Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: వివాదంలో మహారాష్ట్ర మంత్రి

మహారాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రకాశ్‌ మెహతా దక్షిణ ముంబయిలోని తార్‌దేవ్‌లో ఎంపి మిల్స్‌ కాంపౌండులో ఎస్‌ఆర్‌ఏ (స్లమ్‌ రీహేబిలేటేషన్‌ అథారిటీ) చేపట్టిన ప్రాజెక్టులో బిల్డరుకు కనీసం రూ.500 కోట్ల వరకు మేలు కలిగేటట్లు నిర్ణయం తీసుకున్నాడని అసెంబ్లీలో ఆరోపణ వచ్చింది. దానికి సంబంధించిన ఫైలుపై మంత్రి 'ముఖ్యమంత్రి ఫడ్ణవీస్‌కి తెలిసే యీ నిర్ణయం తీసుకున్నా'నని రాశాడు. అసెంబ్లీలో అడిగితే ముఖ్యమంత్రి 'నాకా విషయమే తెలియదు' అన్నాడు. ఆయన యిలా అంటున్నాడేం అని మంత్రిని నిలదీస్తే 'అవేళ చాలా ఫైళ్లు ఆయన దగ్గరకి పట్టుకెళ్లాను. వాటిల్లో యీ ఫైలు కూడా వుందనుకున్నాను.

ఇప్పుడు వాటిల్లో యీ ఫైలు లేదని డిపార్టుమెంటు వాళ్లు చెపితే తెలుసుకున్నాను.' అని కుంటి సమాధానం చెప్పాడు. ఫడ్ణవీస్‌కు యీ వ్యవహారం ఏమీ నచ్చలేదు. వెంటనే ఆర్డరు కాన్సిల్‌ చేసి, విచారణకు ఆదేశించాడు. తనేమీ తప్పు చేయలేదని మంత్రి వాదిస్తూనే వున్నాడు. విచారణతో ఆగకుండా అబద్ధం చెప్పినందుకు చర్య తీసుకోవాలని ప్రతిపక్షాల డిమాండు. వారికి తెలుసు - గుజరాతీ ఐన మెహతాకు బిజెపి అధిష్టానం ఆశీస్సులున్నాయని, ఫడ్ణవీస్‌ ఏమీ చేయలేడనీ! ప్రకాశ్‌ మెహతాను కాబినెట్‌లో తీసుకోవడం కూడా ఫడ్ణవీస్‌కు యిష్టం లేదని దిల్లీ ఒత్తిడితో తీసుకోవాల్సి వచ్చిందని పుకార్లు వున్నాయి.

మెహతా ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌ల ప్రకారం అతని ఆస్తులు 2004 నుంచి 2014 వరకు పదేళ్లలో 16 రెట్లు పెరిగాయి. అప్పుడు రూ.2 కోట్లయితే 2014లో 32 కోట్లు! సౌరాష్ట్రలోని ఊనా పట్టణానికి చెందిన మెహతా ముంబయిలో స్థిరపడి ఆరెస్సెస్‌ కార్యకర్తగా పనిచేసి, రాజకీయాల్లో పైకి వచ్చాడు.  

ప్రస్తుత వివాదానికి వస్తే - మురికివాడలను నిర్మూలించి, అక్కడ నివాసముంటున్నవారికి కొత్త చోట ఆవాసం కల్పించడానికి ఎస్‌ఆర్‌ఏ ఏర్పడింది. వాళ్లు 1990లలో ఎస్‌డి కార్పోరేషన్‌ అనే కాంట్రాక్టరు చేత ముంబయిలో ఇంపీరియల్‌ టవర్స్‌ అని రెండు టవర్లు కట్టించారు. ఎస్‌ఆర్‌ఏ కడుతున్న 225 చ.అ.ల ఫ్లాట్లు మరీ చిన్నవిగా వున్నాయని భావించిన కేంద్రం 2008లో నేషనల్‌ హౌసింగ్‌ పాలసీని రూపొందించి ఒక్కో ఫ్లాటు 269 చ.అ.లు వుండాలని నిర్ధారించింది. అయితే ఫడ్ణవీస్‌ ప్రభుత్వం 2015లో యిలా పెంచే విషయాలపై అంతిమ నిర్ణయం ఎస్‌ఆర్‌ఏదే అని చట్టం చేసింది.

ఇదే అదనుగా ఎస్‌డి కార్పోరేషన్‌ ఎస్‌ఆర్‌ఏ వద్దకు వెళ్లి ''ఫ్లాట్లు కేటాయించబడినవారిలో రెండు వేల మంది అదనంగా యిస్తున్న 44 చ.అ.లు మాకు అక్కర్లేదని అంటున్నారు. అలా 88 వేల చ.అ.లు మిగిలిపోతున్నాయి. వాటి హక్కులను మురికివాడల వాసుల నుంచి పిఎపి (ప్రాజెక్టు ఎఫెక్టెడ్‌ పర్శన్స్‌) కు బదిలీ చేద్దామనుకుంటున్నాం. మీరు అనుమతించవలసినది.'' అంది. ఈ పిఎపిల పేరు చెప్పడం ఉత్తుత్తినే అనీ, చివరకు కాంట్రాక్టరు ఎవరికి కావాలంటే వాళ్లకే అమ్ముతాడనీ అనుమానం వచ్చిన ఎస్‌ఆర్‌ఏ సిఇఓ ఆ అభ్యర్థనపై ఏ నిర్ణయం తీసుకోకుండా దాన్ని హౌసింగ్‌ శాఖకు పంపాడు.

ఆ శాఖలో ఎడిషనల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేస్తున్న సంజయ్‌ కుమార్‌ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఫైలుపై  రాశాడు. ఫైలు మంత్రిగారి వద్దకు చేరింది. అతను ప్రతిపాదనను ఆమోదిస్తూ 'పిఎపిలను గుర్తించే పని ప్రభుత్వం చేపడుతుంది.' అని రిమార్కు రాశాడు. పైగా ముఖ్యమంత్రితో యీ విషయాలన్నీ చర్చించాను అని కూడా చేర్చాడు. చర్చించలేదని బయటకు రావడంతో యిప్పుడా ఆర్డరు కాన్సిల్‌ అయింది. విచారణను ఎదుర్కుంటున్నాడు.

ఇది బయటకు వచ్చిన రెండు రోజులకే మరో వివాదం ముందుకు వచ్చింది. ఘాటకోపర్‌లోని పంత్‌ నగర్‌లో మహారాష్ట్ర హౌసింగ్‌ అండ్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఎమ్‌ఎచ్‌ఏడిఏ)కు చెందిన 18,902 చ.మీ.ల స్థలాన్ని 1999లో నిర్మల్‌ హోల్డింగ్‌ ప్రై.లి. అనే సంస్థకు 1.25 ఎఫ్‌ఎస్‌ఐ (ఫ్లోర్‌ స్పేస్‌ ఇండెక్స్‌)తో ట్రాన్సిట్‌ కాంప్‌ టెనమెంట్లు కట్టడానికి యిచ్చింది. తక్కిన 1.25 ఎఫ్‌ఎస్‌ఐతో కమ్మర్షియల్‌ కాంప్లెక్స్‌ కట్టుకోవచ్చంది. 336 టెనమెంట్లు కట్టాక నిర్మల్‌ తన వల్ల కాదంది. 2006లో ఎమ్‌ఎచ్‌ఏడిఏ అలాట్‌మెంట్‌ కాన్సిల్‌ చేస్తానంటే అప్పట్లో అక్కడి ఎమ్మెల్యే అయిన మెహతా బిల్డర్‌ తరఫున వాదించాడు.

రెండేళ్లు పోయేసరికి తనే చేపట్టాలన్న ఐడియా ఎమ్‌ఎచ్‌ఏడిఏకు వచ్చింది. అలా అయితే 1448 టెనమెంట్స్‌, 205 ఫ్లాట్లు కట్టుకోవచ్చనుకుంది. అందుకే 2012లో నిర్మల్‌కు యిచ్చిన ఆర్డరు కాన్సిల్‌ చేసింది. ఇప్పుడు హౌసింగ్‌ మంత్రిగా వచ్చిన మెహతా ఆ స్థలానికి మరో ఆరు మురికివాడల స్థలం కలిపి ఎన్‌ఆర్‌ఏ కింద మళ్లీ నిర్మల్‌ వాళ్లకే యివ్వాలని జనవరిలో జరిగిన సమావేశంలో తన శాఖాధికారులకు సూచించాడని అభియోగం. ఆరు మురికివాడల స్థలాన్ని కలుపుతూ గవర్నమెంటు రిజల్యూషన్‌ ఆగమేఘాల మీద జారీ అయింది. దానిలో డెవలపర్‌ పేరు మాత్రం లేదు. నిర్మల్‌కు యివ్వమని మంత్రి చెప్పినట్లుగా ప్రతిపక్షాలు ఆధారాలు చూపలేదు.

అయితే నిర్మల్‌ సంస్థ మురికివాడల నివాసితుల వద్దకు వెళ్లి నిరభ్యంతర పత్రాలను తీసుకుంటోందని పత్రికల కథనం. నిర్మల్‌తో సంబంధాలున్న సాయినిధి రియల్టర్స్‌ అనే ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ బోర్డులో మెహతా ఎడిషనల్‌ డైరక్టరు అని ఆరోపణ. 'నేను హౌసింగ్‌ మంత్రి కావడానికి 10 రోజుల ముందే ఆ పదవికి రాజీనామా చేశాను' అంటాడు మెహతా. రాజీనామా చేసినా, వారితో సంబంధాలు వుండడం సహజం. మెహతా ఒక్కడే యిన్ని పనులు చేయలేడని, దిల్లీలో వున్న పెద్దల తరఫునే యిది చేస్తున్నాడని కొందరి ఊహ. మధ్యలో యీ విషయంగా తన ప్రభుత్వానికి మచ్చ రాకూడదని ఫడ్ణవీస్‌ తాపత్రయ పడుతున్నాడు. అందుకే 'ఏమీ జరగకుండా ఆపేశానుగా' అని వాదిస్తున్నాడు.

-(ఫోటో - ప్రకాశ్‌ మెహతా, ఫడ్ణవీస్‌)

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
-mbsprasad@gmail.com