దామనుకుంటున్నావ్‌’ అంటూ కుండబద్దలు కొట్టాడు. డేవిడ్ కోపంగా చూశాడు కానీ ఏమీ మాట్లాడలేదు. అంతలో పీటర్ అక్కడకు వచ్చి క్యారీ కిడ్నాప్ అయిందని, ఆమె కారు యాక్సిడెంటు అయిందని, దగ్గర్లో వున్న పెట్రోలు బంక్ వద్ద ఉన్న కెమెరాలో ఎవరో వ్యక్తి ఆమెను యీడ్చుకుపోతున్నట్లు రికార్డయిందని చెప్పాడు. క్యారీని విడిపించడానికి ఏం చేయాలో ప్లాను చేయాలంటూ సాల్ గబగబా గదిలోంచి బయటకు వెళ్లగానే డేవిడ్ పీటర్‌తో ‘సాల్‌కు నీ సంగతి తెలిసిపోయింది, జాగ్రత్తగా వుండు.’ అని చెప్పాడు.

క్యారీని ఒక మిల్లులో బంధించిన నజీర్ సిఐఏకు ఫోన్ చేసి షరతులు విధించలేదు. బ్రాడీకి వీడియో కాల్ చేసి క్యారీని బందీగా పట్టుకుని ఒక పైప్‌కు సంకెల వేసి ఖైదు చేసినట్లు చూపిస్తూ, ‘నన్ను దగా చేసి, సిఐఏతో చేతులు కలిపి, మా ప్లాను విఫలం చేశావ్. రోయా పట్టుబడేట్లు చేశావ్. అందుకే ప్రతీకారంగా క్యారీని పట్టుకున్నాను. క్షణంలో చంపేయగలను. కానీ వాల్డెన్‌ను చంపడానికి నువ్వు సాయం చేస్తే ఆమెను వదిలేస్తాను’ అంటూ ఆఫర్ చేశాడు.

ఎలా చంపగలను అని బ్రాడీ అడిగితే ‘నువ్వు నేవల్ అబ్జర్వేటరీ ఆఫీసుకు వెళ్లు, అక్కడ వాల్డెన్ ఆఫీసు గది వుంటుంది. అక్కడ ఫలానా రహస్య అరలో ఒక నెంబరు దొరుకుతుంది. అది వాల్డెన్ పెట్టించుకున్న పేస్‌మేకర్ (హృదయగతిని నియంత్రించే పరికరం) సీరియల్ నెంబరు. దాన్ని నాకు ఎస్సెమ్మెస్ చేయి. దాని ఆధారంతో ఆ పేస్‌మేకర్‌ స్పీడు పెంచి అతని గుండె వేగంగా కొట్టుకునేట్లు చేస్తాం. దెబ్బకి గుండెపోటు వచ్చి చస్తాడు. ఎవడికీ నీ మీద అనుమానం రాదు. నువ్వు దీనికి ఒప్పుకోకపోతే క్యారీని కాల్చి చంపుతాను.’ అని చెప్పాడు నజీర్. బ్రాడీ ఆలోచిస్తానన్నాడు.

ఈ సంభాషణ విన్న క్యారీ ‘బ్రాడీ అంత సాహసం చేస్తాడని ఎలా అనుకున్నావ్?’ అని నజీర్‌ను అడిగింది. ‘బ్రాడీ అంటే నీకూ యిష్టం. నాకూ యిష్టం. అందుకని అలా అనుకుంటాం. అతను సమర్థుడు. కావాలంటే ఏదైనా చేయగలడు. చేస్తాడని నాకు నమ్మకం కూడా.’ అన్నాడు నజీర్. తర్వాత క్యారీ మొహం తుడిచి మంచినీళ్లు తాగించాడు. ‘నీ టెక్నిక్ యిదే. అంతులేని బాధ కలిగించి, ఆ తర్వాత కొద్దిపాటి అభిమానం చిలకరిస్తావ్. దాంతో ఎదుటివాళ్లు కరిగిపోతారు.’ అంది క్యారీ నిరసనగా.

‘కావచ్చు, కానీ నేను బ్రాడీని నిజంగా అభిమానించాను. అతను మనసున్నవాడు, నిజాయితీపరుడు.’ అన్నాడు నజీర్. తర్వాత క్యారీకి, అతనికి మధ్య టెర్రరిజం గురించి వాగ్వివాదం జరిగింది. ‘మేం అమాయక అమెరికన్ పౌరులను చంపుతున్నామని మీరంటారు. ఇరాన్‌లో, ఇరాక్‌లో మీరు చేసిందేమిటి? మీ కంటికి వాళ్లు మనుషుల్లా కనబడరా? నేను ప్రాణాలతో యీ దేశపు తీరం విడిచి వెళతానా లేదా అన్నది నాకు ముఖ్యం కాదు. మీరంతా జీతాల కోసం పనిచేస్తారు, మా జిహాదీలం దేవుడి కోసం పనిచేస్తాం. మమ్మల్ని చంపినకొద్దీ కొత్తవాళ్లం పుట్టుకు వస్తాం. పోరాటాన్ని ఆపం. అందుచేత మీరు మమ్మల్ని ఎన్నటికీ జయించలేరు. అంతిమంగా విజయం మాదే.’ అన్నాడు నజీర్ జంకుగొంకు లేకుండా.

వీళ్ల వాదన యిలా సాగుతూండగానే బ్రాడీ నేవల్ అబ్జర్వేటరీ ఆఫీసుకి వెళ్లాడు. ఇజ్రాయేల్ రాయబారితో వాల్డెన్ సమావేశమౌతున్నాడని తెలిసి, పై అంతస్తులో ఉన్న అతని ఆఫీసుకి వెళ్లాడు. అతను వాల్డెన్‌కు అత్మీయుడని తెలిసిన సిబ్బంది ఆపలేదు. ఆ గదిలో నజీర్ చెప్పిన చోట వెతకసాగాడు. చివరకు నెంబరు కనబడింది. దాన్ని తన సెల్‌లో ఫీడ్ చేసుకుని నజీర్‌కు ఫోన్ చేశాడు. ‘క్యారీని విడిచి పెట్టు. ఆమె రోడ్డు మీదకు వెళ్లి నేను స్వేచ్ఛగా ఉన్నాను అని చెప్తే తప్ప నీకీ నెంబరు మెసేజి చేయను’ అని బెదిరించాడు.

నజీర్‌కు కోపం వచ్చింది. ‘వదిలాక నువ్వు మాట తప్పితే?’ అని అడిగాడు. ‘నువ్వు రిస్కు తీసుకోవలసినదే. ఐసా చావుకి పగ తీర్చుకోవాలని నువ్వెంత తపిస్తున్నావో, నేను అంతకంటె ఎక్కువ తపిస్తున్నానని నీకు తెలిసే వుంటుంది. పైగా ఈ మార్గం ద్వారా వాల్డెన్ ఒక్కడే చచ్చిపోతాడు తప్ప అమాయకులెవరూ గురించి చావరు. అందుకని తప్పకుండా నీకు యీ విషయంలో సహకరిస్తాను. అయినా నువ్వు నమ్మకపోతే నీ ఖర్మం.’ అన్నాడు బ్రాడీ ధీమాగా.

నిజానికి నజీర్‌కు క్యారీ వంటి బలమైన శత్రువును చంపాలనే వుంది. కానీ బ్రాడీ దృఢంగా వుండడం చూసి, ఇప్పుడు వదిలేసినా మళ్లీ పట్టుకోవచ్చులే అని లెక్కవేసి ఆమెను విడిచిపెట్టాడు. ఆమె వెంటనే చీకట్లో రోడ్డు మీదకు పరిగెట్టి బ్రాడీకి చెప్పింది. బ్రాడీ నజీర్‌కు నెంబరు ఎస్సెమ్మెస్ చేశాడు. అంతలోనే వాల్డెన్ సమావేశం ముగించుకుని ఒంటరిగా తన గదిలోకి ప్రవేశించాడు. బ్రాడీని చూసి నవ్వుతూ ‘ఏమిటి, వైస్ ప్రెసిడెంటు అయ్యాక దక్కబోయే ఆఫీసు చూడ్డానికి వచ్చావా’ అని జోక్ చేశాడు.

‘లేదు, ఆ విషయం చెపుదామనే వచ్చాను. నా కుటుంబాన్ని చూసుకోవడానికి నిశ్చయించుకున్నాను‘ అన్నాడు బ్రాడీ. ‘తొక్కలో కుటుంబం, దాని గురించి యింత మంచి అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా?’ అంటూ మండిపడ్డాడు వాల్డెన్. ఇంతలోనే నజీర్ టెక్నికల్ అసోసియేట్‌కు పేస్‌మేకర్ నెంబరు చేరడం, అతను దాని కోడ్‌లో మార్పులు చేసి, హెచ్చు మోతాదులో ప్రకంపనలు సృష్టించి వాల్డెన్‌కు గుండెపోటు వచ్చేట్లు చేయడం జరిగాయి. హఠాత్తుగా వచ్చిన పోటుతో విలవిలలాడుతూ వాల్డెన్ ‘నాకేదో అవుతోంది. కాస్త ఎవరినైనా ఫోన్ చేసి డాక్టరును పంపించమను.’ అన్నాడు. కానీ బ్రాడీ కదలలేదు.

అతని ప్రవర్తన చూసి ఆశ్చర్యపడుతూ వాల్డెన్ టేబుల్ మీద ఫోన్ అందుకోబోయాడు. బ్రాడీ దాన్ని దూరంగా జరిపాడు. వాల్డెన్ నిస్సహాయంగా అతని కేసి చూస్తూ వుండగా ‘నీకింకా అర్థం కాలేదా? నువ్వంటే నాకు అసహ్యం. నువ్వు చేసే ఏ పనీ నాకు యిష్టం వుండదు. నేను నిన్ను చంపుతున్నాను, తెలుసుకో’ అని బ్రాడీ చెప్పేశాడు. భరించలేని నొప్పితో వాల్డెన్ తలవాల్చేశాడు. అప్పుడు బ్రాడీ ఫోన్ చేసి ఇక్కడ వాల్డెన్‌కు బాగా లేదు, ఎవరినైనా డాక్టర్ని పంపండి అని చెప్పాడు. వాళ్లు వచ్చి అతని మృతిని ధ్రువీకరించారు. ఆ విధంగా ఒక నరరూప రాక్షసుడు చచ్చిపోయాడు.

ఇక రెండోవాడి చెఱ నుంచి తప్పించుకుని రోడ్డు మీదకు వచ్చిన క్యారీకి తను ఎక్కడుందో అర్థం కాలేదు. ఏదైనా వాహనాన్ని ఆపి, సిఐఏకు చెపుదామని చూస్తే రాత్రివేళ కాబట్టి ఎవరూ ఆపలేదు. చివరకు ఓ ట్రక్కును బలవంతంగా ఆపి, అతని ఫోన్ లాక్కుని, సాల్‌కు ఫోన్ చేసింది. ట్రక్కు డ్రైవర్‌ను అడిగి అది ఏ ప్రాంతమో చూచాయగా చెప్పింది. ఆ ఫోన్ సిగ్నల్ బట్టి సిఐఏ వాళ్లు ఎక్కడుందో కనిపెట్టారు. వెంటనే డేవిడ్ సైగ నందుకుని పీటర్ ఒక టీముతో బయలుదేరాడు.

సాల్ అతనితో బాటు వెళ్లబోయాడు కానీ, స్టాఫ్ వచ్చి ‘మిమ్మల్ని పైకి రమ్మన్నారు’ అన్నారు. పైకి వెళితే కిందకు వెళ్లమన్నారు. ఇదేమిటని ఆశ్చర్యపడుతూండగానే మిమ్మల్ని ప్రశ్నించాలట అంటూ యిద్దరు బలవంతంగా ఒక రూములోకి తీసుకుపోయారు. డేవిడ్‌కు ఫోన్ చేయండి అని సాల్ అంటే ఆయనకంతా తెలుసు అన్నారు వాళ్లు. ‘ఓహో, వాల్డెన్ చచ్చిపోయాడు కాబట్టి డ్రోన్ ఎటాక్ సంగతి బయటకు వస్తే ఆ పాపమంతా తన నెత్తికి చుట్టుకుంటుందని డేవిడ్ భయం, అందుకే యిప్పుడు నజీర్‌ను పట్టుకుని చంపేసి, ఆ పై బ్రాడీని చంపేసి, తనను ఏదైనా కేసులో యిరికించి, నోరు మూయించాలని అతని ప్లాను’ అని సాల్‌కు అర్థమైంది.

సిఐఏ టీము వచ్చేదాకా ఆగలేక క్యారీ మళ్లీ మిల్లులోకి ఒంటరిగా వెళ్లింది. ఆయుధం ఏదీ లేదు కాబట్టి ఒక విరిగిన పైపును చేతిలోకి తీసుకుంది. లోపల ఎవరో దాగుని ఉన్నారని ఆమె భావన. కానీ ఎవరో కనబడటం లేదు. కాస్సేపటిలో పీటర్ సిఐఏ, ఎఫ్‌బిఐ తో కూర్చిన స్వాట్ (స్పెషల్ వెపన్స్ అండ్ టాక్టిక్స్) టీమును వెంటేసుకుని అక్కడకు చేరుకున్నాడు. క్యారీని చూసి వాల్డెన్ గుండెపోటుతో చచ్చిపోయాడని చెప్పి, నజీర్ నుంచి నువ్వెలా తప్పించుకున్నావ్ అని అడిగాడు.

ఆమె బ్రాడీ గురించి చెప్పకుండా నజీర్ అదమరుపుగా వున్న క్షణం చూసి తప్పించుకున్నా. బయటకు పారిపోయే ఛాన్సు లేదు, యిక్కడే వుంటాడు, పద వెతుకుదాం అంది. నువ్వు యిప్పటికే అలిసిపోయావు. మొహమంతా దెబ్బలున్నాయి. నువ్వు కారులో రెస్టు తీసుకో, మేమంతా వెతుకుతాం అన్నాడు పీటర్. వాళ్లు మిల్లంతా క్షుణ్ణంగా వెతకసాగారు. క్యారీ కారులో కూర్చుని బ్రాడీకి ఫోన్ చేసింది.

బ్రాడీ తన కుటుంబం దాగి వున్న సేఫ్ హౌస్‌కి వెళ్లి భార్యాబిడ్డలను కలిశాడు. డానా చాలా డిప్రెస్‌డ్ మూడ్‌లో వుంది. ఆమెకు, ఫిన్‌కు పూర్తిగా చెడిపోయింది. ఫిన్ తను గిల్టీగా ఫీలవుతున్నానని చెప్పినా డానా కన్విన్స్ కాలేకపోయింది. మన సంబంధం తెగిపోయిందని స్పష్టంగా చెప్పింది. ఇప్పుడీ సేఫ్ హౌస్‌లో పాలు సరిగ్గా లేవని, తండ్రి నిర్వాకం వలననే యిదంతా జరుగుతోందని సతాయిస్తోంది. కూతురితో వేగలేక సతమతమవుతున్న జెసికా ఇప్పుడు బ్రాడీ వచ్చి సారీ అన్నంత మాత్రాన సర్దుకోలేకపోయింది. మనం కలిసి జీవించడం జరగదు, పిల్లల సంగతి ఏం చేయాలో చర్చిద్దాం అంటోంది.

బ్రాడీ నచ్చచెప్పే స్థితిలో లేడు, ఏదో సంజాయిషీ చెప్పడానికి చూస్తూండగానే క్యారీ నుంచి ఫోన్ వచ్చింది. ‘నజీర్ కోసం వేట సాగుతోంది. నువ్వెలా బయటపడ్డావని పీటర్‌ అడిగితే ఏదో కథ చెప్పాను తప్ప నీ గురించి, వాల్డెన్ చావులో నీ పాత్ర గురించి చెప్పలేదు. కానీ నజీర్ పట్టుబడితే అతనేమైనా నీ గురించి చెప్తాడేమో తెలియదు’ అని చెప్పింది. సరే మంచిది, ఏది ఎలా జరిగితే అలా జరగనీ అన్నాడు బ్రాడీ నిర్లిప్తంగా. అతను అప్పటికే జీవితంతో విసుగెత్తిపోయాడు. ఫోన్ చేసినది క్యారీ అని జెసికా గ్రహించి మరింత మండిపడింది. బ్రాడీ ఏమీ మాట్లాడకుండా హాల్లో పడుక్కున్నాడు.

సాల్‌ను గదిలో కూర్చోబెట్టి పాలీగ్రాఫ్ పరీక్ష జరుపుతామన్నారు. అతను దానికే ఆశ్చర్యపడుతూ వుండగా, ఎప్పుడూ చేసే అతను కాకుండా కొత్తవాడెవరో వచ్చి ప్రశ్నలడగడానికి కూర్చోవడంతో మరింత ఆశ్చర్యపడ్డాడు. ఇక అతను పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగి, ఐలీన్‌కు ఆత్మహత్యాయుధం (తన కళ్లజోడు) ఎందుకు యిచ్చావని అడిగాడు. డేవిడ్ తనను ఏదోలా యిరికిస్తున్నాడని గ్రహించిన సాల్ ‘ఇదంతా ఓ ఫార్సని నాకు తెలుసు. నాకు తక్కినవాటి గురించి తెలిసినా తెలియకపోయినా నజీర్ పట్టబడ్డాక ఒక కాంగ్రెస్‌మన్‌ను హత్య చేస్తారని మాత్రం తెలుసు’ అంటూ కుండబద్దలు కొట్టాడు.

ఆ టెస్టు తర్వాత కొత్తగా వచ్చినతను రిపోర్టు డేవిడ్ చేతికి యిస్తూ ‘సాల్ ఉద్యోగం పీకేయడానికి యిది సరిపోతుంది. అతనేదో కాంగ్రెస్‌మన్ హత్య అంటున్నాడు. నిజమే చెపుతున్నాడని మెషీన్ తెలిపింది. అయినా అది రిపోర్టులో రాకుండా జాగ్రత్తపడ్డాను. నువ్వడిగిన పని చేసి పెట్టాను.’ అని వెళ్లిపోయాడు. డేవిడ్ అతనికి థాంక్స్ చెప్పి పంపించేశాడు. తర్వాత డేవిడ్ సాల్‌ను పిలిచి ‘నీ అంతట నువ్వే సంస్థను విడిచి వెళ్లిపోతే మంచిది. లేకపోతే యీ రిపోర్టు సహాయంతో నీ కెరియర్‌ను నాశనం చేయగలనని గుర్తుంచుకో. నీ మీద ఏళ్ల తరబడి విచారణ జరిపిస్తా.’ అని బెదిరించాడు.

‘నా సంగతి సరే, బ్రాడీనుంచి సాయం పొంది కూడా అతన్ని చంపాలని ఎందుకు చూస్తున్నావు? అతనితో మనం ఒప్పందం కుదుర్చుకున్నామని మర్చిపోయావా?’ అని అడిగాడు సాల్. ‘టెర్రరిస్టులతో కుదుర్చుకున్న ఒప్పందాలను మనం ఖాతరు చేయనవసరం లేదు’ అన్నాడు డేవిడ్ కటువుగా. ‘నువ్వు మాటిమాటికీ నన్ను తప్పుపట్టడానికి చూడడం నాకు నచ్చటం లేదు. ఈ ఆర్గనైజేషన్‌లో నువ్వయినా వుండాలి, నేనైనా వుండాలి’ అన్నాడు.

ఇదిలా జరుగుతూండగానే మిల్లులో టీము ఎంత వెతికినా నజీర్ దొరకలేదు. ‘వాడు దొరకలేదంటే మన టీములోని వారెవరో సాయపడి తరలించుకుని పోయి వుంటారు’ అంది క్యారీ పీటర్‌తో. ఎవరైనా మిస్సయ్యారా అని చూస్తే గాల్వెజ్ అనే క్యారీ సహచరుడు ఎవరికీ చెప్పా పెట్టకుండా మాయమైనట్లు తెలిసింది. అతను ముస్లిము కావడంతో వెంటనే అనుమానించారు. వెంటనే అతని కారు ఎక్కడుందో ట్రేస్ చేసి వెళ్లి అడ్డగించారు. తీరా చూస్తే అతని కారులో నజీర్ లేడు. ‘నేను గెట్టీస్‌బర్గ్ దాడిలో గాయపడ్డాను కదా. ఆ గాయాల నుంచి సడెన్‌గా రక్తం కారసాగింది. అందుకే అసుపత్రికి వెళుతున్నా’ అన్నాడతను.

దాంతో హతాశులైన పీటర్, క్యారీ తిరిగి వెళ్లి మరుసటి రోజు మధ్యాహ్నం దాకా వెతికిస్తూ ఉన్నారు. చివరకు సిఐఏ హెడాఫీసుకి తిరిగి వచ్చారు. డేవిడ్ రోయాను యింటరాగేషన్ రూముకి పిలిపించాడు. క్యారీ తన గాయాలు కడుక్కోవడానికి బాత్‌రూమ్‌కి వెళ్లినపుడు డేవిడ్ పీటర్‌తో క్యారీ చాలా గాయపడి వుంది కాబట్టి నువ్వే రోయాను ప్రశ్నలడిగి ఏదైనా సమాచారం రాబట్టు అన్నాడు. కానీ యీ లోపునే క్యారీ రోయా దగ్గరకు వెళ్లి ప్రశ్నలడగసాగింది. ‘నువ్వు పాపం మంచిదానివే, నజీర్ తన ప్రయోజనాల కోసం నిన్ను ఉపయోగించుకున్నాడు...’ అంటూ మిత్రభేదం కల్పించాలని చూసింది.

కానీ రోయా విరుచుకుపడింది. ‘నీకు నీతీజాతీ లేదు. శీలం లేదు. బ్రాడీని వశపరచుకోవడానికి ఒళ్లమ్ముకున్నావ్. నజీర్‌ను పట్టుకోవడం నీ తరం కాదు. నువ్వంటే తనకే భయమూ లేదు.’ అంటూ అరబిక్‌ భాషలో తిట్టనారంభించింది. దాంతో క్యారీ కంగు తిని బయటకు వచ్చేసి పీటర్‌తో ‘నేను అనవసరంగా కెలికినట్లున్నాను. నువ్వు నీ పద్ధతిలో ప్రశ్నించు, నేను యింటికి వెళ్లిపోయి పడుక్కుంటా.’ అని యింటికి బయలుదేరింది. దారిలో రోయా సంభాషణ గుర్తు చేసుకుంటూండగా ఆమెకు హఠాత్తుగా గుర్తుకువచ్చింది – రోయా అరబిక్‌లో అరచినప్పుడు నజీర్ ధైర్యవంతుడు, ఎక్కడికీ పారిపోయే రకం కాదని అంది అని. దాని అర్థం అతను ఆ మిల్లులోనే ఎక్కడో దాగుని వుండాలి. టీమువాళ్లు సరిగ్గా చూడలేదేమో!

ఈ ఆలోచన రాగానే వెంటనే పీటర్‌కు ఫోన్ చేసింది. మిల్లులో ఏవో సొరంగాలు వుండి వుంటాయి. నేను మళ్లీ వెళ్లి వెతుకుదా మనుకుంటున్నాను అంది. టీము వాళ్లందరూ వెనక్కి వచ్చేసినట్లున్నారు. ఆగు కనుక్కుంటా అన్నాడు పీటర్. క్యారీ వెళ్లేసరికి టీములో ఒక పది మంది మాత్రం ఉన్నారు. వాళ్లూ వెనక్కి వెళ్లిపోతున్నారు. క్యారీ వాళ్లను తీసుకుని లోపలికి వెళ్లింది. సొరంగాల గురించి, రహస్య అరల గురించి ప్రత్యేకంగా వెతకమంది. తనూ పరీక్షగా చూస్తూ వుంటే ఒక గోడలో ఒక చీలిక ఉన్నట్లు కనబడింది. తన వెంట ఉన్నతన్ని పగలగొట్టమంది.

ఇద్దరూ కలిసి లోపలికి వెళితే అక్కడో గది కనబడింది. దానిలో ఒక స్లీపింగ్ బ్యాగ్ వుంది. వ్యక్తులెవరూ లేరు. అంటే నజీర్ ఇక్కడే దాగుని వుండాలి. కానీ ఎక్కడా కనబడటం లేదు. తక్కిన టీము సభ్యులను పిలుచుకుని వస్తాను, నువ్వు అటకలేమైనా ఉన్నాయేమో చూస్తూ వుండు అని క్యారీ రూములోంచి బయటకు వెళ్లింది కానీ ఏదో శబ్దం వినబడి వెనక్కి తిరిగి వచ్చింది. ఆ లోపునే నజీర్ ఎక్కణ్నుంచో ప్రత్యక్షమై అతని పీక కోసేశాడు. అతని శవం చూస్తూనే క్యారీ బయటకు పారిపోబోయింది కానీ నజీర్ ఆమెపై దాడి చేశాడు.

అయితే అదృష్టవశాత్తూ టీములో తక్కిన సభ్యులు యీ శబ్దాలు విని వెనక్కి వచ్చారు. క్యారీని విడిపించి నజీర్‌ను చుట్టుముట్టారు. నజీర్‌కి అర్థమై పోయింది. తన అంతిమ ఘడియలు దగ్గర పడ్డాయని. మోకాళ్ల మీద వాలి తన అంగీ జేబులోని తుపాకీ చేతిలోకి తీసుకోబోయాడు. అంతే టీము మొత్తం అతనిపై తుపాకీగుళ్ల వర్షం కురిపించారు. దెబ్బకి మరో నరరూప రాక్షసుడు నేలవాలాడు.  

ఆ విషయం సేఫ్‌హౌస్‌లో వున్న బ్రాడీ దాన్ని నిర్వహిస్తున్నావిడ వెంటనే చెప్పింది. ప్రమాదం తొలగిపోయింది, మీకు రక్షణ విత్‌డ్రా చేసేశారు. మీరు ఏ క్షణాన్నయినా యింటికి వెళ్లిపోవచ్చు అని. నజీర్ చావు వార్త వింటూనే బ్రాడీ చలించిపోయాడు. ఎంత కాదన్నా అతను తనను చంపేయకుండా దయ చూపించాడు, అన్నం పెట్టి ఆదరించాడు అన్న కృతజ్ఞత అతనిది. అతని భావాలు కుటుంబసభ్యులెవరికీ అర్థం కాలేదు. ముఖ్యంగా డానా అతనిపై విపరీతమైన కోపంతో వుంది. నీ కారణంగానే యీ సేఫ్‌హౌస్‌లో వుండాల్సి వస్తోందని తండ్రిని తిట్టిపోస్తోంది, నీ కంటె మైక్ మంచి తండ్రి అని మొహం మీదే చెప్పింది.

నజీర్ శవంతో సహా టీము సిఐఏ హెడ్‌క్వార్టర్స్‌కు వచ్చారు. డేవిడ్‌కు చూపించి, శవాన్ని ట్రక్కులోకి ఎక్కించి ఎక్కడికో పంపేశారు. డేవిడ్ క్యారీ వద్దకు వచ్చి శభాష్ అని మెచ్చుకున్నాడు. తర్వాత పీటర్‌ను విడిగా పిలిచి, ఇక ఆగనక్కరలేదు, బ్రాడీని వెంటనే చంపేయ్, నజీర్ మృతికి ప్రతీకారంగా అల్‌ఖైదా వాళ్లే చంపేసి వుంటారు అని ప్రచారం చేద్దాం అన్నాడు. పీటర్ సరేనని తల వూపాడు.

బ్రాడీ కుటుంబం యింటికి తిరిగి వచ్చారు. పిల్లలు యింట్లోకి వెళ్లపోయారు. బ్రాడీ బయటే నిలబడ్డాడు. లోపలకి వస్తున్నావా అని బ్రాడీని అడిగింది. రాలేను అన్నాడు బ్రాడీ. ఇద్దరూ తమ పెళ్లి ఎందుకిలా అయిందో చర్చించుకున్నారు. ఎలిజబెత్ చనిపోయిన రోజు ఏమైందో చెప్తాను విను అంటూ బ్రాడీ ఏదో చెప్పబోయాడు. కానీ జెసికా ‘మనం విడిపోయే వేళ నువ్వు ఏ నిజాలు చెప్పినా నాకు అక్కరలేదు. నాతో కలిసున్నంతకాలం అబద్ధాలాడుతూనే వున్నావన్న విషయమే నన్ను ఎల్లకాలం బాధిస్తూనే వుంటుంది. ఇప్పుడు మనం చర్చించవలసినది పిల్లల సంగతి మాత్రమే.’ అని కరాఖండీగా చెప్పింది. బ్రాడీ యింకేమీ మాట్లాడలేక కారు ముందుకు పోనిచ్చాడు.

ఇదంతా దూరం నుంచి పీటర్ గమనించి, బ్రాడీని వెంటాడాడు. బ్రాడీ క్యారీ యింటికి వెళ్లాడు. ఆమె యితన్ని సాదరంగా ఆహ్వానించింది. నా ప్రాణం కాపాడడానికి వాల్డెన్‌ను చంపే దుస్సాహసం చేశావంటూ ఆమె కృతజ్ఞత తెలిపింది. నీ కోసం ఆ మాత్రం చేయలేనా అన్నాడు బ్రాడీ. ఇద్దరూ కలిసి ఆమె యింట్లోకి వెళ్లారు. పీటర్ తన కారును వీధిలో ఆపుకుని, వీళ్లనే గమనిస్తున్నాడు. (ఫోటో – నజీర్‌ను టీము చుట్టుముట్టిన దృశ్యం, ఇన్‌సెట్‌లో వాల్డెన్ అంతిమఘడియలు, పైన డార్) (సశేషం)

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?