Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: విస్మృత దర్శకుడు లేఖ్‌ టాండన్‌

లేఖ్‌ టాండన్‌ పోయి నెల్లాళ్లయింది అని చెప్తే ఆయనెవరు? అని సినిమా అభిమానులే అడిగే పరిస్థితి ఉంది. ఆయన గొప్ప సినిమాలు, హిట్‌ సినిమాలూ తీశాడు.  అయినా మహేశ్‌ భట్‌ తదితరుల్లా డప్పు కొట్టుకోలేదు. దాంతో ఆ క్రెడిట్‌ అంతా తారలకు, నిర్మాతలకు, సంగీతదర్శకులకు పోయింది. ''ప్రొఫెసర్‌'' (1962) అనగానే శమ్మీ కపూర్‌, శంకర్‌ జైకిషన్‌ గుర్తుకు వస్తారు. ''ఆమ్రపాలి'' (1966) అనగానే వైజయంతిమాల, లతా మంగేష్కర్‌లు గుర్తుకు వస్తారు. ''ప్రిన్స్‌'' (1969) అనగానే శమ్మీ, వైజయంతిమాల గుర్తుకు వస్తారు. 

''దుల్హన్‌ వహీ జో పియా మన్‌భాయే'' (1977) అనగానే తాళ్లూరి రామేశ్వరి, రవీంద్ర జైన్‌, తారాచంద్‌ బర్జాత్యా గుర్తుకు వస్తారు. ''అగర్‌ తుమ్‌ న హోతే'' (1983) అనగానే రాజేశ్‌ ఖన్నా, ఆర్‌డి బర్మన్‌ గుర్తుకు వస్తారు. అయినా ఆయన ఎవరి మీద ఫిర్యాదు చేయలేదు. తన పని తను చేసుకుంటూ పోయాడు. టీవీ సీరియల్స్‌ తీశాడు. 70 ఏళ్ల వయసు దాటాక టీవీ స్టార్‌గా తను ప్రోత్సహించిన షారుఖ్‌ ఖాన్‌ సినిమాలైన ''స్వదేశ్‌'' (2004), ''చెన్నయ్‌ ఎక్స్‌ప్రెస్‌'' (2013), ఆమీర్‌ ఖాన్‌ ''రంగ్‌ దే బసంతి'' (2006) వంటి సినిమాల్లో నటుడిగా కనిపించాడు.

1929లో లాహోర్‌లో పుట్టిన లేఖ్‌, పృథ్వీరాజ్‌ కపూర్‌కు స్కూల్‌మేట్‌ ఐన ఫకీర్‌చంద్‌కు కుమారుడు. ఆ పరిచయంతో లేఖ్‌ సోదరులను పృథ్వీరాజ్‌ సినీరంగంలోకి రమ్మనమన్నాడు. లేఖ్‌ సోదరుడు యోగరాజ్‌ ఉర్దూలో నాటకాలు రాశాడు, కపూర్లకు సెక్రటరీగా పనిచేస్తూ అసిస్టెంటు డైరక్టరుగా పనిచేశాడు. లేఖ్‌ కూడా 1950ల నుంచి అసిస్టెంటు డైరక్టరుగా పనిచేశాడు. తొలిసారిగా తీసిన ''ప్రొఫెసర్‌'' హాస్యచిత్రం సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. దాన్ని తెలుగులో ఎన్టీయార్‌తో ''భలే మాస్టారు'' (1969)గా, సుమన్‌తో ''పెద్దింటి అల్లుడు'' (1991)గా తీశారు. క్రీస్తు పూర్వం నాటి మగధ రాజు అజాతశత్రువు, వైశాలీ నగరానికి చెందిన రాజనర్తకి ఆమ్రపాలికి మధ్య జరిగిన ప్రణయం ఆధారంగా, సునీల్‌ దత్‌ హీరోగా తీసిన భారీ కాస్ట్యూమ్‌ చిత్రం ''ఆమ్రపాలి''కి దర్శకత్వం చేసే అవకాశం వచ్చింది. 

ద్వారకా దివేచా ఫోటోగ్రఫీ, భానూ అతైయా కాస్ట్యూమ్స్‌, ఎంఆర్‌ ఆచ్రేకర్‌ ఆర్ట్‌ డైరక్షన్‌, వైజయంతి సౌందర్యం, నృత్యాలు, శాస్త్రీయ సంగీతం ఆధారంగా శంకర్‌ జైకిషన్‌ కూర్చిన శాస్త్రీయ సంగీత బాణీలు సినిమాను ఉన్నతస్థాయిలో నిలబెట్టాయి. అది భారతదేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేయబడింది కానీ వాణిజ్యపరంగా తృప్తి నీయలేదు. తర్వాత ''హియర్‌ కమ్స్‌ మిస్టర్‌ జోర్డాన్‌'' (1941) అనే హాలీవుడ్‌ సినిమా ఆధారంగా రాజేంద్రకుమార్‌, సైరా బాను లతో తీసిన ''ఝుక్‌ గయా ఆస్మాన్‌'' (1968) డైరక్టు చేసే అవకాశం వచ్చింది. 

యమలోకంలో జరిగిన పొరపాటు వలన ఒక వ్యక్తి బదులు మరొక వ్యక్తిని చనిపోనడం, పొరపాటు దిద్దుకోవడానికి అతని పోలికలతో ఉన్న మరొక వ్యక్తి దేహంలో యితని ఆత్మ ప్రవేశపెట్టడం తర్వాత చాలా సినిమాల్లో అనుకరించారు. కానీ యీ సినిమా పెద్దగా ఆడలేదు. లేఖ్‌ను మొదటి నుంచీ ఆదరిస్తూ వచ్చిన ఈగిల్‌ ఫిల్మ్‌స్‌ ఎఫ్‌.సి.మెహ్రా శమ్మీ కపూర్‌, వైజయంతి మాలలతో ''ప్రిన్స్‌'' తీసే అవకాశం యిచ్చాడు. అది బాగా ఆడింది. 'బదన్‌ పే సితారే లపేటే హుయే' పాట సూపర్‌ డూపర్‌ హిట్‌. 

తెలుగులో కూడా అనుకరించారు. అదే ఏడాది శశి కపూర్‌, హేమమాలినిలతో ''జహాఁ ప్యార్‌ మిలే'' తీసి దాన్నీ హిట్‌ చేశాడు.  అయినా అవకాశాలు రాలేదు. చిన్న తారలతో తీసిన ''ఆందోళన్‌'' (1975) ఆడలేదు. కానీ రాజశ్రీ ఫిల్మ్‌స్‌ వారు కొత్త తారలతో తీసిన ''దుల్హన్‌ వహీ జో పియా మన్‌ భాయే'' దర్శకత్వం వహించే అవకాశం యిచ్చారు. సినిమా  గోల్డెన్‌ జూబ్లీ ఆడింది. రాత్రికి రాత్రి రామేశ్వరి సెలబ్రిటీ అయిపోయింది. 

కానీ దాని వెంటనే రాజశ్రీ వారికై నవీన్‌ నిశ్చల్‌, శబానాలతో తీసిన ''ఏక్‌ బార్‌ కహో'' (1980) ఆడలేదు. జితేంద్ర, రామేశ్వరిలతో తీసిన ''శారదా'' (1981)ది, వినోద్‌ ఖన్నా, టీనా మునిమ్‌లతో తీసిన ''ఖుదా కసమ్‌''(1981) దీ కూడా అదే గతి. సరోగేట్‌ మదర్స్‌ గురించి శబానా ఆజ్మీ, విక్టర్‌ బెనర్జీలతో తీసిన ''దూస్రీ దుల్హన్‌'', రాజేశ్‌ ఖన్నా, రేఖలతో తీసిన ''అగర్‌ తుమ్‌ న హోతే'' రెండూ 1983లోనే రిలీజయ్యాయి. రెండో దాంట్లో టైటిల్‌ సాంగ్‌ హాంటింగ్‌ మెలడీకి ఉదాహరణ. సంగీతంపై లేఖ్‌కు పట్టు పోలేదనడానికి నిదర్శనం. దీని తర్వాత వచ్చిన విక్టర్‌ బెనర్జీ, శబానాలతో తీసిన బెంగాలీ సినిమా ''ఉత్తరాయణ్‌'' (1985), మిళింద్‌ గుణాజీ, మీనాక్షీ శేషాద్రిలతో తీసిన ''దో రాహేఁ'' (1997) కూడా లేఖ్‌కు మేలు చేయలేదు. 

ఇక టీవీ రంగంపై దృష్టి సారించాడు. ''దిల్‌ దరియా'' (1988-89) అనే సీరియల్‌లో షారుఖ్‌ ఖాన్‌కు అవకాశం యిచ్చాడు. సీరియల్‌ సక్సెసై, అతనికి విపరీతంగా పేరు వచ్చింది కానీ లేఖ్‌ ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోయాడు. ''ఫిర్‌ వహీ తలాశ్‌'', ''ఫర్మాన్‌'' సీరియళ్లు అంతగా విజయం సాధించలేదు. సినీ పరిభాషలో క్రమంగా ఫేడౌట్‌ అయిపోయాడు. కానీ సరదా చంపుకోకుండా నటుడిగా చిన్న వేషాలు వేశాడు. ఆ గొప్ప దర్శకుడికి యిదే నా నివాళి.

(ఫోటోలు - ''ప్రొఫెసర్‌'' లో శమ్మీ కపూర్‌, కల్పనా, ''ఆమ్రపాలి''లో వైజయంతిమాల, ఆ సినిమా షూటింగులో హీరోయిన్‌తో దర్శకుడు)

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (నవంబరు 2017) 
mbsprasad@gmail.com