Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌: బరువూ తగ్గింది, పరువూ తగ్గింది...

ఇమాన్‌ అహ్మద్‌ అనే 36 ఏళ్ల ఈజిప్షియన్‌ వనిత తన స్థూలకాయాన్ని తగ్గించుకోవడానికి ఫిబ్రవరిలో ముంబయిలోని సైఫీ ఆసుపత్రికి వచ్చిందని మనమంతా పేపర్లలో చదివాం. అసాధ్యమైన చికిత్స చేపట్టినందుకు ఇమాన్‌ సోదరి షైమా ధన్యవాదాలు చెప్పడంతో ఆ ఆసుపత్రికి, బేరియాట్రిక్‌ సర్జన్‌ డా. ముఫజల్‌ లకడావాలాకు చాలా పబ్లిసిటీ వచ్చింది. మూడు నెలలు పూర్తి కాకుండానే ఆమె గురువారం నాడు ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయ్యేవేళ మాత్రం వేరే రకమైన పబ్లిసిటీ వస్తోంది. షైమా ఆసుపత్రిని సిబ్బందిని, సిబ్బంది షైమాని పరస్పరం నిందించుకుంటున్నారు. ఈ వివాదానికి మూలకారణం ఆమె తగినంతగా బరువు తగ్గలేదని సైఫీ అనడం, తగ్గిందని డాక్టర్లు అనడం!

నిజం తెలియాలంటే చేర్చినపుడు ఆమె బరువు ఎంత, యిప్పుడెంత అనేది నిర్ధారణగా తెలియాలి. ఆమె ఫిబ్రవరి 11 న ముంబయికి వచ్చినపుడు 504 కిలోలుందని పత్రికలలో వచ్చింది. ఇన్నాళ్లూ అదే ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె బరువు 200 కిలోలకు లోపే అని డాక్టర్లు చెప్తున్నారు. ఆమెకు ఏప్రిల్‌ 24 న సిటి స్కానింగ్‌ చేశామని, ఆ యంత్రం 204 కిలోల కు మించి బరువు మోయలేదు కాబట్టి తాము చెప్పినది నిజమే అని రుజువౌతోందని అన్నారు. అయితే ఆమె వచ్చినపుడు బరువెంత అన్న ప్రశ్న లేవనెత్తినపుడు డా. ముఫజల్‌  ''2016 అక్టోబరులో ప్రపంచ మీడియా అత్యంత బరువైన వ్యక్తి అని యీమెను పేర్కొన్నారు. ఈజిప్టు డాక్టరొకాయన 500 కిలోల బరువన్నాడు. నేను షైమాను అడిగినప్పుడు తాము ఒక ఇండస్ట్రియల్‌ త్రాసుపై ఆమెను తూచామని దాని ప్రకారం చెప్పామని నాతో అంది. ఇప్పుడలా అనలేదంటోంది. ఆమె మాట పట్టుకునే మేము 550 కిలోల బరువు మోసే బెడ్‌ను హంగరీ నుంచి తెప్పించాం. ఆమె వచ్చిన మూడు వారాలకు మేం మార్చి 2 న తూస్తే 378 కిలోలుంది. ఇప్పుడు 176 కిలోలుంది.'' అంటున్నారు. మొన్నమొన్నటివరకు 500 కిలోలని ప్రచారం సాగుతూ వచ్చినపుడు ఆయన 'అబ్బే అంత వుండదు' అని చెప్పలేదన్నది యిక్కడ గమనించవలసిన అంశం.

ఎందుకు పుట్టించారో కానీ 500 అంకె ఇమాన్‌కు బ్రహ్మాండమైన గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆమె చికిత్స కయ్యే ఖర్చు భరించడానికి ప్రపంచపౌరులు చాలామంది ముందుకు వచ్చారు. అసలంత బరువెలా పెరిగింది అని అడిగితే చెప్పినదేమిటంటే - ఆమె పుట్టినప్పుడు 5 కిలోల బరువుందట. 11 ఏళ్ల వయసు నుంచి విపరీతంగా పెరగసాగిందట. దాంతో ఆమె కాళ్లు ఆమె శరీరభారాన్ని మోయలేకపోయాయి. దాంతో పాకేది. స్కూల్లో పిల్లలు అది చూసి గేలి చేసేవారు. అందువలన ఆమె 5 వ తరగతితో చదువు ఆపేసి యింట్లో వుండిపోవాల్సి వచ్చింది. అలా పాతికేళ్లగా ఆమె యింట్లో మంచం మీదనే వుంటూ అనూహ్యంగా బరువు పెరిగిపోతూ వచ్చింది. ఆమెకు ఒక జెనటిక్‌ డిజార్డర్‌ వుంది. అందువలన ఆమె మెదడు 'నీకు ఆకలేస్తోంది, తినుతిను' అని చెప్తూ వుంటుంది. అందువలన తినేసేది. ఆ జబ్బుకి మందు యింకా పరీక్షల దశలో వుంది. ఆమె శరీరానికి ఏ రకమైన వ్యాయామం లేకపోవడంతో సకల రోగాలు చుట్టుముట్టాయి. టైప్‌ 2 డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌, హైపోథైరాడిజం, గౌట్‌, ఫ్లూయిడ్‌ రిటెన్షన్‌... యిలా. మూడేళ్ల క్రితం ఆమెకు స్ట్రోక్‌ వచ్చింది. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయిద్దామంటే బరువు కారణంగా చేయించలేకపోయారు. పక్షవాతం వచ్చి మాట పడిపోయింది, ఎడమ చేతివైపు చచ్చిపడిపోయింది. లేచి కూర్చునే శక్తి కూడా కోల్పోయింది.

ఈ పరిస్థితిలో ఇంజనియర్‌గా పనిచేసే ఆమె అక్క షైమా తన ఉద్యోగం మానేసి తల్లికి సహాయంగా ఇమాన్‌ను చూసుకోసాగింది. చెల్లికి చికిత్స చేయిద్దామని ఈజిప్టులో ఎందర్ని సంప్రదించినా అందరూ చేతులెత్తేశారు. 2016 సెప్టెంబరులో ఎవరో డా. ముఫజల్‌ గురించి ఆమెకు చెప్పారు. ఆమె వెంటనే ఆయనకు ఉత్తరం రాసింది. ఆయన యీ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్నారు. పేషంటును తమ ఆసుపత్రికి తీసుకువస్తే తన టీముతో కలిసి ఉచితంగా వైద్యం చేస్తామన్నారు. అయితే ఆమెను ఇండియాకు తీసుకురావడం ఎలా? ఇండియాకు వీసా కావాలంటే ఆమె ఈజిప్టులోని ఇండియన్‌ ఎంబసీకి స్వయంగా వెళ్లాలి. ఆమె కదల్లేదు. అప్పుడు డాక్టరు సుష్మా స్వరాజ్‌తో మాట్లాడి మినహాయింపు తెప్పించారు. రావడానికి మామూలు విమానాలు సరిపోవు కాబట్టి కార్గో ఫ్రయిటర్‌ను ఆమెకు అనుగుణంగా మార్చి ఇండియాకు తీసుకురావడానికి రూ. 83 లక్షలు ఖర్చవుతుంది. 'హెల్ప్‌ సేవ్‌ ఇమాన్‌' పేర డాక్టరు క్రౌడ్‌ ఫండింగ్‌ వేదిక ఏర్పాటు చేశారు. జనం నుంచి విరాళాలు పోగయ్యాక యీ ఫిబ్రవరి నెలలో ఆమెకై ప్రత్యేకమైన బెడ్‌ తయారుచేయించి, ఆమె నివాసముండే యింటి గోడ పగలకొట్టి క్రేన్‌ సహాయంతో ఆమెను విమానంలోకి ఎక్కించారు. ఆమెకున్న ఆరోగ్యసమస్యల దృష్ట్యా 300 కిలోల మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ కూడా తోడుగా తెచ్చారు.

విమానం ఫిబ్రవరి 11న ముంబయికి వచ్చాక క్రేన్‌ సహాయంతో ఓపెన్‌ ట్రక్‌లో ఎక్కించి, హాస్పటల్‌కు చేర్చారు. ఆమె కోసం వెయ్యి చ.అ.ల గదిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ప్రత్యేకమైన ఆహారమిచ్చి 100 కిలోలు తగ్గించామని, ఆ తర్వాత మార్చి 7 న పొట్ట సైజుని నాలుగోవంతుకి తగ్గించే బేరియాట్రిక్‌ సర్జరీ చేసి మొత్తం 140 కిలోలు తగ్గించడం చేత, ప్రస్తుతం 358 కిలోలుందని మార్చి 18 న డాక్టర్లు చెప్పారు. షైమా కూడా డాక్టర్లు ఎంతో శ్రమిస్తున్నారని కితాబు యిచ్చింది. అంతా బ్రహ్మాండంగా వుందని అనుకుంటూండగా మే నెల మొదటివారంలో ఆమెను వెనక్కి పంపేస్తామని డాక్టర్లు ఏప్రిల్‌ నెలలో అనడంతో షైమా గుండెల్లో రాయి పడింది. ఇప్పుడు మళ్లీ యీమెను వెనక్కి తీసుకుని వెళ్లి మళ్లీ సేవలు చేయడానికి ఆమె సిద్ధంగా లేదు. 'మీరు ఆమెను సొంత కాళ్ల మీద నడిచేట్లా చేస్తానని మాట యిచ్చారు. అప్పటిదాకా నేను తీసుకెళ్లను' అని గొణగసాగింది. కాళ్లు సరిగ్గా ఎదగక, పాతికేళ్లగా నడవకుండా వుండి, యీ మధ్యలో అనేక రోగాలు తెచ్చుకున్న పేషంటును నడిపిస్తామని తాము ఎన్నడూ అనలేదని, ఆమె వచ్చినపుడు యిచ్చిన ప్రెస్‌ మీట్‌లో కూడా తన కాళ్ల మీద తాను నిలవడం అనేది సుదూర స్వప్నం అనే అన్నామనీ, వీల్‌ ఛెయిర్‌లో కూర్చోబెట్టగలగడమే తమ లక్ష్యం అనీ డాక్టర్లన్నారు. పైగా తాము బేరియాట్రిక్‌ సర్జన్లమే తప్ప కార్డియాలజీ, న్యూరాలజీ వంటి విభాగాలతో తమకు సంబంధం లేదని నచ్చచెప్పబోయారు. పనిలో పనిగా ఏప్రిల్‌ 12 న ఒక ప్రకటన చేస్తూ ఇమాన్‌ బరువు 242 కిలోలు అయిందని, అంటే సగానికి సగం తగ్గిందని, దాని కారణంగా ఆమె ఆరోగ్యం మెరుగు పడిందని, ఆమె గుండె, మూత్రపిండాలు, ఊపిరితిత్తులు గతంలో కంటె బాగా పనిచేస్తున్నాయని చెప్పారు. ఏప్రిల్‌ 18న ఆమె వీల్‌ఛెయిర్‌లో కూర్చుని చిరునవ్వు నవ్వుతున్న వీడియోను ఏప్రిల్‌ 22న ప్రెస్‌కు రిలీజ్‌ చేశారు. ఆమెను మామూలు రూముకి మార్చారు.

ఇది ఆమె సోదరి షైమాను మండించింది. తమ పేరు మీద బోల్డంత ఉచిత పబ్లిసిటీ కొట్టేసిన ఆసుపత్రివారు యిప్పుడు తమను తరిమివేద్దామని చూస్తున్నారని ఫీలైంది. కనీసం రెండేళ్ల పాటు తమ దగ్గరే వుంచుకుంటామని హామీ పత్రం రాసిమ్మని డిమాండ్‌ చేసింది. డా. ముజఫల్‌ అలాటి హామీ ఏమీ యివ్వనని చెప్పారు. దాంతో రచ్చకెక్కింది. అరబిక్‌ భాషలో ఒక ప్రసంగం చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. 'ఇక్కడి డాక్టర్లందరూ ఆమె 300 కిలోలు తగ్గిందని చెప్పుకుంటున్నారు. అంతా అబద్ధాలకోర్లు. నిజానికి 10% కంటె బరువు తగ్గలేదు. ఇండియాకు వచ్చాక వాళ్లు ఒక్కసారి కూడా బరువు చెక్‌ చేయలేదు. పైగా వచ్చినప్పటి కంటె ఆరోగ్యం చెడిపోయింది. వాళ్లు ఇమాన్‌కు విపరీతంగా మందులిచ్చేసి, ఆమె బ్రెయిన్‌ యాక్టివిటీని ఆపేస్తున్నారు. తనకు ఎపిలెప్సీ స్ట్రోక్‌ వచ్చినా సాధారణమైన గదికి మార్చేస్తున్నారు. నేను దానికి అభ్యంతరం తెలిపితే నాకు బుద్ధి చెప్పడానికి ఓ రోజంతా నా గదికి కరంటు సప్లయి ఆపేశారు.' అంటూ ఆరోపించింది.

పేషంటును వెనక్కి తీసుకెళితే తమలా కోటి రూ.ల వైద్యాన్ని ఉచితంగా అందించడానికి ఈజిప్టు డాక్టర్లెవరు సిద్ధంగా లేరు కాబట్టి తమను బ్లాక్‌మెయిల్‌ చేయడానికే షైమా యిలా మాట్లాడిందని సైఫీ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది అనుకున్నారు. మర్నాడే 11 మంది డాక్టర్లు 'మేం యిక ఇమాన్‌ను ట్రీట్‌ చేయం' అని ప్రకటించారు. ఆమె ఆరోగ్యం గతంలో కంటె మెరుగు పడిందని రుజువు చేసే వీడియోలు యూట్యూబులో పెట్టారు. అయితే షైమా అరబిక్‌ ప్రసంగం అరబ్బు దేశాల్లో సంచలనం రేకెత్తించింది. అబూ ధాబీలోని విపిఎస్‌ హెల్త్‌కేర్‌లోని డాక్టరు మేయెర్‌, ఇమాన్‌ చికిత్సను తమ వద్ద కొనసాగించడానికి ముందుకు వచ్చారు. ఈ లోగా షైమా యిక్కడ రచ్చచేయడానికి నిశ్చయించుకుని చెల్లెలి బెడ్‌ వద్దకు వచ్చి ఆమె నోట్లో నీళ్లు పోయబోయింది. 'ఆమెకు మూణ్నెళ్లగా ముక్కు ట్యూబు ద్వారానే ఆహారం యిస్తున్నాం. ఇప్పుడు సడన్‌గా నోటి ద్వారా ఏదైనా యిస్తే కాంప్లికేషన్‌ వచ్చి డిస్ఛార్జి చేయడానికి యిబ్బంది కావచ్చు' అనుకున్న నర్సులు అడ్డుకున్నారు. అయినా ఆమె వినలేదు, వాళ్లను తోసేసింది. వాళ్లు పోలీసులను పిలిచారు. తన సోదరి ఆరోగ్యం బాగు పడకపోయినా సైఫీ ఆసుపత్రి వాళ్లు డిస్ఛార్జి చేసేస్తున్నారని షైమా గగ్గోలు పెట్టేస్తోంది. చుట్టపుచూపుగా వచ్చి దెయ్యమై పట్టుకుందనే సామెత నిజమైంది. అలా ఆమె పరువుతో బాటు, యిక్కడకు వచ్చినపుడు ఆమె బరువు 500 కిలోలు లేదనే వాస్తవాన్ని దాచినందుకు డాక్టర్ల పరువూ పోయింది.

సైఫీ హాస్పటల్‌ డాక్టర్లు అనేదేమిటంటే - ''అసలు యిన్ని రోగాలున్న భారీ మనిషితో యింత రిస్కు తీసుకోవడానికి ఏ డాక్టరూ ముందుకు రారు. మేం సేవాదృక్పథంతో యీ పని చేపట్టాం. మనసా, వాచా, కర్మణా శ్రమించాం. చివరకు మాకు దక్కినది చెడ్డపేరు మాత్రమే. ఆమెకు వూపిరి ఆడకపోవడం సహజం. బేరియాట్రిక్‌ సర్జరీ చేశాక ఆ సమస్య అందరికీ వస్తుంది. ఆమె 20-30ని.లు కూర్చోగలుగుతోందంటేనే గొప్ప. ఆమె యిక్కడకు వచ్చాక మళ్లీ స్ట్రోక్‌ రాలేదని సిటి స్కాన్‌లో తేలింది. మా శక్తియుక్తులు, ఆర్థిక వనరులు ఒకే పేషంటుపై వెచ్చించలేము కదా. ఫిజియోథెరపీకి దగ్గరగా వుంటుంది కదాని ఆమెను మెయిన్‌ బిల్డింగుకు మార్చాం. దానికే షైమా గగ్గోలు పెట్టేస్తోంది. ఇకపై ట్రీట్‌మెంటుకు ఖర్చు ఎక్కణ్నుంచి వస్తుందాని ఆమె చింత. అందుకే యిలాటి ప్రకటనలు చేస్తోంది.'' అంటున్నారు. షైమా వారితో విభేదిస్తోంది - ''ఈజిప్టులో ఉచితంగా చికిత్స చేస్తానన్నారు. కానీ అక్కడి కంటె యిక్కడ వసతులు బాగుంటాయని నచ్చచెప్పి డా. ముజఫల్‌ యిక్కడకు రప్పించారు. ఇక్కడకు వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. ఇతర డాక్టర్లతో కానీ, మీడియాతో మాట్లాడకూడదని ఆసుపత్రివారు నిర్బంధం చేస్తున్నారు.'' అంటోంది.

ఈజిప్షియన్‌ సొసైటీ ఫర్‌ బేరియాట్రిక్‌ సర్జరీ వ్యవస్థాపకుడు డా. ఖాలీద్‌ గాదత్‌ ''ఇమాన్‌తో ఇండియన్‌ డాక్టర్లు వ్యవహరించిన తీరుపై ఈజిప్టులో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇక్కడ మా హాస్పటల్స్‌ సమగ్రమైన చికిత్స చేస్తామని చెప్పాం. అయితే ఇండియన్‌ హాస్పటల్‌ వారు ఆర్నెల్ల నుంచి ఏడాది వరకు తమ వద్ద వుంచుకుని చికిత్స చేస్తామని చెప్పడంతో వాళ్లు అక్కడకు వెళ్లారు. ఈజిప్టులో సరైన చికిత్స లేదు కాబట్టే తన వద్దకు వచ్చారంటూ డా. ముజఫల్‌ గొప్పగా పబ్లిసిటీ యిచ్చుకున్నాడు. దీనిలో మార్కెటింగ్‌ టెక్నిక్కే తప్ప మానవీయ కోణం లేదు.'' అని చాలా ఘాటుగా మాట్లాడాడు. ఇప్పుడు డా. మేయెర్‌ అనే ఆయన గురువారం నాడు ఇమాన్‌ను వెంటపెట్టుకుని ఎయిర్‌ యాంబులెన్సులో ఆబూ ధాబీలోని బుర్జీల్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ న్యూరాలజికల్‌, సైకలాజికల్‌ చికిత్స చేయిస్తారట. ఇండియాలో సరిగ్గా చికిత్స జరగలేదని వాళ్లు చెప్పుకోవడం ఖాయంగా కనబడుతోంది. ఎంతో హంగామాతో ప్రారంభమైన ఇమాన్‌ ఉదంతం యిలా వివాదాస్పదంగా ముగిసింది.

-ఎమ్బీయస్‌ ప్రసాద్‌
mbsprasad@gmail.com