Advertisement

Advertisement


Home > Politics - Andhra

లోకేష్ తోడ‌ల్లుడు భ‌ర‌త్ కూడా టీడీపీకి భార‌మేనా!

లోకేష్ తోడ‌ల్లుడు భ‌ర‌త్ కూడా టీడీపీకి భార‌మేనా!

తెలుగుదేశం పార్టీ ఫ‌స్ట్ ఫ్యామిలీ ప్యాకేజ్ లో భాగంగా వ‌ర‌స‌గా రెండో సారి లోక్ స‌భ ఎన్నిక‌ల బ‌రిలో నిలుస్తున్న శ్రీభ‌ర‌త్ కూడా త‌న తోడ‌ల్లుడు నారా లోకేష్ కు తీసిపోతున్న‌ట్టుగా లేడు! విశాఖ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో ఎంపీగా పోటీ చేసి ఓట‌మి పాలైన శ్రీభ‌ర‌త్, ఇప్పుడు కూడా అలాంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటూ టీడీపీకి అద‌న‌పు భారంగా మారాడ‌నే టాక్ వినిపిస్తూ ఉంది. పైపెచ్చూ.. ఎన్నిక‌ల వేళ శ్రీభ‌ర‌త్ కు సంబంధించి ర‌క‌ర‌కాల లీల‌లు వెలుగు చూస్తూ ఉండ‌టం గ‌మ‌నార్హం!

తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్...తప్పులు చేస్తున్నాడు. వాటిని కప్పిపుచ్చుకోవడానికి మరికొన్ని తప్పులు, అప్పులు, వాటిని తీర్చలేక అప్పుల మీద అప్పులు  ఇలా చేసుకుంటూనే వెళ్లిపోయాడ‌నే మాట ఇప్పుడు విశాఖ స‌ర్కిల్స్ లో చ‌ర్చ‌గా మారింది! ఎన్నికలు దగ్గర పడేకొద్దీ అతనిలోని మరో రూపం బయటపడుతోందంటున్నారు! అవినీతి అక్రమాలు, డిఫాల్టర్ కేసులకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన గీతం విద్యా సంస్థల అధిపతి శ్రీ భరత్ విష‌యంలో పాత కొత్త వ్య‌వ‌హారాలు ఎన్నిక‌ల స‌మ‌యంలో చర్చ‌గా మారాయి!

బెంగళూరు ఊర‌వ‌త‌ల ఉన్న గీతం క్యాంపస్ లో విద్యార్థుల భద్రతపై సరైన ప్రమాణాలు పాటించకపోవడం వల్ల తన కుమారుడు బ్రహ్మసాయి రెడ్డి క్యాంపస్ బిల్డింగ్ పై నుంచి దూకి మరణించాడని, దీనికి కారణం సంస్థ అధినేత భరత్ నిర్లక్ష్యమేనని దాసరి వెంకట శివారెడ్డి ఫిర్యాదు చేశారు. 2024లో బెంగళూరునిలో దొడబళ్లాపుర పోలీస్టేషన్ లో సెక్షన్ 304(ఏ) కింద భరత్ పై కేసు నమోదైంది.

ఇకపోతే ఇక్కడే గీతం విద్యా సంస్థ నిర్మాణం పూర్తయినా సరే, డబ్బులు చెల్లించడం లేదంటూ ఎంఎస్ రామయ్య ప్రై లిమిటెట్ సంస్థ ఏం చేసిందంటే భరత్ పై దొడబళ్లాపుర పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో 505, 379, 380, 420, 448, 323, 506 (బీ) సెక్షన్లపై కేసు నమోదు చేశారు.

ముందు పనిచేయించుకుంటాడు గానీ, ఒక పట్టాన డబ్బులు మాత్రం ఇవ్వడనే పేరు శ్రీ భరత్ కి ఉంది. ఇప్పుడు ఎన్నికల్లో కూడా పార్లమెంటు పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులతో ఇలాగే సున్నం పెట్టుకున్నాడని సమాచారం. చంద్రబాబునాయుడికి మాట ఇచ్చి, అంతా నేను చూసుకుంటాను, 7 నియోజకవర్గాల బాధ్యత నాది, అని చెప్పి, కుటుంబంలో ఒత్తిడి చేసి సీటు తీసుకుని, ఇప్పుడందరికీ ఎగనామం పెడుతున్నాడని తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థులు వాపోతున్నార‌ట‌!  విశాఖలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇతను ఒక్కడి వల్ల గట్టి ఎఫెక్ట్ తగిలేలా ఉందని అంటున్నారు.

చంద్రబాబునాయుడుకి శ్రీ భరత్ వ్యవహారం పెద్ద మైనస్ గా మారింది. ఏం చేయలేక గుక్కిళ్లు మింగుతూ ముందుకెళుతున్నాడని అంటున్నారు.  ఒకవైపు విశాఖ రాజధాని ఉండదనే కాన్సెప్ట్ తో ఏటికి ఎదురీదుతున్న తెలుగుదేశం పార్టీకి...ఇప్పుడు శ్రీ భరత్ ఏకు మేకై కూర్చున్నాడు. శ్రీ భరత్ పార్లమెంటు స్థానం ఓడిపోవడమే బాబుకి కావాలని అంటున్నారు. ఎందుకంటే రేపు కొడుక్కి తను పోటీ రాకూడదు. లోకేష్ ముందు ఏ ఒక్క‌రూ కాస్తైనా బ్రైట్ గా క‌నిపించ‌కూడ‌ద‌నేది చంద్ర‌బాబు స్ట్రాట‌జీ, దీనికి భ‌ర‌త్ ఏ మాత్రం మిన‌హాయింపు కాదు! 

గీతం యూనివర్శిటీకి సంబంధించి ఆక్రమించిన భూముల విలువ నేటి మార్కెట్ ప్రకారం 2 వేల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బాలకృష్ణ‌ నుంచి కట్నం సొమ్ముగా ప్రభుత్వ భూమిని తీసుకున్నాడనే ప్రచారం నెట్టింట జోరుగా వినిపిస్తోంది. జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో సర్వే నెంబర్ 93లో ఉన్న 498.9 ఎకరాల ప్రభుత్వ భూమిని భరత్ కి చెందిన ఏబీసీ అనే ఫెర్టిలైజర్స్ కెంపెనీకి కేవలం నామ మాత్రపు ధరకి కట్టబెట్టారు.

ఎకరం రూ.80 వేల చొప్పున మొత్తం 500 ఎకరాలను కేవలం రూ. 4 కోట్లకు కట్టబెట్టారు. తర్వాత దానికి డిమాండ్ తీసుకురావడానికి చంద్రబాబునాయుడు ఒక జీవో జారీ చేశారు. ఆ ప్రాంతం మొత్తాన్ని ఏపీ సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చారు. ఈ భూములు కొన్న నెలరోజుల తర్వాత చాలా స్పీడుగా జీవో జారీ చేశారు. ఎప్పుడైతే సీఆర్డీఏ పరిధిలోకి వచ్చిందో ఈ ప్రాంతానికి ఫుల్ డిమాండ్ వచ్చింది. ఈ రోజున బాలకృష్ణ అల్లుడిగారు అప్పనంగా కొన్న భూమి ఎకరం విలువ రూ.4 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెరిగిపోయింది. ఈ లెక్కన ఇప్పుడు అల్లుడి గారి కట్నంగా ఇచ్చిన ప్రభుత్వ భూమి ఖరీదు...అక్షరాలా రూ.2 వేల కోట్ల రూపాయలుగా ఉంది. 

ఇలా ఒకటి కాదు... ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి తాతగారి నుంచి తండ్రిగారి నుంచి మనవడి వరకు చూస్తే చాలా గొప్పగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని, సామాజికవర్గాలను అడ్డం పెట్టుకుని, బ్యాంకులకి ఎగనామం పెట్టి, డిఫాల్టర్లుగా మారి...ఇవన్నీ చేసి  గొప్పవాళ్లుగా ఎలా మారారు అన్నది... భరత్ అండ్ కో ఫ్యామిలీని చూస్తే అర్థమవుతుందని అంటున్నారు.  ప్రజాసేవ కోసం తమ రక్తం ధారపోస్తానని చెప్పే ది గ్రేట్ నిప్పు నారా చంద్రబాబునాయుడి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడిందని చాలామంది అనుకుంటున్నారు. ఇక వీరి వెనుక తిరిగే చంద్రబాబు అండ్ కో, పచ్చబ్యాచ్  వాళ్లు ఎటువంటివారో ప్రజలందరికీ అర్థమైంది.  రేపటి విశాఖ పార్లమెంటు  ఎన్నికల్లో శ్రీ భరత్ ని శంకరగిరిమాన్యాలు పట్టించడం ఖాయమని అంటున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?