Advertisement


Home > Articles - MBS
ఎమ్బీయస్‌ : ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు

ఫ్రాన్స్‌ అధ్యక్ష ఎన్నికలు మే 7 ఆదివారం పూర్తయ్యాయి. అంతిమ ఫలితాలు యింకా ప్రకటించలేదు కానీ ఇమాన్యుయేల్‌ మేక్రోన్‌ దాదాపు 65% ఓట్లతో తన ప్రత్యర్థి, ఫ్రంట్‌ నేషనల్‌ (ఎఫ్‌ఎన్‌) అధినేత్రి మేరీన్‌ లేపెనాను ఓడించినట్లు అనుకోవచ్చు. ఇవి రెండవ విడత ఎన్నికలు. ఏప్రిల్‌ 23 న జరిగిన మొదటి విడత ఎన్నికలలో 11 మంది అభ్యర్థులు పాల్గొన్నా ఎవరికీ 50% ఓట్లు రాకపోవడంతో యీ విడత ఎన్నికల అవసరం పడింది. 1965 నుంచి యిలా జరుగుతోంది. ఎవరికీ మొదటి రౌండులో 50% ఓట్లు రావటం లేదు. ఈ సారి 4.70 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్న మొదటి దఫా ఎన్నికలలో ఎక్కువ శాతం ఓట్లు తెచ్చుకున్నవాడు సెంట్రిస్టు (మధ్యేవాది) మేక్రోన్‌యే. అతనికి 24% వచ్చాయి. ద్వితీయస్థానంలో ఫార్‌ రైటిస్టు (తీవ్ర దక్షిణవాది) లే పెనా 21.3%తో, తృతీయ స్థానంలో 20%తో రిపబ్లికన్‌ ఫ్రాంకోయిస్‌ ఫిలాన్‌, చతుర్థ స్థానంలో 19.6%తో లెఫ్టిస్ట్‌ పార్టీ అభ్యర్థి జీన్‌ లూక్‌ మేలెకాన్‌, పంచమ స్థానంలో 6.4%తో సోషలిస్టు బెనోయిట్‌ ఎమోన్‌ నిలిచారు.

మొదటి, రెండవ స్థానాల్లో నిలిచిన యిద్దరూ సాంప్రదాయకపు పార్టీలకు చెందినవారు కారు. దశాబ్దాలగా సెంటర్‌-రైటిస్టులైన రిపబ్లికన్‌ పార్టీ వాళ్లు, సెంటర్‌-లెఫ్టిస్టులైన సోషలిస్టు పార్టీ వాళ్లు మార్చిమార్చి ఫ్రాన్సును ఏలుతున్నారు. ఇద్దరితో ప్రజలు విసిగిపోయారనడానికి నిదర్శనం యీ ఎన్నిక. 22 ఏళ్ల తర్వాత 2012 ఎన్నికల్లో నెగ్గి మొన్నటిదాకా పాలించిన సోషలిస్టు ప్రధాని ఫ్రాంకోయిస్‌ హోలాండ్‌ పరిపాలన అంటే జనాలకు ఎంత విముఖత ఏర్పడిందంటే అతని పార్టీ అభ్యర్థి ఎమోన్‌ ఐదో స్థానంలో నిలిచాడు. ఈ ప్రమాదాన్ని పసిగట్టే హోలాండ్‌ మళ్లీ నిలబడనన్నాడు. నిజానికి అతని స్థానంలో మాజీ ప్రధాని మాన్యుయెల్‌ వాల్స్‌ నిలబడతాడనుకున్నారు. కానీ అతను పార్టీ ప్రాథమిక ఎన్నికలలోనే ఓడిపోయాడు. కన్సర్వేటివ్‌ పార్టీ విషయంలోనూ అదే జరిగింది. మాజీ అధ్యక్షుడు నికొలస్‌ సర్కోజీ ప్రాథమిక ఎన్నికలోనే ఓడిపోయాడు. అతని స్థానంలో అభ్యర్థిగా నిలబడిన ఫిలాన్‌ ఈ జనవరి నుంచి ఒక వివాదంలో చిక్కుకున్నాడు. అతను అధ్యక్షుడిగా వుండగా అతని భార్య, కూతురు, కొడుకు ప్రభుత్వ పదవీ బాధ్యతలు నిర్వహించినట్లు తప్పుడు పత్రాలు చూపించి ప్రభుత్వం నుంచి పదేళ్లపాటు 5 లక్షల యూరోల డబ్బు తీసుకున్నాడు. అందువలన అతని ప్రతిష్ఠ మసకబారింది. ఇక లెఫ్టిస్టు అయిన మేలెకాన్‌ శ్రీమంతులపై యిప్పుడున్న పన్నుల్ని రెట్టింపు చేస్తానన్నాడు. వెనిజులా వంటి దేశాలతో స్నేహం చేస్తానన్నాడు. దాంతో యితరులు భయపడ్డారు. 

ప్రపంచ వ్యవహారాల్లో, మరీ ముఖ్యంగా యూరోజోన్‌లో ఫ్రాన్సుది ముఖ్యమైన పాత్ర. ప్రపంచంలో ఆరవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. యూరోప్‌లో జర్మన్‌ ఎకానమీ తర్వాతి స్థానం దానిదే. మిలటరీ శక్తి కూడా. అణ్వాయుధాలూ వున్నాయి.  యునైటెడ్‌ నేషన్స్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌లో దానికి వీటో అధికారం వుంది. గ్లోబలైజేషన్‌కు, యూరోజోన్‌కు, ముస్లిములకు, వలసలకు బద్ధవ్యతిరేకి, అతి తీవ్ర జాతీయవాది ఐన లే పెనా హవా చాలా ఉధృతంగా నడవడంతో ఫ్రాన్సు ఎటువైపు మొగ్గుతుందా అని ప్రపంచ విశ్లేషకులందరూ ఉగ్గబట్టుకుని చూశారు. ఆమెను ఎలాగైనా నిలవరించాలనే ప్రయత్నంలో మొదటి రౌండులో వెనుకబడిన అభ్యర్థులందరూ (మేలెకాన్‌ తప్ప) మేక్రోన్‌కు మద్దతిస్తామన్నారు. కానీ వాళ్ల అనుయాయులందరూ మేక్రోన్‌కు ఓటేస్తారన్న నమ్మకం లేకపోయింది. ముఖ్యంగా మేలెకాన్‌కు ఓటేసిన తీవ్రవామపక్ష ఓటర్లు 'మేం గైరు హాజరవుతాం, లేదా ఎవరికీ ఓటేయకుండా వదిలేస్తాం తప్ప మేక్రోన్‌కు వెయ్యం' అని చెప్పారు. మేక్రోన్‌, లే పెనాల మధ్య మే 3న జరిగిన వాగ్వాదంలో లే పెనా తన ప్రత్యర్థిని పెద్ద వ్యాపారస్తుల ప్రయోజనాలను కాపాడతాడని, ఇస్లామిక్‌ టెర్రరిజం పట్ల మెతకగా వ్యవహరిస్తాడని ఆరోపించింది. దానికి జవాబుగా మేక్రోన్‌ లే పెనా ఉత్తిపుణ్యాన భయాలు రేకెత్తిస్తోందని జవాబిచ్చాడు.

39 ఏళ్ల మేక్రోన్‌ వృత్తిరీత్యా ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌. ఇప్పటిదాకా ఎన్నికలలో నిలబడలేదు. హోలాండ్‌ కాబినెట్‌లో ఎకానమీ, ఇండస్ట్రీ మంత్రిగా పనిచేసి, అతని విధానాలతో విభేదించి, ఏడాది క్రితం బయటకు వచ్చేసి 'ఎన్‌ మార్చ్‌' (కదలిక అని అర్థం) అనే ఉద్యమం ప్రారంభించాడు. అతను వ్యాపారవర్గాలకు, యూరోజోన్‌కు అనుకూలుడైన సోషల్‌-లిబరల్‌. లేబరు చట్టాలు మరీ కఠినంగా వున్నాయని, వాళ్లకు ఉద్యోగభద్రత మరీ ఎక్కువగా వుందని అందుకే పరిశ్రమలు రావటం లేదనీ అతని వాదన. ఎడ్మినిస్ట్రేషన్‌లో మార్పులు తెచ్చి, స్వయంఉపాధి అవకాశాలను పెంచుతానని, యూరోజోన్‌లోనే వుంటూ నిబంధనలు క్రమేపీ సడలిస్తూ పోయి, వ్యాపారావకాశాలను పెంచుతానని వాగ్దానాలు చేసి యువతను, నగరవాసులను బాగా ఆకర్షించాడు. ప్రభుత్వవ్యయాన్ని ఐదేళ్లలో 60 బిలియన్‌ యూరోల మేరకు తగ్గిస్తానన్నాడు. పెరుగుతున్న అశాంతిని, టెర్రరిజాన్ని దృష్టిలో పెట్టుకుని 10 వేల మంది పోలీసులను నియమించి, 15 వేల మందికై కొత్తగా జైళ్లు నిర్మిస్తానన్నాడు. డిఫెన్స్‌ బజెట్‌ను జిడిపిలో 2%కు పెంచుతానన్నాడు. పార్లమెంటు సభ్యులను మూడింట రెండు వంతులకు తగ్గిస్తానన్నాడు. మొదటి దశ ఎన్నికలలో మెట్రో సెంటర్లలో, ఫ్రాన్సు పశ్చిమ ప్రాంతంలో ఓట్లు బాగా సంపాదించుకున్నాడు. ఇంగ్లీషులో మంచి వక్త. వ్యక్తిగత జీవితానికి వస్తే మేక్రోన్‌ తన 32వ యేట తనకంటె 24 ఏళ్లు పెద్దదైన బ్రిగిటీని పెళ్లాడాడు. ఆమె అతని క్లాస్‌మేట్‌కు తల్లి. ఇతనితో పెళ్లి నాటికి ఆమెకు ఏడుగురు మనుమలు వున్నారు.

మెరీన్‌ లే పెనా తండ్రి జీన్‌ మారీ లే పెన్‌ ఎఫ్‌ఎన్‌ పార్టీని స్థాపించాడు. అతను మరీ తీవ్రవాది. ఫ్రెంచ్‌ క్రిస్టియన్లు కానివారిపై విషం కక్కేవాడు. దాంతో తక్కినవారందరికీ అతన్ని చూస్తే భయం. 2002లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి జాక్విస్‌ చిరాక్‌తో అధ్యక్ష ఎన్నికలలో పోటీ పడి 18% ఓట్లు తెచ్చుకున్నాడు.  లే పెనా తన తండ్రిని పార్టీలోంచి తీసేసి, భావతీవ్రతను కాస్త తగ్గించి సామాన్యజనం ఘోష వినిపిస్తున్నా అని చెప్పుకోసాగింది. 2012లో 17.9% ఓట్లు తెచ్చుకుంది. ఇప్పుడు 48 ఏళ్ల వయసులో ఫైనల్‌ రౌండ్‌లో దాదాపు రెట్టింపు ఓట్లు తెచ్చుకోవడం వలసలకు, గ్లోబలైజేషన్‌కు వ్యతిరేకంగా మారుతున్న ప్రజాభిప్రాయానికి, పరిస్థితులకు అద్దం పడుతోంది. గ్లోబలైజేషన్‌ కారణంగా ఫ్రెంచి నాగరికతకు విఘాతం కలుగుతోందంటోంది. షెంజన్‌ వెసులుబాట్లు రద్దు చేసి, పాస్‌పోర్టులు చెక్‌ చేసే పద్ధతిని మళ్లీ పెడతానంది. యూరోజోన్‌ నుంచి బయటకు రావడానికి ఆర్నెల్ల లోగా రిఫరెండమ్‌ నిర్వహిస్తానంది. ఫ్రాన్స్‌ కరెన్సీ ఐన ఫ్రాంక్‌ను మళ్లీ ప్రవేశపెడతానంది. ఇతర దేశాలతో లావాదేవీలకు మాత్రం కామన్‌ కరెన్సీ ఏదైనా వాడినా దేశంలోపల మాత్రం ఫ్రాంక్‌నే వాడేట్లా చేస్తానంది.  లే పెనా 15 వేల మంది పోలీసులను నియమించి, 40 వేల మంది పట్టే జైళ్లు కడతానంది. ఇన్‌కమ్‌టాక్స్‌ చెల్లింపుదారుల్లో దిగువ మూడు స్లాబుల రేట్లలో 10% చొప్పున తగ్గిస్తానంది. ఫ్రాన్సు జనాభా 6.70 కోట్లు. ఇటీవలి కాలంలో పది లక్షల మంది దాకా వలస వచ్చారు. చట్టపరంగా వచ్చే వలసదారులను యిప్పుడు ఏడాదికి 2 లక్షల మందిని అనుమతిస్తున్నారు. ఇకపై దాన్ని 10 వేలకు తగ్గిస్తానంది. రిటైర్‌మెంట్‌ వయసును 62 నుంచి 60కి తగ్గించి యువతకు ఉద్యోగావకాశాలు పెంచుతానంది. రెండేళ్లగా ఫ్రాన్సు నగరాల్లో టెర్రరిస్టు దాడులు పెరిగాయి. ప్రధానంగా కాథలిక్‌ జనాభా కల ఫ్రాన్సులో ముస్లిముల పట్ల అనుమానాలు పెరిగాయి. లే పెనా ఆ అనుమానాలను ఎగదోసింది. ఆమె బురఖాలకు, బీచ్‌లలో బుర్కినిలకు వ్యతిరేకం. స్కూళ్లలో పోర్కు విషయంలో ముస్లిము పిల్లలకు మినహాయింపు యివ్వకూడదంటుంది. 

గ్లోబలైజేషన్‌ పేరుతో అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలను కొల్లగొట్టాలని చూశాయి. అది కొంతకాలం సాగింది కానీ గత పదేళ్లగా ట్రెండ్‌ రివర్స్‌ అయింది. ఆ దేశాల కార్పోరేట్‌ సంస్థల లాభాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. అందువలన అవి తమ యూనిట్లను తక్కువ వేతనాలున్న దేశాలకు తరలిస్తున్నాయి. తత్ఫలితంగా స్థానికుల ఉద్యోగాలు పోతున్నాయి. చాలా ఏళ్లగా ఫ్రాన్సులో నిరుద్యోగశాతం 10కి అటూయిటూగా వుంది. అమెరికా పారిశ్రామిక వాడల్లో జరిగినదే, ఫ్రాన్సులోనూ జరిగింది. ఉద్యోగాలు పోవడంతో భూమిపుత్రవాదం, విపరీత జాతీయవాదం పెల్లుబికాయి. అమెరికాకు చెందిన విర్ల్‌పూల్‌ కార్పోరేషన్‌కు ఉత్తర ఫ్రాన్సులో 34 ఏళ్లగా ఒక యూనిట్‌ వుంది. ఇటీవలే అది ఆ యూనిట్‌ను పోలండ్‌కు తరలించింది. అక్కడైతే కార్మికుల సంక్షేమానికి తక్కువ ఖర్చు పెట్టవచ్చు. ఈ తరలింపు ఫ్రెంచ్‌ కార్మికులను మండించింది. ఇలాటి సంఘటనలు చాలా జరగడంతో ఉత్తరాన వున్న యిండస్ట్రియల్‌ బెల్ట్‌లో అందరూ లే పెనాను సమర్థించారు. అక్కడ పరిశ్రమలు తగ్గిపోయి, నిరుద్యోగం ప్రబలడంతో ఫ్రాన్సు ఉద్యోగాలు, ఫ్రెంచివారికే అనే ఆమె నినాదం బాగా పనిచేసింది.

అంతేకాకుండా ఆమెకు ఫ్రాన్స్‌ ఉత్తర, ఈశాన్య, ఆగ్నేయ ప్రాంతాలలో, గ్రామాలలో ఓట్లు బాగా పడ్డాయి. 2014లో ఆమె ''పదేళ్లలో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుంది.'' అని ప్రకటించింది. మూడేళ్లు తిరక్కుండానే యిప్పుడున్న స్థాయికి చేరుకుంది. ట్రంప్‌లాగానే ''ఫ్రాన్స్‌ ఫస్ట్‌'', ''గ్లోబల్‌ వద్దు, లోకల్‌ ముద్దు'', ''ముస్లిము టెర్రరిస్టులను దేశంలోకి రానీయకూడదు'' వంటి నినాదాలు యిచ్చింది. ట్రంప్‌ నెగ్గినపుడు 'ఇది నా విధానాల విజయం' అని ప్రకటించింది. కానీ ఫ్రాన్సు అమెరికా దోవ పట్టలేదు. ఇప్పుడు విజేతగా నిలిచిన మేక్రోన్‌ ''మేం దేశభక్తులం తప్ప జాతీయవాదులం కాము.'' అని చెప్పుకుంటున్నాడు. ప్రస్తుతానికి యూరోజోన్‌ నాయకులు అమ్మయ్య అనుకుంటున్నారు. జూన్‌ 11, 18 న 577 సీట్లున్న పార్లమెంటు దిగువ సభకు ఎన్నికలు జరగబోతాయి. ఆ ఎన్నికలలో కూడా మేక్రోన్‌ పార్టీకి మెజారిటీ రావాలి. అప్పుడే అతని సంస్కరణలు అమలయ్యేందుకు వీలవుతుంది.  

- ఎమ్బీయస్‌ ప్రసాద్‌ 
mbsprasad@gmail.com